ప్రధాన మంత్రి కార్యాలయం

నిఘా పై, అవినీతి నిరోధం పై జాతీయ సమ్మేళనాన్ని ప్రారంభించిన ప్రధాన మంత్రి


అవినీతి విషయంలో జీరో టాలరెన్స్ విధానాన్ని భారతదేశం అనుసరిస్తోంది: ప్రధాన మంత్రి

శిక్షాత్మక నిఘా కంటే నివారక నిఘా శ్రేష్ఠతరమైంది: ప్రధాన మంత్రి


అవినీతి తో పోరాటం చేయడానికి పరిపాలన పారదర్శకంగాను, బాధ్యతగలదిగాను, జవాబుదారుగాను, ప్రజలకు సమాధానం చెప్పే విధంగాను ఉండాలి:  ప్రధాన మంత్రి

తర తరాలుగా అవినీతి దేశ ప్రగతి మార్గం లో ఒక పెద్ద అడ్డంకి గా ఉంది: ప్రధాన మంత్రి

Posted On: 27 OCT 2020 7:38PM by PIB Hyderabad

అప్రమత్త భారతదేశం, సమృద్ధ భారతదేశం (सतर्क भारत, समृद्ध भारत) అనే ఇతివృత్తం తో ఏర్పాటు చేసిన ‘నిఘా పై,  అవినీతి నిరోధం పై జాతీయ సమ్మేళనం’ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభించారు.  కేంద్ర దర్యాప్తు సంస్థ (సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్..సిబిఐ) ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం పౌరుల భాగస్వామ్యం తో సార్వజనిక జీవనం లో సమగ్రత ను, సత్యవర్తన ను ప్రోత్సహించడం లో భారతదేశం  నిబద్ధత ను పునరుద్ఘాటించి, నిఘా సమస్యలపై శ్రద్ధ వహిస్తోంది.

సమ్మేళనాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, సర్ దార్ పటేల్ సమైక్య భారతదేశ రూపశిల్పియే కాకుండా దేశ పరిపాలన వ్యవస్థల రూపశిల్పి కూడా అన్నారు.  దేశ ఒకటో హోం మంత్రి గా శ్రీ పటేల్ దేశం లో సామాన్యుల కోసం  వ్యవస్థ ను నిర్మించడానికి, అలాగే సత్యనిష్ఠ పునాది గా కలిగిన విధానాలను రూపొందించడానికి కృషి చేశారని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.  అయితే, అనంతర దశాబ్దాల్లో వేలాది కోట్ల రూపాయల మోసాలు జరిగాయి, బూటకపు కంపెనీలు వెలశాయి, పన్ను వేధింపులు చోటుచేసుకొన్నాయి, పన్ను ఎగవేత వంటి భిన్న స్థితి తలఎత్తింది అంటూ శ్రీ నరేంద్ర మోదీ విచారాన్ని వెలిబుచ్చారు.

2014 సంవత్సరం లో, ఒక పెద్ద మార్పును తీసుకురావాలని, కొత్త దిశ లో పయనించాలని దేశం సంకల్పించుకొన్నప్పుడు, ఈ వాతావరణాన్ని మార్చడం ఒక పెద్ద సవాలు గా నిలచిందని ప్రధాన మంత్రి అన్నారు.  సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు ఉన్నప్పటికీ నల్లధనానికి వ్యతిరేకంగా కమిటీ ఏర్పాటు ఆగిపోయిందని ఆయన తెలిపారు.  ఈ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈ కమిటీ ని ఏర్పాటు చేయడం, అవినీతి కి వ్యతిరేకంగా ప్రభుత్వ నిబద్ధత ను చాటింది అని ఆయన అన్నారు.  2014వ సంవత్సరం నుంచి దేశం బ్యాంకింగ్ రంగం, ఆరోగ్య రంగం, విద్య రంగం, కార్మిక రంగం, వ్యవసాయ రంగం మొదలైన అనేక రంగాల్లో సంస్కరణలను చూసిందని ఆయన చెప్పారు.   ఈ సంస్కరణల ప్రభావం తో, ఆత్మనిర్భర్ భారత్ ప్రచార ఉద్యమాన్ని విజయవంతం చేయడానికి దేశం ఇప్పుడు తన పూర్తి శక్తి తో ముందుకు సాగుతోందని ఆయన వివరించారు.  భవిష్యత్తు లో భారతదేశాన్ని ప్రపంచం లోని అగ్రగామి దేశాల్లో ఒకటి గా రూపొందించాలి అనే ఆశ ను ఆయన వ్యక్తం చేశారు.

పరిపాలన వ్యవస్థ లు పారదర్శకంగాను, బాధ్యతగలదిగాను, జవాబుదారుగాను, ప్రజలకు సమాధానం చెప్పే విధంగాను ఉండవలసిన అవసరాన్ని ప్రధాన మంత్రి నొక్కిచెప్పారు.  అవినీతి తాలూకు ఏ రూపం అయినా సరే దీని అతి పెద్ద శత్రువు అని ఆయన అన్నారు.  అవినీతి ఒక వైపు దేశ అభివృద్ధి ని దెబ్బతీస్తుందని, మరొక వైపు సామాజిక సమతుల్యత ను, వ్యవస్థ పై ప్రజలు కలిగి ఉండవలసిన నమ్మకాన్ని నాశనం చేస్తుందని ఆయన వివరించారు.  అందువల్ల, అవినీతి ని అరికట్టడం అనేది ఏ ఒక్క ఏజెన్సీ లేదా సంస్థ బాధ్యత మాత్రమే కాక ఉమ్మడి బాధ్యత అని ఆయన స్పష్టంచేశారు.  అవినీతి ని స్వతంత్ర విధానంతో వ్యవహరించలేమని ఆయన అన్నారు.

ఇది దేశం మొత్తానికి సంబంధించి ఆలోచించినప్పుడు, నిఘా పరిధి ఎంతో విస్తృతం గా ఉంటుంది.  అవినీతి, ఆర్థిక అపరాధాలు, డ్రగ్ నెట్ వర్క్, మనీలాండరింగ్, ఉగ్రవాదం, లేదా తీవ్రవాద కార్యకలాపాలకు నిధులను అందించడం మొదలైనవన్నీ ఒకదానితో మరొకటి పెనవేసుకొని ఉండటాన్ని చాలా సందర్భాలలో గమనించడమైందని ఆయన అన్నారు.

అందువల్ల అవినీతిపై పోరాడటానికి సమగ్రమైన దృష్టి కోణంతో సహా వ్యవస్థితమైన లెక్కల తనిఖీ (ఆడిట్), సామర్థ్యాలను పెంపొందించడం, శిక్షణ వంటి వాటి ఆవశ్యకత ఉందని ఆయన సూచించారు.  అన్ని ఏజెన్సీలు సమష్టి గా, సహకార స్ఫూర్తి తో పని చేయాలి అని ప్రధాన మంత్రి ఉద్ఘాటించారు.  ‘అప్రమత్త భారతదేశం, సమృద్ధ భారతదేశం’ ను రూపొందించడానికి అవసరమైన నూతన మార్గాల ను సూచించడానికి ఈ సమావేశం ఒక సమర్థ వేదికగా అవతరించాలని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆకాంక్షించారు.

పేదరికం తో పోరాడుతున్న మన దేశం లో అవినీతి కి స్థానం లేదని 2016 నిఘా సంబంధి జాగృతి కార్యక్రమం లో తాను చెప్పిన విషయాన్ని ప్రధాన మంత్రి ఈ సందర్భం లో గుర్తు చేశారు.  దశాబ్దాలుగా పేదలకు అందవలసిన ప్రయోజనాలు అందలేదని, అయితే ఇప్పుడు డీబీటీ కారణం గా పేదలు వారి ప్రయోజనాలను నేరు గా అందుకొంటున్నారని ఆయన చెప్పారు. 1.7 లక్షల కోట్ల రూపాయల కంటే పైబడిన నిధులను ఒక్క డీబీటీ కారణంగానే తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి పోకుండా కాపాడటం జరిగింది అని ఆయన చెప్పారు.

సంస్థలపై ప్రజల విశ్వాసాన్ని పునరుద్ధరించడం జరుగుతోందంటూ ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు.

ప్రభుత్వం వైపు నుంచి ఎక్కువగా జోక్యం ఉండకూడదు, అలాగని పూర్తి దూరంగా ఉండిపోవడం తగదు అని ఆయన స్పష్టం గా చెప్పారు.  ప్రభుత్వ భూమిక ఎంతయితే అవసరమో అంతవరకు పరిమితం అయి ఉండాలి అని ఆయన అన్నారు.  ప్రభుత్వం అనవసరం గా కలగజేసుకొంటోందని గాని, లేదా అవసరమైనప్పుడు ప్రభుత్వం సరిగా వ్యవహరించడం లేదని గాని ప్రజలకు అనిపించకూడదని ఆయన సూచించారు.  

గత కొన్ని సంవత్సరాలుగా 1500 కు పైగా చట్టాలను రద్దు చేయడం జరిగింది, కొన్ని నియమాలను సరళతరం చేయడమైంది అని శ్రీ మోదీ అన్నారు.  సామాన్య ప్రజలకు ఇబ్బందులను తగ్గించడానికి పింఛన్, ఉపకారవేతనాలు, పాస్‌పోర్టులు, స్టార్ట్- అప్ లు మొదలైన అనేక దరఖాస్తులను ఆన్ ‌లైన్ ‌లో సమర్పించేటట్టు చూడటం జరిగిందన్నారు.


‘‘ప్రక్షాళనాద్ధి పంకస్య
దూరాత్ స్పర్శనమ్ వరమ్’’ అనే ఒక కథనాన్ని ప్రధాన మంత్రి ఉదాహరించారు.
 
ఈ మాటలకు ‘‘తరువాత శుభ్రం చేసుకోడానికి ప్రయత్నించడం కంటే మురికి గా తయారవకపోవడం మంచిది’’ అని భావం.

అదేవిధంగా, శిక్షాత్మక నిఘా కంటే నివారణాత్మకమైన నిఘా మంచిది అని ఆయన సూచించారు.  అవినీతి ని ప్రోత్సహించే పరిస్థితులను దూరం చేయవలసిన అవసరం ఉంది అని ఆయన విజ్ఞప్తి చేశారు.

కౌటిల్యుడు చెప్పిన

‘‘న భక్షయంతి యె
త్వర్థాన్ న్యాయతో వర్ధయంతి చ
నిత్యాధికారా:కార్యాస్తే రాజ్ఞ‌: ప్రియహితే రతా:’’ అనే మాటలను ఆయన ఈ  సందర్భం లో ఉట్టంకించారు.


ఈ మాటలకు, ‘‘ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేయకుండా ప్రజా ప్రయోజనాల కోసం మాత్రమే వినియోగించే వారి ని రాష్ట్ర ప్రయోజనాల కోసం ముఖ్యమైన పదవులలో నియమించాలి’’ అని భావం.

ఇదివరకు బదిలీలు, నియామకాల కోసం పైరవీలు చేయడానికి ఒక అపవిత్ర వ్యవస్థ పనిచేసేది; ఇప్పుడు ప్రభుత్వం అనేక విధాన నిర్ణయాలను తీసుకొంది; ఈ స్థితి ని మార్చాలనే సంకల్పాన్ని చాటింది, మరి ఉన్నత పదవుల్లో నియామకాలకు పైరవీలు అంతం అయ్యాయి.  గ్రూప్ బి, గ్రూప్ సి ఉద్యోగాల కు ఇంటర్ వ్యూలను ప్రభుత్వం రద్దు చేసింది.  బ్యాంక్ బోర్డ్ బ్యూరో ను ఏర్పాటు చేయడం తో బ్యాంకుల్లో సీనియర్ పదవులకు నియామకాల లో పారదర్శకత్వం సునిశ్చితమైంది అని ఆయన అన్నారు.

దేశంలో నిఘా ప్రణాళిక ను పటిష్టపరచడానికి అనేక చట్టపరమైన సంస్కరణలు చేపట్టామని, కొత్త చట్టాలను ప్రవేశపెట్టామని ప్రధాన మంత్రి చెప్పారు. నిఘా వ్యవస్థ ను బలోపేతం చేయడానికి రూపొందించిన నల్లధనం వ్యతిరేక చట్టాలు, బేనామీ ఆస్తులు, పారిపోయిన ఆర్ధిక అపరాధుల చట్టం వంటి  కొత్త చట్టాలను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు.  పరోక్ష పన్ను అంచనా వ్యవస్థ ను అమలు చేసిన ప్రపంచంలోని కొద్ది దేశాల్లో భారతదేశం కూడా ఉంది అని ఆయన తెలిపారు.  అవినీతి ని నివారించడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్న కొద్ది దేశాలలో కూడా భారతదేశం ఉంది.  విజిలెన్స్‌ కు సంబంధించిన ఏజెన్సీలకు మెరుగైన సాంకేతిక పరిజ్ఞానాన్ని, సామర్థ్యాన్ని పెంపొందించడం, సరికొత్త మౌలిక సదుపాయాలను, సామగ్రి ని అందించడం ప్రభుత్వ ప్రాధాన్యం అని, తద్వారా వారు మరింత సమర్థవంతంగా పని చేస్తారని, తద్వారా మంచి ఫలితాలను అందించగలుగుతారని ఆయన వివరించారు.

అవినీతికి వ్యతిరేకంగా ఈ ప్రచారం కేవలం ఒక రోజో, ఒక వారమో నిర్వహించే వ్యవహారం కాదు అని ప్రధాన మంత్రి నొక్కి చెప్పారు.

తరాల తరబడి పెచ్చుపెరుగుతున్న అవినీతి ఒక పెద్ద సవాలు గా మారిందని  ఆయన పేర్కొన్నారు.  ఇది దేశంలో ఒక బలీయ శక్తి గా ఎదిగిందన్నారు.  ఒక తరం నుండి మరొక తరానికి బదిలీ అయ్యే అవినీతి ని, తరతరాల అవినీతి గా ఆయన అభివర్ణించారు.  ఒక తరం అవినీతిపరులకు సరైన శిక్ష లభించనప్పుడు, రెండో తరం మరింత శక్తి తో అవినీతి కి పాల్పడుతుందని ఆయన పేర్కొన్నారు.  ఈ కారణంగా, ఇది చాలా రాష్ట్రాల్లో రాజకీయ సంప్రదాయంలో ఒక భాగమైందని శ్రీ మోదీ పేర్కొన్నారు.  ఒక తరం నుండి మరో తరానికి ఈ అవినీతి సామ్రాజ్యం విస్తరించడంతో, అది దేశాన్ని డొల్లగా మార్చివేస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.  ఈ పరిస్థితి దేశ అభివృద్ధికి, సమృద్ధియుత భారతదేశానికి, స్వావలంబనయుత భారతదేశానికి పెద్ద అడ్డంకిగా మారిందని ఆయన అన్నారు.  ఈ అంశాన్ని కూడా ఈ జాతీయ సమ్మేళనం లో చర్చించాలని ఆయన కోరారు.

అవినీతి సంబంధించిన వార్తలపై దృష్టి పెట్టాలని ప్రధాన మంత్రి కోరారు.  అవినీతికి విరుద్ధంగా బలమైన సమయబద్ధ చర్యల ఉదాహరణల ను ప్రముఖం గా చూపినప్పుడు, దానితో ప్రజల విశ్వాసం పెరుగుతుందని, అవినీతిపరులు తప్పించుకోవడం కష్టం అనే ఒక సందేశం వెలువడుతుందని ఆయన తెలిపారు.

దేశం గనక అవినీతిని ఓడిస్తే, అటువంటప్పుడు భారతదేశం బలపడుతుందని, సమృద్ధియుత, స్వావలంబి భారతదేశాన్ని ఆవిష్కరించడం ద్వారా సర్ దార్ పటేల్ గారు కన్న కల ను నెరవేర్చవచ్చని ఆయన అన్నారు.

ప్రతి సంవత్సరం అక్టోబర్ 27 నుంచి నవంబర్ 2 వరకు భారతదేశం లో నిఘా సంబంధి జాగృతి వారాన్ని పాటించే తరుణంలో సిబిఐ ఈ జాతీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేస్తోంది.  ఈ సమ్మేళనం తాలూకు కార్యకలాపాలు అప్రమత్తత తో ముడిపడ్డ అంశాలపై కేంద్రితమై ఉంటాయి. వాటిలో జాగరూకతను పెంపొందించడంతో పాటు పౌరుల భాగస్వామ్య మాధ్యమం ద్వారా సార్వజనిక జీవనం లో సమగ్రత, నిజాయితీ ల పట్ల భారతదేశం నిబద్ధత ను బలపర్చడం కూడా భాగంగా ఉంటుంది.

మూడు రోజుల పాటు సాగే ఈ సమ్మేళనం లో - విదేశీ అధికార పరిధి లోని దర్యాప్తు లో ఎదురైయ్యే సవాళ్ళు, అవినీతి కి వ్యతిరేకంగా విధానపరమైన తనిఖీగా నివారక నిఘా;  అన్ని వర్గాలకు ఆర్థిక సేవల అందజేత కోసం విధానపరమైన మెరుగుదలలు; బ్యాంకు మోసాలకు అడ్డుకట్ట వేయడానికి ఉద్దేశించిన ప్రణాళికయుతమైన సంస్కరణ, వృద్ధి కి సహాకకారిగా ప్రభావవంతమైన లెక్కల తనిఖీ (ఆడిట్), అవినీతికి వ్యతిరేకంగా పోరాటాన్ని వేగవంతం చేసే దిశలో అవినీతి నిరోధ చట్టానికి తాజా సవరణలు, సామర్థ్యాల పెంపుదల- శిక్షణ, వేగవంతమైన,  మరింత ప్రభావవంతమైన పరిశోధన కోసం  బహుళ సంస్థల మధ్య సమన్వయం, ఆర్థిక అపరాధాల్లో చోటు చేసుకొంటున్న  కొత్త కొత్త ధోరణులు, సైబర్ క్రైమ్స్, అంతర్జాతీయ సంఘటిత అపరాధాలను అదుపు చేయడానికి నేర పరిశోధక ఏజెన్సీల నడుమ మెరుగైన సమన్వయాన్ని నెలకొల్పుకోవడంతో పాటు తత్సంబంధిత మెలకువలను ఒక దేశానికి మరొక దేశం ఇచ్చి పుచ్చుకోవడం మొదలైన అంశాలపై చర్చలు జరుగనున్నాయి.  

ఈ సమ్మేళనం విధాన రూపకర్తలను, అభ్యాసకులను ఒక వేదిక మీదకు తీసుకువస్తుంది.  వ్యవస్ధ పరమైన మెరుగుదలలు, నివారక జాగరూకత చర్యలు, సుపరిపాలన, జవాబుదారుగా ఉండే పరిపాలన ల మాధ్యమం ద్వారా అవినీతి ని ఎదుర్కోవడానికి ఒక దోహదకారిగా ఈ సమ్మేళనం పని చేయనుంది. ఇది భారతదేశంలో సరళతర వ్యాపారానికి సమర్ధత ను సంతరించడంలో ఒక మహత్వపూర్ణమైన తోడ్పాటును అందించనుంది.

ఈ సమ్మేళనం లో పాల్గొంటున్న వారిలో అవినీతి నిరోధక బ్యూరో, నిఘా బ్యూరో, వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన ఆర్ధిక అపరాధ విభాగాలు లేదా సిఐడి కార్యాలయాల అధిపతులు; సివిఒ లు;  సిబిఐ అధికారులు, వివిధ కేంద్ర సంస్థల ప్రతినిధులు కూడా ఉన్నారు.  ప్రారంభ సమావేశం లో వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాల చీఫ్ సెక్రటరి లు, డిజిపి లు కూడా పాల్గొన్నారు.

***
 


(Release ID: 1668049) Visitor Counter : 297