సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ లో 95వ ఫౌండేషన్ కోర్సు ముగింపు సమావేశంలో పాల్గొన్న కేంద్రమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్
ఉత్తమ పరిపాలన సాగాలన్న ప్రధానమంత్రి ఆశయం సివిల్ సర్వీసుల కోసం రూపొందించిన కర్మయోగి, ఆరంబ్ కార్యక్రమాలలో ప్రతిబింబిస్తుంది -- కేంద్రమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్
Posted On:
18 DEC 2020 3:49PM by PIB Hyderabad
దేశంలో ఉత్తమ పరిపాలన సాగాలన్న ప్రధానమంత్రి శ్రీనరేంద్రమోడీ ఆశయం దేశంలో సివిల్ సర్వీసుల కోసం రూపొందించిన కర్మయోగి, ఆరంబ్ వంటి కార్యక్రమాలలో ప్రతిబింబిస్తున్నదని కేంద్ర ఈశాన్య ప్రాంతాల అభివృద్ధి, ప్రధానమంత్రి కార్యాలయంలో సహాయమంత్రి, సిబ్బంది వ్యవహారాలు,పెన్షన్లు,ప్రజా సమస్యలు, అటామిక్ శాఖ సహాయ (స్వతంత్ర) మంత్రి డాక్టర్ జితేంద్రసింగ్ అన్నారు. ఈ రోజు జరిగిన లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ 95 వ ఫౌండేషన్ కోర్సు ముగింపు సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ లో ఇస్తున్న శిక్షణ కరోనా మహమ్మారి సమయంలో అధికారులు సక్రమంగా విధులను నిర్వర్తించడానికి దోహదపడిందని ఆయన అన్నారు.
ప్రస్తుత ఫౌండేషన్ కోర్సులో శిక్షణ పొందుతున్న 428 మందిలో 136 మంది మహిళలు ఉండడంపట్ల హర్షం వ్యక్తం చేసిన మంత్రి మహిళల శాతం 32 వరకు ఉండడం మహిళాసాధికారతకు నిదర్శనమని అన్నారు. మహిళాసాధికారత కోసం అధికారం చేపట్టిన నాటి నుంచి ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడీ కృషి చేస్తున్నారని మంత్రి తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మహిళలకు గుర్తింపు లభిస్తున్నదని అన్నారు. శిక్షణ పొందుతున్న అధికారులలో 245 మంది ఇంజినీరింగ్ నేపధ్యం కలిగి ఉండడంతో ఉత్తమ పరిపాలన సాగించాలన్న ప్రభుత్వ ఆశయం కార్యరూపం దాలుస్తుందన్న ధీమాను మంత్రి వ్యక్తం చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్, భూసార కార్డులు, అంతర్గత జలమార్గాలు లాంటి కార్యక్రమాల అమలుకు ప్రత్యేక నైపుణ్యత అవసరముంటుందని మంత్రి వివరించారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడీ పునాది వేసిన నవభారత నిర్మాణం సాకారం అయ్యేలా చూసే అంశంలో తమ వంతు భాద్యతను ఇక్కడ శిక్షణ పొందుతున్న అధికారులు నిర్వర్తించాలని మంత్రి కోరారు. భారతదేశ అధికార యంత్రాంగానికి దిశ దశలను నిర్దేశించడానికి గత అయిదారు సంవత్సరాలుగా ప్రధానమంత్రి అనేక వినూత్న కార్యక్రమాలను రూపొందించి అమలు చేస్తున్నారని మంత్రి వివరించారు. ఐఏఎస్ లుగా పని ప్రారంభించేముందు ప్రతిఒక్క ఐఏఎస్ అధికారి కేంద్రప్రభుత్వ సహాయ కార్యదర్శులుగా పని చేయడాన్ని గత కొన్ని సంవత్సరాలుగా తప్పని సరి చేశామని, దీనివల్ల అధికారుల సామర్ధ్యం పెరుగుతున్నదని ఆయన తెలిపారు.
కర్మయోగి కార్యక్రమం లక్ష్యాన్నిసాధించడానికి 95వ ఫౌండేషన్ కోర్సు నుంచి మూడు నెలల శిక్షణ ప్రారంభించారని తెలిపిన మంత్రి దీనిలో వివిధ సామాజిక అంశాలను పొందుపరిచారని వివరించారు. పిల్లలు, స్త్రీపురుషులు,పట్టణ ప్రాంతాల కార్మికుల సమస్యలపై అవగాహన కల్పించడం, వాస్తవ స్థితిగతులను అర్థం చేసుకోడానికి క్షేత్ర స్థాయి పర్యటనలు లాంటి అంశాలు ఈ కోర్సులో చేర్చారని ఆయన చెప్పారు.
తాము చేయవలసిన పనిపై పూర్తి పట్టు కల్పించాలన్నలక్ష్యంతో అధికారులకు వివిధ శాఖలు, వివిధ రంగాలపై అవగాహనా కల్పించడానికి ఆరంబ్ పేరిట మరో ఫౌండేషన్ కోర్సును రూపొందించామని మంత్రి అన్నారు. దీనిని 2019లో జరిగిన 94వ ఫౌండేషన్ కోర్సులో భాగంగా ప్రారంభించామని అన్నారు.
వివిధ సర్వీసులకు చెందిన 428 మంది పాల్గొంటున్న 95వ ఫౌండేషన్ కోర్సు ఈ ఏడాది అక్టోబర్ 12వ తేదీన ప్రారంభం అయ్యింది.
కొవిడ్ నేపథ్యంలో ఈ ఏడాది ' ఆరంబ్ -2020' పేరిట వివిధ రంగాలకు చెందిన నిపుణులు తమ అనుభవాలను వివరిస్తూ ప్రసంగించారు. " గోవెర్నెన్స్ ఇన్ ఇండియా@100" ప్రధాన అంశంగా ఈ కార్యక్రమం సాగింది.
లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ డాక్టర్ సంజీవ్ చోప్రా మాట్లాడుతూ తమ సంస్థలో శిక్షణా కార్యక్రమాలను వివరిస్తూ ప్రధానమంత్రి సూచించిన విధంగా స్థానికులకు హక్కు అనే అంశానికి ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది శిక్షణ సాగిందని తెలిపిన ఆయన ఈ అనుభవం విధి నిర్వహణలో ఉపయోగపడుతుందని అన్నారు.
శిక్షణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి డాక్టర్ జితేంద్రసింగ్ రాష్ట్రపతి బంగారు పతకాన్ని, సర్టిఫికెట్ ను ప్రధానం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ముస్సోరి లో ప్రభుత్వ ప్రాధమిక పాఠశాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. శిక్షణ పొందుతున్న అధికారులు రూపొందించిన లఘు చిత్రాన్ని ప్రదర్శించారు.
******
(Release ID: 1681802)
Visitor Counter : 193