ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం

కష్ట సమయంలోనూ భారతదేశం సేవాగుణాన్ని విస్మరించలేదు: ఉపరాష్ట్రపతి

- సహాయాన్ని అర్థించిన దేశాలకు కాదనకుండా ఇతోధికంగా సహాయం చేశాం

- కరోనా టీకా పరిశోధనల్లోనూ మనమే ముందున్నాం.. త్వరలోనే శుభవార్త వింటాం

- భారతీయులను స్వదేశానికి తీసుకురావడంలో ఉద్దేశించిన వందేభారత్ మిషన్‌పై ప్రశంసలు

- ఐసీడబ్ల్యూఏ 18వ పాలకమండలి సదస్సులో అంతర్జాల వేదిక ద్వారా ప్రసంగించిన ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు

- మరిన్ని ప్రజా కేంద్రిత కార్యక్రమాలు చేపట్టడంలో ఐసీడబ్ల్యూఏ చొరవతీసుకోవాలని సూచన

Posted On: 02 DEC 2020 6:59PM by PIB Hyderabad

భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రభావం తీవ్రంగా ఉన్న సమయంలోనూ భారతదేశం తన సేవానిరతిని విస్మరించలేదని.. సహాయాన్ని అర్థించిన అన్ని దేశాలకు ఇతోధికంగా సహాయం చేసిందని గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. కష్టకాలంలోనూ ఫార్మాసూటికల్స్ ఉత్పత్తులను అందజేసి తన సేవాగుణాన్ని మరోసారి ప్రపంచానికి పరిచయం చేసిందని ఆయన గుర్తుచేశారు. ఐసీడబ్ల్యూఏ 18వ పాలకమండలి సమావేశాన్ని ఉద్దేశించి.. చెన్నై నుంచి అంతర్జాల వేదిక ద్వారా ఐసీడబ్ల్యూఏ (అంతర్జాతీయ వ్యవహారాలపై భారత మండలి) అధ్యక్షుడి హోదాలో ఉపరాష్ట్రపతి ప్రసంగించారు. కరోనా మహమ్మారి నుంచి తనను తాను కాపాడుకుంటూ ప్రపంచాన్ని కూడా కాపాడేందుకు భారతదేశం చేస్తున్న ప్రయత్నాలను, తీసుకుంటున్న చొరవను వివరించిన ఆయన, కరోనాకు టీకా పరిశోధనల విషయంలోనూ భారతదేశం ముందువరసలో ఉందని, త్వరలోనే టీకాకు సంబంధించి శుభవార్త వినబోతున్నామని స్పష్టం చేశారు.

కరోనా సమయంలో సామాన్య భారతీయుల జీవితాలకు అంతర్జాతీయ సంబంధాలు, విదేశాంగ విధానం యొక్క పాత్ర, ఔచిత్యం మరోసారి వెల్లడైందని అభిప్రాయపడిన ఉపరాష్ట్రపతి, విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం చేపట్టిన ‘వందేభారత్ మిషన్’ను అభినందించారు. ఈ మహత్కార్యాన్ని విజయవంతం చేయడంలో కృషిచేసిన వివిధ విభాగాలు, వివిధ ఏజెన్సీలను హృదయపూర్వకంగా అభినందిస్తున్నట్లు తెలిపారు.  ప్రజాకేంద్రిత కార్యక్రమాలను చేపట్టడంలో ఐసీడబ్ల్యూఏ మరింత చొరవతీసుకోవాలని.. దేశవ్యాప్తంగా ఇంతవరకు చేరుకోలేని వారికి కూడా పథకాలు, కార్యక్రమాలను చేరవేసేందుకు వ్యూహాలు రచించాలని ఆయన సూచించారు.

కరోనా మహమ్మారి ప్రభావితం కాని దేశమే లేదన్న ఉపరాష్ట్రపతి, ఒక్కోదేశం ఒక్కోరకంగా ప్రభావితమైందని తెలిపారు. అయితే ఈ పరిస్థితుల కారణంగా ఆయా దేశాల్లో దాగున్న శక్తిసామర్థ్యాలు, లోటుపాట్లు కూడా బహిర్గతమయ్యాయన్నారు. ‘చాలా దేశాలు ఇప్పుడు పరస్పర సమన్వయంతో పనిచేసేందుకు సిద్ధమైతే.. మరికొన్ని దేశాలు వారి సంకుచిత ఆలోచనలను పట్టుకుని వేలాడుతున్నాయి’ అని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు.

కరోనా కారణంగా వివిధ దేశాల్లో నెలకొన్న పరిస్థితులను ఐసీడబ్ల్యూఏ అధ్యయనం చేస్తోందన్న ఆయన.. మహమ్మారి కారణంగా అంతర్జాతీయ సంబంధాల్లోనూ మార్పులు వస్తాయన్నారు. ఈ 8 నెలల్లో వచ్చిన మార్పులతో కొత్త కోణంలో ఐసీడబ్ల్యూఏ అధ్యయనం చేసేందుకు ఆస్కారం ఏర్పడిందన్నారు.

కరోనా సమయంలో అంతర్జాల వేదికలను సద్వినియోగం చేసుకోవడంలో ఐసీడబ్ల్యూఏ తీసుకున్న చొరవను అభినందించిన ఉపరాష్ట్రపతి.... జాతీయ, అంతర్జాతీయ సెమినార్లు, సదస్సులు, విదేశీ ప్రతినిధులతో ట్రాక్ - 2 చర్చలు, ప్రాంతీయ, ప్రపంచ సమావేశాల, వర్చువల్ వేదికల ద్వారా ఒప్పందపత్రాలపై సంతకాలు చేసుకోవడం వంటి పలు అంశాలను ప్రస్తావించారు. ఇటీవల ఆఫ్రికన్ దేశాల విధాన నిర్ణేతలతో ఏర్పాటుచేసిన రెండు రోజుల సదస్సు ఫలప్రదంగా జరగడంపైనా ఉపరాష్ట్రపతి సంతృప్తి వ్యక్తం చేశారు. నిపుణులతోపాటు, సామాన్య ప్రజల్లోనూ విషయ అవగాహన కల్పించే విషయంలో ఐసీడబ్ల్యూఏ చేపడుతున్న కార్యక్రమాలను సైతం ఉపరాష్ట్రపతి ప్రశంసించారు. ఈ దిశగా విదేశాంగ మంత్రిత్వ శాఖ చేస్తున్న సహాయాన్ని కూడా ఆయన అభినందించారు.

ఇది.. ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు అధ్యక్ష హోదాలో జరుగుతున్న మూడో ఐసీడబ్ల్యూఏ పాలకమండలి సమావేశం కావడం గమనార్హం. ఈ సమావేశంలో 17వ పాలకమండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, ఆర్థికపరమైన అంశాలు వార్షిక నివేదికలకు ఆమోదం తెలిపారు. వీటిని ఇదివరకే ఐసీడబ్ల్యూఏ ఆర్థిక కమిటీ పరిశీలించింది.

ఈ కార్యక్రమంలో మండలి ఉపాధ్యక్షులు విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్, విదేశీ వ్యవహారాల స్టాండింగ్ కౌన్సిల్ చైర్మన్ శ్రీ పీపీ చౌదరి.. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ డాక్టర్ రాజీవ్ కుమార్, ఉపరాష్ట్రపతి కార్యదర్శి శ్రీ ఐ.వి. సుబ్బారావు, ఐసీడబ్ల్యూఏ డీజీతోపాటు పాలకమండలి సభ్యులుగా ఉన్న ఎంపీలు ఇతర సీనియర్ అధికారులు అంతర్జాల వేదిక ద్వారా పాల్గొన్నారు.

***



(Release ID: 1677847) Visitor Counter : 171