గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

యాంత్రిక, సాంకేతిక పరిజ్ఞానంతోనే మరెన్నో కార్యకలాపాల నిర్వహణ

వివిధ సంస్థలకు కేంద్రమంత్రి హర్ దీప్ సింగ్ పూరి సూచన:
సాంకేతిక పరిజ్ఞాన శక్తిని సానుకూలం చేసుకోవాలని పిలుపు

దాదాపు 60వేల ఆస్తుల రికార్డుల నవీకరణ ప్రక్రియను డిజిటల్ పద్ధతిలో
చేపట్టిన భూమి, అభివృద్ధి కార్యాలయం

సంపూర్ణ వివరాలతో ఆస్తుల ధ్రువీకరణ పత్రాల జారీకోసం
ఈ-ధర్తీ పోర్టల్ వ్యవస్థ ఏర్పాటు

Posted On: 21 OCT 2020 5:29PM by PIB Hyderabad

  మానవ ప్రమేయం, మానవ ప్రయత్నం లేకుండానే యాంత్రిక, సాంకేతిక పరిజ్ఞాన సహాయంతో నిర్వహించగలిగే మరిన్ని కార్యకలాపాలను మన సంస్థలన్నీ గుర్తించి తీరాలని కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ సహాయ (ఇన్చార్జి) మంత్రి హర్ దీప్ సింగ్ పూరి విజ్ఞప్తి చేశారు. “సాంకేతిక పరిజ్ఞానానం శక్తిసామర్థ్యాలు ఆపారం, అపరిమితం. సాఫ్ట్ వేర్ సాంకేతిక పరిజ్ఞాన రంగంలో ఎంతో సత్తా ఉన్న భారతదేశానికి ఈ పరిజ్ఞానాన్ని సానుకూలంగా మలుచుకోవడం సాధ్యం కాదనుకోవడం ఏ మాత్రం సమంజసం కాదు.” అని ఆయన అన్నారు. ఈ ధర్తీ (e-Dharti) జియో పోర్టల్ ప్రారంభోత్సవం సందర్భంగా 2020 అక్టోబరు 21న ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ప్రసంగిస్తూ కేంద్ర మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. భూమి, అభివృద్ధి కార్యాలయం ద్వారా దరఖాస్తుదారులకు ఆస్తి ధ్రువీకరణ పత్రాలు జారీచేసే సేవతలందంచేందుకు ఈ పోర్టల్ ను  రూపొందించారు. కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి దుర్గా శంకర్ మిశ్రా, సీనియర్ అధికారుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. భూమి రకం, భూమి లేదా ఆస్తి స్వభావం, ఆస్తి కేటాయింపు తేదీ, ప్రస్తుత పరిస్థితి, స్థలం విస్తీర్ణం, లీజు ఒప్పందం తేదీ, ప్లాటు చిరునామా,  ప్రస్తుత పట్టాదారు వివరాలు, వ్యాజ్యం స్థాయి, భూమి రికార్డులకు సంబంధించిన రేఖాచిత్రం తదితర అంశాలు ఈ ధ్రువీకరణ పత్రంలో పొందుపరిచి ఉంటాయి. వెయ్యి రూపాయల నామమాత్రపు రుసుంతో ఆస్తి ధ్రువీకరణ పత్రాన్ని పొందవచ్చు. భూమి, అభివృద్ధి కార్యాలయానికి చెందిన అధికారిక వెబ్ సైట్ అయిన www.ldo.gov.in ను సంప్రదించడం ద్వారా ఈ సర్టిఫికెట్ ను పొందవచ్చు. ఈ పోర్టల్ ను తీసుకువచ్చినందుకు నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (ఎన్.ఐ.సి.) డైరెక్టర్ జనరల్ డాక్టర్ నీతా వర్మను కేంద్ర మంత్రి పూరి అభనందనలు తెలిపారు.

  ఆస్తి ప్రాంతాన్ని సూచించే రేఖా చిత్రంతోసహా, ఆస్తికి సంబంధించిన మౌలికమైన వివరాలన్నింటినీ ఈ సర్టిఫికెట్ ద్వారా పట్టాదారు పొందవచ్చు. ఆస్తి కొనుగోలుకోసం వచ్చిన కొనుగోలుదారుడు సదరు ఆస్తి వివరాలను తెలుసుకునేందుకు, ఏవైనా కేసులు పెండింగ్ లో ఉంటే ఆ వివరాలు తెలుసుకోవడానికి ఇది దోహదపడుతుంది. సామాన్య ప్రజలకు, ప్రత్యేకించి వృద్ధులకు, అస్వస్థులకు, మహిళలకు, వింతతువులకు ఈ ఏర్పాటు ఎంతో ప్రయోజనకరం. వారు ఎలాంటి కష్టనష్టాలు పొందకండా, అనవసరమైన వ్యాజ్యాల్లో చిక్కుకోకుండా ఇది నివారిస్తుంది.

    ఆస్తి వివరాలను భూగోళ  సమాచార వ్యవస్థ (జి.ఐ.ఎస్.) ఆధార సహితంగా తయారు చేసేందుకు భూమి, అభివృద్ధి కార్యాలయం ఆస్తుల రేఖా చిత్రాలను జి.ఐ.ఎస్.తో సమీకృతం చేస్తోంది. దాదాపు 60వేల ఆస్తులకు సంబంధించి ఈ ప్రక్రియ సాగుతోంది. వీటిల్లో వాణిజ్య, నివాస, పారిశ్రామిక, సంస్థాగత స్వభావం కలిగిన ఆస్తులున్నాయి. ఈ 60వేలలో 49వేల ఆస్తులు పునరావాస ప్రక్రియకు సంబంధించినవి. గతంలో తూర్పు, పశ్చిమ పాకిస్తాన్ నుంచి స్థానభ్రంశం పొందిన వారికి అప్పట్లో వీటిని లీజు ద్వారా కేటాయించారు. ఎక్కువ భాగం ఆస్తులను ఇప్పటికే డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానంతో రేఖా చిత్రాలుగా రూపొందించారు. వాటి విలువలను ఖరారు చేసే ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. ఈ పోర్టల్ అప్లికేషన్ ప్రజలకు ఎంతో ప్రయోజన కలిగిస్తుందని, అంతేకాక ఖాళీ స్థలాల తాజా పరిస్థితి.., ఆక్రమణల సమాచారాన్ని ఇతర వివరాలను ప్రభుత్వం తెలుసుకోవడానికి కూడా ఈ పోర్టల్ ఉపకరిస్తుంది.

  భూమి, అభివృద్ధి కార్యాలయం, తన పని తీరులో పారదర్శకతను తీసుకువచ్చేందుకు, ఆస్తి కేసుల పరిష్కారంలో మానవ ప్రమేయం నివారించేందుకు, కాలహరణం తగ్గించేందుకు ఈ చర్య తీసుకున్నారు. ఈ మొత్తం ప్రక్రియ డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానం వైపుగా వేగంగా ముందుకు సాగుతోంది. ఆస్తుల మ్యుటేషన్, ఆస్తుల స్వభావ మార్పిడి, ఆస్తిని కానుకగా ఇచ్చేందుకు, విక్రయానికి, తనఖా పెట్టడానికి అనుమతుల జారీ వంటి కార్యకలాపాలకోసం దరఖాస్తులను అన్ లైన్ ద్వారా స్వీకరించే ప్రక్రియ ఇప్పటికే మొదలైంది.  అందే దరఖాస్తుల్లో 90శాతం ఆన్ లైన్ ద్వారానే వస్తున్నాయి. ఆస్తిని ఒకసారి కౌలుదారు స్థాయి నుంచి మాన్యందారు స్థాయికి మార్చిన నేపథ్యంలో, ప్రస్తుతం ఆస్తుల రికార్డులను నవీకరించడం లేదు. అయితే, ఈ పోర్టల్ ఏర్పాటు ద్వారా తాజాగా తీసుకున్న చర్యలు, తాజా వివరాల సమాచారంతో భూమి రికార్డులను నవీకరించడానికి, సదరు కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి, ప్రస్తుత యజమానికి భూమి లేదా ఆస్తి పట్టాను మంజూరు చేయడానికి ఎంతగానో దోహదపడతాయి. ఆస్తుల లావాదేవీల్లో పారదర్శకతను తీసుకువచ్చేందుకు, వ్యవస్థను ప్రజాహితంగా, జవాబ్దారీగా, సమర్థవంతంగా మలిచేందుకు కూడా ఇది ఉపకరిస్తుంది.

  ఈ-ధర్తీ పోర్టల్ ప్రారంభోత్సవం సందర్భంగా దరఖాస్తుదారులకు ఆస్తి ధ్రవీకరణ పత్రాలను కేంద్రమంత్రి వర్చువల్ పద్ధతిలో పంపిణీ చేశారు. భూమి, అభివృద్ధి కార్యాలయ వ్యవహారాలను, ఆస్తి ధ్రువీకరణ పత్రాల జారీ వ్యవస్థను డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానంతో నవీకరించినందుకు, దరఖాస్తుదారులు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఇది ప్రజా ప్రయోజనం, ప్రజా సంక్షేమంతో కూడిన చర్య అని, మామూలుగా అయితే, ఎంతో కష్టసాధ్యంగా ఉండే ఆస్తి నమోదు ప్రక్రియ ఇపుడు సరళతరం, పారదర్శకం కావడం అభినందనీయమని వారన్నారు

******


(Release ID: 1666629) Visitor Counter : 142