వ్యవసాయ మంత్రిత్వ శాఖ

రైతుల సంక్షేమానికి కేంద్రం కట్టుబడి ఉంది, చర్చలకు సదా సిద్ధం: నరేంద్ర సింగ్‌ తోమర్‌

రైతు సంఘాల ప్రతినిధులతో గురువారం కొనసాగనున్న చర్చలు

Posted On: 01 DEC 2020 8:03PM by PIB Hyderabad

 

కేంద్ర వ్యవసాయం&రైతుల సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్‌ తోమర్‌, రైల్వేలు&వాణిజ్య శాఖ మంత్రి శ్రీ పీయూష్‌ గోయల్‌, ఆ శాఖ సహాయ మంత్రి శ్రీ సోమ్‌ ప్రకాశ్‌ కలిసి పంజాబ్‌ రైతు సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. దిల్లీ విజ్ఞాన్‌భవన్‌లో ఈ భేటీ జరిగింది. కొత్తగా తెచ్చిన వ్యవసాయ సంస్కరణ చట్టాలతో కలిగే లాభాలను రైతు ప్రతినిధులకు మంత్రులు మరోమారు వివరించారు. చట్టాలకు సంబంధించిన వివిధ అంశాలపై స్నేహపూర్వకమైన సుదీర్ఘ చర్చ జరిగింది.

    చర్చలకు వచ్చిన రైతులకు వ్యవసాయ మంత్రి సాదర స్వాగతం పలికారు. రైతు సంక్షేమానికి కేంద్రం కట్టుబడి ఉందని, వ్యవసాయ అభివృద్ధి తమ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్య అంశమని స్పష్టం చేశారు. రైతుల ఆందోళనలపై ఒక నిపుణుల కమిటీ వేద్దామని, దానివల్ల, పరస్పర సమ్మతితో సమస్యల పరిష్కారానికి వీలవుతుందని శ్రీ తోమర్‌ ప్రతిపాదించారు. తామే మరో దఫా చర్చలకు వస్తామని, స్నేహపూర్వకంగా సమస్యలను పరిష్కరించుకుందామని రైతు ప్రతినిధులు చెప్పారు.

 

    వ్యవసాయ సంస్కరణ చట్టాలపై రైతులకున్న అభ్యంతరాలేమిటో స్పష్టంగా గుర్తించి, వాటిని బుధవారం నాడు కేంద్ర ప్రభుత్వానికి అందించాలని రైతు ప్రతినిధులకు మంత్రులు సూచించారు. గురువారం జరిగే నాలుగో దఫా సమావేశంలో వాటిపై చర్చిస్తారు.

    రైతు ప్రయోజనాలను పరిరక్షించడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడివుందని, రైతుల సంక్షేమం కోసం చర్చలకు సదా సిద్ధంగా ఉంటుందని రైతు సంఘాల ప్రతినిధులకు మంత్రుల బృందం అభయం ఇచ్చింది.

***



(Release ID: 1677593) Visitor Counter : 168