ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
‘మైగవ్, ఐక్యరాజ్య సమితి మహిళా విభాగం’ సంయుక్తంగా నిర్వహించిన పోటీలో
మహిళలు నడిపే 6 అంకుర సంస్థలకు ‘కోవిడ్-19 శ్రీ శక్తి’ పురస్కారం
Posted On:
03 NOV 2020 6:25PM by PIB Hyderabad
ఐక్యరాజ్య సమితి, మైగవ్ (MyGov) సంయుక్తంగా నిర్వహించిన పోటీలో మహిళల నాయకత్వంలోని 6 అంకుర సంస్థలకు “కోవిడ్-19 శ్రీ శక్తి” పురస్కారం లభించింది. కోవిడ్-19పై పోరులో తోడ్పడే వినూత్న పరిష్కారాల ఆవిష్కరణ కోసం మహిళల నేతృత్వంలోని అంకుర సంస్థల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ పోటీ నిర్వహించబడింది. అలాగే మహమ్మారివల్ల భారీ సంఖ్యలో ప్రభావితులయ్యే మహిళల సమస్యలకు ఆ సంస్థలద్వారా పరిష్కారాన్వేషణ కూడా ఈ పోటీలోని మరో ఉద్దేశం. ఈ మేరకు ‘ఐక్యరాజ్య సమితి మహిళా విభాగం, మైగవ్’ సంయుక్తంగా 2020 ఏప్రిల్‌లో ‘శ్రీ శక్తి పోటీ’కి శ్రీకారం చుట్టాయి.
‘మైగవ్’లో భాగమైన ఆవిష్కరణల వేదిక ఈ విశిష్ట పోటీని నిర్వహించింది. ఇందులో భాగంగా మహిళల నాయకత్వంలోనివేగాక, భారీ సంఖ్యలో ప్రభావితులయ్యే మహిళల సమస్యలకు పరిష్కారాలను ఆవిష్కరించిన అంకుర సంస్థలనుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ పోటీని… (1) ఆలోచన దశ (2) భావనా నిరూపణ దశ (PoC) కింద రెండు దశలుగా నిర్వహించింది. ఈ పోటీకి విశేష స్పందన లభించిన నేపథ్యంలో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 1,265 దరఖాస్తులు అందాయి. వీటిని క్షుణ్నంగా పరిశీలించాక నిర్ణాయక సంఘం ఎదుట ప్రతిపాదనల ప్రదర్శనకు 25 సంస్థలు ఎంపికయ్యాయి. ఈ సంఘంలో ‘నాస్కామ్’ అధ్యక్షురాలు దేవయాని ఘోష్, ‘మైక్రోసాఫ్ట్ ఇండియా’ జాతీయ సాంకేతిక అధికారి (CTO) రోహిణీ శ్రీవాస్తవ, ‘అటల్ ఇన్నొవేషన్ మిషన్’ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఆర్.రమణన్, ‘ఐక్యరాజ్య సమితి మహిళా విభాగం’ భారత శాఖ ఉప-ప్రతినిధి నిష్ఠా సత్యం, మైగవ్ ముఖ్య కార్యనిర్వహణాధికారి (CEO) అభిషేక్ సింగ్ సభ్యులుగా ఉన్నారు.
ఈ పోటీకి ఎంపికైన 25 సంస్థలూ తమతమ ఆవిష్కరణల ప్రతిపాదనలను నిర్ణాయక సంఘానికి సమర్పించాయి. అనంతరం ‘ఆధునికత, వినియోగ సౌలభ్యం, ఔచిత్యం, సమాజంపై వాటి ప్రభావం’ తదితర పారామితుల ప్రాతిపదికన ఆయా అంకుర సంస్థలు సమర్పించిన పరిష్కారాలను సంఘం మూల్యాంకనం చేసింది. ఆ తర్వాత పూర్తిస్థాయి సమీక్షద్వారా తదుపరి దశ పోటీకి 11 సంస్థలు ఎంపికయ్యాయి. తమ పరిష్కారాలను మరింత ఉన్నతీకరించడం కోసం ఎంపికైన సంస్థలన్నిటికీ తలా రూ.75,000 వంతున నగదు బహుమతి అందజేయబడింది. దీంతోపాటు మరింత ఉన్నతస్థాయికి తీసుకెళ్లే అవకాశమున్న పరిష్కార ప్రతిపాదనలను భావనా నిరూపణ దశ (PoC) కు చేర్చేదిశగా ప్రోత్సాహక సదస్సులు నిర్వహించబడ్డాయి. “వ్యాపార-ఆర్థిక నమూనాల రూపకల్పన, చట్టబద్ధత ధ్రువీకరణ, డిజిటల్ విక్రయానుకూలత, ఉత్పత్తి రూపకల్పన, తయారీ విధాన స్థాయి”వంటి చర్చనీయాంశాలతో ఈ సదస్సులు సాగాయి. ‘సెంటర్ ఫర్ సెల్యులర్-మాలిక్యులర్ బయాలజీ’ ప్రాంగణంలో నిర్వహించిన ఈ సదస్సులకు ‘నాస్కామ్‌సహా పరిశ్రమ నిపుణులు, అటల్ ఇంక్యుబేషన్ సెంటర్’ తదితరాల సహకారం లభించింది.
పరిష్కారాల ఉన్నతీకరణ కోసం 11 సంస్థలకూ తగిన సమయం ఇచ్చిన తర్వాత నిర్ణాయక సంఘం తుది ఆవిష్కరణల ప్రదర్శన ప్రక్రియను 2020 అక్టోబరు 27న నిర్వహించింది. ఈ సందర్భంగా అన్ని ఆవిష్కరణల నాణ్యత అద్భుతంగా ఉండటంతో వాటి మూల్యాంకనం సంఘానికి ఓ సవాలుగా మారింది. వీటిపై ముమ్మర చర్చలు, సంప్రదింపుల అనంతరం 3 అగ్రశ్రేణి ఆవిష్కరణలు రూపొందించిన సంస్థలను విజేతలుగా ఎంపిక చేసింది. అంతేకాకుండా అద్భుత నాణ్యతరీత్యా మరో మూడింటిని ‘ఆశావహ ఆవిష్కరణ’ల కింద అదనంగా ఎంపికచేసింది. తొలి మూడు స్థానాల్లో నిలిచిన సంస్థలకు తొలుత ప్రకటించిన తలా రూ.5 లక్షల నగదు బహుమతికి అదనంగా మిగిలిన మూడు సంస్థల ‘ఆశావహ ఆవిష్కరణ’లకూ తలా రూ.2 లక్షల బహుమతి అందజేసేందుకు ఐక్యరాజ్య సమితి మహిళా విభాగం ఔదార్యంతో అంగీకరించింది.
తొలి మూడు స్థానాల్లో నిలిచిన సంస్థలివే:
- ‘రెసదా లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్’- బెంగళూరులోని ఈ సంస్థను డాక్టర్ పి.గాయత్రి హేలా స్థాపించారు. సింథటిక్ రసాయనాలకు బదులుగా మొక్కలనుంచి తీసిన పదార్థాలను ఉపయోగించి గృహ, వ్యవసాయ ఉత్పత్తులను ఈ సంస్థ తయారుచేస్తుంది. డాక్టర్ గాయత్రి మాటల్లో- క్రిములు, బ్యాక్టీరియా/వైరస్‌లు కాలక్రమంలో రసాయనాలను నిరోధించగల స్థాయికి చేరుతాయి. కానీ, ఇటువంటి వాటిపై పోరాటంలో ప్రకృతి ఎల్లప్పుడూ తనదైన మార్గాన్ని అనుసరిస్తుంది. ఈ నేపథ్యంలో కోవిడ్-19పై పోరులో భాగంగా మాత్రమేగాక ఇతరత్రా వ్యాధికారక నాశకంగా తాము తయారుచేసిన వినూత్న ‘ఆల్కహాల్‌రహిత చేతి పరిశుభ్రత’ ద్రవాన్ని (శానిటైజర్) ‘శ్రీ శక్తి’ పోటీకోసం గాయత్రి సమర్పించారు. కాగా, 2017లో తమ ఏడాది వయసున్న కుమార్తె ‘సార్స్’ మహమ్మారితో పోరాడే సమయంలోనే ఆమెకు ఈ ఆవిష్కరణపై ఆలోచన కలిగింది.
- ‘ఐహీల్ హెల్త్‌టెక్ ప్రైవేట్ లిమిటెడ్’ సిమ్లాలోని ఈ సంస్థను కేన్సర్‌ను జయించిన మహిళ రోమితా ఘోష్ స్థాపించారు. కోవిడ్ మహమ్మారిపై యుద్ధంలో ఆరోగ్య సంరక్షణ రంగంలోని ఈ అంకుర సంస్థ ముందువరుసలో నిలిచింది. ఈ మేరకు ఆస్పత్రులకు ‘వ్యక్తిగత రక్షణ ఉపకరణాల’ (PPE)ను సరఫరా చేస్తోంది. అయితే, ఈ కిట్లతోపాటు మాస్కులను కూడా తిరిగి ఉపయోగించడం కోసం ‘అతినీల లోహిత కిరణ శుద్ధీకరణ పేటిక’ను రోమితా పూర్తిగా భారతీయ తయారీ విధానంలో రూపొందించారు. దీనివల్ల ఆస్పత్రులకు, ఆరోగ్య సేవాప్రదాతలకూ విపరీత వ్యయాన్ని తగ్గించడంలో కృషిచేశారు.
- ‘తన్మాత్ర ఇన్నొవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్’- కేరళలోని ఈ సంస్థను డాక్టర్ అంజన రామ్‌కుమార్, డాక్టర్ అనుష్క అశోకన్ ఉత్పత్తి నిర్వాహకులు, సహ వ్యవస్థాపకులుగా నడిపిస్తున్నారు. చేతిరుమాలు లేదా దుపట్టాను సురక్షిత మాస్కుగా ఉపయోగించేలా వాటిపై చల్లుకోగలిగే వినూత్న సూక్ష్మజీవి నాశక ద్రవాన్ని ఈ సంస్థ ఆవిష్కరించింది. తద్వారా పిల్లల రక్షణకు ఇదొక సులభమార్గంగా రూపొందింది. ఈ ఆవిష్కరణ సరళం, సులభ లభ్యం మాత్రమేగాక ఏ వస్త్రాన్నైనా వైరస్-నిరోధక మాస్కుగా మార్చుకోగల వీలు కల్పిస్తుంది. కేవలం వస్త్రంపై చల్లి, తక్షణం ఆరబెట్టుకుని, వెంటనే వాడుకునే వెసులుబాటు ఈ వినూత్న ఉత్పత్తిలోని ప్రత్యేకతగా చెప్పవచ్చు.
‘ఆశావహ ఆవిష్కరణ’ల కింద ఎంపికైన మూడు సంస్థలివే:
- ‘సెరాజెన్ బయోథెరపిటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్’- బెంగళూరులోని ఈ సంస్థ సీఈవో, సహ-వ్యవస్థాపకులు వాసంతి పళనివేల్. ఒక శాస్త్రవేత్త-పరిశోధకురాలుగా వైరస్ లక్షణాలు, ప్రభావాలను ఆమె అధ్యయనం చేశారు. కోవిడ్ సోకినవారిలో తీవ్రంగా ప్రభావితమయ్యే శరీరభాగాల్లో ఊపిరితిత్తులు ఒకటని గ్రహించి, కోవిడ్-19వల్ల కలిగే శ్వాస సంబంధిత సమస్యకు ‘ప్లాస్మా చికిత్స’ పరిష్కారాన్ని ఆమె అభివృద్ధి చేశారు.
- ‘ఎంపతీ డిజైన్ ల్యాబ్స్’- బెంగళూరులోని ఈ సంస్థ సహ వ్యవస్థాపకులు శివి కపిల్ నేతృత్వంలో ఆరోగ్య సంరక్షణపై ప్రధానంగా దృష్టి సారిస్తుంది. వ్యాధి సోకే ప్రమాదంవల్ల ఆస్పత్రులకు వెళ్లలేని గర్భవతులకోసం పరిష్కారాల రూపకల్పనలో మహమ్మారి పరిస్థితులను ఆమె అవకాశంగా మలచుకున్నారు. ఈ దిశగా గర్భస్థ దశపై నిత్య పర్యవేక్షణ కోసం ‘క్రియ’ పేరిట ధరించగలిగే పరికరానికి రూపుదిద్దారు. ఏదైనా ప్రతికూల పరిస్థితి ఏర్పడితే సకాలంలో చర్యలు చేపట్టడం కోసం ఈ ‘ఐవోటీ’ ఆధారిత పరికరం హెచ్చరికలు, సూచనలను అందిస్తుంది.
- ‘స్ట్రీమ్ మైండ్స్’ విద్యా-సాంకేతిక కంపెనీకి తల్లీకూతుళ్లు జయ పరాశర్, అంకిత పరాశర్ వ్యవస్థాపక, సహ-వ్యవస్థాపకులు. దేశవ్యాప్తంగాగల పాఠశాల విద్యార్థుల కోసం విజ్ఞానశాస్త్రం, సాంకేతిక పరిజ్ఞానం, చదవడం/రాయడం, కళలు, గణితం వంటివాటిని ప్రోత్సహించే దిశగా ఈ సంస్థ కృషిచేస్తూంటుంది. ఇందులో భాగంగా వీరు ‘డోబో’ పేరిట పూర్తి స్వయంచలితంగా పనిచేసే ‘రోబో’ను రూపొందించారు. కోవిడ్-19 ముప్పునుంచి రక్షణ దిశగా ఆస్పత్రులు, ఆరోగ్య సంరక్షణ వైద్యశాలల్లో ఈ రోబోలు సేవకుల్లా పనిచేస్తాయి.
‘శ్రీ శక్తి’ విజేతలకు ‘మైగవ్’ అభినందనలు తెలపడంతోపాటు వారి పరిష్కారాలు పూర్తిస్థాయి ఉత్పత్తులుగా పరిణతి చెందగలవన్న ఆశాభావం వెలిబుచ్చింది. అంతేగాక కోవిడ్-19పై జాతి పోరాటంలో తోడ్పడగల బలమైన పరిష్కారాలకు ఇవి ఆలంబన కావాలని ఆకాంక్షించింది. అదే సమయంలో మహిళలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పరిష్కారంలోనూ దోహదపడగలవని ఆశిస్తున్నట్లు పేర్కొంది. దేశంలోగల ప్రతిభా పాటవశక్తికి అసలుసిసలు నిదర్శనాలుగా ‘శ్రీ శక్తి’ పోటీ విజేతలను ప్రశంసించింది. భారత్‌లో మహిళా వ్యవస్థాపక శక్తిని మరింత ప్రోత్సహించడంలో ఈ పోటీ ఎంతగానో దోహదం చేస్తుందని పేర్కొంది.
***
(Release ID: 1669954)
Visitor Counter : 269