మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

ఆంధ్రప్రదేశ్ ఎన్.ఐ.టి. కొత్త భవన సముదాయం ప్రారంభం వర్చువల్ పద్ధతిలో ప్రారంభించిన కేంద్రమంత్రి పోఖ్రియాల్

Posted On: 27 OCT 2020 6:26PM by PIB Hyderabad

    ఆంధ్రప్రదేశ్ లోని జాతీయ సాంకేతిక విద్యా సంస్థ (ఎన్.ఐ.టి.లో కొత్తగా నిర్మించిన పలు భవనాలను కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ ‘నిశాంక్’ వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు. ఎన్.ఐ.టి. తొలిదశ-ఎ, కింద నిర్మించిన ఈ భవనాలన్నీ విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది తక్షణమే వినియోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ తరగతి గదుల సముదాయం, డాక్టర్ ఎ.పి.జె. అబ్దుల్ కలామ్ లేబరేటరీ భవన సముదాయం, బాలుల హాస్టల్, అతిథి గెస్ట్ హౌస్ భవనాలను ఎన్.ఐ.టి.లో తాజాగా ప్రారంభించారు. కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ సీనియర్ అధికారులు, ఆంధ్రప్రదేశ్ ఎన్.ఐ.టి. డైరెక్టర్ ప్రొఫెసర్ సి.ఎస్.పి. రావు, గవర్నర్ల బోర్డు చైర్ పర్సన్ మృదులా రమేశ్, గవర్నర్ల బోర్డు సభ్యులు, సెనేట్ సభ్యులు, ఎన్.ఐ.టి. నిర్మాణ ప్రాజెక్టుల, ఫైనాన్స్ కమిటీల సభ్యులు ప్రారంభోత్సవానికి హాజరయ్యారు.

 

   ఈ సందర్భంగా కేంద్రమంత్రి పోఖ్రియాల్ మాట్లాడుతూ, బోధనలో ప్రతిభ, పరిశోధన, నాణ్యతతో కూడిన విద్యాబోధన ద్వారా సృజనాత్మకతను ప్రోత్సహించడం, తద్వారా సమాజానికి సేవలందించడం ఏ విద్యాసంస్థకైనా ప్రధాన లక్ష్యంగా ఉంటుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ఉన్నత విద్యాసంస్థలు,.. ప్రతిభ, నైపుణ్యాలతో కూడిన మానవ వనరులను అభివృద్ధి చేయడంతోపాటుగా, సుస్థిరమైన ఆర్థికాభివృద్ధిని కూడా సాధించవలసి ఉంటుందని మంత్రి అన్నారు.

 

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధిలో కీలకపాత్ర పోషించగలిగిన సామర్థ్యం ఈ ఎన్.ఐ.టి.కి ఉందన్నారు. దేశంలో సాంకేతిక విద్యను, సాంకేతిక నిపుణులను పెంపొందించే లక్ష్యంకోసం ఎన్.ఐ.టి.ని జాతికి అంకితం చేసినట్టు చెప్పారు. తాడేపల్లి గూడెంలో పలు అభివృద్ధి మార్గాలకు తెరతీస్తూ, ఆ ప్రాంతం ప్రగతిలో ఎన్.ఐ.టి. కీలకపాత్ర పోషించి తీరుతుందన్నారు. ఈ రోజు జరిగిన వర్చువల్ ప్రారంభోత్సవం ఎన్.ఐ.టి. ప్రగతికి నిదర్శనమన్నారు. సంస్థ ఆవరణ ప్రగతికి, మౌలిక సదుపాయాల సత్వర అభివృద్ధికి ఎన్.ఐ.టి. అధికారులు చేసిన కృషిని కేంద్రమంత్రి అభినందించారు. 

ఆంధ్రప్రదేశ్ ఎన్.ఐ.టి.లో శాశ్వత భవనాల నిర్మాణం మంచి ఊపుతో సాగుతూ ఉండటం ఎంతో సంతోషదాయకమని అన్నారు.

 

  ఎన్.ఐ.టి. భవనాల నిర్మాణం 2018 అక్టోబరులో ప్రారంభమైనప్పటికీ, అతి స్వల్పకాలంలోనే అనేక భవనాలు ఇప్పటికే పూర్తిచేశారు. ప్రస్తుతం శాశ్వత ఆవరణనుంచి పూర్తిస్థాయిలో సంస్థ పనిచేస్తోంది. రూ. 438కోట్ల వ్యయంతో నిర్మించిన పలు భవనాలను ఈ రోజు మంత్రి ప్రారంభించారు. ప్రీ- ఫ్యాబ్రికేషన్ సాంకేతిక పరిజ్ఞానంతో ఎ.పి. ఎన్.ఐ.టి. నిర్మాణం జరగడం ఆనందదాయకమన్నారు. భారతీయ హరిత భవననిర్మాణ మండలి (ఐ.జి.బి.సి.)నుంచి ఎ.పి. ఎన్.ఐ.టి.కి ప్లాటినమ్ రేటింగ్ లభించందన్నారు.

 

   ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినప్పటినుంచి, కొత్త రాష్ట్రానికి సమాఖ్య లక్షణాలు దక్కేలా చూసేందుకు కేంద్రం నిర్విరామంగా పనిచేసిందన్నారు. తిరుపతిలో ఐ.ఐ.టి., విశాఖపట్నంలో ఐ.ఐ.ఎం., తిరుపతిలో ఐ.ఎస్.ఇ.ఆర్., విశాఖపట్నంలో ఐ.ఐ.పి.ఇ., విజయవాడలో స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్, అనంతపురంలో ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం, విజయవగరంలో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం, తిరుపతిలో జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం, ట్రిపుల్ ఐ.టి.లు..ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యాభివృద్ధి పట్ల కేంద్ర ప్రభుత్వ అంకితభావానికి తార్కాణాలని పోఖ్రియాల్ అన్నారు.

 

    సంస్థలో కొత్త భవన సముదాయాల నిర్మాణంలో ప్రమేయం ఉన్న ఎన్.ఐ.టి. విద్యార్థులకు, అధ్యాపకులకు మిగిలిన వారందరికీ పోఖ్రియాల్ అభినందనలు తెలిపారు. ఎన్.ఐ.టి. ఎలాంటి నిర్మాణాత్మక కార్యక్రమాలు చేపట్టినా కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ అండగా నిలుస్తుందని మంత్రి హామీ ఇచ్చారు.

*****



(Release ID: 1667988) Visitor Counter : 153