ఆయుష్

యోగాస‌నాల‌కు పోటీ క్రీడ‌గా అధికారిక గుర్తింపు


క్రీడగా యోగాస‌న పోటీత‌త్వాన్ని పెంచి, ఈ శాస్త్రాన్ని సుసంప‌న్నం చేసి, ప్ర‌పంచ‌వ్యాప్తంగా విస్త‌రిస్తుంది ః శ్రీ‌పాద్ నాయ‌క్‌

ఖేలో ఇండియా, జాతీయ‌, యూనివ‌ర్సిటీ క్రీడ‌ల‌లో పోటీ క్రీడ‌గా యోగాసనాల‌ను ప్ర‌వేశ పెడ‌తాంః కిర‌ణ్ రిజిజు

Posted On: 17 DEC 2020 4:37PM by PIB Hyderabad

యోగాస‌నాల‌ను పోటీ క్రీడగా అధికారికంగా గుర్తిస్తున్న‌ట్టు ఆయుష్ మంత్రిత్వ శాఖ‌, యువజ‌న‌ వ్య‌వ‌హారాలు, క్రీడ‌ల మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించాయి. శుక్ర‌వారం నాడు న్యూఢిల్లీలో నిర్వ‌హించిన ఉమ్మ‌డి విలేక‌రుల స‌మావేశంలో కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ (ఇన్‌ఛార్జి) స‌హాయ మంత్రి శ్రీ‌పాద్ నాయ‌క్‌, కేంద్ర యువ‌జ‌న వ్య‌వ‌హారాలు, క్రీడ‌ల మంత్రిత్వ శాఖ (ఇన్‌ఛార్జి) స‌హాయ‌మంత్రి కిర‌ణ్ రిజిజు ఈ ప్ర‌క‌ట‌న చేశారు.
విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడుతూ, యోగాస‌నాల మూలాలు భార‌తీయ యోగ సంప్ర‌దాయంలో ఉన్నాయ‌ని, ఈ పోటీల‌ను గ‌త శ‌తాబ్దాల కింద‌ట నుంచే నిర్వ‌హించార‌న్నారు. నేడు కూడా బ‌హుళ స్థాయిల్లో వీటిని నిర్వ‌హిస్తున్నార‌ని, ‌కానీ జాతీయ స్థాయిలో వాటి ఉనికిని తెలిపేందుకు జ‌రిపే పోటీలకు బ‌ల‌మైన, స్థిర‌మైన నిర్మాణం ఇంకా ఉద్భ‌వించ‌లేద‌న్నారు. యోగా రంగంలో భాగ‌స్వాముల‌తో గ‌త 3-4 ఏళ్ళుగా జ‌రిపిన విస్త్ర‌త చ‌ర్చ‌ల అనంత‌రం యోగాస‌నాల‌ను పోటీ క్రీడ‌గా గుర్తించాల‌న్న నిర్ణ‌యాన్ని ప్ర‌భుత్వం తీసుకుంద‌ని చెప్పారు. యోగాస‌నాలు అనేవి యోగ‌లో స‌మ‌గ్ర‌మైన‌, ముఖ్య అంశ‌మ‌ని, అది మాన‌సిక‌, భౌతిక స్వ‌భావాన్ని క‌లిగి ఉండ‌డం, ఫిట్‌నెస్‌, సాధార‌ణ ఆరోగ్యం ప‌ట్ల దాని ప్ర‌భావం కార‌ణంగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్రాచుర్యాన్ని పొందింద‌ని మంత్రి వివ‌రించారు.
యోగాస‌నాలు క్రీడ‌గా రూపాంత‌రం చెంద‌డంతో ఆయా శాస్త్రాల‌లోకి నూత‌న వ్యూహాలు, సాంకేతిక‌త‌ల‌ను ప్ర‌వేశ‌పెడ‌తామ‌ని త‌ద్వారా మ‌న అథ్లీట్లు, అధికారులు త‌మ రంగంలో ఫ‌ల‌వంత‌మైన‌, సంతృప్తిక‌ర‌మైన కెరీర్‌ను పొందేందుకు తోడ్ప‌డుతుంద‌న్నారు.
ఈ సంద‌ర్భంగా విలేక‌రుల‌ను ఉద్దేశించి మాట్లాడుతూ, యోగాస‌నాను గుర్తించి పోటీలు నిర్వ‌హించ‌డ‌మ‌న్న‌ది, యోగ ప‌ట్ల ప్ర‌ప‌పంచ‌వ్యాప్తంగా ప్ర‌జ‌ల‌కు ఆస‌క్తి పెరిగేందుకు స‌హాయ‌ప‌డుతుంద‌ని కిర‌ణ్ రిజిజు అభిప్రాయ‌ప‌డ్డారు. యోగాస‌నాల‌ను పోటీ క్రీడ‌గా స్థిర‌ప‌ర‌చేందుకు రెండు మంత్రిత్వ శాఖ‌లు స‌న్నిహితంగా క‌లిసి ప‌ని చేస్తున్నాయ‌న్నారు. యోగాసనాల‌ను ఖేలో ఇండియాలోనూ, యూనివ‌ర్సిటీ క్రీడ‌ల‌లోనూ  ఒక క్రీడగా  జోడించేందుకు యోచిస్తున్నామ‌ని, జాతీయ క్రీడ‌ల‌లో కూడా దాని ఉని‌కి ఉండేలా  చూస్తామ‌న్నారు. అయితే, ఏ క్రీడ ల‌క్ష్యం అయినా ఒలింపిక్స్‌లో చేర‌డ‌మ‌ని, దీర్ఘ ప్ర‌యాణానికి ఇది ప్రారంభ‌మ‌ని చెప్పారు. యోగాస‌నాలు అంద‌మైన‌, ఆక‌ర్ష‌ణీయ‌మై, ప్రాచుర్యం పొందిన క్రీడ‌గా ఉండ‌బోతోంద‌ని రిజిజు అన్నారు.
ఆయుష్ కార్య‌ద‌ర్శి ప్రెజెంటేష‌న్ ఇస్తూ, యోగాస‌నాలకు నాలుగు ఈవెంట్లు, 7 కేటగిరీల‌లో 51 మెడ‌ళ్ళు ఉండ‌బోతున్నాయ‌న్నారు. స్త్రీ, పురుషులిద్ద‌రికీ ఉద్దేశించిన  ప్ర‌తిపాదిత ఈవెంట్ల‌లో  సంప్ర‌దాయ యోగాసనాలు, క‌ళాత్మ‌క యోగాస‌న (సింగిల్‌), క‌ళాత్మ‌క యోగాస‌న (ఇద్ద‌రు), ల‌య‌బ‌ద్ధ‌మైన యోగాస‌న (ఇద్ద‌రు), ఫ్రీ ఫ్లో/  బృంద యోగాస‌నాలు, వ్య‌క్తిగ‌త ఆల్ రౌండ్ చాంపియ‌న్‌షిప్‌, టీం చాంపియ‌న్ షిప్ ఉంటాయ‌ని వివ‌రించారు.
యోగాస‌న క్రీడ భ‌విష్య‌త అభివృద్ధి, మార్గ‌ద‌ర్శ‌క‌త‌కు దిగువ‌న పేర్కొన్న కార్య‌క‌లాపాలు భాగంగా ఉంటాయ‌ని కార్య‌ద‌ర్శి తెలిపారుః
జాతీయ వ్య‌క్తిగ‌త యోగాస‌న క్రీడ చాంపియ‌న్ షిప్ (దృశ్య మాధ్య‌మం) అన్న పైల‌ట్ యోగాస‌న పోటీల‌ను 2021 మొద‌ట్లో నిర్వ‌హించ‌నున్నారు. 
యోగాస‌న క్రీడ‌కు పోటీలు, ఈవెంట్లు, కార్య‌క్ర‌మాల‌కు సంబంధించిన వార్షిక కేలెండ‌ర్ ప్రారంభం
యోగాస‌న చాంపియ‌న్ షిప్‌కు ఆటోమేటెడ్ స్కోరింగ్ వ్య‌వ‌స్థ అభివృద్ధి
పోటీల కోచ్‌ల‌కు, రిఫ‌రీల‌కు. జ‌డ్జీల‌కు, డైరెక్ట‌ర్ల‌కు ప్ర‌త్యేక కోర్సులు
క్రీడాకారుల‌కు కోచింగ్ క్యాంపులు 
క్రీడాకారుల‌కు, నిపుణుల‌కు, సాద‌న చేసేవారికి కెరీర్‌, సామాజిక హోదా క‌ల్పించి, ఉత్త‌మ యోగాస‌న క్రీడాకారుల‌ను సృష్టించేందుకు యోగాస‌న లీగ్ ప్రారంభం
జాతీయ క్రీడ‌ల‌లోనూ, ఖేలో ఇండియా, అంత‌ర్జాతీయ క్రీడ‌ల‌లో యోగాస‌నాల‌ను ఒక క్రీడగా ప్ర‌వేశ‌పెట్ట‌డం
యోగాస‌న అథ్లీట్ల‌కు ఉద్యోగావ‌కాశాల‌ను సృష్టించేందుకు చ‌ర్య‌లు.

***
 


(Release ID: 1681616) Visitor Counter : 202