ఆయుష్

భావి అవ‌స‌రాల‌ను తీర్చ‌డానికి సిద్ధమైన రెండు ఆయుర్వేద సంస్థ‌ల‌ను ఆయుర్వేద దినోత్సవ సంద‌ర్భం లో దేశ ప్ర‌జ‌ల‌కు అంకితం చేసిన ప్ర‌ధాన మంత్రి

సాంప్ర‌దాయ‌క చికిత్స‌ కు ప్రపంచ కేంద్రం గా భార‌త‌దేశాన్ని ఎంపిక చేసినందుకు డ‌బ్ల్యుహెచ్ఒ కు ఆయ‌న ధ‌న్య‌వాదాలు తెలిపారు

అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌కు తుల‌తూగే ఆయుర్వేద పాఠ్య క్ర‌మాన్ని సిద్ధం చేయాల‌ని పిలుపునిచ్చారు

ఆయుర్వేద కేవలం ఒక ప్ర‌త్యామ్నాయం కాదు, అది దేశ ప్ర‌జ‌ల ఆరోగ్యానికి ఒక కీల‌క ఆధార‌ం కూడా: ప్ర‌ధాన మంత్రి

క‌రోనా కాలం ఆయుర్వేద ఉత్ప‌త్తుల వినియోగాన్ని పెంచి, ఆయుర్వేద ప‌రిశోధ‌న‌ల కు జోరు ను ఇచ్చింది

Posted On: 13 NOV 2020 12:55PM by PIB Hyderabad

భ‌విష్య‌త్తు కాలావ‌స‌రాల‌ను తీర్చేందుకు సిద్ధమైన రెండు ఆయుర్వేద సంస్థ‌ల‌ ను ఈ రోజు న అయిదో ఆయుర్వేద దినం సంద‌ర్భం లో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా దేశ ప్ర‌జ‌ల‌కు అంకితం చేశారు.  వాటిలో ఒకటి జామ్ న‌గ‌ర్ లో ఏర్పాటైన ఇన్స్ టిట్యూట్ ఆఫ్ టీచింగ్ అండ్ రిస‌ర్చ్ ఇన్ ఆయుర్వేద (ఐటిఆర్ఎ), రెండోది జ‌య్‌ పుర్ లోని నేశ‌న‌ల్ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద (ఎన్ఐఎ). ఈ రెండు సంస్థ‌ లు దేశం లో ప్ర‌ధాన ఆయుర్వేద సంస్థ‌లుగా ఉన్నాయి.  ఐటిఆర్ఎ కు ‘జాతీయ ప్రాముఖ్యం క‌లిగిన సంస్థ’ (ఐఎన్ఐ) అనే హోదా ను పార్ల‌మెంటు లో చ‌ట్టం చేయ‌డం ద్వారా క‌ట్ట‌బెట్ట‌డమైంది.  ఎన్ఐఎ కు డీమ్‌డ్ టు బి యూనివ‌ర్సిటీ అనే స్థాయి యూనివ‌ర్సిటీ గ్రాంట్ల సంఘం (యుజిసి) ద్వారా ద‌క్కింది.  ధ‌న్వంత‌రి జ‌యంతి అయిన ధ‌న్ తేర‌స్ సంద‌ర్భం లో  ‘ఆయుర్వేద దినోత్సవాన్ని’ 2016 నుంచి ఏటా ఆయుష్ మంత్రిత్వ శాఖ జ‌రుపుతూ వ‌స్తోంది.

ఈ కార్య‌క్ర‌మానికి కేంద్ర ఆయుష్ శాఖ‌ స‌హాయ మంత్రి (స్వ‌తంత్ర బాధ్య‌త‌) శ్రీ శ్రీ‌పాద్ య‌సో నాయి‌క్‌, గుజ‌రాత్ ముఖ్య‌మంత్రి శ్రీ విజ‌య్ రూపాణీ, రాజ‌స్థాన్ ముఖ్య‌మంత్రి శ్రీ‌ అశోక్ గహ్ లోత్‌‌, రాజ‌స్థాన్ గ‌వ‌ర్న‌ర్ శ్రీ క‌ల్ రాజ్ మిశ్రా, గుజ‌రాత్ గ‌వ‌ర్న‌ర్ శ్రీ ఆచార్య దేవ్ ‌వ్ర‌త్ లు పాల్గొన్నారు. ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (డ‌బ్ల్యుహెచ్ఒ) డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్‌ డాక్టర్ టెడ్రోస్ అదనోమ్ ఘెబ్రెయెసస్ ఈ కార్య‌క్ర‌మానికి ఒక వీడియో సందేశాన్ని పంపించారు.  ఆయుష్మాన్ భార‌త్ ద్వారా అంద‌రికీ ర‌క్ష‌ణ క‌ల్పించ‌డానికి, ఆరోగ్య సంబంధిత ల‌క్ష్యాల సాధ‌న‌కు గాను నిద‌ర్శ‌నాల‌పై ఆధార‌ప‌డిన సాంప్ర‌దాయ‌క చికిత్స‌ల‌ను ప్రోత్స‌హించ‌డానికి ప్ర‌ధాన మంత్రి చాటుతున్న నిబ‌ద్ధ‌త‌ ను ఆయ‌న ప్ర‌శంసించారు.  సాంప్ర‌దాయ‌క చికిత్స‌ కు ప్ర‌పంచ కేంద్రం గా భార‌త‌దేశాన్ని ఎంపిక చేసినందుకు డ‌బ్ల్యుహెచ్ ఒ కు, ఆ సంస్థ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్‌ కు ప్ర‌ధాన మంత్రి ధ‌న్య‌వాదాలు తెలిపారు.  భార‌త‌దేశ వార‌స‌త్వాల‌లో ఆయుర్వేద ఒక‌ట‌ని, భార‌త‌దేశ సాంప్ర‌దాయ‌క జ్ఞానం ఇత‌ర దేశాల‌ను కూడా సుసంప‌న్నం చేయ‌డం సంతోష‌దాయ‌క‌మైన విష‌య‌మ‌ని ఆయ‌న అన్నారు.

ఆయుర్వేద జ్ఞానాన్ని పుస్త‌కాలు, ధ‌ర్మ గ్రంథాలు, గృహ చికిత్స‌ల ప‌రిధి నుంచి బయటకు తీసుకు వ‌చ్చి ఈ పురాత‌న జ్ఞానాన్ని ఆధునిక కాలం అవ‌స‌రాల‌కు త‌గ్గ‌ట్లుగా అభివృద్ధి చేయ‌వ‌ల‌సిన అవ‌స‌రం ఎంతైనా ఉందని శ్రీ మోదీ స్ప‌ష్టం చేశారు.  21 వ శతాబ్దం తాలూకు ఆధునిక విజ్ఞాన శాస్త్రం నుంచి అందుకొన్న స‌మాచారాన్ని మ‌న ప్రాచీన వైద్య చికిత్స కు సంబంధించిన జ్ఞానం తో మిళితం చేయ‌డం ద్వారా నూత‌న ప‌రిశోధ‌న సాగుతోంద‌ని ఆయ‌న తెలిపారు.  ఆయుర్వేదం ప్ర‌స్తుతం కేవ‌లం ఒక ప్ర‌త్యామ్నాయం కాద‌ని, అది దేశ ఆరోగ్య విధానం లో ఒక కీల‌క ప్రాతిపదికగా కూడా ఉంద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు. 

సోవా- రిగ్పా కు సంబంధించిన పరిశోధన, ఇతర అధ్యయనాల కోసం లేహ్ లో నేశ‌న‌ల్ సోవా-రిగ్పా ఇన్స్ టిట్యూట్ ను ఏర్పాటు చేసే ప‌ని జ‌రుగుతోందని శ్రీ మోదీ వెల్ల‌డించారు.  ప్ర‌స్తుతం గుజ‌రాత్ లో, రాజస్థాన్ లో ఉన్న‌తీక‌రించిన రెండు సంస్థ‌లు కూడా ఈ అభివృద్ధి తాలూకు విస్త‌ర‌ణ‌ లో భాగం అని ఆయ‌న చెప్పారు.  

ఈ రెండు సంస్థ‌ల‌ను ఉన్న‌తీక‌రించినందుకు ప్ర‌ధాన మంత్రి అభినంద‌న‌లు తెలియ‌జేస్తూ, ఇక వాటికి మ‌రింత బాధ్య‌త జతపడింద‌న్నారు.  ఆ సంస్థ‌లు అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌ను అందుకొనే ఆయుర్వేద పాఠ్య క్ర‌మాన్ని సిద్ధం చేస్తాయ‌న్న ఆశాభావాన్ని ఆయ‌న వ్య‌క్తం చేశారు.  ఆయుర్వేద ఫిజిక్స్‌, ఆయుర్వేద కెమిస్ట్రీ ల వంటి విభాగాల‌ లో కొత్త అవ‌కాశాల‌ను క‌నుగొన‌వ‌ల‌సిందిగా విద్యా శాఖ‌కు, యుజిసి కి కూడా ఆయ‌న పిలుపునిచ్చారు.  ప్రైవేటు రంగం, అంకుర సంస్థ లు (స్టార్ట్- అప్స్) ఈ రంగంలో చోటు చేసుకొంటున్న ప్ర‌పంచ‌వ్యాప్త ధోర‌ణుల‌ను, డిమాండ్ల‌ను అధ్య‌య‌నం చేయాల‌ని, అవి ఈ రంగంలో పాలుపంచుకొనేందుకు ముందుకు రావాలని  ఆయ‌న పిలుపునిచ్చారు.  నేశ‌న‌ల్ క‌మిష‌న్ ఆఫ్ ఇండియ‌న్ సిస్ట‌మ్ ఆఫ్ మెడిసిన్స్ ను, నేశ‌న‌ల్ క‌మిష‌న్ ఆఫ్ హోమియోప‌తి ని పార్ల‌మెంటు ఇటీవ‌ల నెలకొల్పింద‌ని, జాతీయ విద్య విధానం కూడా ఒక ఏకీకృత దృక్ప‌థాన్ని ప్రోత్స‌హిస్తోంద‌ని ఆయ‌న చెప్పారు.  ఆయుర్వేద విద్య‌లో అలాపథిక్ అభ్యాసాల జ్ఞానం త‌ప్ప‌నిస‌రి కావాల‌న్న‌దే ఈ విధానం మౌలిక ఉద్దేశ్యమ‌ని తెలిపారు.

క‌రోనా కాలంలో ప్ర‌పంచమంతటా ఆయుర్వేద ఉత్ప‌త్తుల‌ డిమాండు శ‌ర‌వేగంగా పెరిగింద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.  ఆయుర్వేద ఉత్ప‌త్తుల ఎగుమ‌తులు ఈ సంవ‌త్స‌రం సెప్టెంబ‌ర్ లో క్రితం సంవ‌త్స‌రం కంటే  దాదాపు  45 శాతం పెరిగాయ‌ని ఆయ‌న తెలిపారు.  వ్యాధినిరోధ‌క శ‌క్తి ని పెంచేవిగా భావిస్తున్న ప‌సుపు, అల్లం వంటి మసాలా దినుసుల ఎగుమ‌తులలో చెప్పుకోద‌గిన పెరుగుద‌ల న‌మోదు కావ‌డం భార‌తీయ మ‌సాలా దినుసులు, ఆయుర్వేద చికిత్స మార్గాల ప‌ట్ల ప్ర‌పంచంలో విశ్వాసాన్ని ఒక్కసారిగా పెంచి వేశాయ‌ని ఈ ప‌రిణామం చాటిచెప్తోంద‌ని కూడా ఆయ‌న అన్నారు.  ప్ర‌స్తుతం అనేక దేశాల‌లో ప‌సుపు సంబంధి ప్ర‌త్యేక పానీయాలు పెరిగాయని, ప్ర‌పంచంలో ప్ర‌తిష్టాత్మ‌క చికిత్స ప‌త్రిక‌లు సైతం ఆయుర్వేదం లో ఒక కొత్త ఆశ‌ ను చూస్తున్నాయ‌ని ఆయ‌న అన్నారు.  ఈ క‌రోనా కాలంలో శ్ర‌ద్ధ అంతా ఒక్క ఆయుర్వేద వినియోగానికే ప‌రిమితం కాకుండా దేశంలో, ప్ర‌పంచంలో ఆయుష్ కు సంబంధించిన అధునాతన ప‌రిశోధ‌న పై కూడా కేంద్రీకృత‌ం అయింద‌ని ఆయ‌న అన్నారు.

ప్ర‌స్తుతం భార‌త‌దేశం ఒక‌ వైపు టీకా మందుల పై ప‌రీక్ష‌లు జ‌రుపుతూనే, మ‌రొక‌ వైపు కొవిడ్ తో పోరాడ‌టానికి సంబంధించిన ఆయుర్వేద ప‌రిశోధ‌న‌ల‌ లో అంత‌ర్జాతీయ స‌హ‌కారాన్ని కూడా పెంచుకొంటోంద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు. ప్ర‌స్తుతం 100 కు పైగా చోట్ల  ప‌రిశోధ‌న కొన‌సాగుతోంద‌ని ఆయ‌న చెప్పారు.  అలాగే, దిల్లీ లోని అఖిల భార‌త ఆయుర్వేద సంస్థ 80 వేల మంది దిల్లీ పోలీసు సిబ్బంది కి వ్యాధినిరోధ‌క‌త్వానికి సంబంధించిన ప‌రిశోధ‌న‌ను నిర్వ‌హించింద‌ని ఆయ‌న చెప్పారు.  ఇది బ‌హుశా ప్ర‌పంచంలోకెల్లా అతి పెద్ద సామూహిక అధ్య‌య‌నం అని, ఫ‌లితాలు ప్రోత్సాహ‌క‌రంగా ఉన్నాయ‌ని తెలిపారు.  రాబోయే కాలంలో మ‌రిన్ని అంత‌ర్జాతీయ ప‌రీక్ష‌లు మొద‌ల‌వ‌నున్నాయ‌ని కూడా ఆయ‌న అన్నారు.

ప్ర‌స్తుతం వ్యాధినిరోధ‌క శ‌క్తి ని పెంచుకోవ‌డంలో పోష‌క విలువ‌లు క‌లిగిన ఆహార ప‌దార్థాల‌కు తోడు, ఆయుర్వేద ఔష‌ధాలు, ఓషధి మొక్కల‌కు ప్ర‌త్యేక ప్రాధాన్యాన్ని ఇస్తున్న‌ట్లు ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు.  గంగాన‌ది తీర ప్రాంతాల‌లో, అలాగే హిమాల‌య ప్రాంతాల‌లో ముత‌క ధాన్యాల ఉత్ప‌త్తితో పాటు సేంద్రియ ఉత్ప‌త్తులను కూడా పెంచేట‌ట్లుగా రైతుల‌ను ప్రోత్స‌హించ‌డం జ‌రుగుతోంద‌ని ఆయ‌న చెప్పారు.  ప్ర‌పంచ దేశాల‌ లో వెల్‌నెస్ కోసం భార‌త‌దేశం మ‌రింత ఎక్కువ‌గా తోడ్పాటు ను అందించేలా ఒక స‌మ‌గ్ర ప్ర‌ణాళిక‌ ను రూపొందించ‌డానికి ఆయుష్ మంత్రిత్వ శాఖ కృషి చేస్తోంద‌ని ఆయ‌న చెప్పారు.  మ‌న ఎగుమ‌తులు కూడా పెర‌గాల‌ని, మ‌న రైతుల ఆదాయం సైతం వృద్ధి చెందాల‌ని ఆయ‌న అన్నారు.  కోవిడ్ మ‌హ‌మ్మారి మొదలైన త‌రువాతి కాలంలో అశ్వ‌గంధ‌, తుల‌సి త‌దిత‌ర ఆయుర్వేద మొక్క‌ల ధ‌ర‌లు ఎంతో పెరిగాయ‌ని ప్ర‌ధాన మంత్రి ప్ర‌స్తావించారు.  అశ్వ‌గంధ వెల క్రింద‌టి ఏడాదితో పోల్చిన‌ప్పుడు రెండింత‌ల‌కు పైగా పెరిగింద‌ని, దీని తాలూకు ప్ర‌త్య‌క్ష ప్ర‌యోజ‌నం ఓష‌ధి మొక్క‌లను సాగు చేసే మ‌న రైతుల‌కు అందుతోంద‌న్నారు.

భార‌తదేశంలో ల‌భిస్తున్న అనేక ఓష‌ధి మొక్క‌ల ఉప‌యోగం తాలూకు చైత‌న్యాన్ని పెంచే దిశ‌లో వ్య‌వ‌సాయ శాఖ‌, ఆయుష్ శాఖ‌, ఇత‌ర విభాగాలు క‌ల‌సి ప‌ని చేయాల‌ని ప్ర‌ధాన మంత్రి విజ్ఞ‌ప్తి చేశారు.  ఆయుర్వేదానికి సంబంధించిన యావ‌త్తు వ్య‌వ‌స్థ అభివృద్ధి చెందితే, దేశంలో ఆరోగ్యానికి సంబంధించిన ప‌ర్య‌ట‌నకు ప్రోత్సాహం ల‌భిస్తుంద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.  జామ్ న‌గ‌ర్ లోను, జ‌య్ పుర్ లోను ఈ రోజు న ప్రారంభోత్స‌వం జ‌రుపుకొన్న రెండు సంస్థ‌లు ఈ దిశ‌ లో కూడా లాభ‌కారిగా నిరూపించుకొంటాయ‌న్న ఆకాంక్ష‌ను ఆయ‌న వ్య‌క్తం చేశారు.

జామ్ న‌గ‌ర్ లోని ఐటిఆర్ఎ ను గురించి:  పార్ల‌మెంటు లో చ‌ట్టం చేయ‌డం ద్వారా ఇటీవ‌ల స్థాపించిన ఇన్స్ టిట్యూట్ ఆఫ్ టీచింగ్ ఎండ్ రిస‌ర్చ్ ఇన్ ఆయుర్వేద (ఐటిఆర్ఎ) ఒక ప్ర‌పంచ శ్రేణి ఆరోగ్య సంర‌క్ష‌ణ సంస్థ‌ గా ఎద‌గ‌డానికి సిద్ధంగా ఉంది.  ఐటిఆర్ఎ లో 12 విభాగాలు, మూడు క్లినిక‌ల్ లేబ‌రేట‌రీలు, మూడు ప‌రిశోధ‌న ప్ర‌ధాన ప్ర‌యోగ‌శాల‌లు ఏర్పాట‌య్యాయి.  సాంప్ర‌దాయ‌క చికిత్స రంగం లో సాగుతున్న ప‌రిశోధ‌న కృషి లో ఒక ప్ర‌ముఖ పాత్ర‌ ను ఈ సంస్థ పోషిస్తోంది.  ప్ర‌స్తుతం 33 ప‌రిశోధ‌న ప‌థ‌కాల‌ను ఈ సంస్థ నిర్వ‌హిస్తోంది.  జామ్ న‌గ‌ర్ లోని గుజ‌రాత్ ఆయుర్వేద విశ్వ‌విద్యాల‌య ఆవ‌ర‌ణ‌ లో గల నాలుగు ఆయుర్వేద సంస్థ‌ల‌ను క‌లిపివేసి ఐటిఆర్ఎ ను నెల‌కొల్ప‌డ‌మైంది.  ఆయుష్ రంగం లో జాతీయ ప్రాధాన్యం కలిగిన సంస్థ (ఐఎన్ఐ) హోదా ను పొందిన తొలి సంస్థ ఇదే.  హోదా ను ఉన్న‌తీక‌రించిన నేప‌థ్యం లో ఆయుర్వేద విద్య ప్ర‌మాణాల‌ను ఉన్న‌తీక‌రించ‌డానికి ఐటిఆర్ఎ కు స్వ‌తంత్ర ప్ర‌తిప‌త్తి ద‌క్క‌నుంది.  ఆధునిక‌ ప్రమాణాలకు, అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌కు అనుగుణ‌మైన పాఠ్య క్ర‌మాల‌ను ఈ సంస్థ అందించ‌నుంది.  పైపెచ్చు, ఇది ఆయుర్వేద కు స‌మ‌కాలీన ఉత్తేజాన్ని ఇచ్చేందుకు ఇంట‌ర్‌డిసిప్లిన‌రీ స‌హ‌కారాల‌ను ఏర్ప‌ర‌చుకోనుంది.

జ‌య్ పుర్ లోని ఎన్ఐఎ గురించి:  దేశ‌వ్యాప్తం గా ప్ర‌ఖ్యాతిని పొందిన ఆయుర్వేద సంస్థ ఎన్ఐఎ ‘డీమ్‌డ్ టు బి యూనివ‌ర్సిటీ’ (డి నోవో కేట‌గిరీ) హోదా ను పొంద‌డంతో ఎన‌లేని ల‌బ్ధి ని చేజిక్కించుకొంది.  175 సంవ‌త్స‌రాల చ‌రిత్ర క‌లిగిన ఎన్ఐఎ, గ‌త కొన్ని ద‌శాబ్దాల‌ లో విశ్వ‌స‌నీయ ఆయుర్వేద ను ప‌రిర‌క్షించ‌డం లో, ప్ర‌చారం చేయ‌డం లో, దీనిని ముందుకు తీసుకుపోవ‌డం లో చెప్పుకోద‌గిన తోడ్పాటు ను అందించింది.  ప్ర‌స్తుతం ఎన్ఐఎ లో 14 వేరు వేరు విభాగాలు ఉన్నాయి.  2019-20 లో 75 ఫేక‌ల్టీలు, 955 మంది విద్యార్థుల తో ఈ సంస్థ చాలా చ‌క్క‌ని విద్యార్థి, ఉపాధ్యాయ నిష్ప‌త్తి ని న‌మోదు చేసింది.  స‌ర్టిఫికెట్ స్థాయి మొద‌లుకొని, డాక్టరల్ స్థాయి వ‌ర‌కు ఆయుర్వేద లో ఈ సంస్థ అనేక పాఠ్య క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తోంది.  అత్య‌ధునాత‌న ప్ర‌యోగ‌శాల స‌దుపాయాలు కలిగిన ఎన్ఐఎ ప‌రిశోధ‌న కార్య‌క‌లాపాల‌లో కూడా మార్గ‌ద‌ర్శి గా ఉంది.  డీమ్ డ్ టు బి యూనివ‌ర్సిటీ (డి నోవో కేట‌గిరీ) హోదా తో ఎన్ఐఎ తృతీయ ఆరోగ్య సంర‌క్ష‌ణ‌, విద్య‌, ప‌రిశోధన విభాగాల‌ లో అత్యున్న‌త ప్ర‌మాణాల‌ను సాధించ‌డం ద్వారా నూతన శిఖ‌రాల‌ను అందుకోవ‌డానికి సంసిద్ధంగా ఉంది.


***



(Release ID: 1672619) Visitor Counter : 202