ప్రధాన మంత్రి కార్యాలయం

నాణ్యమైన ఉత్పత్తులు మరియు హృదయాలను గెలుచుకోవడంపై దృష్టి పెట్టండి

Posted On: 05 JAN 2021 6:58PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఆత్మ నిర్భర్ భారత్ మరియు నాణ్యమైన ఉత్పత్తులను తయారు చేసి, ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ఆమోదించబడేలా నిర్ధారించుకోవడం గురించి కొన్ని ఆలోచనలను లింక్డ్-ఇన్ (@LinkedIn) సామాజిక మాధ్యమం ద్వారా వ్యక్తం చేశారు.

ప్రధానమంత్రి ఆలోచనలు ఈ విధంగా ఉన్నాయి : 

"కొన్ని రోజుల క్రితం, నేను తూనికలు, కొలతలకు సంబంధించిన శాస్త్రం (మెట్రాలజీ) పై ఒక జాతీయ సదస్సును ఉద్దేశించి ప్రసంగించాను.

దీని గురించి ఇంతవరకు విస్తృతంగా చర్చించనప్పటికీ,  ఇది ఒక ముఖ్యమైన విషయం.

నా ప్రసంగంలో, నేను ప్రస్తావించిన అంశాలలో ఒకటి ఏమిటంటే - మెట్రాలజీ, లేదా తూనికలు, కొలతల అధ్యయనం, ఆత్మ నిర్భర్ భారత్ (స్వావలంబన భారతదేశం) మరియు మన పారిశ్రామికవేత్తలకు ఆర్థిక శ్రేయస్సుకు, ఎలా దోహదపడుతుంది అని. 

నైపుణ్యం మరియు ప్రతిభకు భారతదేశం ఒక  శక్తి కేంద్రం లాంటిది. 

మన అంకుర సంస్థలు సాధిస్తున్న విజయాలు, మన యువతకు ఆవిష్కరణల పట్ల ఉన్న ఉత్సాహాన్ని ప్రతిబింబిస్తున్నాయి. 

నూతన ఉత్పత్తులు, సేవలు వేగంగా సృష్టించబడుతున్నాయి.

దేశీయంగా, అంతర్జాతీయంగా భారీ మార్కెట్ అవకాశాలు మన కోసం ఎదురుచూస్తున్నాయి. 

ఈరోజున ప్రపంచం మొత్తం సరసమైన, మన్నికైన, నిత్యం ఉపయోగపడే ఉత్పత్తుల కోసం పరుగులు తీస్తోంది.

పరిమాణం, ప్రమాణం అనే రెండు సూత్రాలపై, ఆత్మ నిర్భర్ భారత్, ఆధారపడి ఉంది.

మనం పరిమాణం లో ఎక్కువగా ఉత్పత్తి చేయాలని అనుకుంటున్నాము. అదే సమయంలో, మంచి నాణ్యతా ప్రమాణాలతో ఉత్పత్తులను తయారు చేయాలని అనుకుంటున్నాము. 

ప్రపంచ మార్కెట్లను తన ఉత్పత్తులతో నింపాలని భారతదేశం ఎప్పుడూ కోరుకోదు. 

భారతీయ ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా ప్రజల హృదయాలను గెలుచుకోవాలని మనం కోరుకుంటున్నాము.

మనం ‘మేక్ ఇన్ ఇండియా’ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నప్పుడు, కేవలం ప్రపంచ డిమాండు‌ను తీర్చడమే కాదు, ప్రపంచ ఆమోదం పొందడాన్ని కూడా మనం లక్ష్యంగా నిర్ణయించుకున్నాము. 

మీరు సృష్టించే ఏదైనా ఉత్పత్తి లేదా సేవలో ‘జీరో ఎఫెక్ట్, జీరో డిఫెక్ట్’ గురించి ఆలోచించాలని, నేను, మీ అందరినీ, కోరుతున్నాను.

పారిశ్రామిక వేత్తలు, వ్యాపార ప్రతినిధులు, అంకుర సంస్థలకు చెందిన యువత మరియు నిపుణులతో, నేను జరిపిన పరస్పర చర్యల సమయంలో, దీని గురించి, వారిలో,  ఇప్పటికే గొప్ప అవగాహన, చైతన్యం ఉన్నట్లు నేను గ్రహించాను. 

ఈ రోజున మన మార్కెట్ ప్రపంచ వ్యాప్తంగా విస్తరించి ఉంది. 

భారతదేశ ప్రజలకు ఆ సామర్థ్యం ఉంది.

విశ్వసనీయత కలిగిన ఒక దేశంగా భారతదేశాన్ని, ప్రపంచం మొత్తం విశ్వసిస్తోంది. 

మన ప్రజల సామర్థ్యం మరియు దేశం యొక్క విశ్వసనీయతతో, అత్యుత్తమ నాణ్యత కలిగిన భారతీయ ఉత్పత్తులు విశ్వవ్యాప్తంగా ప్రయాణిస్తాయి.  విశ్వ శ్రేయస్సును పెంపొందించే - ఆత్మ నిర్భర్ భారత్  ఆదర్శానికి - ఇది నిజమైన నివాళి."

*****



(Release ID: 1686439) Visitor Counter : 193