నీతి ఆయోగ్
ఇండియాలో ఫ్రాంటియర్ టెక్నాలజీస్ క్లౌడ్ ఇన్నోవేషన్ సెంటర్ ప్రారంభించిన నీతి ఆయోగ్ & అమెజాన్ వెబ్ సర్వీసెస్
దేశంలో ప్రారంభించిన మొట్టమొదటి అమెజాన్ వెబ్ సర్వీసెస్ క్లౌడ్ ఇన్నోవేషన్ సెంటర్ వ్యవసాయం, ఆరోగ్య సేవలు, విద్య, మౌలిక సదుపాయాలు మరియు పరిపాలన రంగాలలో వినూత్న కల్పనలను ప్రోత్సహిస్తుంది.
Posted On:
19 OCT 2020 5:47PM by PIB Hyderabad
అంకాత్మక వినూత్నత ద్వారా సామాజిక సవాళ్ళను ఎదుర్కొనేందుకు అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏ డబ్ల్యు ఎస్)తో కలసి ఇండియాలోనే మొట్టమొదటి ఫ్రాంటియర్ టెక్నాలజీస్ క్లౌడ్ ఇన్నోవేషన్ సెంటర్ (సిఐసి) ప్రారంభిస్తున్నట్లు నీతి ఆయోగ్ సోమవారం ప్రకటించింది.
ఇండియాలో ఏర్పాటు చేసే ఈ సిఐసి విశ్వవ్యాప్తంగా ఏ డబ్ల్యు ఎస్ చేపడుతున్న సిఐసి గ్లోబల్ కార్యక్రమంలో భాగం. దీనిద్వారా ప్రభుత్వ సంస్థలు, లాభాపేక్షలేని సంస్థలు మరియు విద్యా సంస్థలు సవాళ్ళను ఎదుర్కోవడానికి కలసికట్టుగా ఏ డబ్ల్యు ఎస్ సాంకేతిక నైపుణ్యాన్ని వినియోగించుకొని కొత్త యోచనలను వర్తింపజేసి వాటిని పరీక్షిస్తాయి.
"విశ్వవ్యాప్తంగా ప్రభుత్వ సంస్థలు క్లౌడ్ టెక్నాలజీని వేగంగా, లాఘవంతో వినియోగించుకొని సమస్యలను పరిష్కరించడం, పౌరులకు సంబంధించిన సమస్యలను పరివర్తింపజేయడం చూస్తున్నాం" అని అమెజాన్ వెబ్ సర్వీసెస్ అంతర్జాతీయ సేల్స్ విభాగం వైస్ ప్రెసిడెంట్ మాక్స్ పీటర్సన్ అన్నారు. 'ప్రభుత్వరంగ సంస్థలలో వినూత్నతను పెంపొందించడానికి ఉత్ప్రేరకంగా పనిచేసే విధంగా మా క్లౌడ్ ఇన్నోవేషన్ సెంటర్ కార్యక్రమాన్ని రూపొందించాం. ఇండియాలో ప్రభుత్వరంగ సంస్థల పనితీరు మెరుగుపరిచేందుకు నీతి ఆయోగ్ చేపట్టిన కార్యక్రమానికి సహకరించడం మాకు ఎంతో ఉత్తేజాన్నిస్తోంది' అని ఆయన అన్నారు.
'ఏడబ్ల్యుఎస్ తో కలసి దీనిలో పనిచేయడం మాకు ఎంతో సంతోషకరంగా ఉంది. ఫ్రాంటియర్ టెక్నాలజీజ్ సిఐసి వినూత్న కల్పనలు ప్రోది చేసే వ్యక్తులు, అంకురా సంస్థలకు ఎంతగానో సహకరించి ప్రోత్సాహాన్నిస్తుంది. అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడంలో మార్గదర్శకంగా ఉంటూ కృత్రిమ మేధ (ఏ ఐ), ఐఓటి, రోబోటిక్స్, బ్లాక్ చైన్ మొదలైన ఉద్భవించే వర్ధమాన టెక్నాలజీలను వినియోగానికి సానుకూల పరిస్థితుల్ని సమకూరుస్తుంది. స్వయంసమృద్ధ భారతాన్ని సాధించాలన్న ప్రధానమంత్రి దార్శనికతకు ఈ కార్యక్రమం అనుగుణమైంది' అని అటల్ ఇన్నోవేషన్ మిషన్ డైరెక్టర్ ఆర్. రమణన్ తెలిపారు.
" ఇండియాలో స్థానిక సమస్యల పరిష్కారానికి కొత్త పద్ధతులను రూపొందించడంలో ప్రభుత్వ సంస్థలు, అంకుర సంస్థలు మరియు స్థానిక సంస్థలకు సిఐసి తోడ్పడుతుంది" అని నీతి ఆయోగ్ సీనియర్ అడ్వైజర్ అన్నా రాయ్ తెలిపారు. సిఐసి కార్యక్రమం ద్వారా పౌర సేవలను మరింత నైపుణ్యంతో విస్తృతంగా ఉపయోగించవచ్చునని ఆమె అన్నారు.
నీతి ఆయోగ్ ఫ్రాంటియర్ టెక్నాలజీస్ క్లౌడ్ ఇన్నోవేషన్ సెంటర్ ప్రధాన లక్ష్యం పౌర సేవలను వినూత్న రీతిలో అందించడం. ఏ డబ్ల్యు ఎస్ క్లౌడ్ ను ఉపయోగించుకొని ఇండియాలో స్థానిక సంస్థలు, అంకుర సంస్థలు, పరిశోధకులు మరియు విశ్వవిద్యాలయాలు ప్రయోగాలు చేయవచ్చు. నమూనాలను రూపొందించవచ్చు.
ఇండియాలో ప్రభుత్వరంగా సంస్థలు పరివర్తన చెంది ఆర్ధిక ప్రగతిని సాధించి సమాజంపై ప్రభావాన్ని చూపేవిధంగా సహాయపడేందుకు కట్టుబడి ఉన్నామని అమెజాన్ ఇంటర్నెట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రాంతీయ విభాగం అధిపతి రాహుల్ శర్మ తెలిపారు.
ఇప్పుడు నీతి ఆయోగ్ ఫ్రాంటియర్ టెక్నాలజీస్ సిఐసి ఆస్ట్రేలియా, బహరేన్, కెనడా, ఫ్రాన్సు , జర్మనీ, దక్షిణ కొరియా మరియు అమెరికాలలో ఉన్న ఏ డబ్ల్యు ఎస్ ప్రభుత్వరంగ క్లౌడ్ ఇన్నోవేషన్ సెంటర్ల సరసన చేరుతుంది. అమెజాన్ వెబ్ సర్వీసెస్ క్లౌడ్ ఇన్నోవేషన్ సెంటర్ల గురించి మరింత సమాచారం కోసం https://aws.amazon.com/government-education/cloud-innovation-centers/ దర్శించండి. అమెజాన్ ఇంటర్నెట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ (ఏ ఐ ఎస్ పి ఎల్) సంస్థ ఇండియాలో ఏ డబ్ల్యు ఎస్ క్లౌడ్ సర్వీసెస్ రీసేల్ మరియు మార్కెటింగ్ పనులు చేస్తుంది.
***
(Release ID: 1666074)
Visitor Counter : 282