ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

చెన్నైలోని శ్రీ రామచంద్ర వైద్య కళాశాల స్నాతకోత్సవం సందర్భంగా విద్యార్థులనుద్దేశించి దృశ్యమాధ్యమం ద్వారా ప్రసంగించిన - డాక్టర్ హర్ష వర్ధన్

"పరిశోధన మరియు అభివృద్ధి కార్యక్రమాల ద్వారా - “ఆత్మ నిర్భర భారత్” మరియు "మేక్-ఇన్-ఇండియా" వంటి ప్రధానమంత్రి కలలను సాకారం చేసి, మెరుగుపరచడానికి వైద్య నిపుణులకు చాలా అవకాశాలు ఉన్నాయి"

వైద్య విద్యను అధ్యయనం చేయడమే, చాలా కఠినమైన పని. వైద్య వృత్తిలో పేరు, ప్రతిష్టలు సాధించడానికి, సంవత్సరాల తరబడి అభ్యాసం అవసరం - డాక్టర్ హర్ష వర్ధన్

Posted On: 04 JAN 2021 5:46PM by PIB Hyderabad

చెన్నైలోని శ్రీ రామచంద్ర ఉన్నత విద్యా మరియు పరిశోధనా సంస్థ స్నాతకోత్సవం సందర్భంగా, విద్యార్థులనుద్దేశించి, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్,  దృశ్యమాధ్యమం ద్వారా ప్రసంగించారు.

ఈ సందర్భంగా, డాక్టర్ హర్ష వర్ధన్ మాట్లాడుతూ,  " ఈ విద్యా సంస్థ 321 స్నాతకోత్సవం సందర్భంగా ప్రసంగించడం నాకు చాలా ఆనందంగా ఉంది మరియు ఇది నాకు లభించిన గౌరవంగా భావిస్తున్నాను. అసాధారణమైన విద్యాసాధన పూర్తిచేసుకుని, ఈ రోజు తమ డిగ్రీలు, ధృవపత్రాలు, పతకాలు అందుకోడానికి, ఇక్కడకు విచ్చేసిన విద్యార్థులందరినీ, ఎంతో ఆనందంగా అభినందిస్తున్నాను.” అని పేర్కొన్నారు.  దేశంలోని ప్రముఖ విద్యాసంస్థలలో ఒకటిగా ఈ సంస్థను స్థాపించడంలో కీలకపాత్ర పోషించిన, శ్రీ ఎన్.పి.వి. రామసామి ఉడయార్ గారి సేవలను, డాక్టర్ హర్ష వర్ధన్, ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. 

32వ స్నాతకోత్సవంలో మొత్తం 1,266 మంది విద్యార్థులు, పట్టాలు స్వీకరించారు.  వీరిలో, 17 డాక్టరేట్ విద్యార్థులు,  26 మంది సూపర్ స్పెషాలిటీ విద్యార్థులు, 509 పోస్ట్ గ్రాడ్యుయేట్లు మరియు 714 అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు ఉన్నారు. 

విశ్వవిద్యాలయం సాధించిన వివిధ విజయాల పట్ల డాక్టర్ హర్ష వర్ధన్, అభినందనలు తెలియజేస్తూ, "దేశంలోని విశ్వవిద్యాలయాలన్నింటిలో, ఈ విశ్వవిద్యాలయం 28 వ స్థానంలోనూ, వైద్య కళాశాలలన్నింటిలోనూ ఈ సంస్థ 13వ స్థానంలోనూ,  దంత కళాశాలలకు ప్రకటించిన 2020-ఎన్.ఐ.ఆర్.ఎఫ్. ర్యాంకింగ్ ‌లో ఈ సంస్థ 7వ స్థానంలోనూ  ఉండటం నాకు చాలా ఆనందంగా ఉంది,  స్థిరమైన వైద్య విద్యా ధృవీకరణ ఆధారంగా, ఈ  డీమ్డ్ విశ్వవిద్యాలయాన్ని ప్రధమ శ్రేణి విశ్వవిద్యాలయంగా యు.జి.సి. గుర్తించింది.  శ్రీ రామచంద్ర వైద్య కళాశాలను, వైద్య విద్యా సాంకేతికతలకు నోడల్ కేంద్రంగా, ఎం.సి.ఐ., 2009 లో ప్రకటించింది.  అప్పటి నుండి, శ్రీ రామచంద్ర వైద్య కళాశాల లోని, ఈ నోడల్ కేంద్రం, దాదాపు 58 వైద్య కళాశాలలకు చెందిన అధ్యాపక బృందం సభ్యులకు శిక్షణ ఇస్తోంది.” అని తెలియజేశారు. 

భారత ప్రభుత్వ జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా విశ్వవిద్యాలయం, బహుముఖ విద్యా కేంద్రంగా మారుతున్నందుకు డాక్టర్ హర్ష వర్ధన్ అభినందనలు తెలియజేస్తూ,  "దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు విదేశాల నుండి కూడా పెద్ద సంఖ్యలో విద్యార్థులను ఆకర్షించడంలో, ఈ గొప్ప సంస్థ యొక్క ప్రత్యేకత,  కీలక పాత్ర పోషిస్తోంది. ఇక్కడ, పరిశోధనలకు అత్యంత ప్రాముఖ్యత ఇవ్వడం నాకు చాలా సంతోషాన్ని కలిగించిందిసంతోషంగా ఉంది.  మొత్తం విశ్వవిద్యాలయం కోసం ‘వినియోగానికి సిద్ధంగా ఉన్న వేదిక’ పై పరిశోధనకు అవసరమైన, పరిశోధన ప్రణాళిక యొక్క అన్ని విభాగాలను జాగ్రత్తగా చూసుకోవటానికి,  "ఎ-టు-జెడ్-గేట్-వే" గా ఈ సంస్థ, ఒక పరిశోధనా సదుపాయాన్ని ఏర్పాటు చేసింది." అని వివరించారు. 

ఐ.సి.ఎం.ఆర్.  టీకా నమూనా పంపిణీ నిర్వహించడానికి  ఈ సంస్థను ఎంపిక చేసిన విషయాన్ని, కేంద్ర మంత్రి పేర్కొంటూ,  "ఇప్పుడు మనం కోవిడ్-19 మహమ్మారి మధ్య కీలక దశలో ఉన్నాము. ఈరోజు ఈ ముఖ్యమైన ఉత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా, ఈ మహమ్మారి సమయంలో రోగి సంరక్షణకు మద్దతు ఇచ్చి, వారి స్వంత ఆరోగ్యాన్ని, జీవితాన్ని సైతం  పణంగా పెట్టడానికి సిద్ధపడిన, ఫ్రంట్‌లైన్ ఆరోగ్య కార్యకర్తలు, వైద్యులు, నర్సులు, సాంకేతిక నిపుణులు, రవాణాదారులు, అత్యవసర వైద్య సాంకేతిక నిపుణులు, ఫార్మసిస్ట్‌లతో పాటు, ప్రతి ఒక్కరికీ, మనమందరం వందనం చేద్దాం.  కోవిడ్ రోగుల కోసం, మీ సంస్థ, ప్రత్యేకంగా ఒక బ్లాకును కేటాయించిన సంగతిని నేను గమనించాను.  మీ సంస్థ 2020 ఏప్రిల్ నెల ప్రారంభం నుండి కోవిడ్ పరీక్షా కేంద్రంగా పనిచేస్తున్నందుకు, నాకు చాలా సంతోషంగా ఉంది.” అని ప్రశంసించారు. 

ఆరోగ్య సంరక్షణ సేవల్లో ప్రాంతీయ అంతరాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, డాక్టర్ హర్ష వర్ధన్, ఉద్ఘాటిస్తూ,  "ఆరోగ్య సంరక్షణ విషయంలో, ప్రభుత్వ రంగం అందించిన సహకారాన్ని, ప్రదర్శించడానికి, ఇటీవలి మహమ్మారి, తగినంత అవకాశాన్ని కల్పించింది.  డాక్టర్-రోగి నిష్పత్తిని మెరుగుపరచడంతో పాటు రోగులు-ఆసుపత్రిలో పడకల నిష్పత్తిని పెంచడానికి, కేంద్ర ప్రభుత్వం సమర్థవంతమైన చర్యలు తీసుకుంటోంది. కేంద్ర ప్రభుత్వం నుండి చురుకైన మద్దతు లభించడంతో, గత 6 సంవత్సరాలలో దేశంలో కొత్త వైద్య కళాశాలలు మరియు ఎయిమ్స్ ప్రారంభించబడ్డాయి. ప్రస్తుతానికి,  గత ఒకటిన్నర సంవత్సరాల కాలంలో, 75 కొత్త వైద్య కళాశాలలను ప్రారంభించాలని ప్రతిపాదించగా, వాటిలో  14 వైద్య కళాశాలలు కేవలం ఒక్క తమిళనాడులోనే ఉన్నాయి.  గత 6 సంవత్సరాల్లో, ఎయిమ్స్ సంఖ్యను 6 నుండి 22 కి పెంచాలని నిర్ణయించాము.” అని తెలియజేశారు.

"ఆత్మ నిర్భర భారత్" ను రూపొందించాలనే, ప్రధానమంత్రి స్వప్నాన్ని, డాక్టర్ హర్ష వర్ధన్ పునరుద్ఘాటిస్తూ, పరిశోధన మరియు అభివృద్ధి కార్యక్రమాల ద్వారా - “ఆత్మ నిర్భర భారత్” మరియు "మేక్-ఇన్-ఇండియా"  వంటి ప్రధానమంత్రి కలలను సాకారం చేసి, మెరుగుపరచడానికి వైద్య నిపుణులకు చాలా అవకాశాలు ఉన్నాయి" అని సూచించారు.

కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి కూడా, కేంద్ర ఆరోగ్య మంత్రి, డాక్టర్ హర్ష వర్ధన్, ఈ సందర్భంగా పునరుద్ఘాటిస్తూ,  "సమస్యలను క్రమం తప్పకుండా అర్థం చేసుకోవడానికీ, సమర్థవంతమైన కోవిడ్ నిర్వహణ కోసం, రాష్ట్రాలతో సహకరించడం కోసం, గౌరవనీయ ప్రధానమంత్రి స్వయంగా, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల పాలనా యంత్రాంగాలతో పాటు సంబంధిత భాగస్వాములందరితో, సంభాషించారు.  కోవిడ్ తో పాటు కోవిడ్ కాని ఆరోగ్య సమస్యలకు నాణ్యమైన చికిత్సను నిర్ధారించడానికీ, గ్రామీణ ప్రాంతాలతో పాటు సుదూర ప్రాంతాల్లోని ప్రజలకు ప్రత్యేకమైన ఆరోగ్య సేవలను విస్తరించడానికీ, "ఈ-సంజీవని" అనే వెబ్ ఆధారిత సమగ్ర టెలి-మెడిసిన్ పరిష్కార సదుపాయం 23 రాష్ట్రాల్లో విస్తృతంగా ఉపయోగపడుతోంది. ఈ డిజిటల్ వేదిక ద్వారా, ఈ రోజు వరకు, 12 లక్షలకు పైగా టెలి-సంప్రదింపులు జరిగాయి.” అని వివరించారు. 

ఈ విషయం గురించి, ఆయన, వివరిస్తూ,  "మన ప్రభుత్వం "ఆయుష్మాన్ భారత్"  అనే ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య పథకాన్ని ప్రారంభించింది.  ఈ పధకం కింద, దేశవ్యాప్తంగా ఉన్న ఉప ఆరోగ్య కేంద్రాలతో పాటు, గ్రామీణ, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయిని పెంపొందించడం ద్వారా, 1,50,000 ఆరోగ్య,  మరియు సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది.  ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన కింద 10.74 కోట్ల పేద, బలహీన కుటుంబాలను గుర్తించారు.  సామాజిక-ఆర్థిక కుల జనాభా లెక్కల ప్రకారం, ద్వితీయ, తృతీయ స్థాయి సంరక్షణ ఆసుపత్రిల ద్వారా వైద్య చికిత్స చేయించుకోడానికి, ఒక్కో కుటుంబానికి  సంవత్సరానికి 5 లక్షల రూపాయల మేర ఆరోగ్య రక్షణ లభిస్తుంది. ” అని తెలియజేశారు. 

ఈ స్నాతకోత్సవంలో పాల్గొన్న యువ పట్టభద్రులను డాక్టర్ హర్ష వర్ధన్ ప్రోత్సహిస్తూ,  "వైద్య విద్యను అభ్యసించడమే చాలా కఠినమైన పని. వైద్య వృత్తిలో పేరు, ప్రతిష్టలు సాధించాలంటే, సంవత్సరాల తరబడి అభ్యసించవలసిన అవసరం ఉంది. ఏదేమైనా, ఈ రంగంలో సేవలందించేవారికి లభించే గౌరవ, ప్రతిష్టలు సాటిలేనివి. ఒక జీవితాన్ని కాపాడే, ఒక మంచి వైద్యుడు, తరచూ తన జీవితానికి మించి జీవిస్తాడు. మీ ఉద్దేశ్యాలు, ప్రయత్నాలతో మీరు సరైన పనులను ధర్మబద్ధమైన పద్ధతిలో ఎంచుకుంటారనీ, జీవితంలోని అన్ని రంగాల్లో మీరు తప్పక  విజయం సాధిస్తారనీ, నేను ఖచ్చితంగా విశ్వసిస్తున్నాను." అని పేర్కొన్నారు. 

డాక్టర్ హర్ష వర్ధన్ మాట్లాడుతూ,  "మన ప్రియమైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ గారికి, యువత శక్తి పై గొప్ప నమ్మకం ఉంది.  అదే, మన వద్ద ఉన్న అతి పెద్ద జాతీయ ఆస్తి అని, ఆయన విశ్వసిస్తారు.  యువత మన దేశ జనాభాలో ఎక్కువ శాతం ఉండడంతో, రాబోయే 5 -10 సంవత్సరాలు భారతదేశానికి ఒక రకమైన స్వర్ణ యుగం అవుతుందని ఆయన భావిస్తున్నారు.  భారతదేశానికి లభించవలసిన కీర్తి, ప్రతిష్టలను సాధించడానికి మీరందరూ ఎంతో ఆత్మవిశ్వాసంతో, ఉత్సాహంతో ముందుకు సాగాలని నేను కోరుతున్నాను.” అని ఆశాభావం వ్యక్తం చేశారు.

చివరగా డాక్టర్ హర్ష వర్ధన్ తమ ప్రసంగాన్ని ముగిస్తూ,  “నా ప్రియమైన యువ మిత్రులారా,  ఈ రోజు నిర్వహించిన ఈ స్నాతకోత్సవం, మీ కృషికి ప్రతిఫలం. అదేవిధంగా సమాజానికి సేవ చేయడానికి మిమ్మల్ని  విద్యార్థి దశ నుండి వృత్తిపరమైన సంసిద్ధతకు ఇది దారి చూపుతుంది. మీరు ఎంచుకున్న ఈ వృత్తి పట్ల, మీరు మక్కువ చూపాలనీ, సమగ్రతను ప్రదర్శించాలనీ, నైతిక ప్రమాణాలను పాటించాలనీ, మిమ్మల్ని కోరుతున్నాను.  మీరు ఎంచుకున్న ఈ రంగంలో నిరంతరం ఆవిష్కృతమయ్యే సాంకేతిక పరిణామాల గురించి తెలుసుకోవటానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి, జీవితకాల అభ్యాసకులుగా కొనసాగండి.” అని విద్యార్థులకు సూచించారు.

 

ఈ స్నాతకోత్సవ కార్యక్రమంలో - శ్రీ రామచంద్ర ఉన్నత విద్యా మరియు పరిశోధనా సంస్థ యొక్క ఛాన్సలర్, శ్రీ. వి.ఆర్. వెంకటచలం గారు;  ప్రో-ఛాన్సలర్, శ్రీ ఆర్.వి.సెంగుతువన్ గారు;  జీ, వైస్ ఛాన్సలర్, డాక్టర్ పి.వి. విజయరాఘవన్ గారు కూడా పాల్గొన్నారు. 

 

*****



(Release ID: 1686178) Visitor Counter : 155