ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం

శ్రీ కలాం స్ఫూర్తితో ఆత్మనిర్భర భారత్ నిర్మాణానికి నడుంబిగించండి - భారతీయ యువతకు గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు పిలుపు


అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు ప్రతినబూనుదాం

గ్రామాలు, చిన్న పట్టణాల్లో ఉపాధి, ఆర్థిక అవకాశాలు కల్పించేందుకు మరింత కృషి జరగాలి

ఆర్థిక, సామాజిక సవాళ్ల పరిష్కారానికి యువత వినూత్న ఆలోచనలతో ముందుకు రావాలని సూచన

శ్రీ కలాం సూచించినట్లుగా సుస్థిరాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ మీద దృష్టి కేంద్రీకరించాలి

రాష్ట్రపతిగా వారు చూపిన హుందాతనం, అవకాశ వాదంనుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది

‘40 ఇయర్స్ విత్ అబ్దుల్ కలాం - అన్‌టోల్డ్ స్టోరీస్’ పుస్తకాన్ని ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి

Posted On: 03 DEC 2020 12:41PM by PIB Hyderabad

మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జీవితాన్ని స్ఫూర్తి పొంది యువత బలమైన, సమగ్రమైన దేశాన్ని, ఆత్మనిర్భర భారత్‌ను నిర్మించేందుకు నడుంబిగించాలని గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. శ్రీ కలాం ప్రేరణతో అధునాతన సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటూ భారత సమాజంపై ప్రభావం చూపిస్తున్న ఆర్థిక, సామాజిక సవాళ్లను పరిష్కరించే దిశగా చొరవతీసుకోవాలని ఆయన సూచించారు. డాక్టర్ శివతను పిళ్లై రాసిన 40 ఇయర్స్ విత్ అబ్దుల్ కలాం -  అన్ టోల్డ్ స్టోరీస్పుస్తకాన్ని చెన్నై నుంచి గురువారం అంతర్జాల వేదిక ద్వారా ఉపరాష్ట్రపతి ఆవిష్కరించారు. ఈ పుస్తకం కలాం జీవిత చరిత్రలోని కొత్త కోణాన్ని స్పృశిస్తోందని.. ఎన్నో కొత్త విషయాలు తెలుసుకునేందుకు వీలువుతోందని తెలిపారు. డాక్టర్ అబ్దుల్ కలాం గారి జీవిత చరిత్ర, మనం ఎదుర్కొనే కష్టనష్టాలను కూడా సానుకూలంగా తీసుకుని వాటి ఆధారంగా మనల్ని మనం ఓ దృఢమైన వ్యక్తిత్వంగా తయారు చేసుకునేందుకు ఓ చక్కటి సాధనంఅని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు.

డీఆర్డీవో చీఫ్‌గా, తర్వాత రాష్ట్రపతిగా శ్రీ అబ్దుల్ కలాం గారు ఉన్న సమయంలో పలుమార్లు వారితో సంభాషించే అవకాశం నాకు దక్కింది. వారితో మాట్లాడిన ప్రతిసారీ వారి లోతైన అవగాహన, విషయ నైపుణ్యత.. దేశాన్ని, సామాన్య ప్రజల జీవితాలను మార్చాలన్న వారి బలమైన ఆకాంక్ష కనబడుతుండేవిఅని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు.

డాక్టర్ కలాంను కర్మయోగిగా అభివర్ణించిన ఉపరాష్ట్రపతి.. వారి జీవితం ప్రతి భారతీయుడికీ స్ఫూర్తిదాయకమని తెలిపారు. వారు అసలైన ప్రజా రాష్ట్రపతి అని పేర్కొన్న ఉపరాష్ట్రపతి, ప్రతి భారతీయుడి జీవితంలో మరీ ముఖ్యంగా ప్రతి యువకుడి జీవితాన్ని వారు స్పృశించారన్నారు. విజ్ఞానం, నిరాడంబరత, నిజాయితీల కలబోతే శ్రీ అబ్దుల్ కలాం అన్న ఆయన, భారత రక్షణ, క్షిపణి వ్యవస్థను బలోపేతం చేసేందుకు వారు చేసిన కృషి భారత చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోతుందన్నారు.

విదేశీ సంబంధాల విషయంలోనూ శ్రీ కలాం చూపిన హుందాతనం, భారతదేశ స్నేహాన్ని, జ్ఞానాన్ని ప్రపంచానికి చాటిచెప్పేందుకు చేసిన కృషి చిరస్మరణీయమన్న ఉపరాష్ట్రపతి, అంతరిక్ష పరిశోధనల రంగంలో వారు చేసిన సేవలకు గానూ.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో కనుగొన్న వ్యవస్థకు శ్రీ కలాం గారి పేరు పెట్టి తమ గౌరవాన్ని చాటుకోవడం మనందరికీ గర్వకారణమన్నారు.

భారతదేశం గురించి శ్రీ కలాం గారి దూరదృష్టిని ప్రస్తావిస్తూ.. మాజీ రాష్ట్రపతి కలాం గారు విస్తృతమైన సహజవనరులు, నైపుణ్యత, కష్టపడే తత్వం కలిగిన యువత, వివిధ రంగాలకు సంబంధించిన మానవవనరులు సమృద్ధిగా ఉన్న భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారే దిశగా దృష్టిపెట్టాలని సూచించేవారు. ఈ దిశగా భవిష్యత్ భారతమైన విద్యార్థులు, యువతలో స్ఫూర్తి రగిలిస్తూ.. జాతి నిర్మాణంలో వారిని భాగస్వాములు చేసేలా ప్రోత్సహించేవారు. వారు ఓ ప్రఖర జాతీయవాది, ప్రభావవంతమైన వక్త, చక్కటి రచయితఅని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు.

వలసకార్మికుల జీవన స్థితిగతులపై కరోనా మహమ్మారి ప్రభావాన్ని ప్రస్తావించిన ఉపరాష్ట్రపతి.. గ్రామాలు, చిన్నపట్టణాల్లో ఉపాధి, ఆర్థిక అవకాశాలను సృష్టించేందుకు కృషి జరగాల్సిన అవసరం ఉందన్నారు. వికేంద్రీకృత ప్రణాళిక, స్థానిక సంస్థల సామర్థ్య నిర్మాణం, కాటేజీ పరిశ్రమలను ఎక్కువమొత్తంలో ప్రోత్సహించడం ద్వారా మన గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి కేంద్రాలుగా పరిణామం చెందుతాయన్నారు. తన పురమోడల్ ద్వారా గ్రామాలు, పట్టణాల మధ్య అంతరాన్ని తగ్గించేందుకు కృషిచేయాలన్న శ్రీ కలాం గారి ఆలోచనలను మనం గుర్తుచేసుకోవాలి. అదే అభివృద్ధి నమూనాకు మొదటి ప్రాధాన్యత కావాలిఅని ఉపరాష్ట్రపతి సూచించారు.

సగటు భారతీయుడి వయసు 30 ఏళ్ల లోపలేనన్న విషయాన్ని ఉపరాష్ట్రపతి గుర్తుచేస్తూ.. యువత శక్తిసామర్థ్యాలను గుర్తించి వాటికి సరైన పద్ధతిలో సానబెట్టడం, వారి ఆలోచనల్లోని లోతుపాతులను గుర్తించి ప్రోత్సహించడం వంటి వాటి ద్వారా వారిని జాతి నిర్మాణానికి సిద్ధం చేయాలని సూచించారు. భారతదేశంలో శక్తి సామర్థ్యాలకు కొరతలేదని.. కరోనాకు ముందు ఒక్క పీపీఈ కిట్‌ను కూడా ఉత్పత్తి చేయలేని స్థితిలో ఉన్న భారతదేశం ఇప్పుడు ప్రపపంచంలోనే రెండో అతిపెద్ద పీపీఈ కిట్ ఉత్పత్తిదారుగా నిలిచిన విషయాన్ని ప్రస్తావించారు. సవాళ్లను అవకాశాలుగా మార్చుకుని ముందుకెళ్లాలని.. ఆత్మనిర్భర భారత్నిర్మాణం దిశగా దేశం సాధిస్తున్న పురోగతిని అవగతం చేసుకోవాలన్నారు.

షిల్లాంగ్‌లో డాక్టర్ కలాం చిట్టచివరి ఉపన్యాసంలో పర్యావరణంపై ఆందోళన వ్యక్తం చేసిన విషయాన్ని ఉపరాష్ట్రతి గుర్తుచేశారు. ఆ విషయాన్ని పునరుద్ఘాటిస్తూ..  సౌరమండంలో జీవించేందుకు అనుకూలమైన ఏకైక గ్రహం భూగ్రహం. అలాంటి భూమాతను కాపాడుకోవడం దీన్ని భవిష్యత్ తరాలకు అందించడం మనందరి గురుతర బాధ్యత. అభివృద్ధి పేరుతో మన పర్యావరణానికి చేసుకుంటున్న నష్టాన్ని శ్రీ కలాం గారు తన ప్రసంగంలో చాలా చక్కగా వివరించారుఅని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ సుస్థిరాభివృద్ధితోపాటు పర్యావరణ పరిరక్షణ కృషిచేయాలని ఆయన సూచించారు.

డాక్టర్ కలాం గారితో తన వ్యక్తిగత అనుభవాలతో చక్కటి పుస్తకం తీసుకొచ్చిన శ్రీ పిళ్లైని ఉపరాష్ట్రపతి అభింనందించారు. వీరి బాటలోనే మరికొందరు కలాం గారితో తమ అనుభవాలను, భవిష్యత్ తరానికి వారు చేసిన మార్గదర్శనాన్ని వివరిస్తూ పుస్తకాలు తీసుకురావాలన్నారు.

ఈ కార్యక్రమంలో పుస్తక రచయిత డాక్టర్ ఎ. శివతను పిళ్లై, ఇస్రో ప్రొఫెసర్ డాక్టర్ వైఎస్ రాజన్, పెంటగాన్ ప్రెస్ ఎండీ, సీఈవో శ్రీ రాజన్ ఆర్యతోపాటు వివిధ వర్గాల ప్రముఖులు అంతర్జాల వేదిక ద్వారా పాల్గొన్నారు.

***



(Release ID: 1678078) Visitor Counter : 306