రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

పదాతిదళ దినోత్సవం

Posted On: 27 OCT 2020 3:20PM by PIB Hyderabad

పదాతిదళ దినోత్సవాన్ని భారత సైన్యం నిర్వహించింది. దేశానికి చేసిన సేవలకు గుర్తుగా పదాతిదళ దినోత్సవాన్ని జరిపారు. ఇది (అక్టోబర్‌ 27) భారత సైన్యానికి చాలా ముఖ్యమైన రోజు. 1947లో ఇదే రోజున భారత సైనికులు తొలిసారిగా శ్రీనగర్‌ విమానాశ్రయంలో దిగారు. పాకిస్థాన్‌ మద్దతుతో జమ్ముకశ్మీర్‌ను ఆక్రమించేందుకు వచ్చిన గిరిజన మూకలను శ్రీనగర్‌  పొలిమేరల నుంచి తిప్పికొట్టారు. తోకముడిచేలా చేశారు.

    పదాతిదళ దినోత్సవంలో భాగంగా; దేశ సేవలో అమరులైన వీర సైనికులకు 'నేషనల్‌ వార్‌ మెమోరియల్‌' వద్ద పుష్పాంజలి ఘటించారు. చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌, సైనికాధిపతి జనరల్‌ ఎం.ఎం.నరవణె, సైనికాధికారులు అమర సైనికులకు పుష్ప వందనం సమర్పించారు. ఆపరేషన్ విజయ్, ఆపరేషన్ మేఘదూత్‌లో పాల్గొన్న బ్రిగేడియర్, వీరచక్ర (విశ్రాంత) ఉమేష్ సింగ్ బవ; సుబేదార్ (గౌరవ కెప్టెన్), మహావీర చక్ర (విశ్రాంత) సంసర్‌ చంద్; నాయక్, వీరచక్ర (విశ్రాంత) జైరామ్‌సింగ్‌ కూడా పదాతిదళ విశ్రాంత యోధుల తరఫున పూలమాలలు సమర్పించారు.

    ధైర్యం, త్యాగం, విధుల పట్ల నిస్వార్థ భక్తి, నైపుణ్యానికి పునరంకితం కావాలని; దేశ సమగ్రతను, సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవాలన్న సంకల్పం పట్ల ఎల్లవేళలా అప్రమత్తతతో ఉండాలని పదాతిదళ డైరెక్టర్ జనరల్ సైన్యానికి పిలుపునిచ్చారు.

 

***



(Release ID: 1667854) Visitor Counter : 231