ఆర్థిక మంత్రిత్వ శాఖ

తమిళనాడులో ఆదాయపన్ను శాఖ సోదాలు

Posted On: 29 NOV 2020 12:55PM by PIB Hyderabad

చెన్నైలోని ఐటీ సెజ్‌ అభివృద్ధిదారు, ఆ సెజ్‌ మాజీ డైరెక్టర్‌, ప్రముఖ స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ పంపిణీదారు కేసుల్లో ఆదాయపన్ను శాఖ సోదాలు నిర్వహించింది. చెన్నై, ముంబై, హైదరాబాద్‌, కడలూరులోని 16 ప్రాంతాల్లో గత శుక్రవారం నాడు ఈ తనిఖీలు జరిగాయి.

    గత మూడేళ్లలో ఐటీ సెజ్‌ మాజీ డైరెక్టర్‌, అతని కుటుంబ సభ్యులు సంపాదించిన రూ.100 కోట్ల ఆస్తులు సహా వివిధ సాక్ష్యాలను అధికారులు కనుగొన్నారు. ఒక నిర్మాణ ప్రాజెక్టుకు సంబంధించి నకిలీ లెక్కలతో సుమారు రూ.160 కోట్లను ఐటీ సెజ్‌ అభివృద్ధిదారు స్వాహా చేసినట్లు కూడా కనుగొన్నారు. బోగస్‌ కన్సెల్టెన్సీ ఫీజు రూపంలో దాదాపు రూ.30 కోట్ల మూలధన ఖర్చులతోపాటు, అనుమతి లేని రూ.20 కోట్ల వడ్డీ ఖర్చులను సదరు సంస్థ పొందినట్లు అధికారులు తేల్చారు.

    ఐటీ సెజ్‌ అభివృద్ధిదారుకు సంబంధించిన షేర్ల కొనుగోలు లావాదేవీలు ఆదాయపన్ను శాఖ సోదాల్లో బయటపడ్డాయి. ఈ సంస్థ వాటాలను 2017-18లో దాని గత వాటాదారులు సుమారు రూ.2300 కోట్లకు విక్రయించారు. మారిషస్‌ మధ్యవర్తిత్వం ద్వారా ఇది జరిగింది. కానీ ఈ లావాదేవీల ద్వారా వచ్చిన మూలధన లాభాల గురించి ఆదాయపన్ను శాఖకు వెల్లడించలేదు.

    వాటాదారుల పరమైన మూలధన లాభాల గురించి తేల్చడానికి అధికారులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు. నగదు చెల్లింపులతో కూడిన భూ లావాదేవీలు, 'కంపల్సరీ కన్వర్టబుల్‌ డిబెంచర్స్‌' గురించి కూడా అధికారులు పరిశీలిస్తున్నారు.

    స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ పంపిణీదారుకు సంబంధించి ఆదాయపన్ను చేపట్టిన సోదాల్లో మూడు రకాల అమ్మకాలు జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. అవి.. లెక్కల్లో చూపుతున్నవి, చూపనివి, పాక్షికంగా చూపుతున్నవి. లెక్కల్లో చూపని, పాక్షికంగా చూపుతున్న అమ్మకాలు ఏటా జరుపుతున్న అమ్మకాల్లో 25 శాతానికిపైగా ఉంటున్నట్లు అధికారులు నిర్ధరించారు. ఇంకా, ఈ అసెస్సీ బృందం వివిధ ఖాతాదారులకు అమ్మకపు బిల్లులు ఇచ్చి, వాటిపై 10 శాతానికిపైగా కమీషన్‌ పొందుతున్నట్లు కూడా అధికారులు గుర్తించారు. ఆదాయపన్ను శాఖకు లెక్కచూపని ఆదాయం దాదాపు రూ.100 కోట్లు ఉంటుందని లెక్కలు వేశారు. వడ్డీకి అప్పులివ్వడం, స్థిరాస్తి అభివృద్ధి వంటి వ్యాపారాల్లోనూ ఈ అసెస్సీ బృందానికి సంబంధముంది. ఈ సంస్థలు లెక్కల్లో చూపని లావాదేవీలు, ఈ సంస్థల్లోకి వచ్చిన లెక్కచూపని పెట్టుబడులు, అప్పులు సుమారు రూ.50 కోట్లు ఉంటాయని అధికారులు అంచనా వేశారు.

    లెక్కల్లో చూపని ఆదాయం రూ.450 కోట్లకుపైగా ఉంటుందని ఇప్పటివరకు జరిగిన సోదాల్లో వెల్లడైంది. ఆదాయపన్ను విభాగం దర్యాప్తు కొనసాగుతోంది.

 

****



(Release ID: 1677027) Visitor Counter : 142