శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

భారతీయ, అంతర్జాతీయ విజ్ఞాన శాస్త్ర ఉత్సవం కోసం భువనేశ్వర్, ఐ.ఎం.ఎం.టి.లో సన్నాహక కార్యక్రమం

ఎలక్ట్రానిక్ పద్ధతిలో కేంద్రమంత్రి హర్షవర్ధన్ శ్రీకారం

Posted On: 05 DEC 2020 3:05PM by PIB Hyderabad

   ఆరవ భారత, అంతర్జాతీయ విజ్ఞాన శాస్త్ర ఉత్సవం (ఐ.ఐ.ఎస్.ఎఫ్.-2020) నిర్వహణకు సన్నాహంగా భువనేశ్వర్ లోని కేంద్ర విజ్ఞాన శాస్త్ర, పారిశ్రామిక పరిశోధనా మండలి-మినరల్స్ అండ్ మెటీరియల్స్ టెక్నాలజీ ఇన్.స్టిట్యూట్ (సి.ఎస్.ఐ.ఆర్.-ఐ.ఎం.ఎం.టి.)లో ఈ రోజు జరిగిన కార్యక్రమాన్ని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, భూగోళ శాస్త్రాలత అధ్యయన శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ఎలెక్ట్రానిక్ పద్ధతిలో ప్రారంభించారు. కేంద్ర పెట్రోలియం, సహజవాయువు, ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సి.ఎస్.ఐ.ఆర్. డైరెక్టర్ జనరల్, విజ్ఞానశాస్త్ర, పారిశ్రామిక పరిశోధనా శాఖ (డి.ఎస్.ఐ.ఆర్.) కార్యదర్శి అయిన డాక్టర్ శేఖర్ సి. మాండే,  భువనేశ్వర్.లోని సి.ఎస్.ఐ.ఆర్.-ఐ.ఎం.ఎం.టి. డైరెక్టర్ ప్రొఫెసర్ శుద్ధసత్వ బసు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. “స్వావలంబనతో కూడిన భారతదేశం, ప్రపంచ సంక్షేమం కోసం విజ్ఞానశాస్త్రం” అనే ఇతివృత్తంతో ఈ సారి ఐ.ఐ.ఎస్.ఎఫ్. ను నిర్వహించబోతున్నారు.

  ఈ సందర్భంగా కేంద్రమంత్రి డాక్టర్ హర్షవర్ధన్ మాట్లాడుతూ,.. స్వావలంబనతో కూడిన భారతదేశం, ప్రపంచ సంక్షేమం పేరిట ఐ.ఐ.ఎస్.ఎఫ్. వేడుకలకోసం చేపట్టిన ఇతివృత్తం ప్రస్తుత పరిస్థితులకు ఎంతో అనువైనదవని అన్నారు. అభివృద్ధి ప్రక్రియను ముందుకు నడిపించేందుకు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కలలుగన్న ఆత్మనిర్భర భారత్ నినాదం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలకపాత్ర పోషిస్తున్న తరుణంలో ఈ ఇతివృత్తం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుందని  అన్నారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో శాస్త్రీయపరమైన ఆవిష్కరణల్లో, సాంకేతిక పరిజ్ఞాన ప్రగతిలో మనదేశం కృషి, ప్రతిభ ప్రతిఫలిస్తోందన్నారు.

  గనుల తవ్వకం, ఖనిజాలు, తదితర అంశాల్లో పరిశోధన భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ముఖ్యమైన భాగాలన్నారు. సి.ఎస్.ఐ.ఆర్. అనుబంధ సంస్థల కుటుంబంలో ఐ.ఎం.ఎం.టి. పాత్ర ఎంతో కీలకమైనదని, ఖనిజాల ఆవిష్కరణ, పరిశోధనలో ఎదురయ్యే సమస్యల పరిష్కారంలో  ఈ సంస్థ ఎంతో కృషి చేస్తోందన్నారు. సుస్థిర ఆర్థిక వ్యవస్థ లక్ష్యంగా గనుల తవ్వకంలో, ఖనిజాల అన్వేషణ రంగంలో ఎదురయ్యే సమస్యలను అవగాహన చేసుకుని వాటిని పరిష్కరించేందుకు సి.ఎస్.ఐ.ఆర్-ఐ.ఎం.ఎం.టి. నిర్విరామంగా కృషి చేస్తోందన్నారు. టంగ్.స్టన్, లీథియం, కోబాల్ట్, మాంగనీస్ వంటి కీలకమైన ఖనిజాలు, అరుదైన భూసంబంధ మూలకాలపై పరిశోధనలో ఈ సంస్థ కృషి ఎంతో ప్రశంసనీయమన్నారు.

   మన జీవిత సమస్యల పరిష్కారానికి విజ్ఞాన శాస్త్రం, ఇంజినీరింగ్, గణిత శాస్త్రం ఎలాంటి మార్గాలు చూపుతుందనే అంశాలను ప్రదర్శించేందుకు ఐ.ఐ.ఎస్.ఎఫ్. వేడుకను వివిధ సామాజిక వర్గాల ప్రతినిధుల భాగస్వామ్యంతో నిర్వహిస్తూ వస్తున్నట్టు కేంద్రమంత్రి చెప్పారు. కొత్త ఆలోచనలు, భావనలు, ఆవిష్కరణల విషయంలో భారతదేశం మిగతా దేశాలకు ఎంత స్ఫూర్తిదాయకంగా నిలిచిందో ప్రస్తుత తరానికి తెలియజెప్పేందుకు ఇది దోహదపడుతుందని అన్నారు. సైన్స్, టెక్నాలజీ శాఖ మంత్రి మాట్లాడుతూ,..2015లో ప్రారంభమైన ఐ.ఐ.ఎస్.ఎఫ్.,.. గత కొన్నేళ్లుగా విజ్ఞాన శాస్త్ర రంగంలో స్ఫూర్తిదాయకంగా, వినూత్నమైన వేదికగా నిలుస్తూ వస్తోందన్నారు. భారతదేశం విశ్వగురువుగా రూపొందడానికి ఈ ఉత్సవం దోహదపడుతుందన్నారు. ఐ.ఐ.ఎస్.ఎఫ్.-2020 విజయవంతంకావాలన్న ఆకాంక్షను మంత్రి వ్యక్తం చేశారు.

  పెట్రోలియం, సహజవాయువు, ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ, భారతదేశం ప్రయోజనాల కోసం ఆవిష్కరణలు కొనసాగించాలని విజ్ఞానశాస్త్ర సమాజాన్ని కోరారు. ఆత్మనిర్భర భారత్ నినాదం స్ఫూర్తిగా భారతదేశం స్వాలంబనతో ఎదిగేందుకు తగిన సానుకూల వాతావరణాన్ని సృష్టించాలనన్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన ఉత్పాదనలు, సేవలు అందించేందుకు కృషిచేయాలని పిలుపునిచ్చారు. విజ్ఞాన శాస్త్రం, ఇతర సృజనాత్మక రంగాల్లో మన సంస్థాగతమైన, పారిశ్రామికపరమైన సామర్థ్యాలను మరింత బలోపేతం చేసుకోవలసిన ఆవశ్యతను గురించి కోవిడ్-19వైరస్ మనకు తెలియజెప్పిందని అన్నారు. ఆత్మనిర్భర భారత్,.. అంటే, కేవలం మన అవసరాలను తీర్చుకోవడమే కాదని,, ప్రపంచ సమాజానికి కూడా ఆశాకిరణంగా మారాలని ‘వసుదైక కుటుంబకం’ సిసలైన స్ఫూర్తి అదేనని అన్నారు.

   ఆర్థికాభివృద్ధికి, సామాజిక ప్రయోజనాలకు విజ్ఞాన శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధిని వినియోగించుకోనిదే, స్వావలంబనకోసం భారతదేశం సాగిస్తున్న కృషి తగిన ఫలితాలను ఇవ్వజాలదని కేంద్రమంత్రి ప్రధాన్ అన్నారు.

  డాక్టర్ శేఖర్ సి. మాండే మాట్లాడుతూ, భారతీయ, అంతర్జాతీయ విజ్ఞానశాస్త్ర ఉత్సవ పరంపరలో ఐ.ఐ.ఎస్.ఎఫ్.-2020 ఆరవ వేడుక అని, ఈ ఉత్సవం ద్వారా విజ్ఞాన శాస్త్ర ప్రయోజనాలను ప్రజల ముంగిటికి చేర్చాలన్నది విజ్ఞాన భారతి లక్ష్యమని అన్నారు. విజ్ఞానశాస్త్ర ఫలాలు, ఔషధ విజ్ఞాన ఉత్పాదనలకోసం సి.ఎస్.ఐ.ఆర్. దేశంలోని పలు ప్రధాన కంపెనీలతో కలసి పనిచేసిందని మాండే అన్నారు.

******

 

 

 


(Release ID: 1678661) Visitor Counter : 320