సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

‘ది రిప‌బ్లిక‌న్ ఎథిక్ వాల్యూమ్ III’, ‘లోక్ తంత్ర్ కే స్వ‌ర్’ ఇ-పుస్త‌కాల‌ను ఆవిష్క‌రించిన‌ కేంద్ర మంత్రి శ్రీ ప్రకాశ్ జావడేకర్

Posted On: 19 NOV 2020 5:42PM by PIB Hyderabad

కేంద్ర స‌మాచార‌, ప్ర‌సార శాఖ మంత్రి శ్రీ ప్రకాశ్ జావ‌డేక‌ర్ ఈ రోజు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రసంగాల రెండు సంపుటాలు.. ‘ది రిప‌బ్లిక‌న్ ఎథిక్ వాల్యూమ్ III, ‘లోక్ తంత్ర్ కే స్వ‌ర్’ ఇ-బుక్ వెర్ష‌న్ ల‌ను ఆవిష్క‌రించారు.

ఈ సంద‌ర్భంలో మంత్రి స‌భికుల‌ను ఉద్దేశించి ప్ర‌సంగిస్తూ, ‘‘భార‌తదేశ రాష్ట్రప‌తి వివిధ అంశాల‌పై ప్రేర‌ణ‌దాయ‌క‌మైన ప్ర‌సంగాలు ఎన్నో చేశారు.  ఈ పుస్త‌కంలోని అన్ని ప్ర‌సంగాలు ఈ దేశ ఆత్మ‌విశ్వాసానికి అద్దం ప‌డుతున్నాయి.  ఈ పుస్త‌కంలో కొవిడ్‌-19 తో పోరాడ‌టానికి దేశం చేసిన కృషికి సంబంధించిన ఉప‌న్యాసాలు ఉన్నాయి.  కొవిడ్‌-19 తో జ‌రుగుతున్న పోరులో భార‌త‌దేశం ఇత‌ర దేశాల‌కన్నా ఎంతో చ‌క్క‌ని ఫ‌లితాల‌ను సాధిస్తోంది.  భార‌త‌దేశం త‌న స‌రిహ‌ద్దుల‌ను కాపాడుకోవ‌డంలో ధైర్య‌సాహ‌సాల‌ను క‌న‌బ‌రుస్తోంది.  ఈ పుస్త‌కం అంద‌రికీ ఒక సంప్ర‌దింపు గ్రంథంగా ఉంటుంది’’ అని పేర్కొన్నారు.

ఈ పుస్తకం అస‌లు ప్ర‌తి న‌మూనాల‌ను కేంద్ర ర‌క్ష‌ణ మంత్రి శ్రీ రాజ్ నాథ్ సింహ్ ఆవిష్క‌రించారు.  శ్రీ రాజ్ నాథ్ సింహ్ ఈ పుస్త‌కాన్ని గురించి మాట్లాడుతూ, రాష్ట్రప‌తి శ్రీ రామ్ నాథ్ కోవింద్ త‌న మ‌న‌స్సుపొర‌ల‌లో నుంచి చేసిన ప్ర‌సంగాలు ఈ పుస్త‌కంలో ఉన్నాయ‌ని పేర్కొన్నారు.

ఈ పుస్త‌కం అన్ని ప్ర‌ధాన ఇ-కామ‌ర్స్ వేదిక‌ల‌లో ల‌భ్యమ‌వుతుంది.

ఈ పుస్త‌కాన్ని గురించిన వివ‌రాలు:

ది రిప‌బ్లిక్ ఎథిక్, మూడో సంపుటి భార‌త‌దేశ రాష్ట్రప‌తి శ్రీ రామ్‌నాథ్ కోవింద్ త‌న అధ్య‌క్ష ప‌ద‌వీకాలంలోని మూడో సంవ‌త్స‌రంలో చేసిన ప్ర‌సంగాల‌లో నుంచి కొన్ని ఎంపిక చేసిన ప్ర‌సంగాల సేక‌ర‌ణ‌గా ఉంది.

ఎనిమిది భాగాలుగా విభ‌జించిన ఈ సంపుటిలో 57 ఉప‌న్యాసాలు ఉన్నాయి.  ముందుచూపుతో కూడిన దిన‌దిన ప్ర‌వ‌ర్థ‌మాన‌మ‌వుతున్న ఒక ‘న్యూ ఇండియా’ ను ఆవిష్క‌రించ‌డం గురించి, అలాగే త‌న చారిత్ర‌క‌, సాంస్కృతిక విలువ‌ల బ‌ల‌మైన పునాదుల పైన ప్ర‌తిష్ట‌త‌మ‌వుతున్న ‘న్యూ ఇండియా’ ను గురించి శ్రీ రామ్‌నాథ్ కోవింద్ ఆలోచ‌న‌లను, దార్శ‌నిక‌తను ఈ సంపుటి ప్ర‌తిబింబిస్తోంది.

న్యాయం, స‌మాన‌త్వం, సోద‌ర‌భావం, అహింస‌, విశ్వ సౌభ్రాతృత్వం, స‌మ్మిళిత వృద్ధి, స‌మాజంలో బ‌ల‌హీన‌వ‌ర్గాల ప‌ట్ల ప్ర‌త్యేక చింత‌న‌.. ఇవ‌న్నీ ఆయ‌న ఉప‌న్యాసాల‌లో ప‌దే ప‌దే చోటుచేసుకొన్నాయి.  21వ శ‌తాబ్దానికి చెందిన ఒక హుషారైన భార‌త‌దేశం ఏ విధంగా రూపుదిద్దుకోవాలో అనే అంశం పై రాష్ట్రప‌తి గారి మ‌నోభావాలు ఈ పుస్త‌కంలో న‌మోద‌య్యాయి.

కొవిడ్‌-19 మ‌హ‌మ్మారి కార‌ణంగా ప్ర‌పంచం స్త‌బ్ద‌‌త‌కు లోనైన నేప‌థ్యంలో సార్వ‌జ‌నిక కార్య‌క్ర‌మాల‌లో పాల్గొని ప్ర‌సంగించేందుకు రాష్ట్రప‌తికి అవ‌కాశాలు అంత‌గా ల‌భించ‌లేదు.  ఆ త‌ర‌హా క‌ష్ట‌కాలాల‌లో కూడా రాష్ట్రప‌తి శ్రీ కోవింద్ ఇత‌రుల‌కు ఒక ఉదాహ‌ర‌ణ‌గా మెలిగారు.  రాష్ట్రప‌తి భ‌వ‌న్ కే ప‌రిమితం అయిన‌ప్ప‌టికీ ఆయ‌న ‘‘స‌రికొత్త ప‌రిస్థితుల’’‌లో ఒక వ్య‌క్తి ఏ విధంగా దేశానికి తోడ్పాటును అందించ‌వ‌చ్చు, పొదుపులు పాటిస్తూ ప్ర‌కృతితో అనుకూల భావ‌న క‌లిగి ఏ విధంగా వ్య‌వ‌హ‌రించ‌వ‌చ్చు అనే అంశాల‌ను చాటి చెప్పారు.  

ఈ పుస్త‌కం ఇద్ద‌రు మ‌హ‌నీయులు.. గౌత‌మ బుద్ధుడు మ‌రియు మ‌హాత్మ గాంధీ ల‌ను గురించి ఆయ‌న ఆలోచ‌న‌లు, అలాగే వారి బోధ‌న‌ల‌కు ఉన్న ప్రాముఖ్యం, గురించి వివరించే ఒక ప్ర‌త్యేక అధ్యాయం కూడా ఉంది.  గాంధేయ ఆద‌ర్శాల‌ను న‌మ్మే రాష్ట్రప‌తి మాన‌వాళి త‌న ఇక్క‌ట్ల బారి నుంచి బ‌య‌ట ప‌డ‌టంలో మ‌హాత్ముడు ప్ర‌వచించిన నైతిక దిక్సూచి ప‌ట్ల త‌న ప్ర‌గాఢ విశ్వాసాన్ని వ్య‌క్తం చేశారు.  ప్ర‌పంచం మ‌హాత్మ గాంధీ 150వ జ‌యంతిని జ‌రుపుకొంటున్న వేళ ఇది 2019-20లో మ‌రింత సంద‌ర్భోచితంగా మారిపోయింది.  
 
ఈ ప్ర‌సంగాలు రాష్ట్రప‌తి దృష్టిలో ప్ర‌పంచం ఎలా ఉండాలన్న దానిని సూచించ‌డంతో పాటు, ఆయ‌న విశ్వ‌సించే సిద్ధాంతాల అంత‌ర్ దృష్టిని కూడా వివ‌రిస్తాయి.



 

***



(Release ID: 1674083) Visitor Counter : 179