ప్రధాన మంత్రి కార్యాలయం
గుజరాత్ లోని కేవడియా లో అక్టోబర్ 31 న ‘ఏకత దివస్’ కార్యక్రమంలో పాలుపంచుకోనున్న ప్రధాన మంత్రి
ఈ సందర్భంలో ప్రజల చేత ఏకత శపథాన్ని చేయించనున్న ప్రధాన మంత్రి; అలాగే, ఏకత దివస్ పరేడ్ లో కూడా ఆయన పాల్గొంటారు
రెండో ఇంటిగ్రేటెడ్ ఫౌండేశన్ కోర్సు ‘‘ఆరంభ్’’ లో పాలుపంచుకొంటున్న ఇండియన్ సివిల్ సర్వీసెస్ ట్రయినీ ఆఫీసర్స్ తో శ్రీ నరేంద్ర మోదీ సంభాషిస్తారు
కేవడియా సమగ్రాభివృద్ధి కి ఉద్దేశించిన వివిధ ప్రాజెక్టులను ప్రధాన మంత్రి అక్టోబర్ 30, 31 లలో ప్రారంభించనున్నారు
Posted On:
28 OCT 2020 5:48PM by PIB Hyderabad
‘ఉక్కు మనిషి’ సర్ దార్ వల్లభ్ భాయి పటేల్ 145 వ జయంతి సందర్భం లో ఈ నెల 31న గుజరాత్ లోని కేవడియా లో ఏర్పాటు చేసిన ఏకత కార్యక్రమం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాలుపంచుకోనున్నారు. అక్కడ మహా నేత శ్రీ సర్ దార్ వల్లభ్ భాయి పటేల్ తాలూకు స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వద్ద శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ని సమర్పిస్తారు. ప్రజల చేత ప్రధాన మంత్రి ‘ఏకత దివస్’ ప్రతిజ్ఞ ను చేయిస్తారు. ఈ సందర్భంలో ఏర్పాటు చేసిన ఏకత దివస్ పరేడ్ లో ప్రధాన మంత్రి పాల్గొంటారు.
ఏకత దివస్ పరేడ్ లో గుజరాత్ రాష్ట్రానికి చెందిన, సెంట్రల్ రిజర్వ్ ఆర్మ్ డ్ ఫోర్స్ కు చెందిన, సరిహద్దు భద్రత దళానికి చెందిన, ఇండో-టిబెటన్ బార్డర్ పోలీసుకు చెందిన, కేంద్ర పారిశ్రామిక భద్రత దళాలకు చెందిన, నేశనల్ సెక్యూరిటీ గార్డ్ స్ కు చెందిన వారు పాల్గొననున్నారు. సిఆర్ పిఎఫ్ కు చెందిన మహిళా అధికారులు సమర్పించే రైఫిల్ డ్రిల్ ను కూడా ప్రధాన మంత్రి వీక్షిస్తారు. ఏకత దివస్ కార్యక్రమాలలో భాగంగా ఆదివాసీ సంప్రదాయాన్ని కళ్లకు కట్టే ఒక సాంస్కృతిక ప్రదర్శన ను కేవడియా లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సందర్భంలో, భారతీయ వాయు సేన ఒక ఫ్లయ్- పాస్ట్ విన్యాసాన్ని ప్రదర్శించనుంది.
దీని తరువాత, భారతీయ సివిల్ సర్వీసులకు చెందిన వివిధ ఆఫీసర్ ట్రయినీలు 428 మంది ని ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రధాన మంత్రి సంభాషించనున్నారు. మసూరీ లోని లాల్ బహాదుర్ శాస్త్రి నేశనల్ అకాడమి ఆఫ్ అడ్మినిస్ట్రేశన్ (ఎల్ బి ఎస్ ఎన్ ఎఎ) తాలూకు 95వ ఫౌండేశన్ పాఠ్య క్రమం లో భాగంగా నడుపుతున్న ఆరంభ్ 2020 లో ఈ అధికారులు ప్రస్తుతం భాగం పంచుకొంటున్నారు.
ఈసారి ఆరంభ్ 2020 కి ఇతివృత్తంగా ‘‘గవర్నెన్స్ ఇన్ ఇండియా @ 100” ఉండబోతోంది. ఇందులో మూడు ఉప ఇతివృత్తాలు కూడా భాగంగా ఉన్నాయి. అవి.. :
1. ఏక్ భారత్ - శ్రేష్ఠ్ భారత్:
సాంస్కృతిక వివిధత్వం లో ఏకత్వానికి ప్రాముఖ్యాన్ని కట్టబెట్టడం ద్వారా భారతదేశాన్ని ప్రభావవంతంగా మార్చడం. దీనితో పాటు ఆర్థిక వివిధత్వం, దాని ఏకీకరణ భారతదేశ శక్తి అని నిరూపించడం కూడా జరుగుతుంది.
2. ఆత్మనిర్భర్ భారత్:
శక్తి, ఆరోగ్యం, పెద్ద కార్యక్రమాల పరంగా భారత్ ను యోగ్యమైందిగా తీర్చిదిద్దడం జరుగుతుంది.
3. నవీన్ భారత్:
విద్య, పరిశ్రమలు, పరిపాలన రంగాలలో పరిశోధన ను, నూతన ఆవిష్కరణలను
ప్రోత్సహించడం జరుగుతుంది.
ఈ సందర్భంలో 2020 అక్టోబర్ 14 న వివిధ రంగాలకు చెందిన జాతీయ, అంతర్జాతీయ నిపుణులు వారి ఆలోచనలను, అనుభవాలను ట్రయినీ అధికారులకు వెల్లడించారు. దీనికి అదనంగా, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగాని కంటే ముందు ట్రయినీలను ఉద్దేశించి ప్రపంచ బ్యాంకు ఎమ్ డి శ్రీ ఎక్సెల్ వాన్ ట్రాట్ సెన్ బర్గ్ ప్రసంగిస్తారు. అలాగే ట్రయినీ అధికారులు కూడా వారు ఆరంభ్ 2020 లో పొందిన అనుభవాలను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో పంచుకొంటారు. లాల్ బహాదుర్ శాస్త్రి నేశనల్ అకాడమి ఆఫ్ అడ్మినిస్ట్రేశన్ (ఎల్ బిఎస్ఎన్ ఎఎ) ప్రచురించిన ఒక ప్రత్యేక పుస్తకం ‘ఎడ్ మినిస్ట్రేటర్’ ను కార్యక్రమంలో భాగంగా ఆవిష్కరించడం జరుగుతుంది.
కేవడియా సమగ్ర అభివృద్ధి లో భాగంగా అనేక అభివృద్ధి పథకాలను కూడా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2020 అక్టోబర్ 30, 31 లలో ప్రారంభించనున్నారు.
ఈ పథకాలలో భాగంగా ప్రధాన మంత్రి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ కి ఒక ఏకత క్రూజ్ సేవ ను, ఏకత మాల్ ను, బాలల కోసం ఒక పోషక పార్కు ను ప్రారంభిస్తారు. వీటికి తోడు, యూనిటీ గ్లో గార్డెన్ లో శ్రీ నరేంద్ర మోదీ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ తాలూకు వెబ్ సైట్ ను కూడా ఆరంభిస్తారు. ఇది ఐక్య రాజ్య సమితి యొక్క అన్ని ఆధికారిక భాషలలో లభ్యం అవుతుంది. కేవడియా ఏప్ ను కూడా ఆయన ప్రారంభిస్తారు.
కేవడియాలో స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ని అహమదాబాద్ లోని సాబర్ మతీ రివర్ ఫ్రంట్ తో కలిపే ఒక సీప్లేన్ సేవ ను కూడా ప్రధాన మంత్రి ప్రారంభించనున్నారు.
ఏకత క్రూజ్ సేవ
ఏకత క్రూజ్ సేవ మాధ్యమం ద్వారా, పర్యటకులు ఫెరీ బోటు సర్వీస్ లో శ్రేష్ట భారత్ భవన్ మొదలుకొని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వరకు ఉన్న 6 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. దీనితో పాటు స్టాచ్యూ ఆఫ్ యూనిటీ తాలూకు అందమైన దృశ్యాలను చూసి పులకించవచ్చు. ఈ యాత్ర 40 నిమిషాల్లో పూర్తి అవుతుంది. దీనిలో ఒక నావ లో గరిష్ఠంగా 200 మంది యాత్రికులు ప్రయాణం చేయవచ్చు. ఫెరీ సేవల కోసం కొత్త గోరా వంతెన ను నిర్మించారు. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ని చూడవచ్చే పర్యటకులకు బోటింగ్ సేవలను అందించాలన్నదే నావ సేవ ను ఆరంభించడంలోని ఉద్దేశ్యంగా ఉంది.
ఏకత మాల్
భారతదేశంలో గల ప్రస్తుత హస్తకళలు, సాంప్రదాయక ఉత్పత్తుల ను ఏకత మాల్ లో ప్రదర్శించడం జరుగుతుంది. దేశం నలు మూలల నుంచి వచ్చిన ఉత్పాదనలను ఇక్కడ ప్రదర్శిస్తారు. ఏకత సందేశాన్ని ఇవ్వడమే దీని ఉద్దేశ్యం. ఈ మాల్ ను 35వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. మాల్ లో 20 ఎంపోరియమ్ లు ఉన్నాయి. ఇవి ఒక్కొక్క నిర్దిష్ట రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తాయి. ఏకత మాల్ ను కేవలం 110 రోజుల్లో నిర్మించడమైంది.
చిన్న పిల్లల కోసం పోషక పార్కు
ఇది పిల్లల కోసం ప్రపంచంలోనే మొట్టమొదటి సాంకేతిక పరిజ్ఞానం ఆధారితమై న్యూట్రిశన్ పార్కు. దీనిని 35 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటుచేశారు. పార్కు లో ఒక న్యూట్రీ ట్రేన్ ను కూడా నడపనున్నారు. ఈ రైలు స్టేశన్ ల పేర్లను కూడా ఎంతో ఆకర్షణీయంగా పెట్టడం జరిగింది. వాటికి ‘ఫల శాఖ గృహం', ‘పాయోనగరీ’, ‘అన్నపూర్ణ’, ‘పోషణ్ పురాణ్’, ‘స్వస్థ భారతం’ అనే పేర్లు పెట్టడమైంది. వివిధ విద్యా సంబంధి, వినోద కార్యకలాపాల ద్వారా పోషకాహారం పట్ల జాగృతి ని విస్తరింపజేయాలన్నది ఈ పార్కు ఉద్దేశ్యంగా ఉంది. ఇందుకోసం పార్కు లో "మిరర్ మేజ్", "5 డి వర్చువల్ రియల్టీ థియేటర్", "ఆగుమెంటెడ్ రియల్టీ గేమ్స్" ను కూడా ఏర్పాటు చేయడమైంది.
ఆరంభ్ 2020
అఖిల భారతీయ సేవలు, గ్రూప్- ఎ కేంద్రీయ సేవలు, విదేశ సేవల ప్రొబేషనర్లందరినీ ఒక కామన్ ఫౌండేశన్ కోర్సు (సిఎఫ్ సి) మాధ్యమం ద్వారా ఒక చోటుకు తీసుకురావడం కోసం తలపెట్టిన కార్యక్రమమే ‘‘ఆరంభ్’’. ఒక పరంపరగా విభాగాలు, సేవల స్థాయి లో బాధ్యతల పంపిణీ చోటు చేసుకొంటున్న విధానాన్ని అంతం చేయాలనేదే ఈ కార్యక్రమం ఉద్దేశ్యం. సివిల్ అధికారి నూతనమైన ఆలోచనల సాయంతో తన ఉద్యోగజీవనాన్ని మొదలుపెట్టగలగాలన్నదే దీని వెనుక ఉన్న ధ్యేయం. వివిధ విభాగాలు, రంగాలతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా పనిచేయగల సామర్ధ్యాన్ని సివిల్ సర్వీసు అధికారుల్లో పెంపొందించాలని, ‘‘ఆరంభ్’’ లక్ష్యంగా పెట్టుకుంది.
“ఆరంభ్” ను 2019లో 94 వ ఫౌండేషన్ కోర్సు లో భాగంగా మొదలుపెట్టడమైంది. దీనిలో భాగంగా 20 విభిన్న సర్వీసులకు చెందిన ట్రైనీ ఆఫీసర్స్ గుజరాత్ లోని కేవడియా లో గల స్టాచ్యూ ఆఫ్ యూనిటీ లో ఒక వారం రోజుల పాటు సాగే కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సందర్భంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమక్షంలో ఒక సమర్పణను ఇవ్వడం జరుగుతుంది. దీనితో పాటు ప్రధాన మంత్రి ట్రైనీ ఆఫీసర్స్ తో ముఖాముఖి సంభాషిస్తారు. వారిని ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు కూడాను.
ఈ సంవత్సరం, ఆరంభ్-2020 రెండో కార్యక్రమం లాల్ బహాదుర్ శాస్త్రి నేశనల్ అకాడమి ఆఫ్ అడ్మినిస్ట్రేశన్ (ఎల్ బిఎస్ఎన్ఎఎ) లో 2020 అక్టోబర్ 14 నుంచి 31 వరకు జరుగుతోంది. ఈ కార్యక్రమంలో, పద్దెనిమిది సర్వీసుల కు, రాయల్ భూటాన్ సర్వీసుల కు చెందిన 428 మంది ఆఫీసర్ ట్రైనీలు పాల్గొంటున్నారు. అయితే, ప్రస్తుతం నెలకొన్న మహమ్మారి స్థితి కారణంగా, ఈ సంవత్సరం ఆరంభ్-2020 ని వర్చువల్ గా నిర్వహిస్తున్నారు. దీని కి ‘‘భారతదేశం లో పరిపాలన @ 100’’ అనే అంశాన్ని ఇతివృత్తంగా తీసుకోవడమైంది.
ఇక ఉప ఇతివృత్తాలు గా “ఏక్ భారత్ శ్రేష్ట భారత్”, “ఆత్మ నిర్భర్ భారత్” తో పాటు “నవీన్ భారత్” ను తీసుకొన్నారు. భారతదేశంలో గల సాంస్కృతిక వైవిధ్యం లో ఏకత్వం అనే విశిష్టత ద్వారా భారతదేశాన్ని ప్రభావశీలమైందిగా మార్చడం వీటి ఉద్దేశ్యం గా ఉంది. అలాగే, ఆర్థిక వైవిధ్యం, దాని ఏకీకరణ లు భారతదేశానికి బలంగా మారేటట్టు చూడటం మరొక ఉద్దేశ్యం గా ఉంది. ఇదే మాదిరిగా శక్తి, ఆరోగ్యం, పెద్ద కార్యక్రమాల నిర్వహణ కు యోగ్యం గా భారత్ ను తీర్చిదిద్దడం, పరిశోధన, విద్య, పరిశ్రమ, పరిపాలన రంగాలలో కొత్తమార్పులను తీసుకువచ్చి భారతదేశాన్ని స్వయంసమృద్ధంగా మార్చాలన్నది కూడా ఇంకొక ఉద్దేశ్యంగా ఉంది.
***
(Release ID: 1668285)
Visitor Counter : 162
Read this release in:
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam