ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రముఖ చమురు, గ్యాస్ కంపెనీ ల సిఇఒ లతో సంభాషించిన ప్రధాన మంత్రి
శరవేగం గా వృద్ధి చెందుతున్న భారతదేశ శక్తి రంగంలో పెట్టుబడిదారు సంస్థల కు ఎనలేని అవకాశాలు ఉండాలి: ప‌్రధాన మంత్రి
భారతదేశం లో అందరికీ స్వచ్ఛమైన తక్కువ ఖర్చుతో లభ్యమయ్యే సుస్థిర ప్రాతిపదిక కలిగిన శక్తిని అందించడమే ప్రభుత్వ విధాన పరమావధిగా ఉంది: ప‌్రధాన మంత్రి
గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ దిశ లో ముందుకు పోయేందుకు దేశం అడుగులు వేస్తోంది: ప‌్రధాన మంత్రి
మానవుల అవసరాలు, ఆకాంక్షలు, ప్రాకృతిక పరిసరాల తో సంఘర్షించకూడదు: ప‌్రధాన మంత్రి
Posted On:
26 OCT 2020 11:08PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సోమవారం నాడు నీతి ఆయోగ్, పెట్రోలియమ్, సహజవాయువు మంత్రిత్వ శాఖ సంయుక్తంగా ఏర్పాటు చేసిన వార్షిక కార్యక్రమం లో భాగంగా ప్రముఖ చమురు, గ్యాస్ కంపెనీల సిఇఒ లతో మాట్లాడారు.
ఈ కార్యక్రమం లో భాగం గా ప్రధాన మంత్రి మానవుల అభివృద్ధికి శక్తి అనేది కేంద్ర స్థానం లో నిలుస్తోందని, ఈ కారణంగానే శక్తి రంగం చుట్టూ సాగే సంభాషణలు ముఖ్యమైనవని పేర్కొన్నారు. భారతదేశం లో ప్రతి ఒక్కరికీ స్వచ్ఛమైన, తక్కువ ఖర్చుతో కూడిన సుస్థిర ప్రాతిపదిక కలిగిన శక్తిని అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వ విధానం లో పెద్దపీట వేయడమైందని, దీనికోసం దేశం ఒక ఏకీకృత వైఖరిని అనుసరిస్తోందని ఆయన అన్నారు.
భారతదేశాన్ని ఒక ఆకర్షణీయమైన పెట్టుబడి నిలయంగా తీర్చిదిద్దడానికి అనేక విధానపరమైన నిర్ణయాలను ప్రభుత్వం తీసుకొంటోందని, భారతదేశ శక్తి రంగం లో అపారమైన అవకాశాలు ఉన్నాయని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. అన్వేషణ, ఉత్పత్తి పథకాల లో భారతదేశం ప్రస్తుతం 100 శాతం ఎఫ్‌డిఐ కి అనుమతి ఇస్తోందని, ప్రభుత్వరంగ చమురు శుద్ధి కార్యకలాపాల లో 49 శాతం ఎఫ్‌డిఐ కి ఆటోమేటిక్ రూట్ లో ఆమోదం తెలపడం జరిగిందని ఆయన వివరించారు. ఈ సంస్కరణలు శక్తి రంగం లో ఎఫ్‌డిఐ అధికం అయ్యేటట్లు చూస్తున్నాయని ఆయన తెలిపారు. భారతదేశం గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ మార్గం లో ముందుకు పోయేందుకు అడుగులు వేస్తోందని, ‘ఒక దేశం, ఒక గ్యాస్ గ్రిడ్’ లక్ష్యాన్ని సాధించడానికి ఒక గ్యాస్ సరఫరా కు ఉద్దేశించిన గొట్టపు మార్గ నెట్ వర్క్ ను అభివృద్ధిపరచడం జరుగుతోందని ఆయన చెప్పారు. స్వచ్ఛమైన వంట ఇంధనాన్ని, అలాగే రవాణా ఇంధనాలను సరఫరా చేయడంలో సాయం చేసేందుకుగాను సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్ లను విస్తరించే దిశలో సాగుతున్న కృషిని గురించి కూడా ఆయన ఈ సందర్భం లో ప్రస్తావించారు. భారతదేశం రసాయనాలు, పెట్రో రసాయనాల ఉత్పత్తి, ఎగుమతి కార్యకలాపాలకు ఒక కేంద్రం గా మారాలనే లక్ష్యాన్ని సైతం నిర్దేశించుకొందని ఆయన ప్రముఖంగా పేర్కొన్నారు.
మానవుల అవసరాలు ఆకాంక్షలు అనేవి ప్రాకృతిక పరిసరాలతో సంఘర్షణకు దిగకూడదని ప్రధాన మంత్రి గుర్తు చేశారు. భారతదేశం మానవుల సాధికారిత తో పాటు, పర్యావరణ పరిరక్షణ ను కూడా విశ్వసిస్తుందని ఆయన అన్నారు. ఇథెనాల్, రెండో తరానికి చెందిన ఇథెనాల్ కంప్రెస్డ్ బయోగ్యాస్, బయో డీజిల్ ల వినియోగాన్ని పెంచుకోవడం ద్వారా ఇంధన దిగుమతి పై ఆధారపడాన్ని తగ్గించుకొనే దిశ లో కృషి చేస్తోందని ఆయన వివరించారు. సుస్థిరాభివృద్ధి సిద్ధాంతం పై ఆధారపడి భారతదేశం అంతర్జాతీయ సౌర కూటమి (ఐఎస్ఎ) వంటి కొత్త సంస్థల ను పెంచి పోషించడానికి నడుం బిగించిందని ‘ఒక ప్రపంచం, ఒక సూర్యుడు, ఒక గ్రిడ్’ అనేదే మా లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. భారతదేశం అనుసరిస్తున్న ‘ఇరుగు పొరుగు దేశాలకు అగ్రతాంబూలం’ (‘నైబర్‌హుడ్ ఫస్ట్’) విధానానికి గల ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్తూ.. నేపాల్, బాంగ్లాదేశ్, శ్రీ లంక, భూటాన్, మయన్మార్ వంటి తన ఇరుగు పొరుగు దేశాలతో శక్తి రంగ సంబంధిత బంధాన్ని భారతదేశం పటిష్ట పరచుకొంటోందన్నారు. భారతదేశం లో శరవేగంగా వృద్ధి చెందుతున్న శక్తిరంగం పెట్టుబడిదారు సంస్థలకు ఎక్కడా లేని అవకాశాలను ఇవ్వజూపుతోందని చెప్తూ, ఆయన తన ప్రసంగాన్ని ముగించారు. భారతదేశ ప్రగతిలో పాలుపంచుకోవాలని, అన్ని రూపాలలో భారతదేశ శక్తి ఉత్పత్తి సామర్ధ్యాన్ని పెంపొందింప చేస్తూ, తత్సంబంధిత సమృద్ధి లో భాగం పంచుకోవాలని ప్రపంచ పారిశ్రామిక రంగానికి ఆయన ఆహ్వానం పలికారు.
చమురు, గ్యాస్ రంగానికి చెందిన దాదాపు 40 మంది సిఇఒ లు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సుమారు 28 మంది ప్రముఖులు వారి ఆలోచనల ను ప్రధాన మంత్రి సమక్షంలో వెల్లడించారు. ఈ కార్యక్రమం లో భాగం పంచుకొన్నవారిలో యుఎఇ పరిశ్రమ, అధునాతన సాంకేతికత శాఖ మంత్రి, అబూ ధాబీ నేశనల్ ఆయిల్ కంపెనీ సిఇఒ డాక్టర్ సుల్తాన్ అహ్మద్ అల్ జాబెర్; కతర్ శక్తి వ్యవహారాల శాఖ సహాయ మంత్రి, డిప్యూటీ చైర్ మన్, ప్రెసిడెంట్, సిఇఒ శ్రీ సాద్ శెరిదా అల్-కాబి; ఒపెక్ సెక్రటరీ జనరల్ శ్రీ మొహమ్మద్ సానూసి బార్కిన్ డో; ఐఇఎ కార్యనిర్వాహక సంచాలకుడు డాక్టర్ ఫెయిత్ బిరోల్; జిఇసిఎఫ్ కు చెందిన శ్రీ యూరి సెంటియూరిన్; యుకె లోని ఐహెచ్ఎస్ మార్కిట్ వైస్ చైర్మన్ డాక్టర్ డానియల్ యెర్జిన్.. ఈ రంగం పై వారి వారి అభిప్రాయాలను వ్యక్తం చేశారు. రోస్ నెఫ్ట్, బిపి, టోటల్, లియోన్ డెల్ బాసెల్, తెలూరియన్, శులుమ్ బర్గర్, బేకర్ హ్యూస్, జెఇఆర్ఎ, ఎమర్సన్, ఎక్స్-కోల్ సహా ప్రధాన చమురు, గ్యాస్ కంపెనీల సిఇఒ లు ఈ సమావేశం లో పాల్గొన్నారు.
***
(Release ID: 1667758)
Visitor Counter : 192
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam