ఉక్కు మంత్రిత్వ శాఖ

దేశంలో తలసరి ఉక్కు వినియోగం పెంపులో గ్రామీణ భారతం కీలక పాత్ర పోషిస్తుందని శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు.

'ఆత్మ నిర్భర్ భారత్ : గ్రామీణ ఆర్ధిక వ్యవస్థలో ఉక్కు వినియోగం పెంపునకు ప్రోత్సాహం - వ్యవసాయం / గ్రామీణాభివృద్ధి - పశుగణాభివృద్ధి మరియు పాడి ఉత్పత్తుల పెంపు / ఆహార ఉత్పత్తుల తయారీ (ఫుడ్ ప్రాసెసింగ్)' రంగాలపై వెబినార్

Posted On: 20 OCT 2020 2:45PM by PIB Hyderabad

భారత పరిశ్రమల సమాఖ్య(సి ఐ ఐ)తో కలసి ఉక్కు మంత్రిత్వ శాఖ  'ఆత్మ నిర్భర్ భారత్ : గ్రామీణ ఆర్ధిక వ్యవస్థలో ఉక్కు వినియోగం పెంపునకు ప్రోత్సాహం -  వ్యవసాయం / గ్రామీణాభివృద్ధి - పశుగణాభివృద్ధి మరియు  పాడి ఉత్పత్తుల పెంపు / ఆహార ఉత్పత్తుల తయారీ (ఫుడ్ ప్రాసెసింగ్)' అంశంపై మంగళవారం ఇక్కడ  నిర్వహించిన వెబినార్ లో  కేంద్ర ఉక్కు మరియు పెట్రోలియం & సహజవాయువు మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్  ప్రసంగించి మన గ్రామాల వృద్ధి మరియు సుసంపన్నం కావడంలో మరియు గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ బలోపేతం మరియు స్వయంసమృద్ధి సాధనలో భారత ఉక్కు రంగం పాత్ర గురించి తన అభిప్రాయాలను పంచుకున్నారు.    గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ మరియు రైతు సంక్షేమం,  పంచాయత్ రాజ్ మరియు  ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ శాఖల  మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ గౌరవ అతిథిగా పాల్గొన్నారు.  ఉక్కు మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి శ్రీ ఫగ్గన్ సింగ్ కులస్తే ఈ సందర్బంగా ప్రత్యేక ప్రసంగం చేశారు. వెబినార్ లో   ముఖ్య అతిథిగా మాట్లాడుతూ  ఉక్కు డిమాండును ప్రోత్సహించడానికి గ్రామీణ రంగంలో అపారమైన అవకాశాలు ఉన్నాయని అన్నారు.  "ఉక్కు, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి,  పశుగణాభివృద్ధి,  పాడి పరిశ్రమకు చెందిన ప్రతినిధులు ఈ వెబినార్ కోసం  జతకూడటం నాకెంతో సంతోషాన్నిచ్చింది" అని శ్రీ ప్రధాన్ అన్నారు.  ప్రాధాన్యతా రంగంలో అనేక కొత్త రంగాలను చేర్చిన ప్రభుత్వం రూ. 10,000 కోట్లతో  వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధిని ఏర్పాటు చేసిందని మంత్రి తెలిపారు.  "దేశవ్యాప్తంగా మేము 5000  బయో గ్యాస్ సంగ్రహణ ప్లాంట్లను అభివృద్ధి చేస్తున్నాం.   భారత రిజర్వు బ్యాంకు ఇటీవల బయో గ్యాస్ ప్లాంట్లను ప్రాధాన్యతా రంగంలో చేర్చింది.  బియ్యం నుంచి ఈథేనాల్ తయారీపైన మేము పనిచేస్తున్నాం.  అందరికీ ఇళ్ళ ఏర్పాటు కార్యక్రమం, గ్రామీణ రోడ్ల నిర్మాణానికి పెట్టుబడి, రైల్వే మౌలిక సదుపాయాల పెంపు,  వ్యవసాయానికి ప్రోత్సాహం వంటి చర్యల ద్వారా ఉక్కుకు డిమాండ్ మరింత పెరుగుతుంది.  తలసరి ఉక్కు వినియోగం పెంచడం అందరికీ ప్రయోజనం చేకూరుస్తుంది"  అని ఆయన అన్నారు.  దేశంలో తలసరి ఉక్కు వినియోగం పెంచడంలో గ్రామీణ భారతం కీలకపాత్ర పోషించగలదని ,  దానివల్ల  సమాజం మరింత బలపడగలదని,  గ్రామీణాభివృద్ధికి మరియు ఉద్యోగాల సృష్టికి దోహదం చేయగలదని శ్రీ ప్రధాన్ అన్నారు.

ఆత్మ నిర్భర్ భారత్ సాధనకు గౌరవనీయ  ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు సాకారం కావాలంటే ముందుగా గ్రామాలు స్వయం సమృద్ధిని సాధించాలని కేంద్ర మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ తమ ప్రసంగంలో పేర్కొన్నారు. గత కొద్దీ సంవత్సరాలుగా  ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధుల వల్ల,  లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదు బదిలీవల్ల  గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ బలపడిందని,  గ్రామీణుల కొనుగోలు శక్తి పెరిగిందని అన్నారు.  వెబినార్ లో ఫలవర్ధకమైన చర్చలు జరుగగలవన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.  

ఉక్కు మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి శ్రీ ఫగ్గన్ సింగ్ కులస్తే  మాట్లాడుతూ గ్రామీణ భారతంలో ఉక్కుకు ఉన్న డిమాండును అంచనా వేయడానికి ఈ వెబినార్ తోడ్పడగలదని.   గ్రామీణ ప్రాంతంలో ఉక్కు అవసరాలపై అధ్యయనం చేయడానికి,  తదనుగుణంగా దేశీయ ఉక్కు ఉత్పత్తిని పెంచడానికి ఒక అధ్యయన బృందాన్ని ఏర్పాటు చేయాలనీ అన్నారు.  కనీస మద్దతు ధరలను పెంచడం,  జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 'నరేగా'  ద్వారా ఉపాధి అవకాశాలు పెరగడం మరియు ఇతర ప్రభుత్వ పథకాలు,  పరపతి సౌకర్యాల విస్తరణ వంటివి గ్రామీణ ఆర్హిక వ్యవస్థ పుంజుకోవడానికి తోడ్పడుతున్నాయని,  దానివల్ల గ్రామీణ రంగం నుంచి ఉక్కుకు డిమాండు పెరుగుతోందని మంత్రి తెలిపారు.  

వెబినార్ లో  ఉక్కు  రంగానికి చెందిన పారిశ్రామిక దిగ్గజాలు,  ఉక్కు, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం మరియు రైతు సంక్షేమం,  పంచాయత్ రాజ్, మరియు ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ మరియు మత్స్య పరిశ్రమ మంత్రిత్వ శాఖలకు చెందిన సీనియర్ అధికారులు,  మరియు ఉత్తరప్రదేశ్,  బీహార్, కర్ణాటక మరియు మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వాలు   మరియు  భారత పరిశ్రమల సమాఖ్య సీనియర్ అధికారులు పాల్గొన్నారు.  


 

 

****


(Release ID: 1666355) Visitor Counter : 171