ఆర్థిక మంత్రిత్వ శాఖ

డి.ఆర్.ఐ. 63 వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను ప్రారంభించిన - కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతా రామన్

Posted On: 04 DEC 2020 5:41PM by PIB Hyderabad

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ (సి.బి.ఐ.సి) ఆధ్వర్యంలో పనిచేస్తున్న అక్రమ రవాణా నిఘా మరియు దర్యాప్తు సంస్థ, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డి.ఆర్.ఐ) 63వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను, కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్, ఈ రోజు, ఇక్కడ, ప్రారంభించారు.

నార్త్ బ్లాక్‌ లోని ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యాలయంలో నిర్వహించిన ప్రారంభ కార్యక్రమంతో ఈ వేడుకలు ప్రారంభమయ్యాయి.  ఈ కార్యక్రమంలో -  కేంద్ర ఆర్ధిక మంత్రితో పాటు, ఆర్థిక కార్యదర్శి డాక్టర్ అజయ్ భూషణ్ పాండే;  సి.బి.ఐ.సి. చైర్మన్ శ్రీ ఎం. అజిత్ కుమార్;  డి.ఆర్.ఐ. ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ శ్రీ బాలేష్ కుమార్ పాల్గొన్నారు. కోవిడ్-19 మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని, ఈ సంవత్సరం, ఈ కార్యక్రమాన్ని కూడా దృశ్య మాధ్యమం ద్వారా నిర్వహించడం జరిగింది.  ప్రత్యక్షంగా ప్రసారమైన ఈ కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న 450 మందికి పైగా డి.ఆర్.ఐ; సి.బి.ఐ.సి. తో సహా ఇతర భారత ప్రభుత్వ అధికారులు ఆన్-లైన్ ద్వారా పాల్గొన్నారు.

బంగారం, విదేశీ కరెన్సీ, మాదకద్రవ్యాలు, మందులు, భద్రత, పర్యావరణం, వాణిజ్య మోసాలపై వ్యవస్థీకృత అక్రమ రవాణా పోకడలను విశ్లేషించే “ భారతదేశంలో అక్రమ రవాణా నివేదిక 2019-20” ని శ్రీమతి సీతారామన్ విడుదల చేశారు. డి.ఆర్.ఐ. ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ శ్రీ బాలేష్ కుమార్, ప్రముఖులకు స్వాగతం పలికారు. అనంతరం గత ఆర్థిక సంవత్సరంలో డి.ఆర్.ఐ. పనితీరుపై ఒక నివేదికను సమర్పించారు.

డి.ఆర్.‌ఐ.  మరియు దాని అధికారుల పనితీరును ముఖ్యంగా మహమ్మారి ప్రబలిన కాలంలో వారు అందించిన ప్రశంసనీయమైన సేవలను ఆర్థిక మంత్రి ఈ సందర్భంగా అభినందించారు. ఎదురౌతున్న అనేక కష్ట, నష్టాలను ఓర్చి,  అవిశ్రాంతంగా కృషి చేస్తున్న డి.ఆర్.ఐ. కి చెందిన 800 అధికారులతో కూడిన పటిష్టమైన ‘లీన్ అండ్ మీన్’ బృందాన్ని శ్రీమతి సీతారామన్ ప్రశంసించారు. డి.ఆర్.ఐ. నమోదు చేసిన కేసులు, అరెస్టులు పెద్ద సంఖ్యలో ఉన్నప్పటికీ, మొత్తం జరిగే నేరాలతో పోలిస్తే ఇది చాలా తక్కువ కావడంతో డి.ఆర్.ఐ. అధికారులు ఇంకా కష్టపడి పనిచేయాలని ఆర్థిక మంత్రి ప్రోత్సహించారు.  భారతదేశ ఆర్థిక వనరులకు విఘాతం కలిగించే ప్రతి అపరాధి శిక్షింపబడేలా చూడాలని డి.ఆర్.ఐ. మరియు భారతీయ కస్టమ్స్ అధికారులను ఆమె కోరారు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీల మధ్య చర్య తీసుకునే ఇన్‌పుట్‌ల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడంలో ప్రపంచ కస్టమ్స్ సంస్థ పాత్రను శ్రీమతి సీతారామన్ గుర్తించారు.  పరస్పర ప్రయోజనకరమైన ఇటువంటి నిఘా మార్పిడిలను పెంపొందించుకోవలసిన అవసరాన్ని ఆమె ప్రధానంగా పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రపంచ కస్టమ్స్ సంస్థ సెక్రటరీ జనరల్ డాక్టర్ కునియో మికురియా కూడా పాల్గొని,  "కోవిడ్-19 మహమ్మారికి కస్టమ్స్ ప్రతిస్పందన" అనే అంశంపై సభికులనుద్దేశించి ప్రసంగించారు. 

ఆర్థిక కార్యదర్శి డాక్టర్ అజయ్ భూషణ్ పాండే మాట్లాడుతూ, వాణిజ్య మోసాలు మరియు సరిహద్దు అక్రమ రవాణాకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన కేసులను చురుకుగా వెలుగులోకి తీసుకురావడం ద్వారా భారత ఆర్థిక, భౌతిక ఆర్థిక వ్యవస్థకు డి.ఆర్.‌ఐ. దోహదపడిందని, పేర్కొన్నారు.  చట్టాలను సమర్థవంతంగా అమలు చేయడానికి ఏజెన్సీల మధ్య డేటా విశ్లేషణ, నిఘా / ఇన్ఫర్మేషన్ / సమాచార మార్పిడి ‌పై ఆయన ఉద్ఘాటించారు.  చట్టాలను అమలుచేస్తున్న ఇతర సంస్థలలో డి.ఆర్.ఐ. ప్రత్యేక స్థానాన్ని సంపాదించిందని డాక్టర్ పాండే ప్రశంసించారు. 

ఈ సందర్భంగా, డి.ఆర్.ఐ. కొచ్చిన్ జోనల్ యూనిట్ కు చెందిన శ్రీ నజీముద్దీన్ టి. ఎస్. మరియు జైపూర్ లోని డి.ఆర్.ఐ. నమోదు చేసిన కేసుకు సంబంధించి స్వతంత్ర సాక్షి శ్రీ సుమెర్ సేన్ లకు ధైర్య పురస్కారాలు ప్రదానం చేశారు.

డి.ఆర్.ఐ. ఉత్క్రిష్ట సేవా సమ్మన్, 2020 అవార్డును 1961 బ్యాచ్ కి చెందిన భారత రెవెన్యూ సర్వీసు (కస్టమ్స్ & సెంట్రల్ ఎక్సైజ్) అధికారి శ్రీ బి. శంకరన్ కు అనేక సంవత్సరాల విశిష్ట మరియు నిబద్ధత గల సేవకు గుర్తింపుగా ప్రదానం చేశారు.  ప్రయాణ ఆంక్షల కారణంగా, ఈ ఏడాది ధైర్య పురస్కారం మరియు ఉత్క్రిష్ట సేవ సమ్మన్ అవార్డు గ్రహీతలకు సంబంధిత డి.ఆర్.ఐ. జోనల్ యూనిట్ ప్రిన్సిపల్ అదనపు డైరెక్టర్ జనరల్స్ ఈ ఉదయం కేంద్ర ఆర్థిక మంత్రి తరపున అవార్డులను ప్రదానం చేశారు.  ఈ వేడుకల వీడియో రికార్డింగులను ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన అధికారుల ముందు ప్రదర్శించారు.

ప్రారంభోత్సవ కార్యక్రమం అనంతరం డి.ఆర్.ఐ. నేతృత్వంలో అంతర్జాతీయ నిపుణుల చర్చ జరిగింది. ఈ చర్చా కార్యక్రమంలో - ఆస్ట్రేలియా సరిహద్దు దళం; నెథర్లాండ్ కస్టమ్స్ యంత్రాంగం; యు.కె. కి చెందిన హెచ్.ఎం. రెవిన్యూ మరియు కస్టమ్స్ తో పాటు ఇంటర్ పోల్ సంస్థలకు చెందిన ప్రతినిధులతో పాటు మొత్తం 200 మందికి పైగా నిపుణులు పాల్గొన్నారు. 

*****



(Release ID: 1678474) Visitor Counter : 152