యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ

సమాజాన్ని ఏకతాటిపైకి తీసుకురావడంలో క్రీడలు శక్తివంతమైన మాధ్యమం: శ్రీ కిరెన్ రిజిజు

శారీరక విద్య మరియు క్రీడలపై జరిగిన వెబ్‌నార్ ప్రారంభ సమావేశానికి హాజరైన క్రీడా మంత్రి

Posted On: 27 OCT 2020 7:17PM by PIB Hyderabad

నేషనల్ స్పోర్ట్స్ యూనివర్శిటీ మణిపూర్ మరియు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు చెందిన లక్ష్మీబాయి నేషనల్ కాలేజీ త్రివేండ్రం సంయుక్తంగా నిర్వహించిన “శారీరక విద్య మరియు క్రీడలు: సమాజాన్ని ఏకం చేసే శక్తి” అనే ఆంశంపై జరిగిన రెండు రోజుల అంతర్జాతీయ వెబ్‌నార్ ప్రారంభ సమావేశానికి క్రీడా మంత్రి శ్రీ కిరెన్ రిజిజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నేషనల్‌ స్పోర్ట్స్‌ యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్‌ ఫ్రొఫెసర్ ఆర్‌సి మిశ్రా (రిటైర్డ్ ఐఎఎస్ ) మరియు ఇంటర్నెషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్ పిజికల్ ఎడ్యుకేషన్ (ఎఫ్‌ఐఇపి) వైస్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ బ్రానిస్లావ్ అంటాలా, స్లోవేకియాలు కూడా వెబ్‌నార్‌లో  పాల్గొన్నారు.  గంటసేపు జరిగిన ఈ  వెబ్‌నార్‌లో కార్యక్రమానికి హాజరైన వక్తలు..సమాజంలో శారీరక విద్య యొక్క ప్రాముఖ్యత, మరియు దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సమాజాన్ని ఏకం చేయడంలో క్రీడలు ఏ విధంగా దోహద పడతాయి అన్న ఆంశంపై ప్రసంగించారు.



శ్రీ కిరెన్ రిజిజు మాట్లాడుతూ, “వెబ్‌నార్ యొక్క ఇతివృత్తం శారీరక ఆరోగ్యానికి మాత్రమే కాకుండా సమాజానికి కూడా చాలా ముఖ్యమైన ఆంశమని చెప్పారు. క్రీడలో విజయంతో ఒక ప్రాంతం అభివృద్ధి చెందడమే గాక సమాజం మొత్తం ఎంతో సాధిస్తుందని చెప్పారు. భారతదేశ మహిళలకు స్ఫూర్తిగా నిలిచిన  మేరీకోమ్ ఎనిమిది ప్రపంచ ఛాంపియన్‌షిప్ పతకాలు సాధించారని అందులో నాలుగు పతకాలు తల్లి అయిన తర్వాత కూడా సాధించారని చెప్పారు. మాతృత్వం తర్వాత కూడా విజయవంతం కాగలరన్న స్పూర్తి భారతీయ మహిళల్లో ఆమె నింపారని చెప్పారు. పీలే వంటి ఆటగాళ్లు తమ స్వదేశమైన బ్రెజిల్‌ను దాటి వారి స్పూర్తిని ప్రపంచానికి చాటి చెప్పారని అటువంటివాళ్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారని చెప్పారు. సమాజాన్ని శక్తివంతం చేసే చిహ్నంగా జెస్సీ ఓవెన్స్ లాంటివాళ్లు నిలిచారని చెప్పారు. క్రీడల్లో సాధించిన విజయాలు ఆటకు మించిన అనేక విషయాలను చూపుతాయి ” అని వెల్లడించారు.

సామూహిక భాగస్వామ్యం యొక్క ప్రాముఖ్యత గురించి మరియు భారతదేశాన్ని క్రీడా శక్తి కేంద్రంగా మార్చడంలో ఫిట్ ఇండియా మరియు ఖేలో ఇండియా పాత్ర గురించి కూడా శ్రీ రిజిజు మాట్లాడారు. “ప్రధాని మోడీ చేపట్టిన ఖేలో ఇండియా ఉద్యమానికి ఆటలు మరియు శారీరక విద్యలు ప్రేరణగా నిలిచాయని చెప్పారు. ఓ వైపు ఖేలో ఇండియా మరోవైపు ఫిట్ ఇండియాలకు సమాన ప్రాతినిథ్యం ఇస్తున్నామని వెల్లడించారు. దేశంలోని ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండేలా ఫిట్ ఇండియా ద్వారా  అవగాహన కల్పిస్తున్నామని దేశాన్ని క్రీడాశక్తిగా మార్చగల సత్తా ఈ కార్యక్రమాలకు  ఉందని చెప్పారు. ఈ మేరకు తాము సామాజిక భాగస్వామ్యాన్ని నిర్ధారించాలన్నారు. అంతా ఏకమైన తర్వాత భారతదేశం అగ్రస్థానానికి రాకుండా ఆపే శక్తి ఎవరికి లేదన్నారు. భారతదేశం ఫిట్‌గా మారితే ప్రపంచం ఫిట్‌గా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఖేలో ఇండియా కార్యక్రమం ద్వారా దేశంలోని అన్ని మూలల నుండి ప్రజలు క్రీడల్లో పాల్గొనవచ్చని చెప్పారు.

ఆర్‌సి మిశ్రా మాట్లాడుతూ, “ప్రభుత్వం  కొత్త విద్యా విధానాన్ని ప్రారంభించిన నేపథ్యంలో ఈ వెబ్‌నార్ యొక్క థీమ్ దానికి ఖచ్చితంగా సరిపడే విధంగా ఉందని చెప్పారు. కొత్త విద్యా విధానంలో పిజికల్ ఎడ్యుకేషన్, క్రీడలు ప్రముఖంగా ఉన్నాయన్నారు. సాధారణ విద్యలోనే ఇవి భాగమై ఉన్నాయన్నారు. సమాజంలో ప్రజలు ఆరోగ్యంగా ఉండడానికి  రుగ్మతల బారిన పడకుండా ఉండడానికి ప్రజల మధ్య సంబంధాలు మెరుగపడడానికి ఆటలు ఎంతగానో దోహదపడతాయని చెప్పారు. సామూహిక పని విధానాన్ని, ఆరోగ్యాన్నికాపాడుకోవడాన్ని క్రీడాలు పెంపొందిస్తాయని చెప్పారు. శాంతి మరియు ఐక్యతను ప్రోత్సహించడానికి పలువురు ప్రపంచనేతలు క్రీడనే సాధనంగా చేసుకున్నారని చెప్పారు.

ప్రొఫెసర్ బ్రానిస్లావ్ అంటాలా మాట్లాడుతూ, “గత జూన్‌ నుండి  భారత ప్రభుత్వం ఎస్‌ఏఐ ఎల్‌ఎన్‌పిఈ ఆన్‌లైన్‌ క్లాసుల వంటి మంచి కార్యక్రమాలను చేపట్టిందన్నారు. ఈ కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న 60 మంది విద్యావేత్తలు సహకరించారని చెప్పారు. జాతీయ క్రీడా విశ్వవిద్యాలయం భారతదేశానికి చెందిన అనేక మందికి శిక్షణ ఇస్తుందని తాను ఆకాంక్షిస్తున్నట్టు చెప్పారు.

 

*******



(Release ID: 1668052) Visitor Counter : 111