రైల్వే మంత్రిత్వ శాఖ

21.03.2020 నుంచి 31.07.2020 మధ్య ప్రయాణకాలానికి ఖరారు చేసుకున్న

పీఆర్‌ఎస్‌ కౌంటర్ టిక్కెట్ల రద్దుకు, టిక్కెట్‌ ధర వాపసుకు కాలపరిమితిని ఆరు నెలలకు మించి పొడిగించిన రైల్వే శాఖ
రెగ్యులర్ టైమ్ టేబుల్ రైళ్ల రద్దుకు మాత్రమే ఇది వర్తింపు

Posted On: 07 JAN 2021 3:28PM by PIB Hyderabad

21.03.2020 నుంచి 31.07.2020 మధ్య ప్రయాణ కాలానికి ఖరారు చేసుకున్న పీఆర్‌ఎస్‌ కౌంటర్ టిక్కెట్లను రద్దు చేసుకునే అవకాశాన్ని, ఆ టిక్కెట్‌ ధరను రిజర్వేషన్ కౌంటర్ల వద్ద వాపసు పొందే కాలపరిమితిని ఆరు నెలల నుంచి తొమ్మిది నెలలకు రైల్వే శాఖ పొడిగించింది. ప్రయాణ తేదీ నుంచి ఈ గడువు ప్రారంభమవుతుంది. రైల్వే శాఖ రద్దు చేసిన రెగ్యులర్ టైమ్ టేబుల్ రైళ్లకు మాత్రమే ఇది వర్తిస్తుంది. ఒకవేళ 139 టోల్‌ ఫ్రీ నంబర్‌ లేదా ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ ద్వారా టిక్కెట్‌ రద్దు చేసుకుంటే, పైన పేర్కొన్న గడువులో బుక్‌ చేసుకున్న టిక్కెట్‌ను రిజర్వేషన్‌ కౌంటర్లలో సమర్పించే గడువును కూడా, ప్రయాణ తేదీ నుంచి 9 నెలల వరకు రైల్వేశాఖ పెంచింది.

    ప్రయాణ తేదీ నుంచి ఆరు నెలలు ముగిసిన తర్వాత, చాలామంది ప్రయాణీకులు టీడీఆర్‌ లేదా సాధారణ దరఖాస్తుతోపాటు అసలు టిక్కెట్‌ను ప్రాంతీయ రైల్వే క్లెయిమ్స్ కార్యాలయాల్లో జమ చేసి ఉండవచ్చు. ఆ పీఆర్‌ఎస్‌ కౌంటర్ టిక్కెట్ల పూర్తి ధరను వారికి రైల్వే శాఖ చెల్లిస్తుంది.

    కొవిడ్‌ పరిస్థితి కారణంగా; టికెట్ల రద్దు, ఛార్జీ వాపసు కోసం గతంలో సమగ్ర మార్గదర్శకాలు జారీ అయ్యాయి. రైల్వేశాఖ రద్దు చేసిన రైళ్లకు సంబంధించి జారీ చేసిన ఆదేశాల ప్రకారం, పీఆర్‌ఎస్‌ టిక్కెట్లను సమర్పించడానికి ప్రయాణ తేదీ నుండి ఆరు నెలల వరకు రైల్వే శాఖ గతంలో గడువు ఇచ్చింది. టిక్కెట్లను 139 టోల్‌ ఫ్రీ నంబర్‌ ద్వారా లేదా ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ ద్వారా రద్దు చేసుకుంటే, ప్రయాణ తేదీ నుంచి ఆరు నెలల వరకు ఆ టిక్కెట్‌ ఖరీదును కౌంటర్‌ ద్వారా వాపసు ఇస్తారు.

***


(Release ID: 1686832) Visitor Counter : 256