నౌకారవాణా మంత్రిత్వ శాఖ

ప్రజాభిప్రాయం కోసం మర్చంట్ షిప్పింగ్ బిల్ 2020 ముసాయిదాను విడుదల చేసిన

రేవులు,నౌకాయానం,జలమార్గాల మంత్రిత్వ శాఖ

మర్చంట్ షిప్పింగ్ చట్టం, 1958 ను రద్దు చేసి నూతన చట్టానికి రూపకల్పన

Posted On: 26 NOV 2020 3:55PM by PIB Hyderabad

ప్రజల నుంచి అభిప్రాయాలను కోరుతూ కేంద్ర రేవులు,నౌకాయానం,జలమార్గాల మంత్రిత్వ శాఖ మర్చంట్ షిప్పింగ్ బిల్ 2020 ముసాయిదాను విడుదల చేసింది. మర్చంట్ షిప్పింగ్ చట్టం, 1958 ( 1958 చట్టాలలో 44 ) మరియు కోస్టింగ్ వెస్సెల్స్ ఛట్ఠం 1838 ( 1838 చట్టాలలో 19)ల స్థానంలో నూతన చట్టాన్ని ప్రవేశపెట్టాలన్న ఉద్దేశంతో ఈ బిల్లుకు రూపకల్పన చేయడం జరిగింది. భారత నౌకాయాన రంగం మరింత అభివృద్ధి సాధించడానికి మరిన్ని అవకాశాలను కల్పించే విధంగా అమెరికా, జపాన్,సింగపూర్, ఆస్ట్రేలియా, యూకే లాంటి అభివృద్ధి చెందిన దేశాలు అనుసరిస్తున్న విధానాలను ఈ బిల్లులో పొందుపరిచారు. భారతదేశం సభ్యత్వం కలిగివున్న ఐఎంఓ సదస్సుల్లో తాజాగా తీసుకున్న నిర్ణయాలను కూడా దీనిలో పొందుపరచడం జరిగింది. నౌకలకు రక్షణ, భద్రత కల్పిస్తూ నౌకలలో పనిచేస్తున్నవారి ప్రాణాలకు రక్షణ కల్పించడానికి, సముద్ర కాలుష్యాన్ని నివారించి, సముద్ర బాధ్యతలు మరియు పరిహారాలను అందించడం మరియు అంతర్జాతీయ సమావేశాల ప్రకారం భారతదేశం యొక్క బాధ్యతలను సమగ్రంగా స్వీకరించడానికి తగిన నిబంధనలు చేర్చబడ్డాయి.
మర్చంట్ షిప్పింగ్ బిల్ 2020లో పొందుపరచిన అంశాల వల్ల ఈ కింది ప్రయోజనాలు కలుగుతాయని అంచనా వేస్తున్నారు.
*భారత నౌకలకు ఎటువంటి లైసెన్సులు అవసరం ఉండవు. దీనితో వ్యాపారం సులువుగా సాగుతుంది.

* డిజిటల్ టెక్నాలజీని అమలు చేయడం .. రిజిస్ట్రేషన్, చట్టపరమైన గుర్తింపులు, ఒప్పందాలు, రికార్డులు, లాగ్ బుక్కుల నిర్వహణ, చెల్లింపులు అంశాలలో ఎలక్ట్రానిక్ విధానాలను ఇది ప్రవేశపెడుతుంది.
*నౌకల బరువును పెంచడం మరియు నౌకను ఆస్థిగా గుర్తించడం .. ఓడల యాజమాన్యం కోసం అర్హత ప్రమాణాలను విస్తృతం చేయడం, నౌకలను బేర్ బోట్ చార్టర్ కమ్ డిమైస్ విధానంలో రిజిస్టర్ చేయడానికి అవకాశం కల్పిస్తూ రవాణా సామర్ధ్యాన్ని ఎక్కువ చేయడానికి బిల్లులో పొందుపరచిన అంశాలు వీలు కల్పిస్తాయి.
*భారత దేశ పరిధిలో అధికార పరిధి మరియు శిధిలాలకు దారితీసే పరిస్థితులను నివారించడం... ప్రతిపాదిత బిల్లు సముద్రాలలో సంఘటనలు చోటు చేసుకున్నప్పుడు తక్షణం స్పందించేలా చూడడానికి నియంత్రణ వ్యవస్థను నెలకొల్పడానికి అవకాశం కల్పిస్తూ బిల్లులో తొలిసారిగా నిబంధనలు పొందుపరచడం జరిగింది. ప్రమాదాలు లేదా ఇతర సంఘటనలు చోటు చేసుకునే సమయంలో స్పందించినప్పుడు నౌకలు పనికి రాకుండా పోయే పరిస్థితిని ఈ నిబంధనలు అరికడతాయి.
*నౌకలలో పనిచేస్తున్న సిబ్బంది, పనికిరాకుండా పోయి వదిలి వేసిన నౌకలకు రక్షణ .. అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా, వదిలివేసిన నౌకల సిబ్బందిని స్వదేశానికి రప్పించడానికి నిబంధనలు పొందుపరచబడ్డాయి.
*క్లయిముల పరిష్కారం .....నౌకలు ప్రమాదానికి గురయినప్పుడు త్వరితగతిన విచారణ పూర్తి చేసి క్లయిములను త్వరితగతిన పరిష్కరించడానికి ప్రమాదానికి గురైన నౌక లోటుపాట్లను తెలియచేయాలని హైకోర్టులు మదింపుదారులను ఆదేశించవచ్చును.
* భారతదేశ అధికారాలు ... సురక్షితంగా లేని నౌకలు మరియు సముద్ర జలాలను, పర్యావరణాన్నికలుషితంచేస్తున్న నౌకలపై చర్యలు తీసుకోవడానికి డైరెక్టర్ జనరల్ కు ఈ బిల్లు అధికారాలను కలిపిస్తుంది. నౌకల నిర్బంధ ఆదేశాలపై అప్పీల్ చేసుకోడానికి వీలు కల్పిస్తారు. కాలుష్య నివారణకు బిల్లులో ప్రాధాన్యత కల్పించారు. కాలుష్య నివారణకు ప్రమాణాలను నిర్దేశించడంతో పాటు, నిబంధనలను అతిక్రమించేవారిపై జరిమాణాలను విధించడానికి కేంద్ర ప్రభుత్వానికి అధికారం కల్పిస్తూ బిల్లులో నిబంధనలను పొందుపరిచారు.
   నౌకాయాన రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించి ఈ రంగంలో స్వావలంబన సాధించే విధంగా బిల్లుకు రూపకల్పన చేయడం జరిగింది. నౌకాయాన విద్య, శిక్షణ, సిబ్బంది నియామకం ఉపాధి అంశాలలో తగిన నియంత్రణ ఉంచడానికి మరియు భారత పతాకం కింద నౌకలను సులువుగా రిజిస్టర్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తూ బిల్లులో పొందుపరచిన నిబంధనల వల్ల నౌకాయాన రంగం అభివృద్ధి సాధించడానికి అవకాశం కలుగుతుంది. దీనివల్ల ఈ రంగంలో ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి. కేంద్రప్రభుత్వం అమలు చేస్తున్న ' ఆత్మ నిర్భర్ భారత్' కార్యక్రమం ద్వారా నౌకాయాన అనుబంధ రంగాలకు కూడా ప్రయోజనాలను వర్తింప చేయడం జరుగుతుంది.
ప్రజల నుండి అభిప్రాయాలు సలహాలను ఆహ్వానిస్తూ మర్చంట్ షిప్పింగ్ బిల్లు, 2020 ముసాయిదా జారీ చేయబడింది. దీనిని http://shipmin.gov.in/sites/default/files/Draft_MS_Bill_2020.pdf లింక్ లో చూడవచ్చును. సలహాలను 24.12.2020 నాటికి msbill2020[at]gmail[dot]com కు పంపవచ్చు.
పాలనలో పారదర్శకతను పెంచడానికి ప్రజల భాగస్వామ్యంతో అన్ని పురాతన వలస చట్టాల స్థానంలో ఆధునిక మరియు సమకాలీన అంతర్జాతీయ చట్టాలను ప్రవేశపెట్టడానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యత. ఇస్తున్నది. దీనిలో భాగంగా రేవులు,నౌకాయాన జలమార్గాల మంత్రిత్వ శాఖ ఇటీవల ప్రజల సంప్రదింపుల కోసం రెండు ముసాయిదా బిల్లులను జారీ చేసింది, నాలుగు నెలల స్వల్ప వ్యవధిలో 'ఎయిడ్స్ టు నావిగేషన్ బిల్ 2020'మరియు'కోస్టల్ షిప్పింగ్ బిల్ 2020'లను విడుదల చేసిన శాఖ తాజాగా మర్చంట్ షిప్పింగ్ బిల్ 2020' ముసాయిదా బిల్లును విడుదల చేసింది.. అంతేకాకుండా, మేజర్ పోర్ట్ అథారిటీస్ బిల్ 2020 కూడా రాజ్య సభ పరిశీలనలో ఉంది, దీనిని ఇప్పటికే గత పార్లమెంట్ సమావేశాలలో లోక్ సభ ఆమోదించింది. ఈ బిల్లులన్నీ భారతదేశాన్ని పూర్తిగా అభివృద్ధి చెందిన సముద్ర ఆర్థిక వ్యవస్థ వైపు కదిలించే తరంగాలను సృష్టించబోతున్నాయి.

***(Release ID: 1676261) Visitor Counter : 231