మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
రోపార్ ఐ.ఐ.టి శాశ్వత భవనాలు జాతికి అంకితం దేశాభివృద్ధికి సేవలందించవలసినందిగా
విద్యార్థులకు కేంద్రమంత్రి పోఖ్రియాల్ పిలుపు
Posted On:
22 OCT 2020 5:49PM by PIB Hyderabad
పంజాబ్ లోని రోపార్ ఐ.ఐ.టి.కి చెందిన శాశ్వత భవన సముదాయాన్ని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ ‘నిషాంక్’ ఈరోజు జాతికి అంకితం చేశారు. కేంద్ర విద్యాశాఖ సహాయమంత్రి సంజయ్ ధోత్రే కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రోపార్ ఐ.ఐ.టి. డైరెక్టర్,.. ప్రొఫెసర్ సరిత్ కె. దాస్, రిజిస్ట్రార్ రవీందర్ కుమార్, ఇతర ప్రముఖులు కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.
ఈ సందర్భంగా పొఖ్రియాల్ మాట్లాడుతూ, రోపార్ ఐ.ఐ.టి. అధ్యాపక, ఉద్యోగ సిబ్బందికి అభినందనలు తెలిపారు. ప్రపంచంలోనే చైతన్యవంతమైన దేశంగా భారత్.ను తీర్చిదిద్దడంలో ముందడుగు వేస్తున్న విద్యార్థులకు, పరిశోధకులకు కూడా మంత్రి అభినందనలు తెలియజేశారు. ప్రాచీన కాలంనుంచి విజ్ఞాన సంపన్నమైనదిగా మనదేశం పేరుపొందిందని, సుసంపన్నమైన వారసత్వ, సాంస్కృతిక వైభవానికి ప్రపంచంలోనే పేరు ప్రతిష్టలు సాధించిందని ఆన్నారు. విద్యార్థులను "జాతి యోధులు"గా ఆయన పేర్కొంటూ, దేశాభివృద్ధికి తగిన సేవలందించవలసిందిగా వారికి పిలుపునిచ్చారు.
దేశంలోను, ప్రపంచంలోనూ అగ్రశ్రేణి విద్యా సంస్థల్లో ఒకటిగా రోపార్ ఐ.ఐ.టి. కొనసాగుతూ వస్తోందని పొఖ్రియాల్ అన్నారు. బెంగళూరులోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ (ఐ.ఐ.ఎస్.సి.) తర్వాత, అగ్రస్థానాన్ని రోపార్ ఐ.ఐ.టి. సాధించిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలపై 2021వ సంవత్సరానికి టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ నిర్వహించిన సర్వేలో 351-400 ర్యాంకు స్థాయిని రోపార్ ఐ.ఐ.టి. సాధించిందన్నారు. పరిశోధనా ప్రశంసల ధ్రువీకరణలో ప్రపంచంలోనే నంబర్ వన్ ర్యాంకును రోపార్ ఐ.ఐ.టి. సాధించిందన్నారు. 2019-20లో ఇంజినీరింగ్ వివిధ సంస్థలపై నేషనల్ ఇన్ స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ (ఎన్.ఐ.ఆర్.ఎఫ్) అఖిలభారత స్థాయిలో నిర్వహించిన ర్యాంకింగ్ సర్వేలో రోపార్ ఐ.ఐ.టి. 25వ స్థానం సాధించిందన్నారు. పరిశోధనా నాణ్యతలో రోపార్ ఐ.ఐ.టి. అన్ని ఐ.ఐ.టి.లను అధిగమించిందన్నారు. ప్రపంచ విద్యా కార్యక్రమానికి అనుగుణంగా 2020వ సంవత్సరపు జాతీయ విధానం రూపొందిందన్నారు. జాతీయ విద్యా విధానంలో వృత్తి విద్యాకోర్సులకు ప్రాధాన్యం ఇవ్వడం, దేశ స్వావలంబనకు, భారతీయ విద్యార్థులు ప్రపంచ స్థాయిలో మరింత గుర్తింపు సాధించేందుకు దోహదపడుతుందని అన్నారు.
“దేశం స్వావలంబన సాధించేందుకు విద్యా విధానం ఒక ప్రాతిపదిక అవుతుంది. ఆత్మనిర్భర భారత్ ప్యాకేజీ అసలు లక్ష్యాన్ని సాధించేందుకు ఇది దోహదపడుతుంది.” అని పోఖ్రియాల్ అన్నారు. “2020వ సంవత్సరపు జాతీయ విద్యావిధానంతో భారత్ విద్యాశక్తి కేంద్రంగా ఆవిర్భవిస్తుంది. ఈ లక్ష్య సాధనకోసం విద్యా మంత్రిత్వశాఖ ఎంతో కృషి చేస్తోంది. దేశ వారసత్వ సంపదను ప్రోత్సహించేందుకు, ప్రపంచ దేశాల్లోని విద్యార్థులను ఆకర్షించేందుకు విద్యాశాఖ కృషి చేస్తోంది.” అని అన్నారు.
కోవిడ్ -19 సంక్షోభం నేపథ్యంలో రోపార్ ఐ.ఐ.టి. తీసుకున్న చొరవను మంత్రి ప్రశంసించారు. ఐసోలేషన్ వార్డులలో, టెస్టింగ్ లేబరేటరీలలో గాలిద్వారా కోవిడ్-19 వైరస్ వ్యాప్తిని నివారించేందుకు, తద్వారా చికిత్సా విధుల్లోని వైద్య సిబ్బందికి వైరస్ నుంచి రక్షణ కల్పించేందుకు నెగెటివ్ ప్రెజర్ రూమ్ పేరిట రోపార్ ఐ.ఐ.టి. రూపొందించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని మంత్రి ప్రస్తావించారు. కోవిడ్ బాధితులవల్ల అంబులెన్స్ విధుల్లో ఉన్న ఆరోగ్య కార్యకర్తలకు వైరస్ ముప్పు తలెత్తకుండా నియంత్రించేందుకు నెగెటివ్ ప్రెజర్ అంబులెన్స్ ను ఈ సంస్థ రూపొందించినట్టు తెలిపారు. అతినీలలోహిత కిరణాల సహాయంతో క్రిమి సంహాకరంగా పనిచేసే యు.వి. సేఫ్ అనే వినూత్న పరికరాన్ని, రోపార్ ఐ.ఐ.టి.లోనే స్థాపించారన్నారు. గదిలో అన్ని వైపులకు ప్రభావం చూపే క్రిమిసంహారకంగా ఈ పరికరం పనిచేస్తుందని, ప్రస్తుతం దుబాయిలో జరుగుతున్న ఐ.పి.ఎల్. లో దీన్ని వినియోగిస్తున్నారని చెప్పారు. కోవిడ్ రోగులనుంచి, కాలుష్యమయంగా ఉన్న పరిసరాలనుంచి ఆరోగ్య కార్యకర్తలకు వైరస్ సోకకుండా నివారించేందుకు తక్కువ వ్యయంతో అధునాతనమైన “మెడి-సారథి’, “ఎ.ఐ.-పవర్డ్ ట్రాలీ” అనే వాహనాలను రూపొందించినట్టు తెలిపారు. ''మేక్ ఇన్ ఇండియా'' నినాదాన్ని సాకారం చేసేందుకు రోపార్ ఐ.ఐ.టి. సృజనాత్మక, పరిశోధన రంగాలపై క్రమం తప్పకుండా దృష్టిని కేంద్రీకరించిందని, ఈ విషయంలో సంస్థ తీసుకున్న చొరవ ఎంతో అభినందనీయమని మంత్రి అన్నారు.
. కేంద్ర విద్యాశాఖ సహాయ మత్రి సంజయ్ ధోత్రే మాట్లాడుతూ, విద్యా ప్రతిభకు ఆలవాలమైన కేంద్రాలుగా ఐ.ఐ.టి.లు ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచాయన్నారు. ప్రపంచంలో అగ్రశ్రేణి ర్యాంకులు సాధించేలా తాము ఐ.ఐ.టి.లను పరిపుష్టం చేస్తున్నట్టు చెప్పారు. వ్యవసాయం, నీటిసరఫరా రంగంలో సాంకేతిక పరిజ్ఞాన సృజనాత్మక కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు కేంద్ర సైన్స్ టెక్నాలజీ విభాగంనుంచి రోపార్ ఐ.ఐ.టి. రూ. 110కోట్లు అందుకోవడం అభినందనీయమన్నారు.
రోపార్ ఐ.ఐ.టి. డైరెక్టర్ ప్రొఫెసర్ సరిత్ కె. దాస్ మాట్లాడుతూ,.. బృహత్ ప్రణాళికలో భాగంగా తమ సంస్థ సాధించిన విజయాల గాథలను వివరించారు. సుస్థిరత్వం సాధించదగిన అనేక అంశాలపై దృష్టిని కేంద్రీకరిస్తూ, గ్రీన్ క్యాంపస్ పేరిట రూపొందించిన వీడియో గురించి ఆయన తెలియజేశారు. సౌరశక్తి, పర్యావరణ హితమైన రవాణా ప్రత్యామ్నాయాలు, సమర్థమైన నీటి వినియోగ నిర్వహణ, వ్యర్థాల తొలగింపునకు ఆరోగ్యకరమైన పద్ధతులు, తదితర అంశాలతో ఈ వీడియోను రూపొందించారు. రోపార్ ఐ.ఐ.టి. పైవ్ స్టార్ గ్రీన్ రేటింగ్ సాధించినట్టు చెప్పారు. సమగ్ర ఆవాస రూపకల్పన కార్యక్రమానికి గాను ఈ రేటింగ్ లభించింది. రోపార్ ఐ.ఐ.టి. తొలినాళ్లనుంచి పరిశోధనా, అభివృద్ధి రంగాలకు ప్రాధాన్యమిస్తూ వచ్చింది. కోవిడ్ సంక్షోభం నియంత్రణలో భాగంగా సాంకేతిక పరిజ్ఞానం ప్రాతిపదికగా అనేక పరిష్కారాలను ఈ సంస్థ రూపొందించిందని, వాటిని సమాజానికి అందజేసిందని ప్రొఫెసర్ సరిత్ కె. దాస్ తెలిపారు.
పంజాబ్ లోని సట్లెజ్ నదీ తీరంలో రోపార్ ఐ.ఐ.టి.ని 2008లో స్థాపించారు. 500 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఈ సంస్థను ఏర్పాటు చేశారు. శాశ్వత భవనాల నిర్మాణంకోసం స్థలాన్ని 2008లోనే సంస్థకు అప్పగించారు. 2015, జనవరి 15న నిర్మాణం మొదలైంది. అధునాతన పరిజ్ఞానంతో నిర్మించిన భవనాలు, లేబరేటరీలలోకి 2017లో సంస్థను తరలించారు. 1.37లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ అధునాతన భవనాలు 2,324మంది విద్యార్థులకు వసతి కల్పిస్తున్నాయి. 170మంది అధ్యాపకులు, బోధనా సిబ్బంది, 118మంది ఇతర సిబ్బంది పనిచేస్తున్నారు. అద్భుతమైన ప్రవేశద్వారం, అధునాత పరిజ్ఞానంతో కూడిన పరిశోధనా శాలలు, గ్రంథాలయాలు, క్రీడా సదుపాయాలు, సాంస్కృతిక కార్యకలాపాల వసతులు ఈ సంస్థలో కల్పించారు. సువిశాలమైన కారిడార్లతో విద్యార్థులకు సదుపాయంగా వసతి గహాలను నిర్మించారు. 2021నాటికల్లా ఈ సంస్థలో 2.32చదరపు మీటర్ల విస్తీర్ణంతో నిర్మాణాలు పూర్తి చేయనున్నారు. దీనితో మొత్తం 2,500మంది విద్యార్థులకు, 220మంది బోధనా సిబ్బందికి, 250మంది ఇతర సిబ్బందికి వసతి లభిస్తుంది.
మొత్తం 4.76 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో 7 అధ్యయన విభాగాలకు వసతి కల్పించేలా ఒక సూపర్ బ్లాకు నిర్మాణం ప్రస్తుతం కొనసాగుతోంది. ఈ ఏడాది శీతాకాలం నాటికి కేంద్రీయ గ్రంథాలయం, 800మంది సామర్థ్యంతో ఆడిటోరియం సిద్ధం కాబోతోంది. 2017లో రోపార్ ఐ.ఐ.టి. వినూత్నమైన విద్యాబోధనను ప్రారంభించింది. మానవ విజ్ఞాన అధ్యయన శాస్త్రాలు, సామాజిక పరిజ్ఞానంతో కూడిన అంశాలు, ప్రాజెక్ట్ ఆధారిత అధ్యయన అంశాల బోధనా వ్యవస్థను ప్రవేశపెట్టింది.
******
(Release ID: 1666896)
Visitor Counter : 141