ప్రధాన మంత్రి కార్యాలయం
ఎంపీలకోసం బహుళ అంతస్తుల నివాసాల ప్రారంభోత్సవ సందర్భంగా ప్రధాని ప్రసంగం
Posted On:
23 NOV 2020 1:42PM by PIB Hyderabad
నమస్కార్
లోకసభ స్పీకర్ శ్రీ ఓం బిర్లాజీ, నా క్యాబినెట్ సహచరులు శ్రీ ప్రహ్లాద్ జోషీజీ, శ్రీ హర్ దీప్ పూరీ జీ, కమిటీ ఛైర్మెన్ శ్రీ సిఆర్ పాటిల్ జీ, పార్లమెంటు సభ్యులకు, సోదర సోదరీమణులారా..ప్రజాప్రతినిధులకోసం ఢిల్లీలో నిర్మించుకున్న ఈ నూతన గృహ వసతి ప్రారంభోత్సవ సందర్భంగా అందరికీ నా అభినందనలు. మన మనసుకు నచ్చే మరో శుభసందర్భం కూడా ఇదే రోజునే వచ్చింది. మృదువుగా మాట్లాడుతూ, ఎంతో నిబద్దతతో విధులు నిర్వహించే స్పీకర్ ఓమ్ బిర్లాజీ పుట్టినరోజు నేడు. ఆయనకు నా శుభాకాంక్షలు. మీరు ఆయురారోగ్యాలతో జీవిస్తూ ఈ దేశానికి సేవలందిస్తూ వుండాలని ఆ దేవున్ని నేను ప్రార్థిస్తున్నాను.
స్నేహితులారా,
గత ఏడాది నార్త్ ఎవెన్యూలో ఎంపీల గృహాలు సిద్ధమయ్యాయి. బిడి రోడ్డులోని మూడు టవర్లు కేటాయించడానికి సిద్ధమయ్యాయి.గంగా, యమున, సరస్వతి..అనే ఈ మూడు టవర్ల సంగమం ఇక్కడ నివసించే మన ప్రజాప్రతినిధులకు ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఇస్తాయని నేను భావిస్తున్నాను. ఇక్కడ నివసించే ఎంపీలు తమ విధులను నిర్వహించడానికి వీలుగా ఈ ప్లాట్లలో అన్ని సదుపాయాలను ఏర్పాటు చేయడం జరిగింది. పార్లమెంటు భవనానికి ఇవి దగ్గరగా వుండడంవల్ల ఇవి ఎంపీలకు మరింత సౌకర్యవంతంగా వుంటాయి.
స్నేహితులారా,
ఢిల్లీలో ఎంపీలకు వసతి సౌకర్యాలు ఏర్పాటు చేయడమనేది ఎన్నాళ్లనుంచో వున్న సమస్య. వసతి సదుపాయం లేకపోవడంతో పలువురు ఎంపీలను చాలా కాలంపాటు హోటళ్లలో వుంచాల్సిన పరిస్థితి ఇంతకాలం వుండేదని శ్రీ బిర్లాజీ ఇప్పుడే నాతో అన్నారు. తద్వారా ఖజానా మీద భారం పడేది. ఎంపీలుకూడా తప్పనిసరి పరిస్థితుల్లో హోటళ్లలో వుండేవారు తప్ప సరదాకుకాదు. ఈ సమస్యను పరిష్కరించడానికిగాను 2014 తర్వాత చిత్తశుద్ధితో ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. దశాబ్దాల తరబడి వున్న ఈ సమస్యలకు పరిష్కారాలను కనుగొనాలి తప్ప వాటిని పక్కనపెట్టడంవల్ల ప్రయోజనం వుండదు. ఎంపీల వసతి సౌకర్యాల సమస్యే కాదు, ఢిల్లీలోని చాలా ప్రాజెక్టులు చాలా సంవత్సరాలపాటు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా వుండేవి. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలు భవనాలను నిర్మించే పనిని మొదలుపెట్టి అనుకున్న సమయానికంటే ముందుగా పూర్తి చేయడం జరిగింది.
అటల్ బిహారీ వాజ్ పేయీ జీ ప్రభుత్వ సమయంలో అంబేద్కర్ జాతీయ స్మారక చిహ్న నిర్మాణంకోసం చర్చలు మొదలయ్యాయి. దాని నిర్మాణం కోసం చాలా సంవత్సరాలు పట్టింది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాతనే దాన్ని పూర్తి చేయడం జరిగింది. 23 ఏళ్ల పాటు వేచి చూసిన తర్వాత డాక్టర్ అంబేద్కర్ అంతర్జాతీయ కేంద్రాన్ని మా ప్రభుత్వం నిర్మించడం జరిగింది. కేంద్ర సమాచార కమిషన్ నూతన భవనాన్ని మా ప్రభుత్వమే పూర్తి చేసింది. దేశంలో యుద్ధ స్మారక చిహ్నాన్ని నిర్మించాలని దశాబ్దాల తరబడి చర్చలు జరిగాయి. మన దేశానికి చెందిన వీర సైనికులు దీనికోసం డిమాండ్ చేస్తూ ఎంతో కాలంగా ఎదురు చూశారు. దేశం కోసం పోరాటం చేసి ప్రాణ త్యాగం చేసిన అమరవీరులను తలుచుకొంటూ ఇండియా గేట్ వద్ద యుద్ధ స్మారక చిహ్నాన్ని నిర్మించిన ఘనత మా ప్రభుత్వానికే దక్కుతుంది. దేశంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం వేలాది మంది పోలీసులు తమ జీవితాలను త్యాగం చేశారు. పోలీసుల త్యాగాలను స్మరించుకునేలా జాతీయ పోలీసు స్మారక చిహ్నాన్ని మా ప్రభుత్వమే నిర్మించింది. ఇదే వరవడిలో ఎంతో కాలంగా ఎదురుచూస్తూ ఎంతో ముఖ్యమైన పనిగా పరిగణించబడిన ఎంపీల గృహాలను ఈ రోజున ప్రారంభించుకోవడం జరిగింది.మన ఎంపీల ఎదురు చూపులకు ఇప్పుడు మోక్షం లభించింది. ఈ ప్లాట్లను నిర్మించే సమయంలో పర్యావరణానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఇంధన సంరక్షణ చర్యలు చేపడుతూ నిర్మించడం జరిగింది. సౌర విద్యుత్ ప్లాంట్లు, మురికి నీటి శుద్ధి ప్లాంట్లను ఏర్పాటు చేసి హరిత భవనాలలాగా, ఆధునికంగా ఈ ప్లాట్లను నిర్మించడం జరిగింది.
స్నేహితులారా,
ఈ సందర్భంగా అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. వీటి నిర్మాణంలో పాలు పంచుకున్న లోక్ సభ స్పీకర్, లోక్ సభ కార్యాలయం, పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ, ఇంకా ఇతర విభాగాలవారికి నా అభినందనలు. మీ కృషి కారణంగానే తక్కువ సమయంలోనే ఇంత మంచి సౌకర్యాలను ఏర్పాటు చేసుకోగలిగాం. నాణ్యతను అదే సమయంలో డబ్బు ఆదా చేయడాన్ని మన లోకసభ స్పీకర్ నమ్ముతారనే విషయం మనందరికీ తెలుసు. పార్లమెంటులో ఆయన సమయాన్ని ఆదాచేస్తూ, నాణ్యమైన చర్చలుండేలా చూస్తున్నారు. ఆయనకున్న ఆ సామర్థ్యాలన్నీ ఈ ఎంపీల నివాస గృహాల నిర్మాణంలో ఎంతో పద్ధతిగా వినియోగింపపడ్డాయి. వర్షాకాల సమావేశాల్లో స్పీకర్ తన విధులను నిర్వహించిన పద్ధతి మనందరికీ గుర్తుండేవుంటుంది. కరోనా కారణంగా అనేక జాగ్రత్తలు, ప్రత్యేక ఏర్పాట్ల మధ్యన పార్లమెంట్ సమావేశాలను నిర్వహించడం జరిగింది. ఈ సమావేశాలకు సంబంధించి ప్రతి సందర్భాన్ని అధికార,ప్రతిపక్ష సభ్యులందరూ చక్కగా ఉపయోగించుకున్నారు. రెండు సభల్లో ఏర్పాటు చేసిన ప్రత్నామ్నాయ సౌకర్యాల విషయంలో అందరూ సహకరించారు. శని ఆదివారాల్లో సమావేశాలు నిర్వహించారు. అన్ని పార్టీలు సహకరించాయి.
స్నేహితులారా,
పార్లమెంటు వ్యవస్థలో పెరుగుతున్న శక్తిసామర్థ్యాల వెనక మరో ప్రధానమైన కారణం వుంది. ఒక రకంగా చెప్పాలంటే 2014నుంచి ఈ శక్తి అందడం ప్రారంభమైంది. నూతన మార్గంలో ప్రయాణం చేయాలని 2014 సమయంలో దేశ ప్రజలు భావించారు. ప్రజలు మార్పు కోరుకున్నారు. దాంతో మూడు వందలమంది మొదటిసారిగా ఎంపీలయ్యారు. మొదటిసారి ఎంపీలయినవారిలో నేను కూడా వున్నాను. ఈ 17వ లోకసభలో కూడా మొదటిసారి ఎంపీలయినవారు 260 మంది వున్నారు. అంటే నాలుగువందలమందికిపైగా ఎంపీలు మొదటిసారి ఎన్నికవ్వడంగానీ, లేదా రెండోసారి ఎన్నికవ్వడంగానీ జరిగిందన్నమాట. అంతే కాదు 17వ లోకసభకు రికార్డు స్థాయిలో మహిళా ఎంపీలు వచ్చారు. దేశ యువచైతన్యం, వారిలోని నూతన ఆలోచనలు పార్లమెంటు కార్యకలాపాల్లో ప్రతిఫలిస్తున్నాయి. ఈ కారణంగా ప్రభుత్వపాలనలో, విధివిధానాల నిర్వహణలో నూతన ఆలోచనలు, నూతన పద్ధతులు కనిపిస్తున్నాయి. అందుకోసమే నూతన భారతదేశ నిర్మాణం కోసం నేటి పార్లమెంటు ఎంతో వేగంగా నిర్ణయాలు తీసుకోగలుగుతోంది. మునపటితో పోల్చినప్పుడు గత 16వ లోకసభలో 15 శాతం అధికంగా బిల్లులు పాసయ్యాయి. ఇక 17వ లోకసభను తీసుకుంటే మొదటి సమావేశాల్లో ఆశించిన సమయంలోనే 135శాతం పని పూర్తయ్యింది. రాజ్యసభ కూడా నూటికి నూరుశాతం తన సామర్థ్యంతో పని చేసింది. గత రెండు దశాబ్దాలతో పోలిస్తే ఇది అత్యుత్తమ స్థాయి సమర్థతగా పరిగణలోకి వచ్చింది. గత శీతాకాల సమావేశంలో లోకసభ ఉత్పాదకత అనేది 110శాతంకంటే అధికం.
స్నేహితులారా,
పార్లమెంటు ఉత్పాదకత విషయంలో ఉత్పత్తుల విషయంలోను, విధానాల విషయంలోను అందరూ ఎంపీలు జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ దిశగా రాజ్యసభ, లోకసభ ఎంపీలు నూతన శిఖరాలను అధిరోహించారు. ప్రస్తుతం పార్లమెంటులో లేని ఎంపీల కృషి కూడా ఇందులో దాగి వుంది. మనం సాధించినది మీరు చూస్తున్నారు. అందరమూ కలిసి చాలా సాధించాం. గడిచిన ఒకటి ఒకటిన్నర సంవత్సరాలను తీసుకుంటే మధ్యవర్తులనుంచి రైతులకు విముక్తి కలిగించడానికిగాను కేంద్రప్రభుత్వం చాలా కృషి చేసింది. అంతే కాదు కార్మికులకు సంబంధించి చారిత్రాత్మక సంస్కరణలు తెచ్చి వారికి రక్షణ కల్పిస్తున్నాం. జమ్ము కశ్మీర్ ప్రజలను ప్రధాన జనజీవన స్రవంతిలోకి తీసుకురావడం జరిగింది. వారికి అనేక చట్టాలను వర్తింపచేశాం. మొదటిసారిగా జమ్ముకశ్మీర్ లో అవినీతికి వ్యతిరేకంగా చట్టాలను తేవడం జరిగింది.
సామాజిక అవలక్షణాలైన ట్రిపుల్ తలాఖ్ లాంటి వాటినుంచి మహిళలకు విముక్తి కలిగించాం. అదే సమయంలో అమాయకులైన బాలికలపై అత్యాచారం చేసినవారికి ఉరిశిక్ష పడేలా చూశాం. ఆధునిక ఆర్ధిక వ్యవస్థను రూపొందించడం కోసం జిఎస్టీ, దివాళా కోడ్ లాంటి ప్రధానమైన నిర్ణయాలను తీసుకొని చట్టాలను చేసి అమలు చేస్తున్నాం. అదే విధంగా ఎంతో సున్నితమైన అస్థిత్వానికి సంబంధించిన పౌరసత్వ సవరణ చట్టాన్ని పాస్ చేసుకోవడం జరిగింది. ప్రజలకు ఇచ్చిన హామీని నెరవర్చగలిగాం. ఈ విజయాలన్నీ ఈ మధ్యకాలంలో పార్లమెంటు ద్వారా సాధించిన ఉత్పత్తులు. వాటిని అమలు చేయడం కూడా ఎంతో గొప్పగా కొనసాగుతోంది. బహుశా ఈ విషయాన్ని చాలా మంది గుర్తించి వుండరు. అదేంటంటే 16వ లోకసభలో 60 శాతం బిల్లులు ఆమోదం పొందడానికి ముందు సరాసరి రెండునుంచి మూడు గంటలపాటు చర్చలు నిర్వహించాం. గత లోకసభకంటే ఎక్కువగా బిల్లులను పాస్ చేయడం జరిగింది. అంతే కాదు గతంలో కంటే ఎక్కువగా వాటిపైన చర్చలు చేశాం.
ఉత్పత్తిపైనే దృష్టి పెట్టడం కాదు, విధానాన్ని కూడా మెరుగుపరచామనడానికి ఇది నిదర్శనం. మన గౌరవనీయులైన ఎంపీల కారణంగానే ఇదంతా సాధ్యమవుతోంది. మీ వల్లనే ఇది సాధ్యమైంది. పార్లమెంటు సభ్యులందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను.
స్నేహితులారా,
సాధారణంగా చూసినప్పుడు 16-17-18 సంవత్సరాల వయస్సులో వున్న యువత, పది పన్నెండు తరగతులు చదువుతున్న ఆ యువతను తీసుకున్నప్పుడు ఆ వయస్సు అనేది వారి విషయంలో చాలా ముఖ్యం. అంతే కాదు యువ ప్రజాస్వామ్యానికి ఆ వయస్సులోని యువత అంతే ముఖ్యం. 2019 ఎన్నికలతో 16వ లోకసభ కాలం ముగిసింది. ఈ ముగింపు కాలం దేశ అభివృద్ధిలోను, ప్రగతిలోను చారిత్రాత్మకమైంది. 2019 ఎన్నికల తర్వాత 17వ లోకసభ కాలం ప్రారంభమైంది. తర్వాత లోక్ సభలో అనేక చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.వాటి ఆధారంగా అనేక చర్యలను చేపట్టడం జిగింది. దీని తర్వాత 18వ లోకసభ రాబోతుంది.నూతన దశాబ్దంలో దేశాన్ని మరింత ముందుకు తీసుకుపోవడానికిగాను రాబోయే 18వ లోకసభ ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని భావిస్తున్నాను. అందుకే నేను 16-17-18 సంవత్సరాల వయస్సు ప్రాధాన్యత గురించి మీ ముందు వుంచాను. ఈ కాలంలో సాధించడానికి మన ముందు అనేక అంశాలున్నాయి. వీటన్నటినీ మనం సాధించాల్సి వుంటుంది. ఆత్మనిర్భర్ భారత్ ఉద్యమ లక్ష్యాలు కావచ్చు, ఆర్ధికరంగానికి సంబంధించిన లక్ష్యాలు కావచ్చు, ఇంకా అలాంటి అనేక నిర్ణయాలను ఈ కాలంలో మనం సాధించాల్సి వుంది. కాబట్టి మన యువభారతదేశానికి ఈ 16, 17, 18 లోక్ సభల కాలం చాలా ముఖ్యమైంది. దేశానికి సంబంధించిన ఈ ముఖ్యమైన సమయంలో భాగమైనందుకు మనం ఎంతో అదృష్టవంతులం. దేశాభివృద్ధిలో సువర్ణ అధ్యాయంగా నిలిచేలా ఈ సమయాన్నీ తీర్చిదిద్దడమనేది మనందరి ఉమ్మడి బాధ్యత. పార్లమెంటు చరిత్రను అధ్యయనం చేసినప్పుడు ఈ సమయం సువర్ణ అధ్యాయంగా నిలిచేలా మనం చూడాలి.
స్నేహితులారా, మన పెద్దలు చెప్పారు “क्रियासिद्धि: सत्वेभवति महताम् नोपकरणे”
దీని అర్థం మన వాస్తవ తీర్మానాలు, సంకల్పాలు మన కర్మకు కారణమవుతాయి.
ఈ రోజున మనకు వనరులున్నాయి. దృఢమైన సంకల్పబలముంది. మన తీర్మానాలను అమలు చేయడానికిగాను మనం మరింత శ్రమించాలి. అప్పుడే మనం త్వరగా, గణనీయస్థాయిలో లక్ష్యాలను సాధించగలుగుతాం. 130 కోట్ల మంది భారతీయుల కలల్ని సాకారం చేసుగోలమని, స్వయం సమృద్ధ భారతదేశ లక్ష్యాలను అందుకోగలమని నాకు నమ్మకంగా వుంది. ఈ ఆకాంక్షలతో, మరో సారి మీకు అభినందనలు తెలియజేస్తున్నాను.
అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.
......
గమనిక : ప్రధాని ప్రసంగానికి దాదాపుగా చేసిన అనువాదమిది. ప్రధాని అసలు ప్రసంగం హిందీభాషలో కొనసాగింది.
(Release ID: 1675255)
Visitor Counter : 250
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam