ప్రధాన మంత్రి కార్యాలయం
బెంగళూరు టెక్ సమిట్ ను ప్రారంభించిన ప్రధాన మంత్రి
సమాచార యుగం లో, మొదట గా ప్రవేశించడం కాదు ముఖ్యం, ఉత్తమమైన విధంగా ఎవరు తరలివచ్చారన్నదే ప్రధానం: ప‌్రధాన మంత్రి
భారతదేశం లో రూపుదిద్దుకొన్నవే అయినప్పటికీ ప్రపంచ సేవల కోసం వినియోగించే సాంకేతిక విజ్ఞాన సంబంధ పరిష్కారాలకు ఇదే తరుణం: ప‌్రధాన మంత్రి
Posted On:
19 NOV 2020 12:16PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న బెంగళూరు లో టెక్ సమిట్ ను వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభించారు. ఈ శిఖర సమ్మేళనాన్ని కర్నాటక ఇన్నోవేషన్ ఎండ్ టెక్నాలజీ సొసైటీ (కెఐటిఎస్), కర్నాటక ప్రభుత్వ విజన్ గ్రూప్ ఆన్ ఇన్ పర్ మేశన్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ ఎండ్ స్టార్ట్-అప్, సాఫ్ట్ వేర్ టెక్నాలజీ పార్క్ స్ ఆఫ్ ఇండియా (ఎస్‌టిపిఐ), ఎమ్ఎమ్ యాక్టివ్ సై-టెక్ కమ్యూనికేశన్స్ లతో కలసి కర్నాటక ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ‘‘నెక్స్‌ట్ ఈజ్ నౌ’’ అనేది ఈ సంవత్సర శిఖర సమ్మేళనం ఇతివృత్తంగా ఉంది. ఈ కార్యక్రమం లో ఇలెక్ట్రానిక్స్ & ఐటి, కమ్యూనికేశన్స్, చట్టం & న్యాయం శాఖ కేంద్ర మంత్రి శ్రీ రవి శంకర్ ప్రసాద్, కర్నాటక ముఖ్యమంత్రి శ్రీ బి.ఎస్. యడియూరప్ప లు కూడా పాల్గొన్నారు.
ప్రస్తుతం డిజిటల్ ఇండియా ను ఇక ఎంతమాత్రం ప్రభుత్వ సాధారణ కార్యక్రమం గా చూడటం లేదని, అంతకంటే అది ఒక జీవన మార్గంగా, మరీ ముఖ్యం గా పేదలకు, ఆదరణ కు నోచుకోని వర్గాల వారికి సంబంధించిన, అలాగే ప్రభుత్వం లో ఉన్న వర్గాల వారి కి జీవన మార్గంగా మారిపోయిందని ప్రధాన మంత్రి చెప్తూ, అందుకు సంతోషాన్ని వ్యక్తం చేశారు.
టెక్ సమిట్ ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, డిజిటల్ ఇండియా వల్ల, మన దేశం అభివృద్ధి ప్రయాణం లో మానవులకు మరింత ప్రాముఖ్యం కట్టబెట్టే విధానానికి సాక్షీభూతంగా నిలచిందన్నారు. సాంకేతిక విజ్ఞానాన్ని అత పెద్ద ఎత్తున ఉపయోగించడం పౌరులకు అనేక మార్పులను తీసుకు వచ్చిందని, ఫలితాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని ఆయన చెప్పారు. ప్రభుత్వం డిజిటల్ పరిష్కార మార్గాలకు, సాంకేతిక విజ్ఞాన సంబంధ పరిష్కార మార్గాలకు ఒక విపణి ని సృష్టించడం ఒక్కటే కాకుండా, దానిని అన్ని పథకాల లో ఒక ముఖ్య భాగం గా కూడా చేసిందని ఆయన అన్నారు. తన ప్రభుత్వ నమూనా లో సాంకేతికత కు ప్రాధాన్యాన్ని ఇవ్వడం జరుగుతోందని, సాంకేతిక విజ్ఞానం ద్వారా మానవుల గౌరవం ఇనుమడించిందన్నిరు. కోట్ల కొద్దీ రైతులు ఒక క్లిక్ ద్వారా నగదు సాయాన్ని అందుకొంటున్నారని, ప్రపంచంలో అతి పెద్ద ఆరోగ్య సంరక్షణ పథకం అయిన ‘ఆయుష్మాన్ భారత్’ ను విజయవంతంగా నిర్వహించడం జరుగుతోందంటూ ఆయన ప్రస్తావించారు. సాంకేతిక విజ్ఞానం భారతదేశం లో పేద ప్రజలు లాక్ డౌన్ శిఖర స్థాయి లో ఉన్న కాలంలో కూడా సరైన సాయాన్ని, సత్వరమే అందుకొనేందుకు పూచీ పడిందని ఆయన నొక్కి చెప్పారు. ఇంత పెద్ద ఎత్తున జరిగిన ఈ సహాయానికి సాటి రాగలిగినవి మరేవీ లేవని ఆయన అన్నారు.
డాటా ఎనలిటిక్స్ శక్తి ని ప్రభుత్వం మెరుగైన సేవల వితరణకు, ఆయా సేవలను సమర్థంగా అందించడానికి గాను వినియోగించుకొందని ప్రధాన మంత్రి అన్నారు. మా పథకాలు ఫైళ్ళలో నుంచి బయటపడి, ప్రజల జీవితాలను అంత త్వరగానూ, అంత పెద్ద ఎత్తున మార్చివేశాయంటే అందుకు ముఖ్య కారణం సాంకేతికత అని ఆయన వ్యాఖ్యానించారు. సాంకేతిక విజ్ఞానం కారణంగానే మనం అందరికీ విద్యుత్తు ను సమకూర్చగలగడంతో పాటు దారి సుంకం కేంద్రాలను శీఘ్ర గతి న దాటి పోగలుగుతున్నామని, తక్కువ కాలంలో విస్తారమైన జనాభా కు టీకా మందు ఇప్పించగలమన్న విశ్వాసాన్ని కూడా సాంకేతిక విజ్ఞానం మనకు అందిస్తోందని ఆయన అన్నారు.
మహమ్మారి కాలం లో సాంకేతిక రంగం తన ప్రతిఘాతుకత్వాన్ని కనబరచినందుకుగాను ప్రధాన మంత్రి ప్రశంసలు కురిపించారు. ఒక దశాబ్ద కాలంలో గాని చోటుచేసుకోలేనంతటి సాంకేతిక విజ్ఞాన అనుసరణ, కొన్ని నెలల వ్యవధిలోనే సాధ్యపడింది అంటూ ఆయన ప్రముఖంగా ప్రకటించారు. ఎక్కడి నుంచైనా పని చేయడం అనే ధోరణి ఒక నియమం గా మారిపోయింది, ఇది ఇక మీదట కూడా కొనసాగుతుంది అని ఆయన అన్నారు. విద్య, వైద్యం, వస్తువుల కొనుగోలు మొదలైన రంగాలలో విరివిగా సాంకేతికత ను అనుసరించడాన్ని గమనించవచ్చని ఆయన అన్నారు.
పారిశ్రామిక యుగం లో నమోదైన కార్య సాధనలు గడచిపోయిన కాలానికి సంబంధించినవి, ప్రస్తుతం మనం సమాచార యుగం మధ్య దశ లో ఉన్నాం అని ప్రధాన మంత్రి అన్నారు. పారిశ్రామిక యుగం లో, మార్పు అనేది ఒకే వరుస లో చోటుచేసుకొంది. కానీ సమాచార యుగం లో మాత్రం మార్పు పెను ప్రభావాన్ని కలుగజేసేదిగా ఉంది అని ఆయన అన్నారు. పారిశ్రామిక యుగంలో మాదిరిగా కాకుండా, సమాచార యుగంలో మొదట ఎవరు తరలి వచ్చారు అనే అంశానికి బదులుగా ఉత్తమ ఫలితాలను ఎవరు ఆవిష్కరించారు అనేది ప్రధానంగా మారుతుంది అని ఆయన స్పష్టం చేశారు. అప్పటి వరకు బజారులో ఉన్న సమీకరణాలన్నిటినీ ధ్వంసం చేసే ఒక ఉత్పత్తిని ఎవరైనా, ఏ కాలంలోనైనా తయారు చేయవచ్చని ఆయన చెప్పారు.
సమాచార యుగం లో ఒక్కసారిగా ముందుకు దూసుకుపోయే విశిష్ట సామర్ధ్యం భారతదేశానికి ఉందని ప్రధాన మంత్రి అన్నారు. భారతదేశం లో శ్రేష్ఠమైన ప్రజ్ఞావంతులకు తోడు అతి పెద్ద విపణి కూడా ఉంది అని ఆయన చెప్పారు. మన స్థానిక సాంకేతిక పరిష్కార మార్గాలకు ప్రపంచ స్థాయి కి ఎదగగల సత్తా ఉంది అని ఆయన అన్నారు. భారతదేశం లో రూపొందించే సాంకేతిక సంబంధిత పరిష్కార మార్గాలను ప్రపంచ అవసరాలకు వినియోగించవలసిన సమయం వచ్చిందని ఆయన నొక్కిచెప్పారు. ప్రభుత్వ విధాన నిర్ణయాలు ఎల్లవేళల సాంకేతికత ను, నూతన ఆవిష్కారాల పరిశ్రమ ను సరళతరంగా మార్చడం పట్లే దృష్టి ని కేంద్రీకరించాయి, ఉదాహరణకు ఇటీవల సమాచార సాంకేతిక పరిశ్రమ మీద ఉన్న విధానాలను పాటించే భారాన్ని తగ్గించడం జరిగింది అని ఆయన గుర్తుచేశారు. ప్రభుత్వం సదా సాంకేతిక పరిశ్రమ లోని భాగస్వామ్య పక్షాలతో సంప్రదింపులు జరుపుతూ ఉండటానికే ప్రయత్నం చేస్తూ ఉంటుంది, అంతేకాక భారతదేశం కోసం భవిష్యత్తు లో ఎటువంటి ఇబ్బందులు ఎదురవని విధంగా విధాన పరమైన ఫ్రేమ్ వర్క్ లను రూపొందించాలనుకొంటోంది అని ఆయన చెప్పారు.
విజయవంతమైన అనేక ఉత్పత్తుల తో కూడిన ఒక పర్యావరణ అనుకూల వ్యవస్థ ను నిర్మించే సామర్ధ్యం ఫ్రేమ్ వర్క్ స్థాయి మనస్తత్వానికి ఉంటుంది అని ప్రధాన మంత్రి అన్నారు. యుపిఐ, నేశనల్ డిజిటల్ హెల్త్ మిశన్, స్వామిత్వ పథకం వంటి కార్యక్రమాలు ఈ రకమైన ఫ్రేమ్ వర్క్ స్థాయి మనస్తత్వం కలిగినవే అని ఆయన చెప్పారు. రక్షణ రంగం మరింత అభివృద్ధి చెందడానికి సాంకేతిక విజ్ఞానం గతి ని అందిస్తోంది అని ఆయన అన్నారు. సాంకేతిక విజ్ఞానాన్ని వినియోగించుకోవడం అమాంతం పెరిగిపోతుండటంతో సమాచార పరిరక్షణ, సైబర్ సెక్యూరిటీ ల అవసరం కూడా పెరిగిపోయింది అని ఆయన స్పష్టం చేశారు. వైరస్ లు, సైబర్ దాడుల బారిన డిజిటల్ ఉత్పత్తులు పడకుండా వాటికి దీటైన టీకా మందు ను పోలిన పటిష్ట సైబర్ సెక్యూరిటీ సంబంధి పరిష్కారాలను కనుగొనడంలో యువతీ యువకులు ప్రధాన పాత్ర ను పోషించవచ్చు అంటూ ఆయన ప్రతిపాదన చేశారు.
బయో-సైన్సెస్, ఇంజినీరింగ్ మొదలైన విజ్ఞాన శాస్త్ర సంబంధిత రంగాల లో నూతన ఆవిష్కరణ అవసరం, అవకాశం ఎంతో సందర్భ శుద్ధి ని కలిగి ఉంటాయి అని ప్రధాన మంత్రి అన్నారు. పురోగమించడానికి నూతన ఆవిష్కరణ అనేది కీలకం అని, నూతన ఆవిష్కారాల విషయానికి వస్తే ఒక భారతదేశం స్పష్టమైన ప్రయోజనాన్ని కలిగివుందని, మన యువత లోని ప్రతిభ, క్రొత్త క్రొత్త విషయాలను అన్వేషించాలనేటటువంటి వారిలోని ఉత్సుకతలే దీనికి కారణం అని ఆయన అన్నారు. మన యువతీ యువకుల సామర్ధ్యం, అలాగే సాంకేతికత లో గల అవకాశాలు అంతం అంటూ లేనివి అని ఆయన చెప్పారు. వాటిని వినియోగించుకోవడానికి మనం మన సర్వ శక్తులను ప్రదర్శించవలసిన తరుణం ఇదే అని ఆయన అన్నారు. మన సమాచార, సాంకేతిక విజ్ఞాన (ఐటి) రంగం మనం గర్వించేదిగా నిలువగలదన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.
***
(Release ID: 1673991)
Visitor Counter : 305
Read this release in:
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam