ప్రధాన మంత్రి కార్యాలయం

2020 వ సంవత్సరం డిసెంబర్ 27 వ తేదీ న జరిగిన ‘మన్ కీ బాత్ 2.0’ (‘మనసు లో మాట 2.0’ కార్యక్రమం) 19 వ భాగం లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం

Posted On: 27 DEC 2020 11:40AM by PIB Hyderabad

నా ప్రియమైన దేశవాసులారా, నమస్కారం.

ఈ రోజు డిసెంబర్ 27.  మరో నాలుగు రోజుల తరువాత, 2021 వ సంవత్సరం రానుంది.  ఒక విధం గా, నేటి ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’ కార్యక్రమం) 2020 వ సంవత్సరం లో చివరి ‘మన్ కీ బాత్’ అన్నమాట.  తదుపరి ‘మన్ కీ బాత్’ 2021వ సంవత్సరం లో మొదలవుతుంది.  మిత్రులారా, మీరు రాసినటువంటి లేఖలు నా ముందు చాలానే ఉన్నాయి.  మీరు Mygov లో పంపే సూచనలు కూడా, నా ముందు ఉన్నాయి.  ఎంతో మంది ఫోన్ చేసి, వారి మాటలను చెప్పారు.  చాలా సందేశాలలో ఈ ఏడాది అనుభవాలు, 2021 తో జతపడ్డ సంకల్పాలు ఉన్నాయి.  కొల్హాపుర్ నుంచి అంజలి గారు.. “ప్రతి సారి కొత్త సంవత్సరం సందర్భం లో మనం ఇతరులను అభినందిస్తున్నాం, శుభాకాంక్షలు చెప్పుకొంన్నాం కదా.  అయితే ఈ సారి మనం ఒక కొత్త పని ని చేద్దాం.  మనం, మన దేశాన్ని, ఎందుకని అభినందించ కూడదు ?   దేశానికి ఎందుకు శుభాకాంక్షలను తెలియజేయకూడదు.. ?” అంటూ రాశారు.   అంజలి గారు, నిజం గా, చాలా మంచి ఆలోచన మీది.  మన దేశం, 2021వ సంవత్సరం లో, సాఫల్యం తాలూకు కొత్త శిఖరాలను అందుకోవాలని, ప్రపంచం లో భారతదేశం గుర్తింపు మరింత బలాన్ని పుంజుకోవాలని కోరుకోవడం కంటే గొప్పదైన కోరిక ఇంకేమి ఉంటుంది ?  

మిత్రులారా, ముంబయి కి చెందిన అభిషేక్ గారు NamoApp లో ఒక సందేశాన్ని పోస్ట్ చేశారు.  ఆయన 2020 వ సంవత్సరం లో ఏమేమిటయితే చూశారో, నేర్చుకొన్నారో, అటువంటివి ఎప్పుడూ ఆలోచించనే ఆలోచించలేదు అంటూ రాశారు.  కరోనా కు సంబంధించిన అన్ని విషయాలను ఆయన రాశారు.  ఈ లేఖలలో, ఈ సందేశాలన్నిటిలో ఉన్న ఒక సామాన్య అంశాన్ని, ప్రముఖంగా కనపడ్డ ఆ అంశాన్ని, నేను ఈ రోజు న మీకు వెల్లడించాలని అనుకుంటున్నాను.  చాలా లేఖల లో దేశ సామర్థ్యాన్ని, దేశవాసుల సామూహిక శక్తి ని ప్రజలు ఎంతగానో ప్రశంసించారు.  ఎప్పుడైతే జనతా కర్ఫ్యూ వంటి వినూత్న ప్రయోగం, యావత్తు ప్రపంచానికి ప్రేరణ నిచ్చిందో, ఎప్పుడైతే చప్పట్లు చరుస్తూ, పళ్లేలను మోగిస్తూ దేశం మన కరోనా యోధులను గౌరవించుకొందో, సంఘీభావాన్ని వ్యక్తం చేసిందో, ఆ విషయాలను కూడా, చాలా మంది గుర్తుకు తెచ్చుకొన్నారు.

మిత్రులారా, దేశం లోని సామాన్యులలోకెల్లా సామాన్యులు ఈ మార్పు ను గ్రహించారు.  నేను, దేశం లో ఆశల తాలూకు ఒక అద్భుత ప్రవాహాన్ని కూడా చూశాను.  సవాళ్లు అనేకం వచ్చాయి.  సంకటాలు కూడా అనేకం వచ్చాయి. కరోనా కారణం గా ప్రపంచం లో సప్లై చైన్ లో అనేక సమస్యలు ఎదురయ్యాయి, అయినప్పటికీ, మనం ప్రతి సంక్షోభం నుంచి కొత్త పాఠాలను నేర్చుకొన్నాం.  దేశం లో కొత్త సామర్ధ్యం కూడా అంకురించింది. మాటల్లో చెప్పాలి అనుకుంటే, మరి ఈ సామర్ధ్యం పేరు ‘ఆత్మ నిర్భరత’ (అదే..స్వావలంబన).

మిత్రులారా, దిల్లీ లో నివసించే అభినవ్ బెనర్జీ గారు తన అనుభవాన్ని నాకు రాసి పంపారు.  ఇది కూడా చాలా ఆసక్తికరం గా ఉంది.  అభినవ్ గారు తన బంధువుల పిల్లలకు బహుమతిగా ఇవ్వడానికి  కొన్ని ఆటవస్తువులను కొనవలసి వచ్చింది.  ఈ కారణంగా, దిల్లీ లోని ఝండేవాలాన్ బజారు కు ఆయన వెళ్ళారు.  మీలో చాలా మంది కి తెలిసే ఉంటుంది..  ఆ మార్కెట్ దిల్లీ లో సైకిళ్ల కు, ఆటవస్తువుల కు ప్రసిద్ది చెందింది అన్న సంగతి. అంతకుముందు అక్కడ ఖరీదైన ఆటబొమ్మలు అంటే అర్థం దిగుమతి చేసుకొన్న ఆటబొమ్మలు అనే. మరి, చౌక బొమ్మలు సైతం బయటి దేశాల నుంచి వచ్చేవి.  అయితే, అభినవ్ గారు తన లేఖ లో రాశారు.. ఇప్పుడు అక్కడి చాలా మంది దుకాణదారులు వినియోగదారులకు బొమ్మలను చూపిస్తూ “ఇది మంచి బొమ్మ.  ఎందుకంటే, ఇది భారతదేశం లో తయారైంది- ‘మేడ్ ఇన్ ఇండియా’’’ అని చెప్తున్నారు.  వినియోగదారులు కూడాను భారతదేశం తయారు చేసిన బొమ్మలు కావాలనే అడుగుతున్నారు.  ఇదే కదా, ఆలోచన లో ఎంత పెద్ద మార్పు వచ్చిందో, మరి ఇది ఒక సజీవ నిదర్శనం గా ఉంది.  దేశవాసుల ఆలోచనవైఖరి లో ఎంత పెద్ద మార్పు వస్తోందో, అది కూడాను ఒక సంవత్సర కాలంలోపలే.  ఈ పరివర్తన ను అంచనా వేయడం అంత సులభం ఏమీ కాదు.  ఆర్థిక వేత్తలు కూడా, దీనిని వారి కొలమానాలతో తుల తూచజాలరు.  

మిత్రులారా, విశాఖపట్నం నుంచి వెంకట మురళీ  ప్రసాద్ గారు ఏదయితే రాశారో, అందులో కూడా ఒక భిన్నమైన తరహా ఆలోచన ఉంది.  “ 2021 వ సంవత్సరం కోసం, నా ఎబిసి ని మీకు అటాచ్ చేస్తున్నాను” అని వెంకట్ గారు  రాశారు.  ఇంతకూ ఈ ఎబిసి అంటే అర్థం ఏమిటో నాకేమీ తట్టలేదు.  అప్పుడు వెంకట్ గారి లేఖ తో పాటు ఒక పట్టిక ను కూడా జతపరచినట్లు  నేను తెలుసుకొన్నాను.  నేను ఆ చార్టు ను చూశాను.  అప్పుడు నేను గ్రహించగలిగాను ఎబిసి అంటే ఆయన అర్థం ఆత్మనిర్భర్ భారత్ (స్వయం సమృద్ధి కలిగిన భారతదేశం) చార్టే ABC అని.  ఇది చాలా ఆసక్తికరం గా ఉంది.  వెంకట్ గారు ఆయన ప్రతి రోజూ ఉపయోగించే వస్తువుల పూర్తి జాబితా ను తయారు చేశారు. ఇందులో ఎలక్ట్రానిక్స్, స్టేశనరి, స్వీయ సంరక్షణ సామగ్రి తో పాటు మరికొన్నివస్తువులు ఉన్నాయి.  మనకు తెలిసో తెలియకో, ఏవయితే విదేశీ వస్తువులను వాడుతున్నామో, వాటి ప్రత్యామ్నాయాలు భారతదేశం లో సులభం గా లభిస్తున్నాయి అని వెంకట్ గారు అన్నారు.  ఇప్పుడు ఆయన ఒట్టు పెట్టుకొన్నారు, అది ఏం ఒట్టు  అంటే.. నేను అదే వస్తువు ను ఉపయోగిస్తాను, దేనిలో అయితే మన దేశవాసుల శ్రమ, స్వేదం జతపడుతోందో.. అనేదే.

మిత్రులారా, అయితే దీనితో పాటు ఆయన మరొక విషయాన్ని కూడా ఇలా చెప్పారు. మరి అది నాకు ఎంతో ఆసక్తిని రేకెత్తించింది.  ఆయన రాశారు కదా.. మనం ఆత్మనిర్భర్ భారత్ ను (స్వావలంబి భారతదేశాన్ని) సమర్ధిస్తున్నాము అని.  అయితే, మన తయారీదారులకు కూడా, ఉత్పత్తుల నాణ్యత విషయం లో రాజీ పడకూడదు అనే స్పష్టమైన సందేశమంటూ ఉండాలి అని ఆయన రాశారు.  ఈ విషయం వాస్తవం.  శూన్య ప్రభావం, శూన్య లోపం అనే ఆలోచన తో పని చేయడానికి ఇది సరైన కాలం. దేశ తయారీదారులు, పరిశ్రమల నాయకులకు నేను విజ్ఞ‌ప్తి చేస్తున్నాను: దేశ ప్రజలు స్వావలంబనయుతమైన భారతదేశం దిశగా బలమైన అడుగులు వేస్తున్నారు.  వారు బలమైన చర్యలు తీసుకున్నారు.  స్థానిక వస్తువులను సమర్ధించడం- ‘వోకల్ ఫార్ లోకల్’- అనే నినాదం ఈ రోజు న ఇంటింటా మారుమోగుతోంది. ఇలాంటి పరిస్థితులలో మన ఉత్పత్తులు ప్రపంచ స్థాయి లో ఉండేటట్టు చూడవలిసన సమయం ఆసన్నం అయింది.  ప్రపంచం లో ఉత్తమమైంది ఏమైనప్పటికీ, మనం దానిని భారతదేశం లో తయారు చేయవచ్చు.  దీని కోసం మన సహచరులు ముందుకు రావాలి.  స్టార్ట్-అప్‌ లు కూడా ముందుకు రావాలి.  వెంకట్ గారి ఉత్తమ ప్రయత్నాలను మరో సారి అభినందిస్తున్నాను.

మిత్రులారా, ఈ భావన ను మనం నిలబెట్టుకోవాలి.  ఈ భావన ను కాపాడుకోవాలి, దీనిని పెంచుకొంటూ ముందుకు సాగాలి.  నేను, ఇంతకు ముందు కూడా అన్నాను.. మరి ఇంకొకసారి కూడా, దేశవాసులను కోరుతున్నాను.  అది ఏమిటి అంటే, మీరు కూడా ఒక జాబితా ను తయారు చేయండి.  రోజంతా మనం ఉపయోగించే అన్ని వస్తువుల ను గురించి చర్చించండి.  విదేశాలలో తయారైన వస్తువులు ఏవైనా మనకు తెలిసీ తెలియకుండానే మన జీవనం లోకి ప్రవేశించాయేమో చూడండి.  ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు మనలను  బందీలను చేశారు.  విదేశీ వస్తువుల స్థానం లో ఉపయోగించగలిగే భారతదేశం ఉత్పత్తులను గుర్తించండి.  ఇకపై భారతదేశం లో ప్రజలు పాటు పడి, చెమటోడ్చి తయారుచేసిన ఉత్పత్తులనే ఉపయోగిస్తాం అనే నిర్ణయాన్ని తీసుకోండి.  మీరు ప్రతి సంవత్సరం కొత్త సంవత్సర సంకల్పాలను చెప్పుకొంటూ ఉంటారు.  ఈసారి దేశం కోసం అంటూ ఒక సంకల్పాన్ని చెప్పుకోవాలి.

నా ప్రియమైన దేశవాసులారా,  దేశంలో వేల సంవత్సరాల సంస్కృతి ని, నాగరికత ను, మన ఆచారాలను కాపాడడానికి;  ఉగ్రవాదుల నుంచి, అణచివేతదారుల నుంచి దేశాన్ని రక్షించడానికి  మన దేశం లో ఎన్ని త్యాగాలు చేశారో.. ఆ బలిదానాలను గుర్తుకు తెచ్చుకొనే రోజే ఈ రోజు. ఈ రోజు గురు గోవింద్ గారి కుమారులు సాహిబ్  జాదే జోరావర్ సింహ్, ఫతే సింహ్ లను గోడ లో ప్రాణాలతో బలి చేసినటువంటి రోజు.  సాహిబ్ జాదే తన విశ్వాసాన్ని వదులుకోవాలని, మహనీయ గురు పరంపర తాలూకు బోధ ను వదలివేయాలని అఘాయిత్యం చేసిన వారు కోరుకున్నారు. కానీ, మన సాహిబ్ జాదా లు అంత చిన్న వయస్సు లోనూ గొప్ప సాహసాన్ని, సంకల్ప శక్తి ని చాటారు.  గోడ లో సజీవ సమాధి చేసే సమయం లో రాళ్ళు తగులుతూనే ఉన్నా, గోడ పెరుగుతూ పోతున్నా, మరణం వారి కట్టెదుటే తిరుగాడుతున్నా, వారు మాత్రం అదరలేదు, బెదరలేదు.  గురు గోవింద్ సింహ్ గారి తల్లి గారు – మాతా గుజ్ రీ కూడా ప్రాణసమర్పణం చేశారు..  సుమారు ఒక వారం రోజుల కిందట,  శ్రీ గురు తేగ్ బహాదుర్ జీ బలిదానం  చేసిన రోజు.  దిల్లీ లోని గురుద్వారా రకాబ్ గంజ్ కు వెళ్ళి, గురు తేగ్ బహాదుర్ జీ కి శ్రద్ధాంజలి ఘటించే సందర్భం, శిరసును వంచి నమస్కరించే అవకాశం నాకు లభించాయి.  ఇదే నెల లో, శ్రీ గురు గోవింద్ సింహ్ జీ ప్రేరణ తో అనేక మంది నేల మీదే పడుకొంటారు.  

శ్రీ గురు గోవింద్ సింహ్ జీ కుటుంబం బలిదానాలను ప్రజలు చాలా భావోద్వేగ స్థితి లో  గుర్తు పెట్టుకొంటారు. ఈ ప్రాణసమర్పణం యావత్తు మానవాళి కి, దేశానికి కొత్త పాఠాన్ని నేర్పింది.  ఈ అమరవీరులు మన సంస్కృతి ని సురక్షితం గా ఉంచడం లో మహా కార్యాన్ని చేశారు.  ఈ అమరవీరులకు మనమంతా రుణపడి ఉన్నాం.  శ్రీ గురు తేగ్ బహాదుర్ జీ , మాతా గుజ్ రీ జీ, గురు గోవింద్ సింహ్ జీ లతో పాటు నలుగురు సాహిబ్ జాదా ల బలిదానానికి మరో మారు నమస్కరిస్తున్నాను.  అదే విధం గా, చాలా మంది అమరవీరులు భారతదేశ ప్రస్తుత స్వరూపాన్ని సంరక్షించారు, నిలబెడుతూ వచ్చారు.

నా ప్రియమైన దేశవాసులారా, ఇప్పుడు నేను మీకు చెప్పే విషయం మీకు సంతోషం గా, గర్వం గా కూడా ఉంటుంది.  2014-2018 సంవత్సరాల మధ్య భారతదేశం లో చిరుతపులుల సంతతి 60 శాతానికి పైగా పెరిగింది.  2014 వ సంవత్సరం లో దేశం లో చిరుతపులుల సంఖ్య 7,900 గా ఉండింది, 2019 వ సంవత్సరం లో లో వాటి సంఖ్య 12,852 కు పెరిగింది. ‘‘ప్రకృతి లో యథేచ్ఛ గా సంచరించే చిరుతపులులను చూడని వారు దాని అందాన్ని ఊహించలేరు.  చిరుతపులి రంగుల అందం, దాని నడక లోని   సౌందర్యాన్ని ఊహించలేరు’’ అని జిమ్ కార్బెట్ గారు చెప్పిన చిరుతపులి అదే.  దేశం లోని చాలా రాష్ట్రాలలో-  ముఖ్యంగా మధ్య భారతదేశం లో  చిరుతపులుల  సంఖ్య పెరిగింది.  చిరుతపులుల జనాభా అధికంగా ఉన్న రాష్ట్రాలలో మధ్య ప్రదేశ్, కర్నాటక, మహారాష్ట్ర లు అగ్రస్థానం లో ఉన్నాయి.  ఇది పెద్ద విజయం.  చిరుతపులులు సంవత్సరాలు గా ప్రపంచవ్యాప్తం గా అపాయాలను ఎదుర్కొంటూ వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తం గా వాటి ఆవాసాలకు నష్టం జరుగుతోంది.  అటువంటి సమయం లో భారతదేశం చిరుతపులుల సంతతి ని అదే పని గా వృద్ధి చేసి, యావత్తు ప్రపంచానికి ఒక మార్గాన్ని చూపించింది.  గత కొన్నేళ్లుగా భారతదేశం లో సింహాల సంఖ్య సైతం పెరిగింది. పులుల సంఖ్య కూడా పెరిగింది.  అంతే కాకుండా భారతదేశ అటవీ ప్రాంతం కూడాను అధికం అయింది.  దీనికి కారణం ప్రభుత్వం ఒక్కటే కాక చాలా మంది ప్రజలు, పౌర సమాజం, అనేక సంస్థలు కూడా మన చెట్లను, వన్య ప్రాణులను సంరక్షించడం లో పాల్గొంటుండడమే. వారందరూ అభినందన కు పాత్రులే.  

మిత్రులారా, తమిళ నాడు లోని కోయంబత్తూర్‌ లో జరిగిన హృదయాన్ని స్పర్శించే ఒక కృషి ని గురించి చదివాను.  సోశల్ మీడియా లో మీరు కూడా ఆ కృషి కి సంబంధించిన విజువల్స్ ను చూశారు.  మనమందరం మనుషులు ఆసీనులయ్యే చక్రాల కుర్చీ ని చూశాం.  కానీ కోయంబత్తూరు కు చెందిన గాయత్రి అనే అమ్మాయి తన తండ్రి తో కలసి బాధిత కుక్క కోసం వీల్‌చైర్ ను తయారు చేసింది.  ఈ సంఘటన ఉత్తేజకరమైంది.  ప్రేరణదాయకమైంది.  మనుషులు ప్రతి జీవి పట్ల దయ ను, కరుణ ను చూపినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది.

దేశ రాజధాని దిల్లీ లో, దేశం లోని ఇతర నగరాల్లో చలి ఎక్కువ గా ఉన్న సమయం లో జంతువులను జాగ్రత్తగా చూసుకోవడానికి చాలా మంది అనేక ఏర్పాట్లు చేస్తున్నారు.  వారు ఆ జంతువులకు తినడానికి, తాగడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.  వాటి కోసం స్వెట్టర్లు, పరుపులను  కూడా ఏర్పాటు చేస్తారు. కొంతమంది ప్రతిరోజూ వందలాది జంతువులకు ఆహారం అందిస్తున్నారు. ఇటువంటి ప్రయత్నాలను ప్రశంసించాలి. ఉత్తర్ ప్రదేశ్‌ లోని కౌశాంబి లో కూడా ఇలాంటి గొప్ప ప్రయత్నాలు జరుగుతున్నాయి.  ఆవులను చలి నుంచి రక్షించడానికి అక్కడి జైలు ఖైదీ లు ప్రత్యేకం గా పాత, చిరిగిన కంబళ్ల ను కుడుతున్నారు. కౌశాంబి సహా ఇతర జిల్లాల జైళ్ల నుంచి వాటిని సేకరించి, ఆ తరువాత వాటిని కుట్టి గోశాలలకు పంపుతారు.  కౌశాంబి జైలు ఖైదీలు పాత దుప్పట్లతో, చిరిగిన దుప్పట్లతో ఆవులను కప్పేందుకు  ప్రతి వారం ఇలాంటి కవర్లను తయారు చేస్తున్నారు. రండి, ఇతరులను చూసుకోవటానికి సేవాభావం నిండిన ఇటువంటి ప్రయత్నాలను ప్రోత్సహించండి.  ఇవి నిజంగా సమాజం లోని సానుభూతులను బలపరచే మంచి పనులు.

నా ప్రియమైన దేశవాసులారా,  ఇప్పుడు నా ముందు ఉన్న లేఖ లో రెండు పెద్ద ఫోటోలు ఉన్నాయి.  ఈ ఫోటో లు ఒక దేవాలయానివి.  గతంలో, ఇప్పుడు ఆ దేవాలయం ఫోటోలు అవి.  ఈ ఫోటోలతో ఉన్న లేఖ తమను తాము యువ బ్రిగేడ్ అంటూ పిలుచుకొనే యువకుల బృందాన్ని గురించి చెప్తుంది.  వాస్తవానికి ఈ యువ బ్రిగేడ్ కర్నాటక లోని శ్రీరంగపట్న సమీపం లో గల పురాతన వీరభద్రస్వామి శివాలయానికి పునరుద్ధరణ ను కల్పించింది.  ఈ మందిరంలో ప్రతి వైపు కలుపు మొక్కలు, పొదలతో నిండి ఉండేది. ఎంతగా అంటే అక్కడ శివాలయం ఉందనే విషయం  బాటసారులు కూడా చెప్పలేనంతగా.  ఒక రోజు న కొంతమంది పర్యటకులు ఈ పురాతన ఆలయం వీడియో ను సోశల్ మీడియా లో పోస్ట్ చేశారు.  ఈ వీడియో ను సోశల్ మీడియా లో చూసిన యువ బ్రిగేడ్ ఉండబట్టలేకపోయింది.  ఆ బృందం ఆ ఆలయాన్ని పునరుద్ధరించాలని కంకణం కట్టుకొంది.  ఆలయం ప్రాంగణం లో పెరిగిన ముళ్ల పొదలను, గడ్డిని, మొక్కలను ఈ బృందం తొలగించింది.  అవసరమయ్యే చోట మరమ్మతు పనులకు, నిర్మాణానికి నడుంకట్టింది.  వారి మంచి పని ని చూసిన స్థానికులు వారి వంతుగా సహాయాన్ని అందించారు.  కొంతమంది సిమెంటు ఇచ్చారు.  కొంతమంది పెయింటు, మరెన్నో వస్తువులతో తలో చేయి ని వేశారు. ఈ యువకుల్లో అనేక రకాలైన వృత్తుల వారు ఉన్నారు. ఈ విధంగా వారు వారాంత దినాలలో కాలాన్ని వెచ్చించి, ఆలయం కోసం పని చేశారు. ఆలయం లో తలుపులను ఏర్పాటు చేయడంతో పాటు, విద్యుత్ కనెక్షన్‌ ను కూడా ఏర్పాటు చేశారు.  ఆ విధంగా ఆలయానికి పూర్వ వైభవాన్ని తిరిగి తీసుకువచ్చేందుకు కృషి చేశారు.  అభిరుచి, సంకల్పం ఉన్నప్పుడు ఏ లక్ష్యాన్ని అయినా సరే సాధించవచ్చు.  భారతదేశ యువతను చూసినప్పుడు నాకు సంతోషం గా ఉంటుంది.  నమ్మకం కలుగుతుంది.  ఎందుకంటే నా దేశం లోని యువత లో ‘నేను చేయగలను’ అనే దృష్టికోణం, ‘నేను చేస్తాను’ అనే ఆత్మవిశ్వాసం ఉన్నాయి.  వారికి ఏ సవాలూ పెద్దది కాదు.  ఏదీ వారికి అందనంత దూరం లో లేదు.  నేను తమిళ నాడు కు చెందిన ఒక ఉపాధ్యాయురాలిని గురించి చదివాను.  ఆమె పేరు ఎన్.కె. హేమలత. విడుపురమ్ లోని ఒక పాఠశాల లో ప్రపంచం లోని పురాతన భాష అయిన తమిళాన్ని ఆమె నేర్పిస్తారు.  కోవిడ్ 19 మహమ్మారి కూడా ఆమె బోధన మార్గానికి అడ్డు నిలవలేదు.  అవును, ఆమె ముందు సవాళ్లు ఉన్నాయి.  కానీ, ఆమె ఒక వినూత్న మార్గాన్ని కనుగొన్నారు.   కోర్సు  మొత్తం 53 అధ్యాయాలను రికార్డ్ చేశారు.  యానిమేటెడ్ వీడియోలను తయారు చేశారు. వాటిని పెన్ డ్రైవ్‌ లో తన విద్యార్థులకు పంపిణీ చేశారు.  ఇది ఆమె విద్యార్థులకు చాలా సహాయపడింది.  దీని ద్వారా అధ్యాయాలను విద్యార్థులు దృశ్య రూపం లో అర్థం చేసుకోగలిగారు.  దీంతో పాటు ఆమె తన విద్యార్థులతో టెలిఫోన్‌ లో మాట్లాడటం కొనసాగించారు.  ఇది విద్యార్థులకు చదువు ను మరింత ఆసక్తికరం గా మార్చివేసింది. దేశవ్యాప్తం గా కరోనా ఉన్న ఈ కాలం లో ఉపాధ్యాయులు అనుసరించిన వినూత్న పద్ధతులు, సృజనాత్మకంగా తయారుచేసిన పాఠ్య ప్రణాళిక సామగ్రి ఆన్‌లైన్ అధ్యయనాల తో కూడిన ఈ దశ లో అమూల్యమైనవి.  ఈ కోర్సు సామగ్రి ని విద్యా మంత్రిత్వ శాఖ కు ఇవ్వాలని ఉపాధ్యాయులందరినీ కోరుతున్నాను.  దయచేసి ‘దీక్ష’ పోర్టల్‌ లో అప్‌లోడ్ చేయండి.  ఇది దేశంలోని సుదూర ప్రాంతాలలో నివసిస్తున్న విద్యార్థులకు ఎంతో మేలు చేస్తుంది.

మిత్రులారా, ఠార్ ఖండ్‌ కు చెందిన కొర్ వా తెగ కు చెందిన హీరామన్ గారి ని గురించి మాట్లాడుకుందాం.  హీరామన్ గారు గఢ్ వా జిల్లా లోని సింజో గ్రామం లో ఉంటారు. కొర్ వా తెగ జనాభా 6,000 మాత్రమే అని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.  వారు నగరాలకు దూరంగా పర్వతాలలో, అడవులలో నివసిస్తున్నారు.  తన సమాజ సంస్కృతి ని, గుర్తింపు ను కాపాడడానికి హీరామన్ గారు ముందంజ వేశారు. 12 సంవత్సరాల పాటు అలుపెరగని శ్రమ చేసిన తరువాత, అంతరించిపోతున్న కొర్ వా భాష కు నిఘంటువు ను తయారుచేశారు.  ఇంట్లో ఉపయోగించే మాటలు మొదలుకొని నిత్య జీవనం లో ఉపయోగపడే అనేక పదాలను అర్థాలతో సహా ఆయన ఈ నిఘంటువు లో చేర్చారు.  కొర్ వా సమాజం కోసం హీరామన్ గారు చేసిన పని, దేశానికి ఆదర్శం గా నిలుస్తుంది.

నా ప్రియమైన దేశవాసులారా, అక్బర్ ఆస్థానం లో ఒక ప్రముఖ సభ్యుడు అబుల్ ఫజల్ అని ఉండేవారని అంటారు.  ఆయన ఒక సారి కశ్మీర్‌ యాత్ర కు వెళ్లి వచ్చి, కశ్మీర్ లో ఒక చోట ఎలాంటి దృశ్యం ఉందంటే దానిని చూసిన తరువాత అంతవరకు చిరాకు తో, కోపం తో  ఉండే వారు సైతం ప్రసన్నులు అవుతారు అని వ్యాఖ్యానించారు.  నిజానికి, కశ్మీర్‌ లోని కుంకుమపువ్వు పొలాలను గురించి ఆయన ఆ మాట అన్నారు.  కుంకుమ పువ్వు, శతాబ్దాల తరబడి కశ్మీర్‌ తో సంబంధాన్ని కలిగివుంది.  కశ్మీరీ కుంకుమ పువ్వు ను ప్రధానం గా పుల్ వామా, బడ్ గామ్, కిష్త్ వాడ్ ల వంటి ప్రదేశాలలో పండిస్తారు.  ఈ సంవత్సరం మే నెల లో కశ్మీరీ కుంకుమ పువ్వు కు భౌగోళిక సూచిక ట్యాగ్, అంటే జీ ఐ ట్యాగ్ ను ఇచ్చారు.  దీని ద్వారా కశ్మీరీ కుంకుమ పువ్వు ను ప్రపంచ వ్యాప్తం గా ప్రాచుర్యం పొందిన బ్రాండ్‌ గా మార్చాలని మేము అనుకుంటున్నాం.  కశ్మీరీ కుంకుమ పువ్వు అనేక ఔషధ లక్షణాలను కలిగివున్నటువంటి మసాలా దినుసు గా ప్రపంచం అంతటా ప్రసిద్ది చెందింది.  ఇది చాలా సుగంధం కలిగివుండి, ముదురు రంగు లో ఉంటుంది.  దీని కేసరాలు పొడవుగాను, మందంగాను ఉంటాయి. ఇది దీని ఔషధ విలువ ను పెంచుతుంది.  ఇది జమ్ము కాశ్మీర్  గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని సూచిస్తుంది. నాణ్యత గురించి చెప్పాలంటే కాశ్మీరీ  కుంకుమ పువ్వు చాలా ప్రత్యేకమైంది. ఇతర దేశాల కుంకుమ పువ్వు తో పోలిస్తే  పూర్తి గా భిన్నమైంది.  కశ్మీరీ కుంకుమ పువ్వు కు జిఐ ట్యాగ్ గుర్తింపు తో ప్రత్యేకత వచ్చింది.  జిఐ ట్యాగ్ సర్టిఫికెట్ లభించిన తరువాత కశ్మీరీ కుంకుమ పువ్వు ను దుబయి లోని సూపర్ మార్కెట్ లో ప్రవేశపెట్టడమైంది. ఈ సంగతి తెలిస్తే మీరు సంతోషిస్తారు.  ఇప్పుడు దీని ఎగుమతులు పెరగడం మొదలవుతుంది. ఇది ఇది ఆత్మనిర్భర్ భారత్ ను (స్వావలంబనయుత భారతదేశాన్ని) నిర్మించడానికి మన ప్రయత్నాలను మరింత బలోపేతం చేస్తుంది.  కుంకుమ పువ్వు  రైతులకు దీనివల్ల ప్రయోజనం ఉంటుంది.  పుల్ వామా లోని త్రాల్ లో ఉన్న  శార్ ప్రాంతం లో నివసించే అబ్దుల్ మజీద్ వానీ ని  చూడండి. ఆయన జిఐ ట్యాగ్ ను పొందిన  కుంకుమ పువ్వు ను పంపోర్‌ లోని ట్రేడింగ్ సెంటర్‌లో నేశనల్ శాఫ్రాన్ మిశన్ సహాయం తో ఇ-ట్రేడింగ్ ద్వారా విక్రయిస్తున్నారు.  ఇలా చాలా మంది కశ్మీర్‌ లో ఈ పని చేస్తున్నారు.  ఈసారి మీరు కుంకుమ పువ్వు ను కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నప్పుడు కశ్మీర్ నుంచి కుంకుమ పువ్వు ను కొనాలనే ఆలోచన చేయండి.  కశ్మీరీ ప్రజల గొప్పదనం ఏమిటంటే అక్కడి కుంకుమ పువ్వు రుచే వేరు గా ఉంటుంది.

నా ప్రియమైన దేశ వాసులారా, మనం రెండు రోజుల కిందట గీతా జయంతి ని జరుపుకున్నాం.  గీత మన జీవితం లోని ప్రతి సందర్భంలో మనకు స్ఫూర్తిని ఇస్తుంది.  గీత ఇంత అద్భుతమైన గ్రంథం ఎందుకు అయిందని  మీరు ఎప్పుడైనా ఆలోచించారా ?  ఎందుకంటే అది స్వయం గా భగవాన్ శ్రీకృష్ణుని వాణి.  కానీ గీత  ప్రత్యేకత ఏమిటంటే అది తెలుసుకోవాలనే ఉత్సుకత తో మొదలవుతుంది.  ప్రశ్న తో మొదలవుతుంది.  అర్జునుడు దేవుడిని ప్రశ్నించాడు. ఉత్సుకత వ్యక్తం చేశాడు.  అప్పుడే ప్రపంచానికి గీత  జ్ఞానం లభించింది.  గీత మాదిరి గా మన సంస్కృతి లో ఉన్న జ్ఞానం అంతా ఉత్సుకత తో ఆరంభం అవుతుంది.  వేదాంతం  మొదటి మంత్రం “అథాతో బ్రహ్మ జిజ్ఞాసా’. అంటే  మనం బ్రహ్మ ను విచారిద్దాం అని అర్థం.  అందుకే బ్రహ్మ ను అన్వేషించే చర్చ కూడా ఉంది.  ఉత్సుకత లోని శక్తి అలాంటిది.  ఉత్సుకత నిరంతరం కొత్త అంశాల  కోసం మిమ్మల్ని ప్రేరేపిస్తుంది.  బాల్యం లో మనలో ఉత్సుకత ఉన్నందు వల్ల మనం నేర్చుకుంటాం.  అంటే ఉత్సుకత ఉన్నంతవరకు జీవితం ఉంటుంది.  ఉత్సుకత ఉన్నంతవరకు కొత్త అభ్యాస క్రమం కొనసాగుతుంది. ఇందులో వయస్సు, పరిస్థితులతో సంబంధం లేదు. అటువంటి ఉత్సుకత శక్తి కి, జిజ్ఞాస కు ఒక ఉదాహరణ నాకు తెలిసింది.  ఆ ఉదాహరణ తమిళ నాడు కు చెందిన పెద్ద వారు టి.  శ్రీనివాసాచార్య స్వామి జీ గురించి!  టి.  శ్రీనివాసాచార్య స్వామి గారి వయస్సు 92 సంవత్సరాలు.  ఈ వయస్సు లో కూడా ఆయన తన పుస్తకాన్ని కంప్యూటర్ లో రాస్తున్నారు.  అది కూడా స్వయంగా టైప్ చేయడం ద్వారా. పుస్తకం రాయడం సరైందేనని మీరు ఆలోచిస్తూ ఉండాలి.  కానీ పూర్వ కాలంలో కంప్యూటర్ అసలే లేదు.  అప్పుడు ఆయన కంప్యూటర్ ను ఎప్పుడు నేర్చుకున్నారు ?  ఆయన కళాశాల లో చదువుతున్న సమయం లో కంప్యూటర్ లేదనేది నిజం.  కానీ, ఆయన యవ్వనం లో ఉన్నప్పుడు ఉన్న ఉత్సుకత, జిజ్ఞాస లు ఇప్పుడూ ఉన్నాయి.  శ్రీనివాసాచార్య స్వామీ జీ సంస్కృత, తమిళ భాషా పండితుడు.  ఆయన ఇప్పటివరకు 16 ఆధ్యాత్మిక గ్రంథాలను రాశారు.  కంప్యూటర్ వచ్చిన తరువాత పుస్తకం రాయడం, ముద్రించే విధానం మారిందని భావించినప్పుడు, తన 86 సంవత్సరాల వయస్సు లో కంప్యూటర్ నేర్చుకున్నారు.  తనకు అవసరమైన సాఫ్ట్‌వేర్ ను నేర్చుకున్నారు.  ఇప్పుడు ఆయన తన పుస్తకాన్ని పూర్తి చేస్తున్నారు.

మిత్రులారా, జీవితం లో జిజ్ఞాస చనిపోయేంత వరకు నేర్చుకోవాలనే కోరిక చనిపోదు.  అందుకు ప్రత్యక్ష ఉదాహరణ టి. శ్రీనివాసాచార్య స్వామీ జీ జీవితం.  అందువల్ల వెనుకబడిపోయామని, ఆగిపోయామని ఎప్పుడూ అనుకోకూడదు.  నేర్చుకుంటామని ఆశాజనకం గా ఉండాలి. మనం నేర్చుకోలేమని, ముందుకు సాగలేమని కూడా అనుకోకూడదు.

నా ప్రియమైన దేశవాసులారా, ప్రస్తుతం మనం ఉత్సుకత తో కొత్త విషయాన్ని నేర్చుకోవడం గురించి మాట్లాడుకుంటున్నాం.  కొత్త సంవత్సరం లో కొత్త సంకల్పాలను గురించి కూడా మాట్లాడుకున్నాం.  కొంతమంది నిరంతరం కొత్త పనులు చేస్తూ, కొత్త సంకల్పాలను నెరవేరుస్తూ ఉంటారు.  మీరు కూడా మీ జీవితం లో అనుభూతి చెంది ఉంటారు.  మనం సమాజం కోసం ఏదైనా చేసినప్పుడు సమాజం మనకు చాలా చేయగల శక్తి ని ఇస్తుంది.  సామాన్యం గా కనబడే ప్రేరణల తో చాలా పెద్ద పనులు చేయవచ్చు.  ప్రదీప్ సాంగ్ వాన్ అలాంటి ఒక యువకుడు! గురుగ్రామ్‌ కు చెందిన ప్రదీప్ సాంగ్ వాన్ 2016వ సంవత్సరం నుంచి హీలింగ్ హిమాలయాస్ అనే పేరు తో ఉద్యమం చేస్తున్నారు.  ఆయన తన బృందం, వాలంటియర్ లతో కలసి హిమాలయాల లోని  వివిధ ప్రాంతాలకు వెళ్లి, అక్కడ పర్యటకులు వదలివేసిన ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలను శుభ్రపరుస్తారు.  ప్రదీప్ గారు ఇప్పటివరకు హిమాలయాల లోని వివిధ పర్యటక ప్రాంతాల నుంచి టన్నుల కొద్ది ప్లాస్టిక్‌ ను శుభ్రపరిచారు.  ఇదేవిధం గా కర్నాటక కు చెందిన అనుదీప్, మినూషా అనే ఒక యువ జంట ఉన్నారు.  అనుదీప్, మినూషా లు గత నెల- నవంబర్‌- లో వివాహం చేసుకున్నారు.  వివాహం తరువాత చాలా మంది వివిధ ప్రాంతాలు తిరిగేందుకు వెళతారు.  కానీ ఈ ఇద్దరూ భిన్నమైన పని ని చేశారు.  ప్రజలు తమ ఇంటి నుంచి బయటికి తిరగడానికి వెళ్లడాన్ని వారిద్దరూ ఎప్పుడూ గమనించే వారు.  కానీ ఎక్కడికి వెళ్ళినా ప్రజలు చాలా చెత్త ను వదలివేస్తారన్న విషయాన్ని వారు గమనించారు.  కర్నాటక లోని సోమేశ్వర్ బీచ్‌ లో పరిస్థితి కూడా అలాంటిదే.  సోమేశ్వర్ బీచ్‌ లో ప్రజలు వదిలిపెట్టిన చెత్త ను శుభ్రం చేయాలని అనుదీప్, మినూషా లు నిర్ణయించుకున్నారు.  భార్యాభర్తలు ఇరువురూ వివాహం తరువాత మొదటి సంకల్పాన్ని తీసుకున్నారు.  వారు ఇద్దరూ కలసి సముద్ర తీరం లో చాలా చెత్త ను తీసివేశారు. అనుదీప్ తన సంకల్పాన్ని సోశల్ మీడియా లో కూడా శేర్ చేసుకొన్నారు.  తరువాత ఏమైంది ?  వారిద్దరి అద్భుతమైన ఆలోచన తో ప్రభావితం అయిన చాలా మంది యువత వచ్చి వారితో చేరారు.  మీకు తెలిస్తే ఆశ్చర్యపోతారు.  ఈ వ్యక్తులందరూ కలిసి సోమేశ్వర్ బీచ్ నుంచి 800 కిలోల కంటే ఎక్కువ వ్యర్థాలను తొలగించారు.

మిత్రులారా, ఈ ప్రయత్నాల మధ్య-  ఈ చెత్త ఈ బీచ్ లకు, ఈ పర్వతాలకు ఎలా చేరుకుంటుందో కూడా మనం ఆలోచించాలి.  మనలోనే కొందరు ఈ చెత్త ను అక్కడ వదలివేస్తారు. ప్రదీప్, అనుదీప్-మినూషా ల లాగా  శుభ్రత ఉద్యమాన్ని మనం నడపాలి.  అయితే, అంతకంటే ముందుగా  చెత్త ను వ్యాప్తి చేయబోం అంటూ కూడా మనం సంకల్పాన్ని చెప్పుకోవాలి.  స్వచ్ఛ్ భారత్ అభియాన్ మొదటి తీర్మానం కూడా ఇదే.  అవును.. నేను మీకు మరో విషయం గుర్తు చేయాలనుకుంటున్నాను.  కరోనా కారణం గా ఈ సంవత్సరం పెద్ద గా చర్చించలేదు.  ఒకసారి ఉపయోగించే ప్లాస్టిక్ నుంచి దేశానికి విముక్తి ని కల్పించాలి.  2021 వ సంవత్సర సంకల్పాల లో ఇది కూడా ఒకటి.  మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.  ఆరోగ్యం గా ఉండండి, మీ కుటుంబాన్ని కూడా ఆరోగ్యం గా ఉంచండి.  వచ్చే సంవత్సరం జనవరి లో కొత్త అంశాల పై ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’ కార్యక్రమం ) ఉంటుంది.

అనేకానేక ధన్యవాదాలు.

 

 

 

***


(Release ID: 1683993) Visitor Counter : 483