ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం

భారతీయ సంస్కృతి, సంప్రదాయం, విలువల కలబోత శ్రీరాముడు : ఉపరాష్ట్రపతి

• రామచంద్రుని జీవన సందేశాన్ని నవతరం స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలి

• రామాయణం మహాకావ్యం, ఆదికావ్యం మాత్రమే కాదు.. అనాదికావ్యం కూడా

• అలాంటి ఉన్నత కావ్యం పట్ల బాల్యం నుంచే పిల్లలకు అవగాహన కల్పించాలి, ఆ విలువలను ఒంటబట్టించాలి

• ‘తవాస్మి’ పుస్తకావిష్కరణలో గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు

• నిద్రపోయే ముందు చిన్న పిల్లలకు కథలు చెప్పే పద్ధతి కనుమరుగవుతోందని ఆవేదన వ్యక్తం చేసిన ఉపరాష్ట్రపతి

Posted On: 06 NOV 2020 11:21AM by PIB Hyderabad

మర్యాదాపురుషోత్తముడు, సత్యవాక్పరిపాలకుడైన శ్రీరాముడి జీవితం నుంచి నవతరం ప్రేరణ పొంది.. రాముడు చూపిన విలువలను తమజీవితంలో ఆచరిస్తూ తమ తమ జీవితాల్లో విజయాన్ని సాధించాలని గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు సూచించారు. 

 

శుక్రవారం ఉపరాష్ట్రపతి నివాసం లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ సమావేశ మందిరం నుంచి అంతర్జాల వేదిక ద్వారా ‘తవాస్మి-రామాయణ స్ఫూర్తితో సానుకూల జీవితం, నైపుణ్యం’ పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘సత్యం, ధర్మం, విలువలు, నైతికతల కలబోత అయిన శ్రీరాముడి జీవితాన్ని ప్రతి ఒక్కరూ చదివి తెలుసుకుని, జీవితాలకు అన్వయించుకుని ఆచరించాలని సూచించారు. తల్లిదండ్రులు, సోదరులు, భార్య, మిత్రులతో పాటు చివరకు శత్రువుతో కూడా ఆయన వ్యవహరించిన గౌరవప్రదమైన తీరును, ఆచరించిన ఆదర్శాలను మనం కూడా ఆచరించాలని, అప్పుడే వ్యక్తిగతంగా, సమాజంగా, దేశంగా బలోపేతమవుతామని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. 

 

ఒక గొప్ప వ్యక్తిని ఒకతరం మహా అంటే నాలుగు తరాలు గుర్తుంచుకుంటాయని.. అలాంటిది ఎన్ని యుగాలైనా రాముడి గురించి మాట్లాడుకుని ఆయన ఆదర్శాలను స్ఫూర్తిగా తీసుకుంటున్నామంటే.. మర్యాదాపురుషోత్తముడైన రాముడు అందించిన ధర్మబద్ధమైన, సుపరిపాలనను అర్థం చేసుకోవచ్చని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. అంతటి మహనీయుడి గురించిన ఈ ఆది కావ్యం, అనాది కావ్యానికి నేటికీ ప్రపంచవ్యాప్తంగా విస్తృతమైన ఆదరణ ఉందన్నారు. యువకులు, వయోవృద్ధులు అనే తేడా లేకుండా.. పండితులు, పామరులనే భేదం లేకుండా ప్రతి ఒక్కరి నోళ్లలోనూ రామాయణం వినిపిస్తోందన్నారు. మరీ ముఖ్యంగా నవతరం రామాయణాన్ని అవగతం చేసుకుని రాముడు చూపిన ఆదర్శాలను తమ జీవితాల్లో అనుసరించి విజయతీరాలకు చేరుకోవాలని ఉపరాష్ట్రపతి సూచించారు. 

రావణసంహారం తర్వాత లంకను వదిలి వచ్చేముందు ‘జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపీ గరీయసి’ అన్న రాముడి మాటలను ఉపరాష్ట్రపతి ఉటంకిస్తూ.. ఉపాధికోసం ఏయే దేశాలకు వెళ్లినా, ఎంత ఉన్నతమైన శిఖరాలను అధిరోహించినా మాతృభూమిని మించిన స్వర్గం మరొకటి లేదని భావించి.. మాతృభూమి సేవను, మన దేశాన్ని సుసంపన్నం, సుభిక్షం చేసుకోవడంలో మన బాధ్యతను రామతత్వం గుర్తుచేసిందన్నారు.

ఉన్నతమైన భారత సంప్రదాయాలు, కుటుంబవ్యవస్థను యావత్ ప్రపంచం శ్రద్ధగా గమనిస్తోందన్న ఉపరాష్ట్రపతి, మన సంస్కృతి, మన సభ్యత, మన సంప్రదాయాలు, మన కళలు, మన గ్రంథాల గురించి వివిధ దేశాలు అధ్యయనం చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. అంతటి విలువైన జ్ఞాన సంపదను తెలుసుకునేందుకు ప్రపంచమంతా ప్రయత్నిస్తోందని, వారితో పాటు మనం కూడా విలువైన ఈ సంపదను కాపాడుకుని, ముందు తరాలకు అందజేయడం ప్రతి ఒక్కరి బాధ్యతని ఆయన పేర్కొన్నారు. 

చిన్నారులకు నిద్రపోయేముందుకు కథలు చెప్పే అలవాటు క్రమంగా కనుమరుగవుతోందని ఆవేదన వ్యక్తం చేసిన ఉపరాష్ట్రపతి.. అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యల నుంచి రామాయణం, మహాభారతం వంటి కావ్యాలను, నీతి కథలను తెలుసుకోవడం ద్వారా చిన్నారుల్లో బాల్యం నుంచే నైతిక విలువలు పెంపొందుదాయని.. అది వారితోపాటు దేశ ఉజ్వల భవిష్యత్తుకు దోహదపడుతుందన్నారు. 

చెడుపై మంచి, ధర్మం, సత్యం సాధించిన విజయాలకు గుర్తుగా జరుపుకునే దసరా, దీపావళి పండగల సందర్భంగా అందరికీ ఉపరాష్ట్రపతి శుభాకాంక్షలు తెలిపారు. ఈసారి దీపావళి సందర్భంగా.. కరోనా నేపథ్యంలో ప్రభుత్వాల సూచనలు పాటించాలని, టపాసులు కాల్చకూడదని సందేశాన్నిచ్చారు. 

కొన్నేళ్లపాటు విస్తృతంగా పరిశోధనలు చేసి నాలుగు సంపుటాలతో కూడిన ‘తవాస్మి’ పుస్తకాన్ని తీసుకువచ్చిన రచయిత శ్రీ రాళ్లబండి శ్రీరామ చక్రధర్, సహ రచయిత శ్రీమతి అమర శారదాదీప్తితోపాటు వారి యువ బృందాన్ని ఉపరాష్ట్రపతి అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ సీవీసీ శ్రీ కేవీ చౌదరితోపాటు పుసక్త రచయిత, సహ రచయిత, వారి బృందం, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

 

***



(Release ID: 1670592) Visitor Counter : 274