జల శక్తి మంత్రిత్వ శాఖ

278 లక్షల ఇళ్లకు మంచినీటి కుళాయిలు

31శాతంపైగా గ్రామీణ ఇళ్లకు జలజీవన్ మిషన్ వర్తింపు

Posted On: 16 DEC 2020 3:43PM by PIB Hyderabad

   గత ఏడాది ఆగస్టు 15న ప్రకటించిన జల్ జీవన్ మిషన్ పథకం కింద 278 లక్షల ఇళ్లకు మంచినీటి కుళాయిల కనెక్షన్లు అందించారు.  ప్రస్తుతం దేశంలోని 6.01 కోట్ల గ్రామీణ కుటుంబాలకు కుళాయిల ద్వారా  నేరుగా తమ ఇళ్లకే మంచినీరు అందుతోంది. దేశవ్యాప్తంగా 18 జిల్లాలల్లో అన్ని ఇళ్లకు నీటి కుళాయిల కనెక్షన్లను అందించారు. ఇంటింటికీ కుళాయిల ద్వారా మంచినీటి సరఫరా చేసేందుకు రాష్ట్రాలు ఒకదానితో పరస్పరం పోటీపడుతున్నాయి. కాగా, జలజీవన్ మిషన్ అమలు ప్రగతిపై వివరాలను సూచిస్తూ కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ వెబ్ సైట్ (https://ejalshakti.gov.in/jjmreport/JJMIndia.aspx)లో ఒక డ్యాష్ బోర్డును ఏర్పాటు చేశారు.

 

 

   దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్ల ద్వారా  దీర్ఘకాలిక ప్రాతిపదికన తగినంత మంచినీటిని 2024లోగా అందించే లక్ష్యంతో జల జీవన్ మిషన్ (జెజె.ఎం.)ను కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆయా రాష్ట్రాల భాగస్వామ్యంతో అమలు చేస్తోంది. ఈ పథకం అమల్లోకి వచ్చిన తరువాత,. గ్రామీణ ఇళ్లకు నీటి కుళాయిల కనెక్షన్లపై క్షేత్రస్థాయి సమాచారం రూపొందించేందుకు కసరత్తు చేయాలని ఆయా రాష్ట్రాలకు కేంద్రం సూచించింది.  గ్రామీణ ప్రాంతాల్లో 19.05 కోట్ల  ఇళ్లు ఉండగా, వాటిలో 3.23 కోట్ల గృహాలకు ఇప్పటికే ట్యాప్ కనెక్షన్లు అందించినట్లు, క్షేత్రస్థాయి సమాచారం ద్వారా తెలిసింది. మిగిలిన 15.81 కోట్ల ఇళ్లకు కొత్తగా నీటి కనెక్షన్లు అందించాల్సి ఉంది. అందువల్ల, కాలబద్ధమైన గడవులోగా 16 కోట్ల గృహాలకు నీటి కుళాయిలను అమర్చాలని,  ఇప్పటికే అమర్చిన కనెక్షన్లను తప్పక పనిచేసేలా చూడాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.  అంటే ప్రతి సంవత్సరం 3.2 కోట్ల ఇళ్లకు, రోజువారీగా 88,000 నీటి కుళాయిల చొప్పున కనెక్షన్లు అందించాలి. ఈ లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని, గ్రామీణ ప్రాంతాల్లో నీటి కుళాయిలను ఏర్పాటు చేయడానికి వివిధ రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు ఎంతో కృషిచేస్తున్నాయి.

    పథకం అమలుకోసం 2020-21లో రూ. 23,500 కోట్లు కేటాయించారు. దీనికి తోడు, 2020-21లో, 15 వ ఆర్థిక కమిషన్ గ్రాంటులో 50శాతాన్ని అంటే, రూ. 30,375కోట్లను గ్రామీణ స్థానిక సంస్థలకు మంజూరు చేస్తారు. ఈ గ్రాంటు మొత్తాన్ని నీటి సరఫరా, పారిశుద్ధ్యం కోసం వినియోగిస్తారు. గ్రామాల్లోని ప్రజలు దీర్ఘకాల ప్రాతిపదికపై శుద్ధమైన నీటిని పొందేందుకు ఈ చర్యలు వీలు కలిగిస్తాయి.

   పథకం అమలులో,.. ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థలతో పాటుగా పలు స్వచ్ఛంద సేవా సంస్థలు, సామాజిక సంస్థలు, కార్పొరేట్ సామాజిక బాధ్యతా సంస్థలు, అంతర్జాతీయ సంస్థల భాగస్వామ్యం కోసం అన్వేషణ సాగుతోంది. మరో వైపు,..నీటి సరఫరా జనోద్యమంగా మారుతుందని, ఇది ప్రతి ఒక్కరి విధిగా రూపుదాల్చుతుందని ప్రభుత్వం ఆశిస్తోంది.  కాగా, 2024వ సంవత్సరానికి ముందే లక్ష్యాన్ని సాధించాలని వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నాయి. అన్ని ఇళ్లకు నీటి కనెక్షన్లు అందుబాటులోకి వచ్చేలా గోవా ఇప్పటికే చర్యలు తీసుకుంది.  వచ్చే ఏడాదికల్లా  అన్ని ఇళ్లకు నీటి కనెక్షన్లు అందించాలని  బీహార్, పుదుచ్చేరి, తెలంగాణ ప్రభుత్వాలు సంకల్పించాయి. అలాగే, 2022కల్లా లక్ష్యం సాధించాలని గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్ము కాశ్మీర్, లడఖ్, మేఘాలయ, పంజాబ్, సిక్కిం ప్రణాళిక వేసుకున్నాయి. 2023లోగా వందశాతం గ్రామీణ ఇళ్లకు పథకం వర్తింపజేయాలని అరుణాచల్ ప్రదేశ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మణిపూర్, మిజోరాం, నాగాలాండ్, త్రిపుర, చత్తీస్ గఢ్ తీర్మానించుకున్నాయి. 2024లోగా లక్ష్య సాధనకు అస్సాం, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలు నిర్ణయించుకున్నాయి.

   గ్రామంలో ప్రతి కుటుంబానికి నేరుగా ఇంటికే నీటి కనెక్షన్ అందేలా చూడాలని, ఈ విషయంలో ఎవరూ వెనుకబడేందుకు వీలులేదనే లక్ష్యంతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు.  ఎస్.సి., ఎస్.టి. జనాభా ఎక్కువగా ఉన్న గ్రామాలకు, ఆశావహ జిల్లాలకు, దుర్భిక్ష పీడిత గ్రామాలకు, ఎడారి ప్రాంతం వారికి, నాణ్యమైన నీరు అందుబాటులో లేనివారికి ఈ పథకంలో ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్రాలు నిర్ణయించాయి. నాణ్యతలేని నీరు అందుతున్న ప్రాంతాలకు శుద్ధమైన నీరు అందించడానికి మాత్రం అగ్రశ్రేణి ప్రాధాన్యం ఇస్తున్నారు. సీసం, ఫ్లోరైడు వంటి వాటితో నీరు కలుషితమైన ప్రాంతాలకు ఈనెలాఖరులోగా శుద్ధమైన నీరు ఇంటింటికీ అందించేందుకు జలజీవన్ మిషన్ ప్రాధాన్యం ఇస్తోంది.

   ఈ పథకం అమలుకోసం పంచాయతీ పరిధిలో గ్రామ నీటి సరఫరా పారిశుద్ద్య కమిటీలు, వాటికి ఉప సంఘాలుగా పానీ సమితులు ఏర్పాటవుతున్నాయి. కనీసం 50శాతం మహిళా సభ్యులతో ఈ కమిటీలకు రూపకల్పన చేస్తున్నారు. ఈ కమిటీలు ఐదేళ్ల గడువుతో గ్రామ కార్యాచరణ ప్రణాళికను తయారు చేయవలసి ఉంటుంది. నీటి వనరుల అభివృద్ధి, సరఫరా, మురుగునీటి తొలగింపు నిర్వహణా వ్యవస్థ వంటి అంశాలకు ఈ కమిటీలు బాధ్యత వహించవలసి ఉంటుంది.  గ్రామస్థాయిలో ప్రతిస్పందనతో కూడిన, బాధ్యతాయుతమైన నాయకత్వాన్ని తయారు చేసుకునేందుకు గ్రామపంచాయతీలో, పంచాయతీ కమిటీలో తగిన సామర్థ్యాలను నిర్మించుకోవాలని జలజీవన్ మిషన్ లక్ష్యంగా పెట్టుకుంది. నీటిసరఫరా మౌలిక సదుపాయాలకు గ్రామస్థాయిలోని ఈ నాయకత్వమే బాధ్యత వహించేలా తగిన చర్యలు తీసుకుంటారు.

   నీటి వనరులను బలోపేతం చేయడం, నీటిని పొదుపు చేయడం, అక్విఫెర్ రీచార్జ్, నీటిశుద్ధి, మురుగునీటి పారుదల తదితర అంశాలకు ఈ పథకం కింద ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ఇందుకోసం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎం.జి.ఎన్.ఆర్.ఇ.జి.ఎస్.), పంచాయతీరాజ్ సంస్థలకు సంబంధించిన 15వ ఆర్థిక సంఘం గ్రాంట్లు, స్వచ్ఛభారత్ మిషన్ (గ్రామీణ్) నిధులు, జిల్లా ఖనిజాభివృద్ధి సంస్థ నిధి, కార్పొరేట్ సామాజిక బాధ్యతా నిధులు, స్థానిక ప్రాంత అభివృద్ధి నిధలు వంటివి సమర్థంగా వినియోగిస్తారు. మేస్త్రీ పనులు, ప్లంబింగ్, విద్యుత్ సరఫరా పని, మోటార్ మరమ్మతులు వంటి అంశాల్లో గ్రామాల్లో అందుబాటులో ఉన్న వనరుల వినియోగానికి ప్రాధాన్యం ఇచ్చారు.

   సరఫరా చేసిన నీటి  నాణ్యతను లేబరేటరీలద్వారా పర్యవేక్షించడం ఈ పథకంలో ముఖ్యమైన అంశం. ఈ ప్రయోగశాలలను బలోపేతం చేయడానికి, వాటికి నేషనల్ అక్రెడిటేషన్ బోర్డు  గుర్తింపును సాధించడానికి ప్రాధాన్యత ఇస్తారు. నీటి నాణ్యతా ప్రయోగశాల సౌకర్యాలను రాష్ట్రాలు సాధారణ ప్రజలకు కూడా అందుబాటులో ఉంచుతాయి.  దీనితో  గ్రామంలో ఏ మహిళైనా, తన ఇంటికి అందుతున్న నీటి నాణ్యతను తానే స్వయంగా వచ్చి పరీక్షించుకోవచ్చు. తమకు సరఫరా అయ్యే నీటి సరఫరా నాణ్యతపై ఆయా ప్రజా సంఘాలు అప్రమత్తంగా వ్యవహరించేలా తగిన చర్యలు తీసుకుంటారు.  దీని కోసం గ్రామంలో ఐదుగురికి, ప్రత్యేకించి మహిళలకు శిక్షణ ఇస్తారు. తద్వారా గ్రామాల్లో సరఫరా చేసే నీటిని స్థానికంగానే పరీక్షించే వీలుటుంది.

 ఆర్థిక సమ్మిళితం, ఇళ్లు, రహదారులు, స్వచ్ఛమైన ఇంధనం, విద్యుత్, మరుగుదొడ్లు వంటి సదుపాయాతో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు సౌకర్యంగా జీవనం ఉండేలా చూడాలన్న ప్రధానమంత్రి విజ్ఞప్తికి అనుగుణంగా  జలజీవన్ మిషన్ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటికీ తాగునీటిని సరఫరాకోసం కృషిచేస్తోంది. గ్రామీణ జనం జీవితాలను మెరుగుపరచడానికి ఇది ఎంతగానో దోహదం చేస్తుంది. గ్రామాల్లో  ఎక్కడో దూరంనుంచి నీటి తీసుకువచ్చే ప్రయాస మహిళలకు, బాలికలకు తప్పుతుంది.

 

********



(Release ID: 1681296) Visitor Counter : 139