ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

బ్రిటన్‌ నుంచి భారత్‌ వచ్చే ప్రయాణీకుల పరిస్థితులపై సమీక్షించిన కేంద్ర ఆరోగ్య శాఖ; 10 రాష్ట్రాలు/యూటీలకు వచ్చినవారిలో పాజిటివ్‌ గుర్తింపు

Posted On: 23 DEC 2020 7:51PM by PIB Hyderabad

బ్రిటన్‌ నుంచి భారత్‌ వచ్చే ప్రయాణీకుల పరిస్థితులపై కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి శ్రీ రాజేష్‌ భూషణ్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. యూకే నుంచి మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, పశ్చిమ బంగాల్‌, గోవా, పంజాబ్‌, గుజరాత్‌, కేరళ వచ్చిన కొందరిలో పాజిటివ్‌ గుర్తించారు. ప్రతిస్పందన చర్యలపై ఆరా తీశారు. ఐసీఎంఆర్‌ డీజీ, అన్ని రాష్ట్రాల ఆరోగ్య శాఖ కార్యదర్శులు, ఎన్‌హెచ్‌ఎం ఎండీ, కేంద్ర ఆరోగ్య శాఖ అదనపు కార్యదర్శి ఆర్తి అహుజా, ఎన్‌సీడీసీ డైరెక్టర్‌ డా.సుజీత్‌ సింగ్‌, ఇతర సీనియర్‌ అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. 

    బ్రిటన్‌లో కనిపించిన కొత్త రకం కరోనా నేపథ్యంలో, "సాంక్రమిక వ్యాధులపై నిఘా, ప్రతిస్పందన"పై కేంద్ర ఆరోగ్య శాఖ ఈనెల 22న జారీ చేసిన ప్రామాణిక కార్యాచరణ విధానాలు (ఎస్‌వోపీ)పై సవివరంగా ఈ సమీక్షలో చర్చించారు.

    యూకే నుంచి భారత్‌ వచ్చే ప్రయాణీకుల వివరాలను ఎయిర్‌ సువిధ పోర్టల్‌, ఇమ్మిగ్రేషన్‌ బ్యూరో నుంచి తీసుకోవాలని రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి సూచించారు. జన్యు శ్రేణి పరిశీలన కోసం, పాజిటివ్‌గా తేలినవారి నమూనాలను గుర్తింపుపొందిన పరీక్ష కేంద్రాలకు పంపాలని చెప్పారు. 

    గుర్తింపు పొందిన ఆరు పరీక్ష కేంద్రాలు, సంప్రదింపుల కోసం వాటి నోడల్‌ అధికారుల వివరాలను రాష్ట్రాలకు అందించారు. ఆ పరీక్ష కేంద్రాలు: సీఎస్‌ఐఆర్‌- ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ జెనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ, దిల్లీ; సీఎస్‌ఐఆర్‌- సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ, హైదరాబాద్; డీబీటీ- ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ లైఫ్ సైన్సెస్, భువనేశ్వర్; డీబీటీ- ఇన్‌స్టెమ్‌-ఎన్‌సీబీఎస్‌, బెంగళూరు; డీబీటీ- నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ బయోమెడికల్ జెనోమిక్స్, కల్యాణి, పశ్చిమ బంగాల్; ఐసీఎంఆర్‌- నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ వైరాలజీ, పుణె. గుర్తింపుపొందిన ల్యాబుల సంఖ్యను మరింత పెంచి, వాటి వివరాలను రాష్ట్రాలకు అందిస్తారు.

    ఈ సమీక్షలో రాష్ట్రాలు లేవనెత్తిన రవాణా సంబంధిత అంశాలను కేంద్రం పరిష్కరించింది. ఎస్‌వోపీ కచ్చితంగా పాటించేలా, విమానాశ్రయ ఆరోగ్య కార్యాలయాలు, నిఘా అధికారులతో సమన్వయం చేసుకోవాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది.

 

***



(Release ID: 1683408) Visitor Counter : 134