ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కేంద్రఆరోగ్య మంత్రిత్వ శాఖలో ఆరోగ్య రక్షణ దినోత్సవం ఉత్తమ సేవలందించిన 1,153మంది
ప్రాథమిక ఆరోగ్య కార్యకర్తలకు సత్కారం
17రాష్ట్రాల, 5 కేంద్రపాలిత ప్రాంతాల్లో నిర్వహించిన
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఆవిష్కరణ
ఎస్.డి.జి. డాష్.బోర్డు,.. ఎన్.సి.డి. మెడికల్ ఆఫీసర్ యాప్.ల విడుదల
“ఆరోగ్య రక్షణ వ్యవస్థను విప్లవాత్మకంగా మార్చివేసిన ఆయుష్మాన్ భారత్”
పని ప్రారంభమైన 51,500 ఆరోగ్య, సంక్షేమ కేంద్రాల్లో
30కోట్లమందికి వైద్యపరీక్షలు: డాక్టర్ హర్షవర్ధన్
Posted On:
12 DEC 2020 4:34PM by PIB Hyderabad
సార్వత్రిక ఆరోగ్యరక్షణ వ్యవస్థ దినోత్సవం సందర్భంగా ఈ రోజు జరిగిన ప్రత్యేక కార్యక్రమానికి కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ అధ్యక్షత వహించారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అశ్వినీ కుమార్ చౌబే పాట్నానుంచి వర్చువల్ పద్ధతిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ మాట్లాడుతూ, పటిష్టమైన
ఆరోగ్య రక్షణ వ్యవస్థల ఆవశ్యతకను కోవిడ్-19 చాటిచెప్పిందన్నారు. ఆరోగ్య రక్షణ వ్యవస్థలు అందరికీ సమానంగా అందుబాటులో ఉండవలసిన అసరాన్ని కూడా కోవిడ్-19 తెలియపరిచిందన్నారు. “ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులనుంచి మనం తప్పనిసరిగా బయటపడాలి, ఇపుడే కాక, భవిష్యత్తులో కూడా అందరినీ రక్షించగలిగే బలమైన ఆరోగ్య వ్యవస్థల రూపకల్పనకు కృషిచేయాలి. సార్వత్రిక ఆరోగ్య రక్షణ వ్యవస్థకు సంబంధించిన పటిష్టమైన నమూనాను ప్రపంచానికి కూడా అందించగలిగే శక్తి సామర్థ్యాలు భారతదేశానికి ఉన్నాయన్నది నా చిరకాల నమ్మకం.” అని డాక్టర్ హర్షవర్ధన్ అన్నారు.
'ఆయుష్మాన్ భారత్' పథకం రూపొందించి, అమలు చేయడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రదర్శించిన దార్శనిక నాయకత్వ పటిమ ఎంతో గొప్పదని కేంద్రమంత్రి ప్రశంసించారు. “2018లో ప్రారంభమై ప్రజలకు అందుబాటులోకి వచ్చిన 'ఆయుష్మాన్ భారత్' పథకం దేశంలోని ఆరోగ్యరక్షణవ్యవస్థను అన్నిస్థాయిల్లోనూ సమూలంగా మార్చివేసింది. ఆరోగ్యపరంగా చేపట్టే వ్యాధినిరోధక చర్యలపై ఈ పథకం పూర్తిగా దృష్టిని కేంద్రీకరించింది.” అని అన్నారు. ఆయుష్మాన్ భారత్ పథకంలోని ఆరోగ్యరక్షణ వ్యవస్థను, ఆరోగ్య సంక్షేమ కేంద్రాలను (హెచ్.డబ్ల్యు.సి.లను),.. ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన (పి.ఎం.జె.ఎ.వై.) పథకాలను అమలు చేయడం ద్వారా ప్రభుత్వం దేశంలోని కోట్లాది మంది ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందుబాటులోకి తెస్తోందని మంత్రి అన్నారు. “ఆయుష్మాన్ భారత్ పథకం, ఆరోగ్య, సంక్షేమ కేంద్రాల అమలులో మేం. గణనీయమైన ప్రగతిని సాధించాం. ఆరోగ్యరక్షణ పయనంలో గొప్ప మైలు రాయిని ఇప్పటికే అధిగమించాం. 51,500 కేంద్రాలు ఇప్పటికే పనిచేస్తున్నాయి. నిర్దేశించుకున్న లక్ష్యంలో మూడో వంతును ఇప్పటికే సాధించాం. 25వేల కోట్లమందికిపైగా ప్రజలకు మెరుగైన ప్రాథమిక ఆరోగ్య రక్షణ సేవలు అందుబాటులోకి వచ్చాయి. వచ్చే ఏడాది డిసెంబరులోగా లక్షన్నర ఆరోగ్య, సంక్షేమ కేంద్రాల ఏర్పాటు మా లక్ష్యం. ఆయుష్ మంత్రిత్వ శాఖ ఏర్పాటుచేస్తున్న 12,500 ఆరోగ్య, సంక్షేమ కేంద్రాలు కూడా వీటిలో భాగమే.” అని అన్నారు.
కోవిడ్19 వైరస్ రూపంలో ఎన్నో సవాళ్లు ఎదురైనా, ఆరోగ్య, సంక్షేమ కేంద్రాల ఏర్పాటులో వివిధ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల కృషి అభినందనీయమని డాక్టర్ హర్షవర్ధన్ అన్నారు. పని మొదలైన 51,500 ఆరోగ్య, సంక్షేమ కేంద్రాల్లో ఇప్పటికే 30కోట్ల మంది ఆరోగ్య సేవలను పొందినట్టు రికార్డులు చెబుతున్నాయన్నారు. ఈ కేంద్రాల్లో 6.89కోట్ల మందికి పైగా జనం రక్తపోటు పరీక్షలు, 5.62కోట్లమందికిపైగా మదుమేహ పరీక్షలు చేయించుకున్నారని ఆయన తెలిపారు. ఈ కేంద్రాలు, 35లక్షలకు పైగా ఆరోగ్య రక్షణ, సంక్షేమ కార్యకలాపాలను నిర్వహించాయని చెప్పారు. యోగా, జుంబా, శిరోధర, ధ్యానం వంటి కార్యక్రమాలను చేపట్టాయన్నారు. వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల సహకారంతో తమ మంత్రిత్వ శాఖ ఆరోగ్య, సంక్షేమ కార్యకలాపాలన్నీ సజావుగా నిర్వహిస్తోందన్నారు.
ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన (ఎ.బి.-పి.ఎం.జె.ఎ.వై.) కింద నిరుపేదలకు కోటీ 45లక్షలకుపైగా నగదు రహిత చికిత్సలను అందించినట్టు కేంద్రమంత్రి చెప్పారు. తీవ్రమైన అనారోగ్యంతో అవస్థపడుతున్న లక్షలాది కుటుంబాలకు అండగా నిలిచే పథకంగా ఎ.బి.-పి.ఎం.జె.ఎ.వై.ని గుర్తించినట్టు చెప్పారు.
వివిధ ఆరోగ్యరక్షణ పథకాలు, కార్యక్రమాల అమలుకు సంబంధించిన కొన్ని ఉపయోగరమైన యాప్.లను, మార్గదర్శక సూత్రాలను డాక్టర్ హర్షవర్ధన్ ఈ సందర్భంగా ఆవిష్కరించారు.:
- ఎస్.డి.జి.-3 డాష్.బోర్డు: 2030నాటికి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (ఎస్.డి.జి.) సాధనలో భవిష్యత్తు కార్యాచరణకు అవసరమైన కీలకమైన ప్రాధాన్యతలను గుర్తించడంలో విధాన నిర్ణాయక కర్తలకు, అమలు అధికారులకు ఎస్.డి.జి.-3 డాష్.బోర్డు ఉపకరిస్తుంది
- ఆరోగ్య, సంక్షేమ కేంద్రాల క్రియాశీలక ప్రక్రియపై సంక్షిప్త సమాచార సంకలనం: ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఆరోగ్య, సంక్షేమ కేంద్రాలను క్రియాశీలంగా పనిచేయించేందుకు గత రెండేళ్లలో దేశవ్యాప్తంగా జరిగిన కృషి, సాధించిన ప్రగతిపై సమాచారాన్ని ఇది అందిస్తుంది.
- చెవి, ముక్కు, గొంతు (ఇ.ఎన్.టి.), కళ్లు, మానసిక, నాడీమండల వ్యవస్థ (ఎం.ఎన్.ఎస్.) రుగ్మతలకు సంబంధించి, సమగ్రమైన ఆరోగ్య రక్షణ సేవలపై సవివరమైన మార్గదర్శక సూత్రాలు... జన ఆరోగ్య సమితి (జె.ఎ.ఎస్.) మార్గదర్శక సూత్రాలు... ఆయుష్మాన్ భారత్ పథకం కింద పనిచేసే ఆరోగ్య, సంక్షేమ కేంద్రాల్లో విస్తృతస్థాయి సేవలు అందించాలన్న లక్ష్యంతో ఈ మార్గదర్శక సూత్రాలను రూపొందించారు.
- జాతీయ ఆరోగ్య కార్యక్రమం కింద చేపట్టిన చర్యలపై కీలక సమాచారంతో ఇ-బుక్.లెట్.: జాతీయ ఆరోగ్య కార్యక్రమం కింద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరంగా తీసుకున్న చర్యలపై సవివరమైన సమాచారం ఇందులో పొందుపరిచి ఉంటుంది. ఆరోగ్య పథకాల అమలులో పాలుపంచుకునే వారందరికీ ఎప్పటికప్పుడు ఈ సమాచారం అందుబాటులో ఉంటుంది.
- ఎన్.సి.డి. మెడికల్ ఆఫీసర్ యాప్.: అంటువ్యాధులుగా పరిగణించని నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ (ఎన్.సి.డి.) కేటగిరీకి చెందిన రోగుల చికిత్సా కార్యకలాపాల సమాచారాన్ని అందించేందుకు ఇది ఉపకరిస్తుంది.
కోవిడ్-19పై పోరాటంలో ముందువరుసలో నిలిచి సవాళ్లను ఎదుర్కొంటూ సమాజానికి నిస్వార్థంగా సేవలందించిన ప్రాథమిక ఆరోగ్య రక్షణ కార్యకర్తలకు అభినందనలు తెలియజేస్తున్నట్టు కేంద్రమంత్రి తెలిపారు. ప్రశంసనీయమైన సేవలందించిన 1,153మంది ఆరోగ్య కార్యకర్తలను ఆయన వర్చువల్ పద్ధతిలో సత్కరించారు.
దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల జనాభా, ఆరోగ్యం, పౌష్టికాహార సమాచారం తదితర అంశాలతో కూడిన 5వ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేని (ఎన్.ఎఫ్.హెచ్.ఎస్.ను) డాక్టర్ హర్షవర్ధన్ విడుదలచేశారు. 6.1లక్షల ఇళ్లను నమూనాలుగా పరిగణిస్తూ, ఇంటింటికీ తిరిగి ఈ సర్వే నిర్వహిస్తూ వస్తున్నారు. తొలిదశలో 17రాష్ట్రాలు, 5 కేంద్రపాలిత ప్రాంతాల సర్వే నివేదికలను ప్రస్తుతం విడుదల చేశారు. అంటే, అస్సాం, బీహార్, మణిపూర్, మేఘాలయ, సిక్కిం, త్రిపుర, ఆంధ్రప్రదేశ్, అండమాన్ నికోబార్ దీవులు, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, జమ్ము కాశ్మీర్, లఢక్, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, మిజోరాం, కేరళ, లక్షద్వీప్, దాద్రా నాగర్ హవేలీ, డామన్ డయ్యూల సర్వే ఫలితాలను ప్రకటించారు. ఇక, రెండవ దశలో 12రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల సర్వే క్షేత్రస్థాయ కార్యకలాపాలను కోవిడ్-19 వ్యాప్తి కారణంగా మొదట్లో కొన్నాళ్లు రద్దు చేశారు. ఈ ఏడాది నవంబరులో తిరిగి ప్రారంభమైన ఈ సర్వే వచ్చే ఏడాది మేనెలకల్లా పూర్తి కావచ్చని భావిస్తున్నారు.
మాననసిక ఆరోగ్యం, చిన్నారుల ఆరోగ్యానికి సంబంధించి 2015-16వ సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుత సర్వేలో గణనీయమైన పెరుగుదల నమోదైంది. గర్భధారణ రేటు మరింత పడిపోయినట్టు, గర్భనిరోధక విధానాల వినియోగం పెరిగినట్టు తొలిదశ సర్వేలో తేలింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 12-23నెలల మధ్య వయస్సు కలిగిన పిల్లలకు టీకాలు కవరేజి గణనీయంగా పెరిగినట్టు కూడా సర్వే పేర్కొంది. బ్యాంకు ఖాతాలు కలిగిన మహిళలతో పాటు మహిళల సాధికారతలో కూడా గణనీయమైన ప్రగతి కనిపిస్తోంది.
సార్వత్రిక ఆరోగ్య రక్షణ వ్యవస్థలను అందుబాటులోకి తేవడంలో గట్టి కృషిచేసిన వారందరికీ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయమంత్రి అశ్వినీ కుమార్ చౌబే అభినందనలు తెలిపారు. “ఆరోగ్య రక్షణ వ్యవస్థలపై ప్రజల అవగాహనను, భావనలను కోవిడ్-19 సమూలంగా మార్చివేసింది, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టి కారణంగా, సంపూర్ణ ఆరోగ్య రక్షణ వ్యవస్థను రూపకల్పనలో భారత్ ముందువరసలో ఉంది. కోవిడ్ మహమ్మారి వ్యాప్తి సమయంలో ఆయుష్మాన్ భారత్-ఆరోగ్య, సంక్షేమ కేంద్రాలనుంచి భారీ సంఖ్యలో ప్రజలు ఆరోగ్య సేవలందుకోవడం దేశ ఆరోగ్య రక్షణ వ్యవస్థ పటిష్టతకు నిదర్శనం.” అని ఆయన అన్నారు. దేశవ్యాప్తంగా ఆరోగ్య, సంక్షేమ కేంద్రాల ఏర్పాటుతో దేశంలోని ప్రాథమిక ఆరోగ్య రక్షణ వ్యవస్థలో నిశ్శబ్ధ విప్లవం మొదలైందని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ వ్యాఖ్యానించారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి, జాతీయ ఆరోగ్య కార్యక్రమం (ఎన్.హెచ్.ఎం.) మిషన్ డైరెక్టర్ వందనా గుర్నానీ, అదనపు కార్యదర్శి మనోహర్ అగ్ననీ, కార్యదర్శి విశాల్ చౌహాన్, జాయింట్ సెక్రెటరీ రత్నా అంజన్ జేనా, గణాంక శాక డైరెక్టర్ జనరల్, మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు చెందిన సీనియర్ అధికారులు ఆన్ లైన్ ద్వారా కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.
*****
(Release ID: 1680427)
Visitor Counter : 232