శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

భారతీయ, అంతర్జాతీయ విజ్ఞానశాస్త్ర ఉత్సవంపై అవగాహనకు
సి.ఎస్.ఐ.ఆర్.-ఐ.ఐ.టి.ఆర్., సి.ఎస్.ఐ.ఒ., ఐ.ఎం.డి. కార్యక్రమాలు

41కార్యక్రమాలతో ముస్తాబవుతున్న ఐ.ఐ.ఎస్.ఎఫ్-2020

Posted On: 29 NOV 2020 3:13PM by PIB Hyderabad

    ఈ ఏడాది డిసెంబరులో వర్చువల్ పద్ధతిలో జరగబోయే ఆరవ భారత్, అంతర్జాతీయ విజ్ఞాన శాస్త్ర ఉత్సవం (ఐ.ఐ.ఎస్.ఎఫ్.-2020)పై అవగాహన కల్పించేందుకు ముందస్తుగా దేశంలో పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

  విజ్ఞాన శాస్త్ర, పారిశ్రామిక పరిశోధనా మండలి (సి.ఎస్.ఐ.ఆర్.)కి అనుబంధించిన లక్నోలోని భారతీయ విషతత్వ శాస్త్ర పరిశోధనా సంస్థ (ఐ.ఐ.టి.ఆర్.)లో ఇలాంటి అవగాహనా కార్యక్రమం జరిగింది. ఐ.ఐ.ఎస్.ఎఫ్.-2020 సారథ్య సంఘం అధ్యక్షుడుగా వ్యవహరిస్తున్న విజ్ఞాన శాస్త్ర, పారిశ్రామిక పరిశోధనా సంస్థ (డి.ఎస్.ఐ.ఆర్.) కార్యదర్శి, సి.ఎస్.ఐ.ఆర్. చైర్మన్ డాక్టర్ శేఖర్ మాండే ప్రధానోపన్యాసం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ వైరస్ సంక్షోభం కారణంగా పలు ఆంక్షలు అమలులో ఉన్నప్పటికీ, విజ్ఞాన శాస్త్ర ఉత్సవం స్ఫూర్తిదాయకంగా నిర్వహిస్తూ ఉండటం అభినందనీయమని అన్నారు. ఈ ఉత్సవాన్ని నిర్వహించాలన్న భావన, భాగస్వామ్య వర్గాల్లో చెక్కుచెదరని విజ్ఞాన శాస్త్ర స్ఫూర్తిని తెలియజేస్తున్నదన్నారు. -స్వావలంబనతో కూడిన భారతదేశం, ప్రపంచ సంక్షేమం కోసం విజ్ఞాన శాస్త్రం- అన్న ఇతివృత్తంతో ఐ.ఐ.ఎస్.ఎఫ్ 2020 ఉత్సవాన్ని నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఆత్మనిర్భర భారత్ నినాదమే స్ఫూర్తిగా స్వావలంభనతో కూడిన భారతదేశ నిర్మాణంలో విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక పరిజ్ఞానం, సృజనాత్మకతల పాత్రను గురించి ఈ ఉత్సవంలో చర్చించే అవకాశం ఉందన్నారు. అలాగే,..ప్రపంచం ఎదుర్కొనే అనేక సమస్యలకు ఈ ఉత్సవం పరిష్కారాలను సూచించే అవకాశాలు ఉన్నాయన్నారు.

 

  ఉత్తరప్రదేశ్ ఉన్నత విద్య, సైన్స్, టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి నీలిమా కటియార్ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. లక్నో నగర మేయర్ సంయుక్త భాటియా గౌరవ అతిథిగా హాజరయ్యారు. సి.ఎస్.ఐ.ఆర్-ఐ.ఐ.టి.ఆర్. డైరెక్టర్ డాక్టర్ సరోజ్ కె. బారిక్ స్వాగతోపన్యాసం చేస్తూ, ఐ.ఐ.ఎస్.ఎఫ్.-2020 యువ శాస్త్రవేత్తలకు సదవకాశమని, తమ భావనలను, ఆలోచనలను పంచుకునేందుకు వారికి ఇది సరైన తరుణమని అన్నారు. ప్రపంచ స్థాయిలో ప్రయోజనాలకోసం వారు తమ ప్రతిభా పాటవాలను పంచుకోవచ్చన్నారు.

 

  ఈ సందర్భంగా విజ్ఞాన భారతి సంస్థ జాతీయ నిర్వహణా కార్యదర్శి జయంత్ సహస్రబుధే, యు.పి.లోని అవథ్ ప్రాంత విజ్ఞాన భారతి కార్యదర్శి శ్రేయాంశ్ మాండ్లోయ్ మాట్లాడుతూ, ఆన్ లైన్ పద్ధతిలో తమ అభిప్రాయాలను కార్యక్రమ భాగస్వాములతో పంచుకున్నారు. విజ్ఞాన శాస్త్ర ఉత్సవంలో పెద్ద ఎత్తున పాల్గొనాలని, మన దైనందిన జీవితాల్లో విజ్ఞాన శాస్త్రం పాత్రను అర్థం చేసుకునేందుకు ఐ.ఐ.ఎస్.ఎఫ్. ఉత్సవ వేదికను వినియోగించుకోవాలని పాఠశాలలను, కళాశాలలను కోరారు.

   ఐ.ఐ.ఎస్.ఎఫ్. ఉత్సవంపై అవగాహన కల్పించేందుకు లక్నోలోని సి.ఎస్.ఐ.ఆర్.- జాతీయ వృక్షశాస్త్ర పరిశోధనా సంస్థ (ఎన్.బి.ఆర్.ఐ.)లో మరో కార్యక్రమాన్ని ఆన్ లైన్ పద్ధతిలోనే నిర్వహించారు. సి.ఐ.ఎస్.ఆర్-ఎన్.బి.ఆర్.ఐ. డైరెక్టర్ డాక్టర్ ఎస్.కె. బారిక్ ప్రారంభోన్యాసం చేశారు. అవథ్ ప్రాంత విజ్ఞాన భారతి సంస్థ నిర్వహణా కార్యదర్శి శ్రేయాంశ్ మాండ్లోయ్ ఐ.ఐ.ఎస్.ఎఫ్. ఉత్సవ ప్రాముఖ్యతను వివరించారు. సి.ఎస్.ఐ.ఆర్. డైరెక్టర్ జనరల్ డాక్టర్ శేఖర్ సి. మాండే ప్రధానోపన్యాసం ఇచ్చారు. ఉత్తరప్రదేశ్ కేబినెట్ మంత్రి బ్రిజేశ్ పాఠక్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

   చండీగఢ్ లోని సి.ఎస్.ఐ.ఆర్. కు అనుబంధించిన కేంద్ర విజ్ఞాన శాస్త్ర ఉపకరణాల సంస్థ (సి.ఎస్.ఐ.ఒ.)లో కూడా ఐ.ఐ.ఎస్.ఎఫ్. ఉత్సవంపై అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించారు. న్యూఢిల్లీలోని భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ (ఐ.సి.ఎ.ఆర్.) డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సురేష్ కుమార్ చౌధరి ముఖ్య అతిథిగా ఈ వర్చువల్ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. కేరళ రాష్ట్రం, అలెప్పీలోని ఎస్.డి. కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ నాగేంద్ర ప్రభు ప్రధానోపన్యాసం ఇచ్చారు. “సుస్థిర వ్యవసాయం, పర్యావరణం కోసం విజ్ఞాన శాస్త్రం” అన్న ఇతివృత్తంతో కార్యక్రమం నిర్వహించారు.

 

   కేంద్ర భూగోళ శాస్త్రాల మంత్రిత్వ శాఖ పరిధిలోని భారతీయ వాతావరణ శాఖ (ఐ.ఎం.డి.) ఆధ్వర్యంలో కూడా ఐ.ఐ.ఎస్.ఎఫ్. ఉత్సవంపై  యూట్యూబ్ ఛానల్ ద్వారా మరో అవగాహనా కార్యక్రమం జరిగింది. భూగోళ శాస్త్రాల అధ్యయన మంత్రిత్వ శాఖ ఆరవ భారత, అంతర్జాతీయ విజ్ఞాన శాస్త్ర ఉత్సవం నిర్వహణా బాధ్యతలు కూడా నిర్వర్తిస్తోంది. ఐ.ఎం.డి. డిప్యూటీ జనరల్ మేనేజర్ డాక్టర్ ఎం. మహాపాత్ర స్వాగతోపన్యాసం చేశారు. మంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శి శైలేశ్ నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. “స్వావలంబనతో కూడిన భారతదేశం, ప్రపంచ సంక్షేమం కోసం వాతావరణ శాఖ సేవలు” అనే ఇతివృత్తంతో  జరిగిన ఈ కార్యక్రమంలో డాక్టర్ సతీదేవి, డాక్టర్ డి.ఎస్. పాయ్, డాక్టర్ ఆర్.కె. జేనామణి, కె.ఎన్. మోహన్, డాక్టర్ ఎ.కె. మిత్రా, డాక్టర్ ఎస్.డి. అత్రి, డాక్టర్ అశోక్ కుమార్ దాస్, డాక్టర్ ఆర్.కె. గిరి తదితరులు ప్రసంగించారు.

  భారతీయ, అంతర్జాతీయ విజ్ఞాన శాస్త్ర ఉత్సవం ఒక వినూత్నమైన కార్యక్రమం. ఉత్సవంలో భాగంగా సదస్సులు, కార్యగోష్టులు, చర్చలు నిర్వహిస్తారు. విజ్ఞాన శాస్త్ర పరిణామాలపై నిపుణులతో చర్చలు, విజ్ఞాన శాస్త్ర రంగస్థల కార్యక్రమాలు, సంగీత, కవితా కార్యక్రమాలు చేపడతారు. ఐ.ఐ.ఎస్.ఎఫ్-2020 ఉత్సవం కోసం 41రకాల కార్యక్రమాలను గుర్తించారు. 2020 డిసెంబరు 22న మొదలయ్యే ఈ ఉత్సవం డిసెంబరు 25న ముగుస్తుంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన భారతీయ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జయంతి రోజున మొదలై, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్.పేయి జయంతి రోజున ముగిసిపోతుంది. మన జాతి ప్రగతిలో విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక పరిజ్ఞానం పాత్ర ఎప్పటికీ కీలకపాత్ర పోషిస్తుందన్న భావనను వీరు సంపూర్ణంగా విశ్వసించారు.

 

******

 (Release ID: 1677075) Visitor Counter : 54