మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
‘టిహాన్ ఐ.ఐ.టి. హైదరాబాద్’ కేంద్రానికి శంకుస్థాపన
వర్చువల్ పద్ధతిలో కేంద్ర విద్యామంత్రి భూమిపూజ
భూతల, గగనతల వాహనాల నావిగేషన్.లో సృజనాత్మక పరిజ్ఞానంపై
దేశంలో ఇదే తొలి ప్రయోగ కేంద్రం
Posted On:
29 DEC 2020 4:00PM by PIB Hyderabad
టెస్ట్ ట్రాకులు, అధునాతన సాంకేతి పరిజ్ఞాన సదుపాయాలు, రహదారి మౌలిక సదుపాయాలు, వి2ఎక్స్ కమ్యూనికేషన్, డ్రోన్ రన్.వేలు, ల్యాండింగ్ ఏరియా, మెకానికల్ ఇంటిగ్రేషన్ సదుపాయం, కేంద్రీకృత కంట్రోల్ రూమ్/గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్, హ్యాంగర్లు, మరెన్నో సదుపాలకు నిలయం ఈ కేంద్రం
భూతల, గగనతల వాహనాల ప్రయాణ గమనానికి సంబంధించిన సృజనాత్మక సాంకేతిక పరిజ్ఞాన అధ్యయనంకోసం రూపొందించిన స్వయంప్రతిపత్తి సంస్థ ‘టిహాన్-ఐ.ఐ.టి. హైదరాబాద్’ నిర్మాణానికి కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ. రమేష్ పోఖ్రియాల్ ‘నిశాంక్’, వర్చువల్ పద్ధతిలో శంకుస్థాపన చేశారు. కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి సంజయ్ ధోత్రే సమక్షంలో ఈ భూమిపూజ జరిగింది. ఐ.ఐ.టి. హైదరాబాద్ గవర్నర్ల బోర్డు చైర్మన్ డాక్టర్ బి. వి. ఆర్. మోహన్ రెడ్డి, ఐఐటి హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ బి. ఎస్. మూర్తి, కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖక, సైన్స్ టెక్నాలజీ శాఖలకు, హైదరాబాద్ ఐ.ఐ.టి.కి చెందిన సీనియర్ అధికారులు కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. భూతల, గగనతల వాహనాల ప్రయాణ గమన సాంకేతిక పరిజ్ఞానంపై భారతదేశపు తొలి సృజనాత్మక ప్రయోగ కేంద్రంగా ‘టిహాన్-ఐ.ఐ.టి. హైదరాబాద్’ సంస్థను పరిగణించవచ్చు. మానవ రహిత విమానాలు, రిమోట్ సహాయంతో నడిచే వాహనాల సాంకేతిక పరిజ్ఞానంపై ఈ సంస్థ అధ్యయనం, ప్రయోగాలు నిర్వహిస్తుంది.
ఈ సంస్థ ఏర్పాటుకు గాను, ఇంటర్-డిసిప్లనరీ ఫిజికల్ సిస్టమ్స్.పై రూపొందించిన జాతీయ కార్యక్రమం కింద రూ. 135కోట్లను కేంద్ర సైన్స్ టెక్నాలజీ శాఖ (డి.ఎస్.టి.),. హైదరాబాద్ ఐ.ఐ.టి.కి మంజూరు చేసింది. 'టిహాన్ ఫౌండేషన్' పేరిట ఈ సృజనాత్మక సాంకేతిక పరిజ్ఞాన కేంద్రాన్ని, 2013వ సంవత్సరపు కంపెనీల చట్టం, సెక్షన్-8 పరిధిలోని కంపెనీగా (పరిశోధనా ప్రాధాన్యం కలిగిన కంపెనీగా) 2020 జూన్ నెలలో పొందుపరిచారు.
సంస్థ శంకుస్ధాపన సందర్భంగా కేంద్రమంత్రి పోఖ్రియాల్ మాట్లాడుతూ, సంస్థ ఏర్పాటు దోహపడిన సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధిపట్ల హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ ఐ.ఐ.టి. పరిధిలో ఏర్పాటైన 'టిహాన్ ఫౌండేషన్' బహుళ శాఖలు ఉమ్మడిగా చేసిన కృషి ఫలితమే అన్నారు. ఎలెక్ట్రికల్, కంప్యూటర్త సైన్స్, మెకానికల్, ఎయిరోస్పేస్, సివిల్, మ్యాథమ్యాటిక్స్, డిజైన్ రంగాల చెందిన పరిశోధకులతోపాటు, పలు ప్రముఖ సంస్థలు, పరిశ్రమలు ఈ కేంద్రం ఏర్పాటుకు కృషి చేసినట్టు చెప్పారు. ‘ఆత్మనిర్భర్ భారత్’, ‘స్కిల్ ఇండియా’, ‘డిజిటల్ ఇండియా’ కలలను సాకారం చేసుకునే కృషిలో ఇది ఒక ముందడుగని అన్నారు. వివిధ సాంకేతిక పరిజ్ఞానాల తులనాత్మక అధ్యయనంతో కూడిన పరిశోధనపై ఈ కేంద్రంలో ప్రత్యేకంగా దృష్టిని కేంద్రీకరిస్తారని చెప్పారు. గగనతల, భూతలాల్లో మానవ రహిత విమానాలు, రిమోట్ ఆపరేటెడ్ వాహనాల వినియోగంలో వాస్తవికంగా ఎదురయ్యే సవాళ్లకు తగిన పరిష్కార మార్గాల పరిశోధనపై దృష్టిని కేంద్రీకరించనున్నట్టు తెలిపారు.
కేంద్ర విద్యాశాఖ సహాయమంత్రి సంజయ్ ధోత్రే మాట్లాడుతూ, సంస్థ రూపకల్పన కోసం హైదరాబాద్ ఐ.ఐ.టి. బృందం తీసుకున్న చొరవ ఎంతో ప్రశంసనీయమన్నారు. హైదరాబాద్ ఐ.ఐ.టి. గవర్నర్ల బొర్డు చైర్మన్ డాక్టర్ బి.వి.ఆర్. మోహన్ రెడ్డి మాట్లాడుతూ, ఈ భారీ ప్రాజెక్టును చేపట్టడంలో తమ సంస్థ అధ్యాపక బృందం చేసిన కృషిని అభినందించారు.
హైదరాబాద్ ఐ.ఐ.టి. డైరెక్టర్ ప్రొఫెసర్ బి.ఎస్. మూర్తి ఈ సందర్భంగా టిహాన్ బృందానికి అభినంనదలు తెలిపారు. మానవ రహిత వాహనాలు, రిమోట్ కనెక్టెడ్ వాహనాలను వినియోగ సంఘాలకు భద్రతాపరంగా ఆమోదయోగ్యంగా తీర్చిదిద్దాలంటే, నిజ జీవితంలో వాటి పనితీరును, సామర్థ్యాన్ని ప్రదర్శించి పరీక్షించి తీరాలన్నారు. ఈ వాహనాల భద్రతపై ప్రయోగాత్మక పరీక్షల్లో కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని తప్పనిసరిగా పరీక్షించి తీరాలన్నారు.
ఈ కొత్త సృజనాత్మక సాంకేతిక పరిజ్ఞాన కేంద్రం ప్రాముఖ్యతను గురించి టిహాన్ ప్రాజెక్టర్ డైరెక్టర్, ఎలెక్ట్రికల్ ఇంజినీరింగ్ శాఖ ప్రొఫెసర్ డాక్టర్ పి. రాజలక్ష్మి వివరించారు. మానవ రహిత వాహనాలు, అనుసంధాన వాహనాల పనితీరుపై ఇలాంటి ప్రయోగాత్మక పరీక్షా కేంద్రాలను ప్రపంచవ్యాప్తంగా పలు సంస్థలు అందుబాటులోకి తెస్తున్నాయన్నారు. మనదేశంలో మాత్రం నావిగేషన్ వ్యవస్థలపై ఇప్పటివరకూ ఇలాంటి కేంద్రం లేదన్నారు. నిఘా, స్వయంప్రతిపత్తి రవాణా వ్యవస్థ, వ్యవసాయం, పర్యావరణ, మౌలిక సదుపాయాల పర్యవేక్షణ రంగాలపై తాజాగా ఏర్పాటయ్యే ఈ కేంద్రం దృష్టిని పెడుతుందన్నారు.
ఈ కేంద్ర నిర్మాణం కోసం హైదరాబాద్ ఐ.ఐ.టి. ఆవరణలో మొత్తం 2 ఎకరాల స్థలాన్ని ఇప్పటికే కేటాయించారు. దశలవారీగా ఈ కేంద్రంలో పలు సదుపాయాలను ఏర్పాటు చేస్తారు. టెస్ట్ ట్రాకులు, అధునాతన సాంకేతి పరిజ్ఞాన సదుపాయాలు, రహదారి మౌలిక సదుపాయాలు, వి2ఎక్స్ కమ్యూనికేషన్, డ్రోన్ రన్.వేలు, ల్యాండింగ్ ఏరియా, మెకానికల్ ఇంటిగ్రేషన్ సదుపాయం, కేంద్రీకృత కంట్రోల్ రూమ్/గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్, హ్యాంగర్లు, మరెన్నో సదుపాలకు నిలయంగా ఈ కేంద్రాన్ని తీర్చిదిద్దుతారు. ఇక్కడ పూర్తిగా అభినవృద్ధి చేసిన పరీక్షా కేంద్రం,.. అన్ని రకాల పరిశ్రమలకు, పరిశోధనా గారాలకు, నావిగేషన్ రంగానికి చెందిన పరిశోధనా సంస్థలకు అందుబాటులో ఉంటుంది.
*****
(Release ID: 1684523)
Visitor Counter : 153