వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహం

Posted On: 20 OCT 2020 3:36PM by PIB Hyderabad

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీ‌ఐ) ఆర్థిక వృద్ధికి ప్రధాన చోద‌క శ‌క్తి మరియు భారతదేశ ఆర్థికాభివృద్ధికి ముఖ్యమైన రుణేతర ఆర్ధిక వనరు. దేశంలో విదేశీ పెట్టుబ‌డుల‌కు అనుకూలంగా ఉండేలా స్నేహ‌పూర్వ‌క‌ ఎఫ్‌డీఐ విధానాన్ని అందుబాటులో ఉంచేలా ప్రభుత్వం ప్ర‌యత్నాలు చేస్తోంది. ఎఫ్‌డీఐ పాలసీని  పెట్టుబడిదారులకు మరింత స్నేహపూర్వకంగా మార్చడం మరియు దేశంలోకి పెట్టుబడుల ప్రవాహానికి ఆటంకం కలిగించే పాలసీ అడ్డంకులను తొలగించడం  ప్ర‌భుత్వ ఉద్దేశం. గ‌డిచిన‌ ఆరు సంవత్సరాల్లో ఈ దిశగా తీసుకున్న చర్యలు ఫలించాయి. దేశంలో విదేశీ ప్ర‌త్య‌క్ష పెట్టుబ‌డుల‌ ప్రవాహం ఎప్పటికప్పుడు పెరుగుతూ వ‌స్తున్నాయి. ఎఫ్‌డీఐల‌ సరళీకరణ, సుల‌భ‌త‌‌రీక‌ర‌ణ‌ మార్గంలో ముందుకు సాగుతున్న‌ ప్రభుత్వం వివిధ రంగాలలో ప‌లు ఎఫ్‌డీఐ సంస్కరణల్ని చేపట్టింది. ఎఫ్‌డీఐ విధాన సంస్కరణలు, పెట్టుబడులకు త‌గిన‌ సదుపాయం, వ్యాపార సులభతర‌త దిశ‌గా ప్రభుత్వం తీసుకున్న చర్యలు మ‌న దేశంలోకి ఎఫ్‌డీఐల ప్రవాహం పెరిగేలా చేశాయి. ఈ క్రింది పోకడలు భారత్‌ను విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) విభాగంలో.. ప్రపంచ పెట్టుబడిదారులకు ప్రియ‌మైన గమ్యస్థానంగా ఆమోదించిన విష‌యాన్ని వెల్ల‌డిస్తున్నాయి.

ఎ. గత 6 సంవత్సరాల కాలానికి (2014-15 నుండి 2019-20 వరకు)
ఈ కాలంలో మొత్తం ఎఫ్‌డీఐల ప్రవాహం 55% పెరిగింది. అనగా 2008-14లో 231.37 బిలియన్ డాలర్లుగా ఉన్న ఎఫ్‌డీఐలు.. 2014-20లో 358.29 బిలియన్ డాలర్ల‌కు పెరిగాయి. ఎఫ్‌డీఐ ఈక్విటీ ఇన్‌ఫ్లో 2008-14 కూడా 160.46 బిలియన్ డాలర్ల నుండి 57 శాతం మేర‌ పెరిగి 252.42 బిలియన్ డాలర్లకు (2014-20) పెరిగింది.

బి. ఆర్థిక సంవత్సరం 2020-21 (ఏప్రిల్ - ఆగస్టు, 2020 వరకు)..
ఈ ఏడాది (2020) ఏప్రిల్ నుండి ఆగస్టు వరకు, మొత్తం ఎఫ్‌డీఐల ప్రవాహం 35.73 బిలియన్ డాలర్లుగా నిలిచింది. ఒక ఆర్థిక సంవత్సరం మొదటి ఐదు నెలల కాలంలో న‌మోదైన ఎఫ్‌డీఐల‌లో ఇదే అత్య‌ధికం. 2019-20 మొదటి ఐదు నెలల కాలంతో పోలిస్తే ఇది దాదాపు 13 శాతం మేర‌ ఎక్కువ (31.60 బిలియన్ డాల‌ర్లు). 2020-21 (ఏప్రిల్- ఆగస్టు, 2020) ఆర్థిక సంవ‌త్స‌రంలో
27.10 బిలియ‌న్ డాల‌ర్ల ఎఫ్‌డీఐ ఈక్విటీ పెట్టుబ‌డులు వ‌చ్చాయి. ఒక ఆర్థిక సంవత్సరం మొదటి 5 నెలల్లో న‌మోదైన ఎఫ్‌డీఐ ఈక్విటీ పెట్టుబ‌డుల‌లో ఇదే అత్య‌ధికం. 2019-20 సంవ‌త్స‌రం మొద‌టి ఐదు నెల‌ల కాలంలో ల‌భించిన మొత్తం 23.25 బిలియ‌న్ డాల‌ర్ల ఎఫ్‌డీఐ ఈక్విటీల కంటే కూడా ఇది 16 శాతం అధికం.
                               

***


(Release ID: 1666248) Visitor Counter : 259