ఆయుష్

నవంబర్ 13 న 5 వ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా రెండు ఆయుర్వేద సంస్థలను దేశానికి అంకితం చేయనున్న ప్రధాని

Posted On: 12 NOV 2020 11:31AM by PIB Hyderabad

2020 నవంబర్ 13 న 5 వ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా భవిష్యత్తు అవసరాలకు సిద్ధంగా ఉన్న రెండు ఆయుర్వేద సంస్థలను దేశానికి అంకితం చేస్తారు. అవి జమ్‌నగర్‌లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ టీచింగ్ అండ్ రీసెర్చ్ మరియు జైపూర్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదం (ఎన్ఐఏ). ఈ రెండు సంస్థలు దేశంలోని ఆయుర్వేద ప్రధాన సంస్థలు. మొదటగా ఇవి పార్లమెంటు చట్టం ద్వారా ఇన్స్టిట్యూషన్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ (ఐఎన్ఐ)  హోదాను సాధించాయి. అలాగే యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ ద్వారా విశ్వవిద్యాలయంగా గుర్తించబడిన సంస్థలు.

2016 నుండి ఆయుష్ మంత్రిత్వ శాఖ  ధన్వంతరి జయంతి (ధంతేరాస్) సందర్భంగా ప్రతి సంవత్సరం ‘ఆయుర్వేద దినోత్సవాన్ని’ పాటిస్తోంది. ఈ సంవత్సరం, ఇది నవంబర్ 13 న వస్తుంది.

కొవిడ్-19 నేపథ్యంలో ఈ  5 వ ఆయుర్వేద దినోత్సవం 2020 జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో వర్చువల్ ప్లాట్‌ఫామ్‌లపై ఎక్కువగా చర్చనీయాంశమయింది. పైన పేర్కొన్న రెండు సంస్థలను దేశానికి అంకితమిచ్చే కార్యక్రమం నవంబర్ 13 న ఉదయం 10.30 నుండి https://pmevents.ncog.gov.in వద్ద ప్రసారమవుతుంది. MyGov platform రిజిస్టర్ అవడం ద్వారా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలంటూ దేశప్రజలను ఆయుష్ మంత్రిత్వ శాఖ  ఆహ్వానించింది.

ఐటిఆర్‌ఎ, జామ్‌నగర్: ఇటీవల పార్లమెంటు చట్టం ద్వారా సృష్టించబడిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ టీచింగ్ అండ్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదం (ఐటిఆర్‌ఎ) ప్రపంచ స్థాయి ఆరోగ్య సంరక్షణ సంస్థగా అవతరించడానికి సిద్ధంగా ఉంది. ఐటిఆర్‌ఎలో 12 విభాగాలు, మూడు క్లినికల్ ప్రయోగశాలలు మరియు మూడు పరిశోధనా ప్రయోగశాలలు ఉన్నాయి. సాంప్రదాయ వైద్య రంగంలో పరిశోధనకు ఇది ప్రముఖ సంస్థగా పరిగణించబడుతోంది. ప్రస్తుతం ఇది 33 పరిశోధన ప్రాజెక్టులను నిర్వహిస్తోంది. జామ్‌నగర్‌లోని గుజరాత్ ఆయుర్వేద విశ్వవిద్యాలయ ప్రాంగణంలో నాలుగు ఆయుర్వేద సంస్థల సమూహాన్ని కలపడం ద్వారా ఐటిఆర్‌ఎ ఏర్పడింది. ఇన్స్టిట్యూషన్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ (ఐఎన్ఐ) హోదా కలిగిన ఆయుష్ సెక్టార్లో ఇది మొదటి సంస్థ. ఆయుర్వేద విద్యలో నాణ్యతను, ప్రమాణాలను అప్‌గ్రేడ్ చేయడానికి ఐటీఆర్ఎకు స్వయంప్రతిపత్తి ఉంటుంది. ఎందుకంటే ఇది ఆధునిక, అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం కోర్సులను అందిస్తుంది. అలాగే ఇది సమకాలీన ఆయుర్వేదాన్ని మరింత అభివృద్ధి చేయడానికి కూడా సహకారం అందిస్తుంది.

ఎన్‌ఐఏ, జైపూర్: దేశవ్యాప్తంగా పేరున్న ఆయుర్వేద సంస్థ. త్వరలో డిమ్డ్‌టుబి యూనివర్సిటీ హోదా లభించనుంది. అలాగే ఈ సంస్థకు 175 సంవత్సరాల వారసత్వ చరిత్ర ఉంది. గత కొన్ని దశాబ్దాలుగా ప్రామాణికమైన ఆయుర్వేదాన్ని పరిరక్షించడానికి, ప్రోత్సహించడానికి మరియు అభివృద్ధి చేయడానికి ఎన్‌ఐఏ ఎంతగానో కృషి చేస్తోంది. ప్రస్తుతం ఎన్ఐఏ 14 వేర్వేరు విభాగాలను కలిగి ఉంది. ఈ సంస్థ చాలా మంచి విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తిని కలిగి ఉంది. 2019-20లో మొత్తం 955 మంది విద్యార్థులకు గాను 75 మంది అధ్యాపకులు ఉన్నారు.  ఆయుర్వేదంలో సర్టిఫికేట్ నుండి డాక్టోరల్ స్థాయి వరకు అనేక కోర్సులను ఈ సంస్థ అందిస్తుంది. అత్యాధునిక ప్రయోగశాల సౌకర్యాలతో, పరిశోధనా కార్యకలాపాలలో ఎన్‌ఐఏ  ముందుంది. ప్రస్తుతం ఇది 54 వేర్వేరు పరిశోధన ప్రాజెక్టులను నిర్వహిస్తోంది. డీమ్డ్ టు యూనివర్శిటీ (డి నోవో కేటగిరీ), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆరోగ్య సంరక్షణ, విద్య మరియు పరిశోధనలలో అత్యున్నత ప్రమాణాలను సాధించడం ద్వారా సరికొత్త శిఖరాలకు చేరుతోంది.

***


(Release ID: 1672232) Visitor Counter : 246