ప్రధాన మంత్రి కార్యాలయం

శ్రీ కేశూభాయ్ పటేల్ మరణంపై ప్రధానమంత్రి సంతాప సందేశం


Posted On: 29 OCT 2020 4:20PM by PIB Hyderabad

ఈ రోజు , దేశానికి , గుజరాత్ కి  చెందిన ఒక గొప్ప కుమారుడు మన అందరి నుండి దూరంగా వెళ్ళిపోయారు. మనందరికీ ప్రియమైన, గౌరవనీయమైన  కేశూభాయ్ పటేల్ గారి మరణంతో నేను చాలా బాధగానూ, విచారంగానూ ఉన్నాను. కేశూభాయ్ మనల్ని  వదిలి వెళ్ళడం తండ్రి లాంటి వ్యక్తి వదిలి వెళ్లిపోవడం తో  సమానం గా ఉంది. ఆయన మృతి నాకు వ్యక్తిగత తీరని ఆవేదనను మిగిల్చింది, అది ఎన్నటికీ తీరదు. దాదాపు ఆరు దశాబ్దాల ప్రజా జీవితం, నిరంతరం ఒకే లక్ష్యం -దేశభక్తి, జాతీయ ప్రయోజనం.

కేశుభాయ్ గొప్ప వ్యక్తిత్వం గల వ్యక్తి. ఒకవైపు ఆచరణలో సౌమ్యత మరియు మరోవైపు నిర్ణయాలు తీసుకునే బలమైన సంకల్పం ఆయన లో ఉన్న గొప్ప లక్షణాలు. ఆయన తన జీవితంలోని ప్రతి క్షణాన్ని సమాజ సేవకు, సమాజంలోని ప్రతి వర్గానికి అంకితం చేశారు. ఆయన ప్రతి చర్య గుజరాత్ అభివృద్ధి కోసం, ఆయన ప్రతి నిర్ణయం ప్రతి గుజరాతీకి సాధికారత కల్పించడమే.

ఒక సాధారణ వ్యవసాయ కుటుంబం నుండి వచ్చిన మా కేశుభాయ్ పేదల, రైతుల బాధను, వారి దుస్థితిని అర్థం చేసుకున్నారు. రైతుల సంక్షేమం ఆయనకు ముఖ్యమైంది. ఆయన ఎమ్మెల్యేగా, పార్లమెంటు సభ్యుడిగా, మంత్రిగా లేదా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా, కేశుభాయ్ తన ప్రణాళికలు, నిర్ణయాలలో రైతుల ప్రయోజనాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. గ్రామం, పేదలు మరియు రైతుల జీవితాన్ని సులభతరం చేయడానికి ఆయన చేసిన కృషి, జాతీయవాదం, ప్రజా భక్తి యొక్క ఆదర్శాలు ఆయన జీవితమంతా చేసిన కృషి తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుంది.

కేశుభాయ్‌కు గుజరాత్ లోని ప్రతీ ఇంచు ఇంచు బాగా తెలుసు. గుజరాత్‌లోని ప్రతి ప్రాంతానికి జనసంఘ్, బిజెపిలను తీసుకెళ్లి, ప్రతి ప్రాంతంలో వారిని బలోపేతం చేశారు. ఎమర్జెన్సీ రోజుల్లో కేశూభాయ్ ప్రజాస్వామ్యం కోసం ఎలా పోరాడారో నాకు గుర్తుంది.

కేశుభాయ్ నా లాంటి చాలా మంది సాధారణ కార్యకర్తలకు చాలా చాలా నేర్పించారు, ఎల్లప్పుడూ మార్గనిర్దేశం చేసారు. నేను ప్రధాని అయ్యాక కూడా ఆయనతో సన్నిహితంగా ఉండేవాడిని. గుజరాత్ వెళ్ళడానికి నాకు అవకాశం వచ్చినప్పుడల్లా, నేను ఆయన ఆశీర్వాదం కోసం వెళ్లే వాడిని.

కొద్ది వారాల క్రితం, సోమనాథ్ ట్రస్ట్ యొక్క వర్చువల్ సమావేశంలో కూడా, నేను ఆయన తో సుదీర్ఘంగా సంభాషించాను, ఆయన చాలా సంతోషంగా ఉన్నాడు. కరోనా యొక్క ఈ కాలంలో నేను ఆయన తో ఫోన్‌లో చాలా సార్లు మాట్లాడాను , నేను ఆయన ఆరోగ్యంకు సంబంధించి వివరాలను అడుగుతూనే ఉన్నాను. దాదాపు 45 సంవత్సరాల పరిచయం, సంస్థ, సంఘర్షణ, వ్యవస్థకు సంబంధించిన విషయం అయినా, అనేక సంఘటనలు నేడు నా స్మృతి పట్టికలో జ్ఞప్తికి వస్తున్నాయి.

ఈ రోజు, ప్రతి బిజెపి కార్యకర్త కూడా నాలాగే చాలా బాధగా ఉన్నాడు. నా ఆలోచనలు, సంతాపం కేశూభాయ్ కుటుంబంతో, శ్రేయోభిలాషులతో ఉన్నాయి . ఈ దుఃఖసమయంలో, నేను ఆయన కుటుంబంతో నిరంతరం సంప్రదిస్తూనే ఉన్నాను.

కేశుభాయ్ కి తన పాదాల దగ్గర స్థానం ఇవ్వాలని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని నేను దేవుడిని ప్రార్థిస్తున్నాను.

ఓం శాంతి !!!

******



(Release ID: 1669215) Visitor Counter : 175