ప్రధాన మంత్రి కార్యాలయం
ఆగ్రా లో ఆగ్రా మెట్రో ప్రాజెక్టు నిర్మాణ పనులను ప్రారంభించిన ప్రధాన మంత్రి
దేశం లో మౌలిక సదుపాయాల కల్పన ను మెరుగుపరచడానికి ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రయత్నాలు: ప‌్రధాన మంత్రి
స్వదేశ్ దర్శన్, ప్రసాద్ పథకాల ద్వారా పర్యటకులను ఆకట్టుకోవడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి: ప‌్రధాన మంత్రి
భవన నిర్మాతలకు, గృహ కొనుగోలుదారులకు మధ్య విశ్వాసపరంగా నెలకొన్న అంతరాన్ని తొలగించడం కోసమే రెరా చట్టాన్ని తీసుకురావడం జరిగింది: ప్రధాన మంత్రి
ఇళ్ళను కొనుగోలు చేయడానికి 12 లక్షలకు పైగా పట్టణ ప్రాంతాల కు చెందిన మధ్యతరగతి కుటుంబాలకు సుమారు 28,000 కోట్ల రూపాయల సాయాన్ని పిఎమ్ ఆవాస్ యోజన లో భాగంగా అందించడమైంది: ప్రధాన మంత్రి
Posted On:
07 DEC 2020 1:15PM by PIB Hyderabad
ఉత్తర్ ప్రదేశ్ లోని ఆగ్రా లో ఆగ్రా మెట్రో ప్రాజెక్టు నిర్మాణ పనులను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ఈ రోజు న ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల శాఖ కేంద్ర మంత్రి శ్రీ హర్ దీప్ సింహ్ పురీ, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ లతో పాటు ఇతర ఉన్నతాధికారులు కూడా పాలుపంచుకొన్నారు.
ఈ సందర్భం లో ప్రధాన మంత్రి మాట్లాడుతూ, ఒక సమస్య కొత్త ప్రాజెక్టులను ప్రకటించినప్పటికీ, వాటికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుందనే అంశంపై ఏమంత శ్రద్ద వహించకపోవడమనేది దేశ మౌలిక సదుపాయాల కల్పన రంగం లో ఉన్న ప్రధాన సమస్య ల్లో ఒకటన్నారు. తన ప్రభుత్వం నూతన పథకాలను ఆరంభించేటప్పుడే అవసరమైన నిధులకు పూచీ పడుతోందని ఆయన చెప్పారు.
నేశనల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ ప్రాజెక్ట్ లో భాగంగా 100 లక్షల కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేయడం జరుగుతుందిఅని ప్రధాన మంత్రి అన్నారు. మల్టి-మోడల్ కనెక్టివిటీ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ మాస్టర్ ప్లాన్ విషయంలో సైతం పనులు జరుగుతున్నట్లు ఆయన చెప్పారు. దేశం లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికిగాను ప్రపంచం నలు మూలల నుంచి పెట్టుబడి ని ఆకర్షించే కృషి జరుగుతోందని కూడా ఆయన వివరించారు.
ప్రతి ఒక్కరికీ సంపాదించే మార్గాలు కలిగిన రంగాలలో పర్యటక రంగం ఒకటి అని ప్రధాన మంత్రి చెప్తూ ఇ-వీజా పథకం పరిధి లోకి దేశాల సంఖ్య ను ప్రభుత్వం పెంచడం ఒక్కటే కాకుండా,హోటల్ గదుల పై సుంకం తాలూకు పన్ను ను కూడా చెప్పుకోదగిన స్థాయి లో తగ్గించిందని గుర్తు కు తెచ్చారు. అంతేకాకుండా, స్వదేశ్ దర్శన్, ప్రసాద్ ల వంటి పథకాల ద్వారా పర్యటకులను ఆకట్టుకొనేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. ప్రభుత్వ కృషి ఫలితం గా భారతదేశం ప్రస్తుతం ప్రయాణ, పర్యటక స్పర్ధాత్మక సూచీ లో 34 వ స్థానం లో నిలచిందన్నారు. 2013 వ సంవత్సరం లో భారత్ ఈ సూచీ లో 65 వ స్థానం లో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. కరోనా స్థితి మెరుగవుతున్న కొద్దీ, పర్యటక రంగ వైభవం కూడా తిరిగి వస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.
సంస్కరణలను ప్రస్తుతం అరకొర పద్ధతి లో కాక సంపూర్ణ రీతి లో చేపట్టడం జరుగుతోందని ప్రధాన మంత్రి అన్నారు. నగరాల అభివృద్ధికి.. చాలా కాలంగా పరిష్కారం కాకుండా మిగిలివున్న సమస్యలను పరిష్కరించడం, జీవించడం లో సౌలభ్యాన్ని మెరుగుపరచడం, వీలైనంత ఎక్కువ స్థాయి లో పెట్టుబడులు, ఆధునిక సాంకేతిక విజ్ఞానాన్ని మరింత ఎక్కువ గా వినియోగించుకోవడం.. అనే నాలుగు దశలలో పని చేయడం జరుగుతోందని ఆయన వివరించారు.
భవన నిర్మాతలకు, ఇళ్ళ ను కొనుగోలు చేసేవారికి మధ్య నమ్మకం లో అంతరం చోటు చేసుకొందని ప్రధాన మంత్రి అన్నారు. కొన్ని దురుద్దేశాలున్న వ్యక్తులు యావత్తు స్థిరాస్తి రంగానికి అప్రదిష్ట తీసుకువచ్చారు, ఇది మన మధ్యతరగతి కుటుంబాలను నిస్పృహ కు లోను చేసిందని ఆయన అన్నారు. ఈ సమస్య ను నివారించడానికి రెరా చట్టాన్ని తీసుకురావడమైందని ఆయన చెప్పారు. ఈ చట్టం వచ్చిన తరువాత మధ్యతరగతి గృహాలు త్వరితగతిన పూర్తి అవుతున్నట్లు ఇటీవల కొన్ని నివేదికలు వెల్లడించాయని ఆయన అన్నారు. నగరాల్లో జీవనాన్ని సరళతరం గా మార్చడానికి ఆధునిక సార్వజనిక రవాణా మొదలుకొని గృహ నిర్మాణం వరకు అన్ని విధాలుగాను అభివృద్ధిపరచడం జరుగుతోంది అని ఆయన అన్నారు.
‘ప్రధాన మంత్రి ఆవాస్ యోజన’ ను ఆగ్రా నుంచే మొదలుపెట్టడం జరిగిందని, ఈ పథకం లో భాగంగా పట్టణ ప్రాంతాల పేదల కోసం 1 కోటి కి పైగా గృహాలకు ఆమోదం తెలపడమైందని ప్రధాన మంత్రి అన్నారు. ఇళ్ళను కొనుగోలు చేయడానికి నగర ప్రాంత మధ్యతరగతి కోసం మొట్టమొదటి సారిగా సాయపడటం జరుగుతోందని ఆయన చెప్పారు. ఇళ్ళ ను కొనుగోలు చేయడానికి ఇంతవరకు 12 లక్షలకు పైగా పట్టణ ప్రాంత మధ్యతరగతి కుటుంబాలకు దాదాపుగా 28,000 కోట్ల రూపాయలు సాయంగా అందించడం జరిగిందని ఆయన అన్నారు. ఎఎమ్ఆర్ యుటి (అమృత్ మిషన్) లో భాగం గా అనేక నగరాలలో నీరు, మురికినీటి కాలవల వంటి మౌలిక సదుపాయాలను ఉన్నతీకరించడం జరుగుతోందని, అంతేకాకుండా నగర ప్రాంతాల లో పబ్లిక్ టాయిలెట్ లను మరింత ఉత్తమమైనవిగా తీర్చిదిద్దడానికి, వ్యర్థాల నిర్వహణలో ఒక ఆధునిక వ్యవస్థను అమలులోకి తీసుకురావడానికి స్థానిక సంస్థలకు సాయాన్ని అందించడం జరుగుతోందని ఆయన వివరించారు.
2014 వ సంవత్సరం తరువాత, 450 కి.మీ. మెట్రో మార్గాన్ని పనిచేయించడం ప్రారంభించడమైందని, అంతకు పూర్వం దీని పరిధి 225 కి.మీ. మాత్రమే అని ప్రధాన మంత్రి తెలిపారు. 1,000 కి.మీ. పొడవైన మెట్రో మార్గాల తాలూకు పనులు శీఘ్ర గతి న పురోగమిస్తున్నాయని కూడా ఆయన తెలిపారు. ఈ పనులు దేశంలోని 27 నగరాల పరిధిలో కొనసాగుతున్నాయి.
ఆగ్రా మెట్రో ప్రాజెక్టులో మొత్తం 29.4 కి.మీ. పొడవున రెండు కారిడార్లు ఉన్నాయి. ఇది తాజ్ మహల్, ఆగ్రా కోట, సికంద్రా వంటి ప్రముఖ పర్యటక కేంద్రాలను రైల్వే స్టేషన్లతోను, బస్ స్టాండ్‌లతోను కలుపుతుంది. ఈ ప్రాజెక్టు ఆగ్రా నగరం లోని 26 లక్షల జనాభా కు లబ్ధిని చేకూర్చడంతో పాటు ప్రతి ఏటా ఆగ్రా ను చూడడానికి వచ్చే 60 లక్షల మందికి పైగా పర్యటకులకు కూడా తన సేవలను అందించనుంది. చరిత్రాత్మక నగరమైన ఆగ్రా కు పర్యావరణానుకూలమైన మాస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ ను ఈ ప్రాజెక్టు అందుబాటు లోకి తీసుకురానుంది. 8,379.62 కోట్ల రూపాయల అంచనా వ్యయం తో కూడిన ఈ ప్రాజెక్టు ను 5 సంవత్సరాల్లో నిర్మాణం పూర్తి చేయడం జరుగుతుంది.
అంతకు ముందు, గత ఏడాది మార్చి నెల 8 న, ‘సిసిఎస్ ఎయర్ పోర్ట్ నుంచి మున్శీ పులియా’ వరకు మొత్తం 23 కి.మీ. మేర సాగే నార్త్-సౌత్ కారిడార్ లో లఖ్‌నవూ మెట్రో తాలూకు వాణిజ్య సరళి కార్యకలాపాలను ప్రధాన మంత్రి మొదలుపెట్టడం తో పాటు ఆగ్రా మెట్రో ప్రాజెక్టు ను కూడా ప్రారంభించారు.
***
(Release ID: 1678877)
Visitor Counter : 258
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam