రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

ఎన్‌సిసి నెల రోజుల రాజ్యాంగ దినోత్సవ యూత్ క్లబ్ ప్రచారాన్ని రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభించారు; రాజ్యాంగ హక్కులు , కర్తవ్యాల గురించి యువతకు అవగాహన కల్పిస్తారు.

Posted On: 18 NOV 2020 4:50PM by PIB Hyderabad

రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ఢిల్లీనుండి వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఎన్‌సిసి నిర్వహిస్తున్న దేశవ్యాప్త రాజ్యాంగ దినోత్సవ యూత్ క్లబ్ కార్యకలాపాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ప్రజలలో భారత రాజ్యాంగం గురించి అవగాహన కల్పించడానికి యువతను సమీకరించడం ఈ కార్యక్రమం  లక్ష్యం.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ రాజ్యాంగ స్ఫూర్తిని అర్థం చేసుకోవాలని, దాని ఆదర్శాలను గ్రహించడానికి హృదయపూర్వకంగా పనిచేయాలని దేశ యువకులను కోరారు. సంవత్సరాల తరబడి తీవ్రమైన చర్చలు, సంప్రదింపుల తరువాత మన రాజ్యాంగం రూపొందిందని అన్నారు. ‘‘మన రాజ్యాంగం పీఠిక "మేము" తో మొదలవుతుంది. ఇది మన దేశాన్ని , మన వ్యవస్థను ఎలా ముందుకు తీసుకువెళ్లాలో మనందరిపై ఆధారపడి ఉంటుంది. రాజ్యాంగంలో పొందుపరచబడిన వారి హక్కుల గురించి ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. హక్కులు , విధులు రెండూ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నందున వారి విధుల గురించి కూడా అవగాహన కల్పించాలి. విధులను నెరవేర్చకుండా అతడు / ఆమె హక్కులను పొందలేరు” అని ఆయన అన్నారు.   రాజ్యాంగం మన జీవితాలకు క్రమశిక్షణ, వైవిధ్యం, ఐక్యత, స్వేచ్ఛ, సమానత్వం, సార్వభౌమాధికారం వంటి విలువల ద్వారా మార్గనిర్దేశం చేస్తుందని ప్రజలకు తెలియజేయాలని అన్నారు.  నవ భారత్ను నిర్మించడానికి ఇవన్నీ అవసరమని చెప్పారు.  మహాత్మా గాంధీ, స్వామి వివేకానంద, డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్, పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ వంటి గొప్ప నాయకులను స్ఫూర్తిని తీసుకొని, రాజ్యాంగ ఆదర్శాలను కృతనిశ్చయంతో పాటించాలని  రాజనాథ్ సింగ్ అన్నారు. ఈ సందర్భంగా కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల సహాయ మంత్రి  కిరణ్ రిజిజు మాట్లాడారు. ఈ ప్రచారాన్ని దేశంలోని యువ జన సంస్థలు, అంటే నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్సీసీ), నేషనల్ సర్వీస్ స్కీమ్ (ఎన్ఎస్ఎస్), నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ (ఎన్‌వైకెఎస్), భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్, హిందుస్తాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అసోసియేషన్ , రెడ్ క్రాస్ 18 నవంబర్ నుండి 13 డిసెంబర్ 2020 వరకు నిర్వహిస్తాయని ప్రకటించారు.

భారత రాజ్యాంగంలో ప్రాథమిక సూత్రాలు , దాని స్ఫూర్తి గురించి ప్రజలలో అవగాహన కల్పించడం,  రాజ్యాంగంలో పొందుపరచబడిన ప్రాథమిక విధులపై చైతన్యం తేవడం కార్యక్రమం ప్రధాన లక్ష్యం. బాధ్యతాయుతమైన పౌరుడికి ఉండాల్సిన గుణాలు, రాజ్యాంగం  ప్రాముఖ్యత వివరించడం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సందేశాన్ని వ్యాప్తి చేయడం కూడా కార్యక్రమంలో భాగం.

22 నుండి 24 నవంబర్ 20 వరకు స్వచ్ఛందంగా యువకులు దేశవ్యాప్తంగా రక్తదాన శిబిరాలను నిర్వహిస్తారు. ఈ ప్రచారం సందర్భంగా, యువత సోషల్ మీడియాలో # ఇట్స్ మై డ్యూటీ (డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్) , # మేరాకర్తవ్య (ఎన్‌సిసి ట్విట్టర్ హ్యాండిల్) అనే హ్యాష్‌ట్యాగ్‌లను ప్రచారం చేస్తారు. అవగాహన సందేశాలను ఈ–మెయిల్‌లు, మెసేజ్లు , బ్యానర్‌ల ద్వారా కూడా పంపిస్తారు. ఈ ప్రచారంలో ప్రకృతి పట్ల పౌరుడి బాధ్యతను గుర్తు చేయడం , ఇంట్లో , పరిసరాల్లో శుభ్రత కోసం వారం పాటు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడం వంటివీఉంటాయి.  రక్షణ కార్యదర్శి డాక్టర్ అజయ్ కుమార్, యువజన వ్యవహారాల కార్యదర్శి ఉషా శర్మ, ఎన్‌సిసి డీజీ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ చోప్రా కూడా ఈ సమావేశంలో ప్రసంగించారు.

 

****

 


(Release ID: 1673892) Visitor Counter : 228