సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్

కోవిడ్ పై పోరుకు ఎం.ఎస్.ఎం.ఇ. టెక్నాలజీ ఆధారిత చర్యలు

అత్మనిర్భర భారత్, మేక్ ఇన్ ఇండియా నినాదాలే స్పూర్తి
హ్యాండ్ శానిటైజర్లతో సహా పలు వైద్య పరికరాల
ధరలు తగ్గడానికి దోహదపడిన చర్యలు

Posted On: 19 NOV 2020 12:08PM by PIB Hyderabad

కోవిడ్-19 వైరస్ విసిరిన సవాలును ఎదుర్కొనేందుకు కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థల (ఎం.ఎస్.ఎం.ఇ.) మంత్రిత్వ శాఖ పలు చర్యలు తీసుకుంది. ఆత్మనిర్భర భారత్, మేక్ ఇన్ ఇండియా పేరిట ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపు మేరకు సాంకేతిక పరిజ్ఞాన ఆధారితమైన ఈ చర్యలు తీసుకున్నారు. మంత్రిత్వ శాఖ చొరవతో,  డిమాండుకు తగినన్ని హ్యాండ్ శానిటైజర్ బాటిల్ పంపులను దేశం ఉత్పత్తి చేయగలిగింది. వాటిని ఎగుమతి చేయగలిగే స్థాయికి కూడా చేరుకుంది. చేతుల పరిశుభ్రతకు వినియోగించే హ్యాండ్ శానిటైజర్ల (లిక్విడ్/జెల్) ఉత్పాదనలో స్వయం సమృద్ధిని సాధించడానికి మంత్రిత్వ శాఖ చర్యలు ఎంతగానో దోహపడ్డాయి. కోవిడ్ నిరోధక మందుజాగ్రత్త చర్యలకు ఉపయోగపడే మాస్కులు, ఫేస్ షీల్డులు, వ్యక్తిగత రక్షణ కిట్లు(పి.పి.ఇ.కిట్లు), శానిటైజర్ బాక్స్, పరీక్షా నిర్వహణా సదుపాయాల రూపకల్పనకు కూడా ఈ చర్యలు వీలు కలిగించాయి. ఈ ఉత్పాదనల తయారీకి ఎం.ఎస్.ఎం.ఇ. బృందాలు తీసుకున్న చొరవపట్ల కేంద్ర ఎం.ఎస్.ఎం.ఇ. శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అభినందనులు తెలిపారు.

 

హ్యాండ్ శానిటైజర్ బాటిల్ డిస్పెన్సర్ (పంపు):

  కోవిడ్ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో హ్యాండ్ శానిటైజర్లకు, శానిటైజర్ బాటిళ్లకు ఉన్నట్టుండి గిరాకీ పెరిగిపోయింది. అందుకు తగినట్టుగా బాటిల్ డిస్పెన్సర్ పంపులకు కూడా డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఇలాంటి పంపులు రోజుకు 50లక్షల వరకూ అవసరమయ్యాయి. కోవిడ్ సంక్షోభం తలెత్తక ముందు వీటి ఉత్పత్తి రోజుకు 5లక్షలు మాత్రమే. కొత్తగా ఏర్పడిన గిరాకీని తట్టుకునేందుకు భారీ సంఖ్యలో బాటిల్ డిస్పెన్సర్లను చైనానుంచి దిగుమతికి చేసుకునేందుకు తొలుత ఏర్పాట్లు చేశారు. అయితే,..విదేశాలనుంచి వీటి సరఫరా వ్యవస్థ పూర్తిగా విచ్ఛిన్నమైంది. దీనితో వీటి ధర కూడా విపరీతంగా పెరిగి, ఒక్కొక్క డిస్పెన్సర్ ధర 30 రూపాయలకు చేరింది. ఫలితంగా భారతీయ మార్కెట్లో శానిటైజర్ల ధరలు కూడా పెరిగాయి.

 

• శానిటైజర్ల్ బాటిల్ డిస్పెన్సర్ అనేది ఓ ప్లాస్టిక్ పరికరం. శానిటైజర్ లిక్విడ్, లేదా జెల్ ను బయటికి చిమ్మడానికి, బాటిల్ ను మూసిఉంచడానికి ఒక మూత దీనికి అమర్చి ఉంటుంది.

• డిస్పెన్సర్ 3 రకాలుగా ఉండవచ్చు. చిమ్మడానికి ఉపయోగపడే స్ప్రే, జెల్ ను చిమ్మడానికి ఫ్లిప్ క్యాప్, లిక్విడ్ ను చిమ్మడానికి క్యాప్..ఇలా 3 రకాలుగా డిస్పెన్సర్ ఉంటుంది.

• డిస్పెన్సర్ అనేది 11 చిన్నచిన్న విడిభాగాల అమరికతో ఉంటుంది. వీటిలో బాల్, స్ప్రింగు, ట్యూబు వంటివి మినహా మిగతా విడిభాగాలన్నీ ఇన్.జెక్షన్ మౌల్టింగ్ యంత్రాల సహాయంతో తయారవుతాయి.

• డిస్పెన్సర్ పంపు సరిగా పనిచేయాలంటే అన్ని విడిభాగాలను సక్రమంగా అమర్చడమే కీలకం. మరో వైపు విడిభాగాల ఆటోమేటిక్ అమరిక చాలా ఖర్చుతో కూడుకున్న పని.

• వేగంగా అమ్ముడుపోయే వినియోగ వస్తువుల (ఎఫ్.ఎం.సి.జి.) రంగంలో ఇలాంటి డిస్పెన్సర్ల వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఇదివరకే కుదిరిన ఒప్పందం ప్రకారం, డిస్పెన్సర్ల తయారీదార్లు కూడా ఎఫ్.ఎం.సి.జి. రంగానికే దీర్ఘకాలం డిస్పెన్సర్లను సరఫరా చేయాల్సి ఉంటుంది. దీనితో కోవిడ్ మహమ్మారి వ్యాప్తి జరిగిన తొలి రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా తక్కువ సామర్థ్యంతో పరిమితంగా మాత్రమే శానిటైజర్ల విభాగానికి డిస్పెన్సర్లు సరఫరా అయ్యేవి.

ఎం.ఎస్.ఎం.ఇ. మంత్రిత్వ శాఖ చర్యలు:

  2020 మే నెల ప్రారంభంలో డిస్పెన్సర్ల కొరత తీవ్రతను అర్థంచేసుకున్న ఎం.ఎస్.ఎం.ఇ. మంత్రిత్వ శాఖ కార్యదర్శి పలు దఫాలుగా మంత్రిత్వ శాఖ అధికారులతో సహా వివిధ భాగస్వామ్య వర్గాలతో సమావేశాలు జరిపారు. టెక్నాలజీ సెంటర్లు, టూల్ రూమ్స్ ప్రతినిధులతో కూడా భేటీ అయ్యారు. అఖిల భారత ప్లాస్టిక్ తయారీదార్ల సంఘం, అఖిల భారత వైద్య పరికరాల తయారీదార్ల సంఘం తదితర ప్రతినిధివర్గాలతో కూడా చర్చించారు. స్థానికంగా, స్వదేశీయంగా డిస్పెన్సర్ల తయారీకి గల అవకాశాలను తెలుసుకునేందుకు ఈ సమావేశాలు జరిపారు. ప్రైవేటు రంగం తయారీదార్లు తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని విస్తరించుకునేలా వారికి దిశానిర్దేశం చేశారు. అయితే, అకస్మాత్తుగా ఉత్పత్తిని పెంచడం సాధ్యంకాదని అర్థమైంది. డిస్పెన్సర్లను తయారుచేసేందుకు అవసరమైన అచ్చులు దేశంలో అందుబాటులో లేకపోవడమే ఇందుకు కారణం. ఇప్పటివరకూ వీటిని పరిశ్రమ వర్గాలు దిగుమతి చేసుకుంటూ వస్తున్నాయి.

టెక్నాలజీ సెంటర్లకు ఎం.ఎస్.ఎం.ఇ.మంత్రిత్వ శాఖ ప్రేరణ:

• దేశంలో డిస్పెన్లర్ల కొరత సంక్షోభాన్ని దీటుగా ఎదుర్కొనేలా టెక్నాలజీ సెంటర్లకు తగిన ప్రేరణ కలిగించారు. డిస్పెన్సర్ల విడిభాగాల తయారీకి 7రకాల అచ్చులు లేదా మౌల్డులు అవసరమవుతాయి.

• వివిధ రకాల ఉత్పాదనలకోసం రూ. 26కోట్ల రూపాయల యంత్రపరికరాల కొనుగోలుకు అవసరమైన గ్రాంటును టెక్నాలజీ సెంటర్లకు  మంత్రిత్వ శాఖ అనుమతించింది

• మల్టీ కేవిటీ అచ్చులను తయారుచేయాలన్న సవాలును టెక్నాలజీ సెంటర్లు కూడా స్వీకరించాయి.

• తయారీలో కాలయాపన జరగరాదన్న ఉద్దేశంతో ఏడు రకాల అచ్చుల రూపకల్పన  బాధ్యతను పలు టెక్నాలజీ సెంటర్లకు పంపిణీ చేశారు. (అహ్మదాబాద్, లూధియానా, ఔరంగాబాద్, జంషెడ్ పూర్, హైదరాబాద్, ముంబై నగరాల్లోని టెక్నాలజీ సెంటర్లకు ఈ పనిని అప్పగించారు.)

ఫలితం:

• శానిటైజర్ పంపులకు సంబంధించి రెండు సెట్ల అచ్చుల తయారీకోసం అవసరమైన నమూనాలను టెక్నాలజీ సెంటర్లు పారిశ్రామిక వర్గాలకు అందజేశాయి.

• 30మిల్లీమీటర్లు, 24 మిల్లీమీటర్ల వ్యాసంతో ఫ్లిప్ క్యాప్ అచ్చుల నమూనాలను లూధియానాలోని టెక్నాలజీ సెంటర్ రూపొందించింది.

•దీనితో స్ఫూర్తిని పొందిన ప్రైవేటు సంస్థలు కూడా అచ్చుల తయారీలో విరివిగా పాలుపంచుకుంటున్నాయి

దేశవ్యాప్త ప్రభావం:

• ఎం.ఎస్.ఎం.ఇ. మంత్రిత్వశాఖ తీసుకున్న చర్యలతో డిస్పెన్సర్ల తయారీలో స్వయం సమృద్ధిని దాదాపుగా సాధించగలిగాం.

• ఇప్పటికే రోజుకు దాదాపు 40లక్షల మేర డిస్పెన్సర్లు తయారవుతున్నాయి.

• 2020 ఏప్రిల్- మే నెలల్లో దాదాపు 30 రూపాయల వరకూ ఉన్న వీటి ధర ఇపుడు ఐదున్నర రూపాయలకు తగ్గిపోయింది.

•  డిస్పెన్సర్ల తయారీని మంత్రిత్వ శాఖ ప్రారంభించాయి. ఇప్పటికే అవి అదనపు నిల్వలు కూడా సమకూర్చుకుని ఉండవచ్చు.

• అఖిల భారత ప్లాస్టిక్ తయారీ దార్ల సంఘం (ఎ.ఐ.పి.ఎం.ఎ.)తో జరిపిన చర్చల్లో అందిన సమాచారం ప్రకారం, ఇపుడు రోజుకు 50లక్షలకుపైగా డిస్పెన్సర్లను వినియోగిస్తున్నారు. (జనం ఇపుడు రీఫిల్ ప్యాక్ లను కూడా కొనుగోలు చేస్తున్నారు).

ప్రస్తుతం ఎగుమతికి సిద్ధం:

• మొదట్లో స్ప్రే పంపుతో కూడిన శానిటైజర్ల ఎగుమతిపై దేశంలో నిషేధం ఉండేది. ఇపుడు ఆ నిషేధాన్ని ఎత్తివేశారు. అంటే,.స్ప్రే సంపుతో కూడిన శానిటైజర్లను పూర్తిస్థాయిలో ఎగుమతి చేయగలిగే స్థాయికి మనం చేరుకున్నామన్నమాట.

హ్యాండ్ శానిటైజర్ల తయారీకి అవసరమైన వస్తువుల తయారీలో స్వయంసమృద్ధి:

  హ్యాండ్ శానిటైజర్ల తయారీకి అవసరమైన లిక్విడ్, జెల్ తయారీలో దేశం స్వయంసమృద్ధిని సాధించేందుకు ఎం.ఎస్.ఎం.ఇ. మంత్రిత్వ శాఖ పలు చర్యలు తీసుకుంది. సహజంగా సువాసనను వెదజల్లే ఆయుర్వేద, కాస్మెటిక్ శానిటైజర్లను రూపొందించడంతో పాటు, శానిటైజర్ పనితీరుపై పరీక్షా సదుపాయాలను కూడా మంత్రిత్వ శాఖ నెలకొల్పింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి:

• కోవిడ్-19 వైరస్ వ్యాప్తి నేపథ్యంలో హ్యాండ్ శానిటైజర్లకు గిరాకీ విపరీతంగా పెరిగిపోయింది. శానిటైజర్ల మార్కెట్ చిల్లర ధర కూడా అత్యధిక స్థాయికి పెరిగి, వాటికి తీవ్రమైన కొరత ఏర్పడింది. దీనితో శానిటైజర్ల తయారీ లైసెన్సింగ్ ప్రక్రియను భారత ప్రభుత్వం సరళీకరించింది. శానిటైజర్ల తయారీని ప్రారంభించేలా,..చక్కెర కర్మాగారాలు, డిస్టిల్లరీలు, ఎం.ఎం.సి.జి. రంగాలకు ప్రభుత్వం గట్టి ప్రోత్సాహం అందించింది.

• శానిటైజర్ తయారీకోసం శానిటైజర్, ఆల్కహాల్ లైసెన్సును తీసుకోవలసిందిగా ఎం.ఎస్.ఎం.ఇ. మంత్రిత్వ శాఖ,.. కనూజ్ లోని తన టెక్నాలజీ సెంటర్ ను ఆదేశించింది. ఫ్రాగ్రన్స్ అండ్ ఫ్లేవర్ డెవలప్మెంట్ సెంటర్ (ఎఫ్.ఎఫ్.డి.సి.) అనే ఈ టెక్నాలజీ సెంటర్,.. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యు.హెచ్.ఒ.) ప్రమాణాలకు తగినట్టుగా శానిటైజర్ రూపొందించి, తయారు చేసింది. కనూజ్, దాని పరిసర ప్రాంతాల ఆరోగ్య రక్షణ వ్యవస్థలకు ఈ శానిటైజర్లను సరఫరా చేశారు. 

• శానిటైజర్ల ప్యాకేజింగ్ శ్రేణిని, ఇతర పరికరాల కొనుగోలుకు అవసరమైన నిధులను ఎం.ఎస్.ఎం.ఇ. మంత్రిత్వ శాఖ,.. ఎఫ్.ఎఫ్.డి.సి.కి అందించింది. శానిటైజర్ల ధరల ఖరారు విషయంలో జాతీయ ఔషధ ధరల నిర్ణాయక సంస్థ (ఎన్.పి.పి.ఎ.) మార్గదర్శక సూత్రాలను ఎఫ్.ఎఫ్.డి.సి. అనుసరించింది.

• ఎఫ్.ఎఫ్.డి.సి. సంస్థ 90వేల బాటిళ్లు, 400 క్యాన్లకు పైగా హ్యాండ్ శానిటైజర్ ను విక్రయించింది. ఉత్తర రైల్వేతో సహా వివిధ బ్యాంకులకు, పలు ప్రభుత్వ సంస్థలకు శానిటైజర్ ను సరఫరా చేసింది.

• శానిటైజర్ పనితీరును పరీక్షించే సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేసి, ప్రారంభించారు. దీనికి తోడు,. ఆయుర్వేద, కాస్మెటిక్ శానిటైజర్ ను సహజసిద్ధమైన సువాసనలతో రూపొందించారు. (కేంద్ర శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధనా మండలి పరిధిలో,.. లక్నోకు చెందిన జాతీయ వృక్ష శాస్త్ర పరిశోధనా సంస్థ దీన్ని పరీక్షిస్తోంది).

• ప్రస్తుతం దేశంలో శానిటైజర్ తయారీకి అవసరమైన వస్తువులు పూర్తిగా అందుబాటులో ఉన్నాయి.

3. ఇతర ఉత్పత్తులు:

I. యు.వి. శానిటైజర్ బాక్సులకు ఇప్పటికే రూపకల్పన జరిగింది. రామ్ నగర్ టెక్నాలజీ సెంటర్ లో వాటిని తయారు చేస్తున్నారు. అవసరమైన డిజైన్ ను కూడా ఇప్పటికే అందించారు. 

II. ఎం.ఎస్.ఎం.ఇ. మంత్రిత్వ శాఖకు చెందిన టెక్నాలజీ సెంటర్ ఇప్పటికే ఫేస్ షీల్డుల, మాస్కుల తయారీని ప్రారంభించింది. కె.వి.ఐ.సి. కూడా మాస్కుల తయారీ మొదలు పెట్టింది. దేశంలో ఫేస్ షీల్డులు, మాస్కుల కొరత తీవ్రంగా నెలకొన్న తరుణంలో వీటి తయారీ ప్రక్రియ మొదలైంది.. ఇపుడు మాస్కుల తయారీలో దేశం స్వయంసమృద్ధిని సాధించింది.

III. అలాగే,.. వైరస్ నిరోధంకోసం శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే వ్యక్తిగత రక్షణ సూటుకు (పి.పి.ఇ.కి)  చెన్నైలోని టెక్నాలజీ సెంటర్ రూపకల్పన చేసింది. టేప్ సీలింగ్ యంత్రం సహాయంతో ఈ సూటుకు రూపకల్పన చేశారు.

IV. పి.పి.ఇ. కిట్ పై బ్లడ్ పెనెట్రేషన్ టెస్టింగ్ ప్రక్రియ కోసం ఉపయోగించే పరికరాన్ని మీరట్  టెక్నాలజీ సెంటర్ రూపొందించింది. అలాగే,..చేతులకు వేసుకునే తొడుగులు, శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే పి.పి.ఇ. కిట్ల సామర్థ్యంపై పరీక్ష జరిపే సదుపాయాలను ఒఖ్లా టెక్నాలజీ సెంటర్ లో మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది.  

*****



(Release ID: 1674070) Visitor Counter : 269