జల శక్తి మంత్రిత్వ శాఖ

జల్ జీవన్ మిషన్ కింద రాష్ట్రాలు /కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలవుతున్న కార్యక్రమాల పురోగతిపై జల్ శక్తి మంత్రిత్వ శాఖ మధ్యంతర సమీక్ష నిర్వహించింది.

సిక్కిం రాష్ట్రంలోని ఎస్సీ / ఎస్టీ జనాభా అధికంగా ఉన్న గ్రామాలు, జిల్లాల్లో 2021 నాటికి.. మిగిలిన ప్రాంతాల్లో 2022 నాటికి కార్యక్రమం పూర్తి చేయాలన్న లక్ష్యంపై మధ్యంతర సమీక్ష జరిగింది.

Posted On: 21 OCT 2020 2:35PM by PIB Hyderabad


2024 నాటికి దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలి ప్రాంతాల్లోని గ్రామీణ నివాసాలకు కుళాయి ద్వారా సురక్షిత మంచినీటిని అందించాలన్న ఉద్దేశంతో కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జల్ జీవన్ మిషన్(జేజేఎం) పేరుతో కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమం అమలు పురోగతిపై సమీక్షించేందకు జల్‌శక్తి మంత్రిత్వ శాఖ వర్చువల్ విధానంలో మధ్యంతర సమీక్ష నిర్వహించింది. 2024 నాటికి గ్రామీణ నివాసాలకు కుళాయి ద్వారా సురక్షిత మంచినీటిని అందించాలన్న లక్ష్య సాధనలో రాష్ట్రాలు, కేంద్రపాలి ప్రాంతాలు ఎంతవరకూ ప్రగతి సాధించాయన్న విషయంపై చర్చ జరిగింది. లక్ష్యం మేరకు ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తాము సాధించిన ప్రగతిని, తమ ప్రణాళికలను ఈ సమావేశంలో వివరించాయి.

సిక్కిం రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిలు ఈ సమీక్షలో తాము సాధించిన పురోగతిని జాతీయ జల్ జీవన్ మిషన్‌కు అందించారు. సిక్కింలో సుమారు 1.05 లక్షల గృహాలు ఉన్నాయి. వీటిలో 70,525 (67%) కుటుంబాలకు కుళాయి నీటి కనెక్షన్లు ఉన్నాయి. 2021-22 నాటికి రాష్ట్రంలోని అన్ని ఇండ్లకు 100% కుళాయి కనెక్షన్లు అందించాలని రాష్ట్రం భావిస్తోంది. రాష్ట్రంలో మంచి నీటి సరఫరాకు సంబంధించి మంచి మౌలిక సదుపాయాలు ఉన్నాయి. అలాగే 411 గ్రామాలలో నీటి సరఫరా పథకాలు ఉన్నాయి. 2020-21 నాటికి ఎస్సీ / ఎస్టీ జనాభా అధికంగా ఉన్న గ్రామాలు, జిల్లాల్లో పూర్తిస్థాయిలో వారి ఆంకాంక్షలను నెరవేర్చాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోంది. ప్రజా మంచినీటి వ్యవస్థ ఉన్న గ్రామాల్లో 81 గ్రామాలు మాత్రమే ‘హర్ ఘర్ జల్’ గ్రామ హోదాను సాధించారు. 7,798 కుళాయి నీటి కనెక్షన్లను అందించడం ద్వారా సుమారు 211 గ్రామాలు 100% కుళాయి కనెక్షన్ ఉన్న హోదాని సాధించగలుగుతాయి. మంచినీటి పథకాలు ఉన్న గ్రామాలన్నీటిలోని ప్రతిఇంటికి పంపునీటిని అందించాలని రాష్ట్రప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

గ్రామ ప్రణాళిక తయారీ, గ్రామ విలేజ్ వాటర్ & శానిటేషన్ కమిటీ (విడబ్ల్యుఎస్సీ) నిర్మాణం వంటి ఆంశాలు ఈ సదస్సులో ప్రధానంగా చర్చకు వచ్చాయి. నీటి సరఫరా వ్యవస్థల ప్రణాళిక, అమలు మరియు ఆపరేషన్ మరియు నిర్వహణ కోసం స్థానిక సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, ఎన్జిఓలు, మహిళా స్వయం సహాయక సంఘాలకు ప్రాధాన్యతను ఇవ్వాలని నిర్ణయించారు. గ్రామ పంచాయతీ కార్యకర్తలతో పాటు కార్యక్రమంలో పాల్పంచుకునే ఇతర సభ్యుల సామర్థ్యం పెంపొందించడానికి శిక్షణను నిర్వహించాలని వారి ద్వారా గ్రామ స్థాయిలో ఇతరులకు  నైపుణాభివృద్ధి శిక్షణ ఇప్పించాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. తద్వారా తాగునీటి సరఫరా వ్యవస్థ మరింత సమర్ధవంతంగా పనిచేయడానికి అవకాశం ఉంటుందని అభిప్రాయ పడింది. అలాగే తాగునీటి సరఫరా వ్యవస్థను మొదలుపెట్టేముందు జలవనరులకు రసాయన పరీక్షలు, బ్యాక్టీరియా పరీక్షలను నిర్వహించాలని రాష్ట్రం సూచించింది.


జల్ జీవన్ మిషన్ అమలు కోసం 2020-21 సంవత్సరానికి సిక్కింకు రూ .11.36 కోట్లు కేటాయించారు. అందులో రూ .7.84 కోట్లు విడుదల చేశారు. మొదటి విడత రెండో దశ నిధులను పొందడానికి రాష్ట్రం ఆ నిధుల వినియోగాన్ని వేగవంతం చేయాలి. సిక్కిం గ్రామీణ స్థానిక సంస్థలకు 15 వ ఆర్థిక కమిషన్ గ్రాంట్ల కింద ₹ 42 కోట్లు కేటాయించారు. ఆ మొత్తంలో 50% నీటి సరఫరా మరియు పారిశుద్ధ్యం కోసం ఉపయోగించాలి. అంటే నీటిసరఫరా వ్యవస్థలు, పునర్వినియోగానికి అవసరమైన పథకాల రూపకల్పనపై దృష్టిపెట్టాల్సి ఉంటుంది. అలా అయితే సుదీర్ఘకాలం పాటు తాగునీటి సరఫరా వ్యవస్థ పనిచేసేందుకు అవకాశం ఉంటుంది.


గణనీయమైన నీటి వనరులకు సిక్కిం  రాష్ట్రం ప్రసిద్ధి చెందింది. అయితే వేగంగా పెరుగుతున్న జనాభా, పట్టణీకరణ వంటి ఆంశాలు తాగునీటి లభ్యతతో పాటు నాణ్యతపైనా ప్రభావం చూపుతున్నాయి. రాష్ట్రంలో మంచి నీటి సరఫరా వ్యవస్థ మెరుగ్గా ఉంది. దాని ద్వారా రాష్ట్రంలోని ప్రతి గ్రామీణ గృహానికి కుళాయి నీటి కనెక్షన్‌ను అందించగలిగితే ప్రజల జీవితాలు మరింత మెరుగుపడతాయి.

***



(Release ID: 1666644) Visitor Counter : 147