ప్రధాన మంత్రి కార్యాలయం

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మరియు యు.కె. ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ బోరిస్ జాన్సన్ మధ్య టెలిఫోన్ సంభాషణ

Posted On: 05 JAN 2021 8:05PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు యు.కే. ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ బోరిస్ జాన్సన్ ‌తో టెలిఫోన్ లో సంభాషించారు. 

రాబోయే గణతంత్ర దినోత్సవ వేడుకలలో ముఖ్యఅతిథిగా పాల్గొనేందుకు భారతదేశం రావలసిందిగా తనకు ఆహ్వానం పలికినందుకు యు.కే. ప్రధానమంత్రి శ్రీ బోరిస్ జాన్సన్ కృతజ్ఞతలు తెలిపారు. అయితే, యు.కే. లో కోవిడ్-19 పరిస్థితి ప్రబలంగా ఉన్నకారణంగా హాజరుకాలేక పోతున్నందుకు ఆయన, తన విచారాన్ని వ్యక్తం చేశారు.  సమీప భవిష్యత్తులో భారతదేశాన్ని సందర్శించాలన్న,  తన ఉత్సాహాన్ని ఆయన ఈ సందర్భంగా  పునరుద్ఘాటించారు.

యు.కే. లో నెలకొన్న అసాధారణమైన పరిస్థితిపై ప్రధానమంత్రి తమ అవగాహనను వ్యక్తం చేస్తూ,  మహమ్మారి వ్యాప్తి త్వరగా నియంత్రించబడాలన్న తమ ఆకాంక్షను తెలియజేశారు.  దేశంలో సాధారణ పరిస్థితులు నెలకొన్న అనంతరం సాధ్యమైనంత ముందుగా భారతదేశంలో ప్రధానమంత్రి జాన్సన్ కు ఆహ్వానం పలకడానికి ఎదురుచూస్తూ ఉంటానని శ్రీ నరేంద్రమోదీ పేర్కొన్నారు. 

కోవిడ్-19 వ్యాక్సిన్ల ను ప్రపంచానికి అందుబాటులో ఉంచే విషయంతో సహా ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న సహకారాన్ని నాయకులు సమీక్షించారు. బ్రెక్సిట్ అనంతర, కోవిడ్ అనంతర కాలంలో, భారత-యు.కె భాగస్వామ్య పటిష్టతపై గల నమ్మకాన్ని వారు పునరుద్ఘాటించారు.  ఆ పటిష్టతను గ్రహించడం కోసం ఒక సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాలని ఇరువురు నాయకులు అంగీకరించారు.

*****



(Release ID: 1686437) Visitor Counter : 250