రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

డి.ఆర్.డి.ఓ. వ్యవస్థలను సాయుధ దళాల అధిపతులకు అందజేసిన - రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్ నాథ్ సింగ్


Posted On: 18 DEC 2020 5:02PM by PIB Hyderabad

రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ (డి.ఆర్.‌డి.ఓ), దేశీయంగా అభివృద్ధి చేసిన, మూడు వ్యవస్థలను, రక్షణ మంత్రి శ్రీ రాజనాథ్ సింగ్,  ఈ రోజు, సైనిక, నావికా, వైమానిక దళాలకు, డి.ఆర్.‌డి.ఓ. భవన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో అందజేశారు.

ఈ కార్యక్రమంలో శ్రీ రాజ్ నాథ్ సింగ్ - భారత సముద్ర పరిస్థితుల అవగాహనా వ్యవస్థ (ఐ.ఎమ్.ఎస్.ఏ.ఎస్) ను నావికా దళాధిపతి అడ్మిరల్ కరంబీర్ సింగ్ కు అందజేశారు. అదేవిధంగా,  అస్త్రా ఎం.కె-I క్షిపణి ని ఎయిర్ చీఫ్ మార్షల్ రాకేశ్ కుమార్ సింగ్ భదౌరీ కి మరియు సరిహద్దు నిఘా వ్యవస్థ (బి.ఓ.ఎస్.ఎస్) ని సైనిక దళాధిపతి జనరల్ ఎమ్.ఎమ్. నరవణే కి అందజేశారు.  రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీ శ్రీపాద యెస్సో నాయక్ మరియు రక్షణ సిబ్బంది అధిపతి జనరల్ బిపిన్ రావత్  సమక్షంలో ఈ ఉత్పత్తులను అప్పగించారు.

వివిధ విభాగాలలో విశేష కృషి చేసిన డి.ఆర్.డి.ఓ. శాస్త్రవేత్తలకు ఈ సందర్భంగా రక్షణ మంత్రి శ్రీ రాజనాథ్ సింగ్, అవార్డులు ప్రదానం చేశారు.

ఈ అవార్డులలో - క్షిపణుల నియంత్రణ మరియు మార్గదర్శక పథకాలను అభివృద్ధి చేసినందుకు చేసిన కృషికి శ్రీ ఎన్.వి. కదమ్ కు ప్రదానం చేసిన "డి.ఆర్.డి.ఓ. జీవన సాఫల్య పురస్కారం - 2018",   సాంకేతిక పరిజ్ఞానం అమలు కోసం విద్యా, పరిశ్రమల రంగాలలో ఉత్తమ కృషి చేసినవారికి ప్రదానం చేసిన  "ఎక్సలెన్స్ అవార్డులు"   మొదలైనవి ఉన్నాయి.  వీటితో పాటు, వ్యక్తిగత అవార్డులు, బృందాలకు అవార్డులు, టెక్నాలజీ స్పిన్-ఆఫ్ అవార్డులు, టెక్నో మేనేజర్ అవార్డులు, ఇతర విభాగాలలో అవార్డులను కూడా ఈ సందర్భంగా ప్రదానం చేశారు.

రక్షణ వ్యవస్థలను అభివృద్ధి చేయడంలో, డి.ఆర్.డి.ఓ. శాస్త్రవేత్తలు చేసిన కృషికి రక్షణ మంత్రి అభినందనలు తెలియజేస్తూ, సాయుధ దళాల శక్తి, సామర్థ్యాలను పెంపొందించే వ్యవస్థల కోసం డి.ఆర్.డి.ఓ. ఉన్నత స్థాయి సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేస్తోందని, పేర్కొన్నారు.

కోవిడ్-19 మహమ్మారిని ఎదుర్కోవడంలో డి.ఆర్.డి.ఓ. శాస్త్రవేత్తలు పోషించిన పాత్రను శ్రీ రాజనాథ్ సింగ్ ఈ సందర్భంగా ప్రశంసించారు.  అవార్డులు అందుకున్న శాస్త్రవేత్తలందరినీ ఆయన అభినందించారు, వారి భవిష్యత్ ప్రయత్నాలకు శుభాకాంక్షలు తెలియజేశారు.

రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీ శ్రీపాద నాయక్, ఈ సందర్భంగా మాట్లాడుతూ, రక్షణ రంగం స్వావలంబనలో డి.ఆర్.డి.ఓ. ముఖ్యమైన పాత్ర పోషిస్తోందని, పేర్కొన్నారు.  కోవిడ్-19 ని ఎదుర్కోవటానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్నీ, ఉత్పత్తులనూ అభివృద్ధి చేయడానికి డి.ఆర్.డి.ఓ. చేసిన కృషిని ఆయన ప్రశంసించారు.

రక్షణ సిబ్బంది అధిపతి జనరల్ బిపిన్ రావత్ మాట్లాడుతూ,  శాస్త్ర, సాంకేతిక బృందం సాధించిన విజయాలను అభినందించారు.  అదే విధంగా దేశంలోని చాలా స్వదేశీ వ్యవస్థలు ఉండేలా వేగంగా పని చేయవలసిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు.

ఈ అత్యాధునిక సాంకేతిక వ్యవస్థల అభివృద్ధి రక్షణ సాంకేతిక పరిజ్ఞానాలలో అధిక స్వావలంబనకు దారితీసింది. రూపకల్పన, అభివృద్ధి దశలను పూర్తి చేసుకుని, వినియోగానికి సిద్ధంగా ఉన్న ఈ మూడు వ్యవస్థలను సంబంధిత రక్షణ దళాలకు అప్పగించడం జరిగింది.  

ఈ రోజు అప్పగించిన రక్షణ వ్యవస్థలలో బి.ఓ.ఎస్.ఎస్. (బాస్) కూడా ఉంది.  అన్ని వాతావరణ పరిస్థితుల్లో పనిచేసే, ఎలక్ట్రానిక్ నిఘా వ్యవస్థను, డెహ్రాడూన్ లోని పరికరాల పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ (ఐ.ఆర్.డి.ఈ) విజయవంతంగా రూపొందించి, అభివృద్ధిచేసింది.  ఈ వ్యవస్థను లడఖ్ సరిహద్దు ప్రాంతంలో పగలు, రాత్రి నిఘా కోసం మోహరించారు.  రిమోట్ ఆపరేషన్ సామర్ధ్యంతో, అధిక-ఎత్తులో, సున్నా కన్నా తక్కువ ఉష్ణోగ్రతగల కఠినమైన ప్రాంతాలలో చొరబాట్లను స్వయంచాలకంగా గుర్తించడం ద్వారా ఈ వ్యవస్థ పర్యవేక్షణ మరియు నిఘాను సులభతరం చేస్తుంది.  ఈ వ్యవస్థను, మచిలీపట్నం లోని  భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) నిర్మిస్తోంది.

ఐ.ఎమ్.ఎస్.ఏ.ఎస్. అనేది అత్యాధునికమైన, పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో, అధిక పనితీరు గల తెలివైన సాఫ్ట్‌వేర్ వ్యవస్థ, ఇది గ్లోబల్ మారిటైమ్ సిట్యుయేషనల్ పిక్చర్, మెరైన్ ప్లానింగ్ టూల్స్ మరియు విశ్లేషణాత్మక సామర్థ్యాలను భారత నావికాదళానికి అందజేస్తుంది.  నావల్ కమాండ్ అండ్ కంట్రోల్ (సి-2) ను ప్రారంభించడానికి ఈ వ్యవస్థ సముద్రంలో ఉన్న ప్రతి ఓడకు నావికాదళ ప్రధాన కార్యాలయం నుండి  మారిటైమ్ ఆపరేషనల్ పిక్చర్‌ను అందిస్తుంది.  బెంగళూరులోని, సెంటర్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు రోబోటిక్స్ (సిఏ.ఐ.ఆర్) తో పాటు భారత నావికాదళం సంయుక్తంగా ఈ ఉత్పత్తిని రూపొందించి,  అభివృద్ధి చేశాయి.  కాగా, బెంగళూరు లోని బి.ఈ.ఎల్. సంస్థ, దీనిని అమలు చేసింది.

ఆస్ట్రా ఎమ్.కె-I,  దేశీయంగా అభివృద్ధి చేసిన మొదటి బియాండ్ విజువల్ రేంజ్ (బి.వి.ఆర్) క్షిపణి. దీనిని సుఖోయ్-30, లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ (ఎల్.సి.ఏ), మిగ్-29 తో పాటు మిగ్-29 కె నుండి ప్రయోగించవచ్చు.  ‘ఆత్మ నిర్భార్ భారత్’ లో భాగంగా, అస్త్రా ఆయుధ వ్యవస్థను, హైదరాబాదు లోని రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి ప్రయోగశాల (డి.ఆర్.‌డి.ఎల్) విజయవంతంగా అభివృద్ధి చేసింది. కాగా, హైదరాబాద్ లోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బి.డి.ఎల్) ఉత్పత్తి చేసింది.

రక్షణ రంగానికి అవసరమైన అధునాతన వ్యవస్థలు, సాంకేతిక పరిజ్ఞానాల అభివృద్ధికి, డి.ఆర్.డి.ఓ. కట్టుబడి ఉందని,  డి.డి.ఆర్ & డి, కార్యదర్శి మరియు డి.ఆర్.డి.ఓ., చైర్మన్, డాక్టర్ జి. సతీష్ రెడ్డి పేర్కొన్నారు.  విద్యా, పరిశ్రమ, సాయుధ దళాలతో పాటు రక్షణ రూపకల్పన, అభివృద్ధి, ఉత్పత్తి యొక్క బలమైన పర్యావరణ వ్యవస్థను రూపొందించడానికి డి.ఆర్.డి.ఓ. కృషి చేస్తోందని, ఆయన తెలియజేశారు.

రక్షణ మంత్రిత్వ శాఖతో పాటు, భారత ప్రభుత్వానికి చెందిన అనేక మంది ఉన్నతోద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

 

*****



(Release ID: 1681867) Visitor Counter : 368