ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం

కరోనా సృష్టించిన సమస్యలను అవకాశాలుగా మలచుకోవాలి : ఉపరాష్ట్రపతి
భవిష్యత్ ప్రపంచాన్ని శాసించగల మానవవనరులు మనసొంతం

కావాల్సిందల్లా మన యువశక్తి నైపుణ్యాన్ని అందించి సానబెట్టడమే

లాక్‌డౌన్‌లో ఆన్‌లైన్ విద్య ద్వారా సమయాన్ని సద్వినియోగం చేసుకున్న తీరు అభినందనీయం

స్వర్ణభారత్ ట్రస్టులో శిక్షణ పూర్తిచేసుకున్న వారికి ధృవీకరణపత్రాల ప్రదానోత్సవంలో ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు

సేవ చేయడం ద్వారా నిరంతరం ప్రజల గుండెల్లో నిలిచి ఉంటాం.. అందులోనే సంతృప్తి ఉంటుందని వెల్లడి

Posted On: 28 DEC 2020 3:03PM by PIB Hyderabad

కరోనా మహమ్మారి సృష్టించి సమస్యలను సోపానాలుగా, అవకాశాలుగా మార్చుకుని యువత ముందుకెళ్లాలని గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. కరోనా సమస్యలతో పాటు కొత్త అవకాశాలను, సరికొత్త అవసరాలను కల్పించిందని.. వాటిని ఏవిధంగా సద్వినియోగం చేసుకోవాలనేదానిపైనే.. యువత దృష్టికేంద్రీకరించాలని ఆయన సూచించారు. స్వర్ణభారత్ ట్రస్టు విజయవాడ చాప్టర్‌లో శిక్షణ పూర్తిచేసుకున్న విద్యార్థులకు ధృవీకరణ పత్రాల ప్రదానోత్సవం సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ.. ‘కరోనా మహమ్మారి ప్రపంచం మీద ఎలాంటి ప్రభావాన్ని చూపించిందో మీ అందరికీ తెలుసు. అభివృద్ధి గమనంలో ఈ మహమ్మారి ఎన్ని దారులను మూసేసిందో, అదే సంఖ్యలో కొత్త దారులను కూడా తెరిచింది. సవాళ్ళను సోపానాలుగా మార్చుకుని అభివృద్ధి పథంలో ముందుకు సాగే ధైర్యాన్ని మనకు ఇచ్చింది’ అని పేర్కొన్నారు.

కరోనా సమయంలో ట్రస్టు ఆధ్వర్యంలో  జరుగుతున్న శిక్షణా కార్యక్రమాలను కొనసాగించడంలో అధ్యాపకులు పోషించినపాత్రను ఆయన అభినందించారు. ఆన్‌లైన్ శిక్షణ ద్వారా లాక్‌డౌన్ కాలాన్ని సద్వినియోగం చేసుకునేలా విద్యార్థులను ప్రోత్సహించిన తీరు అభినందనీయమన్నారు.

భారతదేశ జనాభాలో 65 శాతం మంది యువత (35 ఏళ్లలోపువారు) ఉన్నారని.. మొత్తం జనాభాలో సగానికి పైగా మహిళలు ఉన్నారని గుర్తు చేసిన ఉపరాష్ట్రపతి, ప్రతిభావంతులైన యువత శక్తి సామర్థ్యాలను సంపూర్ణంగా వినియోగించుకుని, దేశాభివృద్ధిలో యువతరం, మహిళల భాగస్వామ్యాన్ని మరింత పెంచడం ద్వారా అభివృద్ధి వేగాన్ని పెంచేందుకు అవకాశం ఉందని సూచించారు. 

అపారమైన మానవవనరులు భారతదేశానికి సహజమైన శక్తిగా అభివర్ణించిన ఉపరాష్ట్రపతి, ఈ శక్తిని సద్వినియోగం చేసుకుంటూ వారిని దేశాభివృద్ధిలో భాగస్వామ్యం చేసే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు చేపడుతున్నాయని, వీటిని మరింత వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. దేశంతో పాటు ప్రపంచం ఎదుర్కొనే భవిష్యత్ సవాళ్లను దృష్టిలో ఉంచుకుని అవసరమైన నైపుణ్యాన్ని అందించాలని సూచించారు. ఈ దిశగా ప్రైవేటు రంగం కూడా తన బాధ్యతను స్వీకరించాలన్నారు.

‘మీరంతా మహత్కార్యాలు సాధించడానికే జీవించామని విశ్వసించండి. బలం, శక్తి మీలోనే ఉన్నాయని గుర్తుంచుకోండి. ఎంతో విశ్వాసంతో లేచి నిలబడండి. ధైర్యంగా బాధ్యతను మీ భుజస్కంధాలపై వేసుకోండి. భవిష్యత్తుకు మీరే బాధ్యులమని తెలుసుకోండి. ఆరంభం అతి స్వల్పంగా ఉందని నిరాశపడకండి. క్రమంగా ఘనమైన ఫలితాలు వస్తాయి.. సాహసంగా పని చేయండి’ అన్న స్వామీ వివేకానందుని సూక్తులను మనసా, వాచా, కర్మణా పాటిస్తే తిరుగే ఉండదని.. విద్యార్థులకు ఉపరాష్ట్రపతి దిశానిర్దేశం చేశారు. 

కరోనా మహమ్మారి కారణంగా చాలా కాలం తర్వాత స్వర్ణభారత్ ట్రస్ట్ విజయవాడ చాప్టర్ కు రావడం, విద్యార్థులందరినీ కలవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. మహమ్మారి సృష్టిస్తున్న సమస్యలను లెక్కచేయకుండా, విజయవాడ చాప్టర్ తోపాటు, నెల్లూరు, హైదరాబాద్ చాప్టర్‌ల ఆధ్వర్యంలోనూ విస్తృతంగా సేవాకార్యక్రమాలు నిర్వహిచడం, వలస కార్మికులకు, పేదలకు భోజన వితరణ ద్వారా కరోనా మహమ్మారి నేపథ్యంలో సేవాభావాన్ని చాటిచెప్పారన్నారు. అంతే కాకుండా చుట్టు పక్కల ఉన్న అనేక గ్రామాల్లో నిత్యావసరాలు, కూరగాయలు, పండ్లు అందజేయడం ఆనందదాయకమన్నారు. ఇందు కోసం చొరవ తీసుకున్న స్వర్ణభారత్ ట్రస్ట్ నిర్వహణా బృందాన్ని అభినందించారు.

కరోనా సమయంలో తాను స్వర్ణభారత్ ట్రస్ట్ కు వచ్చి పిల్లల్ని పలకరించలేకపోయినప్పటికీ.. వారి యోగక్షేమాలను, ట్రస్టు సేవాకార్యక్రమాల గురించి నిరంతరం వాకబు చేస్తున్నట్లు ఉపరాష్ట్రపతి తెలిపారు.

సేవా కార్యక్రమాల ద్వారానే నిరంతరం ప్రజలగుండెల్లో నిలిచి ఉంటామని.. సేవలో లభించే తృప్తి మరెక్కడా పొందలేమన్న ఉపరాష్ట్రపతి, ఎన్ని కార్యక్రమాలున్నా, ట్రస్టుకు వస్తే కలిగే ప్రశాంతతే వేరన్నారు. 

రైతులు, మహిళలు, యువత అభివృద్ధి, వారికి సాధికారత కల్పించడంపైనే స్వర్ణభారత్ ట్రస్టు ప్రధానంగా దృష్టి పెట్టిందన్న ఉపరాష్ట్రపతి, ఒక పూట అన్నం పెట్టడం కాదు. రోజూ అన్నం సంపాదించుకునే స్వశక్తిని పెంపొందించుకునే నైపుణ్య శిక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఇప్పటి వరకూ వేలాది మంది యువత స్వర్ణభారత్‌లో నైపుణ్య శిక్షణ పొంది మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారని, అదే విధంగా ఎంతో మంది మహిళలు ఇక్కడ శిక్షణ పొంది, తమ కాళ్ళ మీద తాము నిలబడే సాధికారత సంపాదించారని తెలిపారు. 

ఈ కార్యక్రమంలో స్వర్ణభారత్ ట్రస్ట్ ట్రస్టీ శ్రీ రాజయ్య, విజయవాడ పాలక వర్గ సభ్యులు శ్రీ చుక్కపల్లి ప్రసాద్, శ్రీ కోనేరు సత్యనారాయణ, శ్రీ గ్రంధి విశ్వనాథ్ తో పాటు ట్రస్ట్ సీఈవో శ్రీ శరత్ బాబు విజయవాడ డైరెక్టర్ శ్రీ పరదేశి విద్యార్థులు, అధ్యాపకులు పాల్గన్నారు.

***(Release ID: 1684160) Visitor Counter : 8