రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్‌కు మ‌ద్ద‌తుః అభివృద్ధి చెందుతున్న సాంకేతిక‌త‌లపై ప‌ని చేస్తున్న స్టార్ట‌ప్‌ల‌కు భార‌తీయ సైన్యం స‌హ‌కారం

Posted On: 29 DEC 2020 1:14PM by PIB Hyderabad

ఆత్మ నిర్భ‌ర్ భార‌త్‌కు మ‌ద్ద‌తునివ్వ‌డం కోసం, ఆవిష్క‌ర‌ణ‌ల వాతావ‌ర‌ణాన్ని ప్రోత్స‌హించ‌డం కోసం సొసైటీ ఆఫ్ ఇండియ‌న్ డిఫెన్స్ మాన్యుఫాక్చ‌ర‌ర్స్ (ఎస్ ఐ డి ఎం) స‌హ‌కారంతో భార‌తీయ సైన్యం అభివృద్ధి చెందుతున్న సాంకేతిక‌ల‌కు సంబంధించిన స్టార్ట‌ప్‌ల‌కు ఒక వెబినార్‌ను నిర్వ‌హించింది. సుమారు 89 స్టార్ట‌ప్‌లు దేశీయంగా అభివృద్ధి చేసిన ఆవిష్క‌ర‌ణ‌ల‌ను, ఐడియాల‌ను, ప్ర‌తిపాద‌న‌ల‌ను డిసెంబ‌ర్ 17 నుంచి 28 డిసెంబ‌ర్ 2020 వ‌ర‌కు జ‌రిగిన వెబినార్‌లో దృశ్య‌మాధ్య‌మం ద్వారా అందించాయి. 
డ్రోన్లు, కౌంట‌ర్ డ్రోన్లు, రోబోటిక్స్, అటాన‌మ‌స్ వ్య‌వ‌స్థ‌లు, ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ (ఎఐ), క్వాంటం కంప్యూటింగ్‌, బ్లాక్ చెయిన్ సాంకేతిక‌త‌, 3డి ప్రింటింగ్‌, నానో టెక్నాల‌జీ, మెడిక‌ల్ అప్లికేష‌న్ల క్షేత్రంపై ఈ ప్ర‌తిపాద‌న‌లు దృష్టి పెట్టాయి. 
ఆర్మీ డిజైన్ బ్యూరో (ఎడిబి) నిర్వ‌హించిన ఈ వెబినార్ల‌కు పెద్ద ఎత్తున స్పంద‌న వ‌చ్చింది. వ‌చ్చిన ప్ర‌తిపాద‌న‌ల‌లో భార‌తీయ సైన్యానికి అనువ‌ర్తించే, ఆచ‌ర‌ణ సాధ్య‌మైన ప‌ద‌మూడు ప్ర‌తిపాద‌న‌ల‌ను షార్ట్ లిస్ట్ చేశారు. సైనిక కేంద్ర కార్యాల‌యం, సైనిక శిక్ష‌ణ క‌మాండ్‌కు చెందిన భావి వినియోగ‌దారులు, ఆ రంగంలో నిపుణులు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. 
ఈ సంద‌ర్భంగా మాట్లాడిన భార‌తీయ సైన్యం డిప్యూటీ చీఫ్ లెఫ్టెనెంట్ జ‌న‌ర‌ల్ ఎస్ ఎస్ హ‌స‌బ్నిస్‌, ర‌క్ష‌ణ రంగంలో స్వావ‌లంబ‌న ప్రాముఖ్య‌త‌ను నొక్కి చెప్తూ, అభివృద్ధి చెందుతున్న‌, స‌ముచిత సాంకేతిక‌త‌ల‌లో పెట్టుబ‌డుల‌ను పెట్ట‌వ‌ల‌సిందిగా ర‌క్ష‌ణ ప‌రిశ్ర‌మ‌కు, ముఖ్యంగా స్టార్ట‌ప్‌ల‌కు పిలుపిచ్చారు. 
సైనిక నిర్వ‌హ‌ణా సామ‌ర్ధ్యాల‌ను పెంచ‌గ‌ల సాంకేతిక‌త‌ల‌, ఆవిష్క‌ర‌ణ‌ల అభివృద్ధిలో భార‌తీయ సైన్యం తోడ్పాటునందించి, బాస‌ట‌గా ఉంటుంద‌ని స్టార్ట‌ప్‌ల‌కు డిప్యూటీ చీఫ్ హామీ ఇచ్చారు. 

***


(Release ID: 1684526) Visitor Counter : 173