కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ

కోవిడ్ కష్టకాలంలో నిర్విరామ సేవలకు అభినందనలు

సి.ఎల్.సి., ఇ.పి.ఎఫ్.ఒ., ఇ.ఎస్.ఐ.సి. అధికారులకు
కేంద్రమంత్రి గాంగ్వర్ సత్కారం, ప్రశంసా పత్రాల ప్రదానం

Posted On: 11 NOV 2020 3:34PM by PIB Hyderabad

   కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టే కృషిలో యుద్ధవీరుల్లా కష్టపడి విధులు నిర్వర్తించిన కార్మిక శాఖ ప్రధాన కమిషనర్ (కేంద్ర) కార్యాలయం (సి.ఎల్.సి.), ఉద్యోగ భవిష్యనిధి సంస్థ (ఇ.పి.ఎఫ్.ఒ.), కార్మిక రాజ్యబీమా సంస్థ (ఇ.ఎస్.ఐ.సి.) సిబ్బందిని సత్కరించేందుకు కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా మంత్రిత్వ శా ఖ ఈ రోజు ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది.

 

  ఆయా సంస్థల అధికారులు, ప్రాంతీయ కార్యాలయాల సిబ్బంది అంకిత భావంతో,  వృత్తిపరమైన ఉన్నత స్థాయి నైపుణ్యంతో అందించిన సేవలకు గుర్తింపుగా,.. కేంద్ర కార్మిక ఉపాధి కల్పనా శాఖ సహాయ (ఇన్చార్జి) మంత్రి సంతోష్ కుమార్ గాంగ్వర్ వారికి ప్రశంసా పత్రాలు ప్రదానం చేశారు. ఈ సంజదర్భంగా మంత్రి మాట్లాడుతూ,..కార్మికుల సంక్షేమం, పారిశ్రామిక రంగం కోసం తమ మంత్రిత్వ శాఖ ఎన్నో చర్యలు తీసుకుందన్నారు. రెండుకోట్ల మంది నిర్మాణరంగ కార్మికులకోసం వారి బ్యాంకు ఖాతాల్లో రూ. 5వేల కోట్లు జమచేసినట్టు చెప్పారు. పంపిణీ కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించేందుకు సి.ఎల్.సి. కేంద్రీయ కార్యాలయం 80మందికిపైగా అధికారులను ప్రత్యేకంగా నియోగించిందన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి ఇ.ఎస్.ఐ.సి., ఇ.పి.ఎఫ్.ఒ. నోడల్ అధికారులు, ఆయా సంస్థల ప్రాంతీయ కార్యాలయాల సిబ్బంది రేయింబవళ్లు అవిశ్రాంతంగా పనిచేశారన్నారు. 16వేలకు పైగా ఫిర్యాదుల పరిష్కారానికి 20 కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశామని, 96శాతానికి గా ఫిర్యాదులను గడవులోగానే పరిష్కరించేందుకు సి.ఎల్.సి. కేంద్రీయ కార్యాలయం, ఇ.పి.ఎఫ్.ఒ., ఇ.ఎస్.ఐ.సి. కార్యాలయాలు పనిచేశాయన్నారు. అంకిత భావంతో ఉమ్మడిగా సేవలందించిన ఈ మూడు సంస్థల అధికారులకు కేంద్రమంత్రి ధన్యవాదాలు తెలిపారు. దేశవ్యాప్తంగా 23 ఇ.ఎస్.ఐ.సి. ఆసుపత్రులను కోవిడ్-19 ఆసుపత్రులుగా ప్రకటించామని,.. 2,600 ఐసొలేషన్ పడకలు, 555 ఐ.సి.యు. పడకలు, 213 కృత్రిమ శ్వాస ఉపకరణాలు (వెంటిలేటర్లు) ఈ ఆసుపత్రుల్లో ఏర్పాటు చేశామని చెప్పారు. కోవిడ్ వైరస్ వాప్తి నేపథ్యంలో ప్రత్యేకంగా అందిన ప్రత్యేక కోవిడ్ క్లెయిములను పరిష్కానికి  ఇ.పి.ఎఫ్.ఒ. ఎంతో చొరవ తీసుకుందని, 47లక్షల మంది పి.ఎఫ్. చందాదారుల కోవిడ్ క్లెయిముల కోసం రూ. 12వేల కోట్లను పంపిణీ చేసినట్టు చెప్పారు. 

 

  కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా మంత్రిత్వ శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర మాట్లాడుతూ, మూడు సంస్థల అధికారులు, సిబ్బంది చేసిన కృషి అభినందనీయమన్నారు. కోవిడ్-19 కష్టకాలంలో అధికారులంతా తమ విధులకు అతీతంగా అందించిన సేవలు  ఎంతో సంతృప్తికరంగా ఉన్నాయన్నారు. 20 కంట్రోల్ రూమ్స్ ఏర్పాటుతో సి.ఎస్.సి. కేంద్రీయ కార్యాలయం కార్మికుల సమస్యలను పరిష్కరించిన తీరును అభినందించారు. కోవిడ్-19 క్లెయిములను కేవలం 50శాతం సిబ్బందితోనే 72 గంటల్లోగా వేగంగా పరిష్కరించేందుకు అధునాతన, సృజనాత్మక విధానాలు అనుసరించిన కేంద్ర భవిష్యనిధి కమిషనర్ (సి.పి.ఎఫ్.సి.)ను, దేశవ్యాప్తంగా ఉన్న ఇ.పి.ఎఫ్.ఒ. అధికారులను ఆయన అభినందించారు. కోవిడ్ బాధితుల సంరక్షణా సదుపాయాలతో ఇ.సి.ఐ.సి. ఆసుపత్రులను తీర్చిదిద్దినట్టు అపూర్వ చంద్ర చెప్పారు. ఆసుపత్రుల్లో ఐ.సి.యు. పడకలు ఏర్పాటు చేసి కోవిడ్-19 నిర్ధారణ పరీక్షలు నిర్వహించారని, ప్లాస్మా ప్రసరణ, ఆర్.టి.పి.సి.ఆర్. నిర్ధారణ పరీక్షలు, తదితర సౌకర్యాలు అమర్చారని చెప్పారు. బీమా చేయించకున్నవారు, లబ్ధిదారులు, ఇతర భాగస్వామ్య వర్గాలవారి సమస్యల పరిష్కారంకోసం ఇ.ఎస్.ఐ.సి. ప్రాంతీయ కార్యాలయాల అధికారులు నిర్విరామంగా పనిచేశారన్నారు.

 కేంద్రకార్యాలయం కార్మిక శాఖ కమిషనర్ డి.పి.ఎస్. నెగీ, కేంద్ర భవిష్యనిధి కమిషనర్ సునీల్ బర్త్వాల్, ఇ.ఎస్.ఐ.సి. డైరెక్టర్ జనరల్ అనూరాధ ప్రసాద్ కూడా తమ అనుభవాలను పంచుకున్నారు. కార్మిక మంత్రి ఆదేశాల మేరకు, లాక్ డౌన్ ను దృష్టిలో పెట్టుకుని క్లెయిముల పరిష్కారం కోసం తమ 20 ప్రాంతీయ కార్యాలయాల్లోనూ 20 కంట్రోల్ రూమ్స్ ను సి.ఎల్.సి. కేంద్రీయ కార్యాలయం ఏర్పాటు చేసిందని నెగీ చెప్పారు. తమ దృష్టికి నచ్చిన ఫిర్యాదును 72గంటల్లోగా పరిష్కరించాలని క్షేత్ర స్థాయి అధికారులను ఆదేశించినట్టు చెప్పారు. సమస్యల పరిష్కారంకోసం ఉద్యోగులను టెలిఫోన్,లేదా ఇమెయిల్, లేదా వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా సంప్రదించినట్టు నెగీ చెప్పారు. కంట్రోల్ రూమ్స్ ఏర్పాటుతో కేంద్ర రంగంలో రూ. 2,95,33,43,880లను 1,86,365మంది కార్మికులకు వేతనంగా ప్రభుత్వం చెల్లించగలిగిందని, ఆయా రాష్ట్రాల్లో రూ. 2,63,73,458లను 3,863మందికి వేతనంగా చెల్లించగలిగారని నెగీ చెప్పారు. వలస కూలీలకు ఆహారం, ఆశ్రయం, రేషన్ వంటి సమస్యల పరిష్కారానికి కూడా కంట్రోల్ రూమ్స్ ఎంతగానో ఉపకరించాయన్నారు.

   కేంద్ర భవిష్యనిధి కమిషనర్ (సి.పి.ఎఫ్.సి.) సునీల్ బర్త్వాల్ మాట్లాడుతూ,..గతంలో కనీవినీ ఎరుగని సమస్యలను, పలు రకాల ఇబ్బందులను ఎదుర్కొన్న వివిధ భాగస్వామ్య వర్గాలవారి ఫిర్యాదుల పరిష్కారానికి ఇ.పి.ఎఫ్.ఒ. ఎన్నో చర్యలు తీసుకుందన్నారు. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన (పి.ఎం.జి.కె.వై.) పథకంలో భాగంగా ఇ.పి.ఎఫ్. సభ్యులకు తిరిగి చెల్లించాల్సిన అవసరంలేని అడ్వాన్సును వారి ఖాతాల్లోకి జమ చేసే అవకాశం ఉందని, కోవిడ్ వ్యాప్తితో దెబ్బతిన్నట్టుగా సంబంధిత ప్రభుత్వం ప్రకటించిన పరిశ్రమల కార్మికులకోసం ఈ ఏర్పాటు చేశారని చెప్పారు. దేశ వ్యాప్తంగా ఉన్న ఇ.పి.ఎఫ్.ఒ. అధికారులు 47.58 కోవిడ్-19 అడ్వాన్స్ క్లెయిములను పరిష్కరించి, తద్వారా రూ. 12,220.26 కోట్లను క్లెయిముదారులకు పంపిణీ చేసినట్టు చెప్పారు. పలు ప్రాంతాలనుంచి అందిన క్లెయిములను 50శాతం సిబ్బందితోనే 72గంటల్లోగా పరిష్కరించేందుకు పూర్తి ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. కోవిడ్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో 2020 ఏప్రిల్ నుంచి సెప్టెంబరు వరకూ రూ. 19.20లక్షల మేర క్లెయిములకు ఉమంగ్ యాప్ ద్వారా చెల్లింపులు జరిపినట్టు చెప్పారు. 2019 అక్టోబరు నుంచి 2020 మార్చివరకూ కోవిడ్ ముందస్తు కాలంలో చెల్లింపులకంటే ఇవి 274శాతం ఎక్కువన్నారు. కోవిడ్ కష్టకాలంలో క్లెయిముల పరిష్కారానికి ఆటో క్లెయిమ్ అనే పద్ధతిని రూపొందించినందుకుగాను ఇ.పి.ఎఫ్.ఒ.కు డిజిటల్ టెక్నాలజీ సభా అవార్డు లభించినట్టు బర్త్వాల్ చెప్పారు. ఆటో క్లెయిమ్ ప్రాజెక్టును అంతర్గతంగానే రూపొందించారని, క్లెయిముల పరిష్కార వ్యవధిని 72 గంటలకు కుదించేందుకు ఇది దోహదపడిందని చెప్పారు.

   ఇ.ఎస్.ఐ.సి. డైరెక్టర్ జనరల్ అనురాధా ప్రసాద్ మాట్లాడుతూ, కోవిడ్ నేపథ్యంలో తమ సంస్థ కార్యకలాపాలను వివరించారు. కోవిడ్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా ఇ.ఎస్.ఐ..సి. ఆసుపత్రులకు అవసరమైన ప్రత్యేక సదుపాయాలన్నీ కల్పించినట్టు చెప్పారు. క్లెయిముల పరిష్కారానికి ఇ.ఎస్.ఐ.సి. ప్రాంతీయ కార్యాలయాలు నిర్విరామంగా పనిచేశాయన్నారు. నిర్ణీతమైన గడువును పాటించడం ద్వారా ఎన్నో కేసులను పరిష్కరించినట్టు, నాణ్యమైన సేవలందించినట్టు, ఫిర్యాదుల పరిష్కారానికి సృజనాత్మక చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం కొనసాగించడం ద్వారా రాష్ట్రాల పరిధిలోని సమస్యల పరిష్కారం సాధ్యమైందని, తద్వారా సానుకూల ఫలితాలు సాధించగలిగామని చెప్పారు.  మూడు సంస్థల అధికారులు, సిబ్బంది ఉమ్మడిగా తీసుకున్న చర్యల ఫలితంగా కార్యకలాపాలన్నింటినీ విజయవంతంగా పూర్తి చేయగలిగామన్నారు.

 

కేంద్ర కార్మిక శాఖ కమిషనర్ (కేంద్రీయ కార్యాలయం), సి.ఎల్.సి. (సి)

మంజూరు అధికారులు, కార్యాలయాలు:

  1. సంతోష్ మాహుర్, ఎల్.ఇ.ఒ.(సి), సి.ఎల్.సి(సి) (హెచ్.క్యు.).
  2. సి.ఎల్.సి.(సి) ప్రాంతీయ కార్యాలయం, చెన్నై.
  3. సి.ఎల్.సి.(సి) ప్రాంతీయ కార్యాలయం, కోల్కతా
  4. సి.ఎల్.సి.(సి) ప్రాంతీయ కార్యాలయం, కొచ్చిన్

 

ఉద్యోగ భవిష్యనిధి సంస్థ (ఇ.పి.ఎఫ్.ఒ.) మంజూరు కార్యాలయాలు:

  1. రూపేశ్వర్ సింగ్, ఆర్.పి.ఎఫ్.సి.-1, ఇ.పి.ఎఫ్.ఒ.(హెచ్.క్యు.)
  2. ఇ.పి.ఎఫ్.ఒ. ప్రాంతీయ కార్యాలయం, ఢిల్లీ (కేంద్రీయ కార్యాలయం)
  3. ఇ.పి.ఎఫ్.ఒ. ప్రాంతీయ కార్యాలయం, ఢిల్లీ (తూర్పు కార్యాలయం)
  4. ఇ.పి.ఎఫ్.ఒ. ప్రాంతీయ కార్యాలయం, కె.ఆర్. పురం, బెంగళూరు

 

ఉద్యోగ రాజ్య బీమా సంస్థ (ఇ.ఎస్.ఐ.సి.) మంజూరు కార్యాలయాలు:

  1. ఎస్.ఎల్. మీనా, డి.డి., ఇ.ఎస్.ఐ.సి. (హెచ్.క్యు).
  2. ఇ.ఎస్.ఐ.సి. ప్రాంతీయ కార్యాలయం, ఒడిశా
  3. ఇ.ఎస్.ఐ.సి. ప్రాంతీయ కార్యాలయం, మహారాష్ట్ర
  4. ఇ.ఎస్.ఐ.సి. ప్రాంతీయ కార్యాలయం, ఢిల్లీ
  5. ఇ.ఎస్.ఐ.సి. వైద్య కళాశాల, ఆసుపత్రి, ఫరీదాబాద్
  6. ఇ.ఎస్.ఐ.సి. వైద్య కళాశాల, ఆసుపత్రి, సనత్ నగర్
  7. ఇ.ఎస్.ఐ.సి. వైద్య కళాశాల, పి.జి.ఐ.ఎం.ఎస్.ఆర్., మోడల్ ఆసుపత్రి, రాజాజీ నగర్

************

 

 

 



(Release ID: 1671989) Visitor Counter : 182