ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం

డిసెంబర్ 13 నాటి ఉగ్రఘటన నాగరిక సమాజానికి సవాల్

- ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యాన్ని, ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీయడమే ఉగ్రవాదుల పని

- పార్లమెంటు ఉగ్రఘటనలో అమరులకు నివాళులు అర్పించిన ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు- ఉగ్రవాదానికి అండగా నిలబడుతున్న వారందరినీ ఏకాకిని చేయల్సిన తరుణమిదేనని వెల్లడి

Posted On: 13 DEC 2020 3:28PM by PIB Hyderabad

సమస్త మానవాళికి, ప్రజాస్వామ్యానికి ఉగ్రవాదం ఓ పెను సవాల్‌గా మారిందని వ్యక్తిగత స్వాతంత్ర్యం, ఆర్థిక ప్రగతి వంటి విలువలతో ముందుకెళ్తున్న ప్రస్తుత ప్రపంచానికి, నాగరికతకు ఉగ్రవాదం అడుగడుగునా విఘాతం కల్గిస్తోందని ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. 2001 డిసెంబర్ 13న పార్లమెంటుపై జరిగిన ఉగ్రదాడిలో అమరులైన వీరులను గుర్తు చేసుకుంటూ, పార్లమెంటు ఆవరణలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం ప్రకాశ్ బిర్లా, కేంద్ర మంత్రులతో కలిసి అమరవీరుల స్మృతికి ఉపరాష్ట్రపతి ఘనంగా నివాళులు అర్పించారు. 

అనంతరం సామాజిక మాధ్యమం ద్వారా ఈ ఘటనకు సంబంధించిన తన మనోగతాన్ని ఆయన వెల్లడించారు. దేశ ప్రజల ప్రాణాలకు కాపాడేందుకు తమ ప్రాణాలను పణంగాపెట్టిన వారందరి త్యాగాలను దేశం ఎన్నటికీ విస్మరించదన్నారు. పార్లమెంటులోకి ఉగ్రవాదులు చొరబడిన విషయాన్ని గుర్తించి పార్లమెంటు భవనంలో వారి కదలికలను ఎప్పటికప్పుడు సీనియర్ అధికారులకు తెలియజేసిన సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కమలేశ్ కుమారి ధైర్యసాహసాలను ఉపరాష్ట్రపతి ప్రశంసించారు. ఆమె చూపిన సాహసం కారణంగానే నాటి ఘటనలో ఉగ్రవాదుల కుట్రలను పసిగట్టి వెంటనే అణచివేయడం సాధ్యమైందన్నారు. ‘దేశాన్ని రక్షించే ప్రయత్నంలో శరీరమంతా బుల్లెట్ గాయాలతోనే వారిని అడ్డుకునేందుకు ఆమె చూపిన తెగువ స్ఫూర్తిదాయకం’ అని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. 

భారతీయ ప్రజాస్వామ్య మందిరంపై జరిగిన దాడితో సీమాంతర ఉగ్రవాదం ప్రభావం యావత్ ప్రపంచాన్నే అలజడికి గురిచేసిందన్నారు. అయినప్పటికీ సాయుధ రక్షక దళాలు చూపిన తెగువ, చేసిన పోరాటం కారణంగానే ఈ మందిర గౌరవం పదిలంగా నిలిచిందన్నారు. 

అదే ఏడాది అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై జరిగిన దాడిని ఉపరాష్ట్రపతి ప్రస్తావిస్తూ.. ఈ శతాబ్దపు తొలి ఏడాదిలోనే ప్రపంచంలోని ప్రముఖ ప్రజాస్వామ్య దేశాలైన భారత్, అమెరికాలపై ఉగ్రదాడులు జరగడం దారుణమన్నారు. గత రెండు దశాబ్దాలుగా ఇలాంటి పలు ఉగ్రదాడులు సమస్త మానవాళినే భయభ్రాంతులకు గురిచేశాయని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని, ఆర్థిక పురోగతిని అడ్డుకోవడం ఒక్కటే ఉగ్రవాదుల అజెండా అని, తద్వారా మానవాళిని చీకట్లోకి నెట్టేయగలమనే భ్రమలో ఉన్నారన్నారు. 

ఉగ్రవాదులు పన్నుతున్న ఇలాంటి కుట్రలను, కుతంత్రాలను భగ్నం చేసి.. సామరస్య పూర్వక ప్రపంచాన్ని నిర్మించేందుకు అన్ని దేశాలు ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందన్నారు. ఉగ్రవాదులకు అండగా నిలబడుతూ ఆర్థికంగా సహాయ సహకారాలు అందిస్తున్న దేశాలను ఏకాకిని చేయాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు. 2001 భారత పార్లమెంటుపై జరిగిన ఉగ్రదాడి.. భారతదేశంతోపాటు యావత్ ప్రపంచంలోని ప్రతి పౌరుడికి మేలుకొలుపు కావాలన్నారు. 

భారతదేశం ప్రతిపాదించిన.. ‘ఐక్యరాజ్యసమితి ఉగ్రవాద వ్యతిరేక సదస్సు’ను వెంటనే ఏర్పాటుచేసి.. ఉగ్రవాదులపై, వారికి సహకరిస్తున్న వారిపై కఠినమైన చర్యలు తీసుకునేలా ప్రపంచమంతా కార్యాచరణ ప్రారంభించేందుకు ఇదే సరైన సమయమని తెలిపారు. 

 

***



(Release ID: 1680459) Visitor Counter : 109