ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం

సర్దార్ వల్లభభాయ్ పటేల్ - నా ఆరాధ్య నాయకుడు


Posted On: 31 OCT 2020 11:51AM by PIB Hyderabad

భారతమాత ప్రియ పుత్రుల్లో ఒకరైన సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతిని ఈ రోజు మనం జరుపుకుంటున్నాం. ఈ నేపథ్యంలో ప్రతి పౌరుడు ముఖ్యంగా యువతరం వారి గొప్పతనాన్ని, ఆధునిక భారతదేశ నిర్మాణంలో వారు పోషించిన నిరుపమాన పాత్రను గురించి తెలుసుకుని వారి ఆదర్శంతో ముందుకు సాగాల్సిన సమయమిది.

శ్రీ చక్రవర్తుల రాజగోపాలచారి ఒక సారి వల్లభభాయ్ అంటే ఏమిటి? అని అడిగారు. అనంతరం “వల్లభభాయ్ అంటే ప్రేరణ, ధైర్యం, విశ్వాసం, శక్తికి ప్రతిరూపం. అలాంటి మరొకరిని మళ్లీ చూడలేము..” అంటూ ఆయనే స్వయంగా తెలియజేశారు.

వారి వ్యక్తిత్వం అలాంటింది. చివరకు లార్డ్ వావెల్ కూడా తన డైరీలో సర్దార్ పటేల్ గురించి రాస్తూ... “కాంగ్రెస్ నాయకుల్లో అత్యంత ఆకట్టుకున్న వ్యక్తి, స్థితప్రజ్ఞత గలిగినవారు” అని రాసుకున్నారు.

1875 అక్టోబర్ 31న నడియాడ్ (గుజరాత్)లోని ఓ సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన సర్దార్ పటేల్, చిన్న తనం నుంచే వారి మాతృమూర్తి వివరించి చెప్పిన రామాయణ, మహాభారత కథలతో బాగా ప్రభావితులయ్యారు. నైతికతను ప్రేరేపించే ఈ కథలను తెలుసుకోవడం ద్వారా ఆయన చిన్నతనం నుంచి అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడే గుణాన్ని పెంచుకున్నారు. తన పాఠశాల రోజుల్లో కూడా తోటి విద్యార్థులకు అన్యాయం జరుగుతోందని భావించినప్పుడల్లా ఆయన అనేక నిరసనలకు నాయకత్వం వహించారు. శిక్షాభయం ఏ రోజూ ఆయన్ను అడ్డుకోలేకపోయింది.

1857లో భారతదేశ మొదటి స్వరాజ్య సంగ్రామంలో సర్దార్ పటేల్ తండ్రి శ్రీ జావరి భాయ్ పటేల్, ఝాన్సి రాణితో కలిసి బ్రిటీష్ సేనలకు వ్యతిరేకంగా పోరాడారని మనలో చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. సర్దార్ పటేల్ తమ తండ్రి గారి వ్యక్తిత్వాన్ని కూడా వారసత్వంగా పొందారు. పుట్టుకతోనే ఉన్నత వ్యక్తిత్వం, పోరాడే తత్వం, నిర్వహణ సామర్థ్యాన్ని కలబోసిన అసాధారణమైన నాయకుడాయన.

వ్యవసాయం అన్నా, అన్నదాతలన్నా సర్దార్ పటేల్ గారికి ఎంతో అభిమానం. ఆయన హృదయానికి వ్యవసాయం మరింత దగ్గరగా ఉండేది. అందుకే వలస పాలకులు రైతుల పట్ల ప్రతికూలంగా వ్యవహరించడాన్ని ఆయన తీవ్రంగా ప్రతిఘటించారు.

బోర్సాడ్ లో న్యాయవాది అయిన తొలినాళ్ళలో కూడా, వ్యవస్థ ద్వారా అన్యాయానికి గురైన వారికి ఎల్లప్పుడూ సహాయం చేసి, ప్రజల ప్రేమను, అభిమానాన్ని సంపాదించుకున్నారు. తర్వాత ఇంగ్లండ్ వెళ్ళి, ఉన్నత న్యాయవిద్యను అభ్యసించి, భారతదేశానికి తిరిగి వచ్చి విజయవంతమైన గొప్ప న్యాయవాదిగా స్థిరపడ్డారు.

వారి స్వతంత్ర భావాలు, మాతృభూమి పట్ల అవ్యాజమైన ప్రేమ వెరసి వారిని స్వరాజ్య సంగ్రామం దిశగా ఆకర్షితులయ్యేలా చేశాయి. గాంధీజీ నిర్వహించే సత్యాగ్రహాలకు సర్దార్ పటేల్ వెన్నెముకగా మారారు. దేశానికి సేవ చేసేందుకు లాభదాయకమైన వృత్తిని కూడా వదలిపెట్టి, స్వరాజ్య సంగ్రామంలో పాల్గొన్నారు.

బ్రిటీష్ వారు అన్యాయమైన పన్నులను విధించినందుకు బార్డోలిలో జరిగిన రైతుల నిరసనను ఆయన ముందుండి నడిపించిన తీరు, శాసనోల్లంఘన ఉద్యమానికి ఓ చుక్కానిగా చెప్పుకోవాలి. పటేల్ అనతి కాలంలో ప్రజల నుంచి గౌరవాభిమానాలను చూరగొన్నారు. ప్రజలంతా వారిని సర్దార్ అని సంబోధించడం ప్రారంభించారు.

ఈ ఉద్యమంపై ‘వారి ప్రచారం యొక్క నిజమైన విజయం ఇది. భారతదేశమంతా రైతుల్లో నింపిన స్ఫూర్తి ఉన్నతమైనది. రైతుల ఆకాంక్షలు, బలం, విజయాలకు బార్డోలి చిహ్నంగా మారింది’ అని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి.

“మహాత్మ గాంధీ పోరాటానికి నిజమైన సైనికుడు, వారికి వెన్నుచూపడం తెలియదు” అంటూ వినోభాభావే సర్దార్ పటేల్ గారి ధైర్యాన్ని కొనియాడారు.

వారి నిర్వహణ మరియు పరిపాలనా సామర్థ్యం చూసి గాంధీజీ సైతం ముగ్ధులయ్యారు. 1928లో రాసిన ఓ లేఖలో గాంధీజీ "బార్డోలిలో పోరాటం చాలా బాగా జరుగుతోంది. ఇలాంటి ఉన్నతమైన పోరాటాన్ని నడిపిచేందుకు సర్దార్ పటేల్ కలకాలం జీవించాలి” అని ఆకాంక్షించారు. 

నిజానికి సర్దార్ పటేల్ ప్రసంగాలు ప్రజలను చైతన్యపరచడమే గాక, బ్రిటీష్ అణచివేతకు వ్యతిరేకంగా పోరాడేందుకు వారిని ప్రేరేపించాయి. బోర్సాద్ సత్యాగ్రహ సమయంలో గ్రామస్థుల మధ్య ప్రసంగిస్తూ “ప్రభుత్వం మీ ఆస్తులను జప్తు చేస్తుంది, మీ పశువులను తీసుకువెళుతుంది.... మీరు ఓపిగ్గా ఇవన్నీ భరించాలి. న్యాయం మీ వైపు ఉంది. నిజాయితీ పరులు, అహింసా మార్గంలో ముందుకు సాగే వారు  ఎప్పటికీ నష్టపోరు” అంటూ ప్రజలను ఉత్తేజితుల్ని చేశారు.

సర్దార్ పటేల్ జీవితంలో సాధించిన విజయాల్లో కలికితురాయిగా చెప్పుకోవలసింది నిస్సందేహంగా భారత ఏకీకరణ. కచ్చితమైన ప్రణాళిక, చర్చలు, వివరించి చెప్పడంతో పాటు వ్యూహాత్మక నిర్వహణ ద్వారా ఆధునిక చరిత్రలో అత్యున్నత విజయాల్లో ఒకటిగా రాచరిక రాష్ట్రాలను భారత్ లో విజయవంతంగా కలపగలిగారు.

రాచరిక రాష్ట్రాలను ఒప్పించడంలో ఆయనకు ఎన్నో అవరోధాలు ఎదురయ్యాయి. భారతదేశం మొదటి విదేశాంగ కార్యదర్శి కె.పి.ఎస్. మీనన్ రాసినట్లు - "బ్రిటీష్ వారు భారతదేశాన్ని విడిచిపెట్టినప్పుడు... 560 రాచరిక రాష్ట్రాలు ఎటూ పాలుపోని స్థితిలో మిగిలిపోయాయి. ఇది భారతదేశాన్ని ముక్కలు చేయబోతున్నట్లుగా అనిపించింది. సర్దార్ పటేల్ అనే ఉక్కు మనిషి ఆయా రాజులను సరైన విధంగా ముందుకు నడపడం ద్వారా ఈ సమస్యను అధిగమించేలా చేశారు.

దేశ చరిత్రలో ఒక క్లిష్టమైన దశలో సర్దార్ పటేల్ భారతదేశ ప్రాదేశిక ఐక్యత మరియు సమగ్రతను కాపాడేందుకు తన తెలివి, చాతుర్యం, నైపుణ్యం, అనుభవాన్ని ఉపయోగించారు. "మనమంతా భారతదేశ చరిత్రలో ఒక ముఖ్యమైన దశలో ఉన్నాము" అని చెబుతూ, "మనమందరం ఒకటే రక్తం, భావనలతో ఎప్పుడో ఒక్కటిగా మారాము. మన స్ఫూర్తిని ఎవ్వరూ ముక్కలు చేయలేరు” అంటూ రాచరిక రాష్ట్రాల పాలకుల్లో ఐక్యతా స్ఫూర్తిని నింపారు.

ఒడిశాలో జరిగిన ఓ సమావేశంలో సర్దార్ పటేల్ మాట్లాడుతూ, “ నేను పాలకుల స్నేహపూర్వక సలహాల కోసం కటక్ వచ్చాను. పాత పారామౌంట్సీ ప్రతినిధిగానో, ఇతర విదేశీ శక్తి ప్రతినిధిగా కాకుండా, ఓ కుటుంబ సభ్యునిగా కుటుంబ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నాను” అని వారిని మెప్పించి, ఒప్పించగలిగారు.

అదే సమయంలో, భారతదేశాన్ని ఐక్యం చేయాలనే తన ఉద్యమానికి ఎదురైన అన్ని రకాల సమస్యలను, సవాళ్లను పరిష్కరించేందుకు ఆయన సంసిద్ధులయ్యారు. కొంత మంది రాజులు చట్టపరమైన అభిప్రాయాన్ని కోరే నెపంతో ఆలస్యం చేసే వ్యూహాలను అనుసరించడానికి ప్రయత్నిస్తున్న సమయంలో, “మీరంతా న్యాయవాదులను సంప్రదించవచ్చు, కాని నేను చట్టాన్ని తయారుచేస్తాను” అని సున్నితంగా హెచ్చరించారు కూడా.

హైదరాబాద్ నిజాం ఒకడుగు ముందుకు వేసి, స్వతంత్రంగా ఉండాలని ప్రయత్నించినప్పుడు సర్దార్ పటేల్ నిజాం రాజును దారికి తీసుకు వచ్చి, హైదరాబాద్ రాష్ట్రాన్ని మిగతా భారత యూనియన్ లో విలీనం చేయడానికి కఠినంగా వ్యవహరించేందుకు కూడా వెనుకాడలేదు. అదే విధంగా సమయానుసారంగా సర్దార్ పటేల్ తీసుకున్న దృఢమైన నిర్ణయం, సముద్రతీర రాష్ట్రమైన జునాగఢ్ ను సైతం భారత యూనియన్ లో విజయవంతంగా విలీనం చేసింది.

మాంచెస్టర్ గార్డియన్ సర్దార్ గురించి రాస్తూ - “పటేల్ అంటే స్వేచ్ఛ కోసం జరిన పోరాటాన్ని ముందుకు నడిపిన నిర్వాహకుడు మాత్రమే కాదు. పోరాటం తర్వాత నూతన భారతాన్ని నిర్మించిన వాస్తుశిల్పి కూడా. ఒకే మనిషి పోరాటం చేయడంలోనూ, రాజనీతిజ్ఞుడిగా ముందుకు సాగడంలోనూ విజయం సాధించిన సందర్భాలు చాలా అరుదు. సర్దార్ పటేల్ దీనికి మినహాయింపు” అని తెలియజేశారు.

కొన్ని విషయాల్లో గాంధీజీ అభిప్రాయాలతో సర్దార్ పటేల్ ఏకీభవించనప్పటికీ, ఆయన జాతిపితతో పొరపొచ్చాలకు ఏ నాడూ తావు ఇవ్వలేదు. ఎప్పటికీ మహాత్ముని యొక్క నమ్మకమైన శిష్యునిగానే వారి వెంట ముందుకు సాగారు.

ఆల్ ఇండియా సివిల్ సర్వీసుల ఏర్పాటు పటేల్ దేశానికి అందించిన మరో గొప్ప బహుమతి. భారతదేశ ఐక్యత మరియు సమగ్రతలను పరిరక్షించే ఉక్కు కోటలాగా ఈ సేవలకు ఆయన రూపకల్పన చేశారు. ఐ.సి.ఎస్. అధికారులతో జరిగిన సమావేశంలో దేశ సేవ చేయాలనే ఆకాంక్ష గురించి వివరించడమే గాక, దేశ సేవకు సమానంగా తమను తాము దేశానికి అంకితం చేసుకోవాలని అధికారులకు సర్దార్ పటేల్ ఆహ్వానం పలికారు. 

అధికారులను పరిపాలనలో భాగస్వాములుగా సర్దార్ పటేల్ భావించారు. వారు సమగ్రత మరియు నిజాయితీ యొక్క అత్యున్నత ప్రమాణాలను పాటించాలని ఆశించారు. "నా కార్యదర్శి నా అభిప్రాయలకు వ్యతిరేకంగా ఓ సూచనను రాయగలరు. ఒక స్పష్టమైన అభిప్రాయ వ్యక్తికరణ పట్ల నేను ఎప్పుడూ అసంతృప్తి చెందను” అంటూ నిర్మొహమాటంగా తమ అభిప్రాయాలను తెలియజేశారు.

సర్దార్ వల్లభభాయ్ పటేల్ నిజమైన కర్మ యోగి. భారతదేశం ఆర్థికంగా బలంగా, సంపన్నగా, ప్రగతిశీల దేశంగా మారాలని కలలు గన్నారు. వారి దేశీయ వ్యవహారాల శాఖ కార్యదర్శిగా పని చేసిన శ్రీ హెచ్.వి.ఆర్. అయ్యంగార్ ఓ సందర్భంలో “సర్దార్ యొక్క బలం ఎక్కడ ఉందో నేను తరచుగా ఆలోచిస్తూ ఉండేవాడిని. అయన ఎక్కువగా తన పనిని అట్టడుగు స్థాయి నుంచి, ప్రతికూల పరిస్థితుల నుంచి ప్రారంభించేవారు.” అంటూ ఆయనలోని కర్మయోగిని మన ముందు ఆవిష్కరించారు.

మాతృభూమి పట్ల సర్దార్ పటేల్ యొక్క లోతైన మరియు అచంచలమైన నిబద్ధత 1950 నాటి తన చివరి స్వాతంత్ర్య దినోత్సవ సందేశంలో ప్రతిబింబిస్తుంది. “నా జీవితంలో, ఇప్పుడు నేను ఓ సారవంతమైన దశకు చేరుకున్నాను. నా దేశాన్ని గొప్పగా చూడడానికి మరియు మన స్వేచ్ఛా పునాదులను చక్కగా, సురక్షితంగా ఉండేలా చూడడానికి నేను కలిగి ఉన్న అభిరుచిని నా వయసు తగ్గించలేదు.” అని రాసుకున్నారు.

చివరి శ్వాస వరకూ మాతృభూమి సేవలోనే గడిపిన సర్దార్ పటేల్ లోని గొప్ప నాయకుడికి నేను సగౌరవంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.

మాతృభూమి పట్ల ఆయనకున్న ప్రేమ, వారి నాయకత్వ లక్షణాలు, సరళత, నిజాయితీ, సమగ్రత, ఒదిగి ఉండే మనస్తత్వం, చిక్కుముళ్ళను పరిష్కరించగలిగే ఆచరణాత్మక విధానం, క్షేత్రస్థాయి విజ్ఞానం, క్రమశిక్షణ, నిర్వహణా నైపుణ్యం లాంటివి ప్రతి భారతీయుడికి ఎప్పటికీ ప్రేరణ అందిస్తూనే ఉంటాయి. ఆధునిక భారతదేశ నిర్మాత మరియు ఐక్యతా స్ఫూర్తి సర్దార్ పటేల్ కలలను సాకారం చేసే దిశగా మనందరం కలిసి పని చేద్దాం.

నిరాడంబర జీవనానికి, ఉన్నతమైన ఆలోచనలకు సర్దార్ పటేల్ ఓ చుక్కాని వంటి వారు. ఆయన ఎప్పుడూ ప్రేమతో, గౌరవంతో ముందుకు సాగారు.

విభజన వలన దేశం ముక్కలు అయ్యే పరిస్థితులు నెలకొన్న సమయంలో దేశ గృహమంత్రిగా అంతర్గత స్థిరత్వాన్ని తీసుకొచ్చి, కొనసాగించిన తీరు వల్ల ఉక్కుమనిషిగా ఖ్యాతిని సముపార్జించారు.

1950 నాటి తమ చివరి స్వాతంత్ర్య దినోత్సవం సందేశంలో “మన పరిపాలన మరియు ప్రజా వ్యవహారాల్లోని కొన్ని ధొరణులు మరియు పరిణామాలు నన్ను కొంత ఆసంతృప్తికి లోను చేయడమే గాక, నా హృదయాన్ని కలచివేస్తుంటాయి. త్యాగం, నిస్వార్థ ప్రయత్నం మరియు క్రమశిక్షణ సహా ఐక్యతా స్ఫూర్తికి ప్రాధాన్యతనిస్తూ ప్రజాజీవితంలో సింహభాగం గడిపిన వ్యక్తి యొక్క భావాలను దేశం గ్రహించగలదు. ఇప్పుడు ఎవరు మాత్రం ఒకప్పటి వంచన గురించి ఆలోచించగలరు.” అంటూ సానుకూల ఆలోచనలను ప్రేరేపించారు.

“మన ప్రజాజీవితం స్తబ్దుగా ఉన్న జలాల కంచెలా క్షీణిస్తున్నట్లు కనిపిస్తోంది. మన మనస్సాక్షి అభివృద్ధి యొక్క అవకాశాల గురించి సందేహాలు, నిరాశతో బాధపడుతోంది. చరిత్ర లేదా అనుభవం నుంచి మనకు లాభం ఉన్నట్లు అనిపించదు. సారాన్ని పీల్చేసి పిప్పిని మిగిల్చే కాలం కొడవలి చూస్తుంటే మనం నిస్సహాయంగా కనిపిస్తాము.

‘భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన కేవలం మూడేళ్లలోనే మన నాయకులు చేసిన త్యాగాలకు కృతజ్ఞతలు తెలియజేసుకోవాల్సిన ప్రాముఖ్యతను, మనమంతా ఐకమత్యంగా, క్రమశిక్షణతో ఉండాల్సిన అవసరాన్ని, గత నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకెళ్లాల్సిన ఆవశ్యకతతోపాటు మరెన్నో అంశాలను మనకు గుర్తుచేస్తోంది’ అని సర్దార్ పటేల్ ఓ సందర్భంలో పేర్కొన్నారు.

అయినప్పటికీ, మనం ఎదుర్కొనే పనులు ఎప్పటిలాగే సంక్లిష్టమైనవి మరియు మూల్యం చెల్లించాల్సినవి. మనం ఉదాసీన వనరులతో వాటిని ఎదుర్కొంటున్నప్పుడు, అవి మనలో ఉత్తమైన వాటిని ఆశిస్తాయి. మనం పెద్దగా పట్టించుకోని విషయాలకు ఎక్కువ సమయం కేటాయించినట్లు అనిపిస్తుంది. లెక్కించే వాటికి ఇది చాలా తక్కువ. మనం మాట్లాడతాము.

కానీ ముఖ్యమైన అవసరం వచ్చినప్పుడు మాత్రమే. మనం ఇతరుల పనిని విమర్శిస్తాము. కాన మనలో స్వీయ సహకార సంకల్పం లేదు. మనం నడవడం నేర్చుకోకపోయినా, పెద్ద ఎత్తున ఇతరులను అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నాము’ చివరగా, సర్దార్ వల్లభభాయ్ పటేల్ జీవితం, సేవల గురించి ప్రతి యువతరం తెలుసుకోవాలని ఆశిస్తున్నాను. అదే విధంగా ప్రతి ప్రజా సేవకుడు (అధికారి) వారి ప్రసంగాలను తప్పకుండా చదవి, ఆకళింపు చేసుకోవాలి. అలాగే ప్రతి రాజకీయ నాయకుడు సర్దార్ పటేల్ యొక్క సమగ్రత, దృఢత్వం, ప్రజల ఆకాంక్షలను గౌరవించడం లాంటి గొప్ప లక్షణాలను అలవర్చుకోవాలని ఆకాంక్షిస్తున్నాను.

****



(Release ID: 1669178) Visitor Counter : 672