మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

ఇండోర్ ఐఐటి 8వ స్నాత‌కోత్స‌వ కార్య‌క్ర‌మంలో విర్చువ‌ల్ ప‌ద్ధ‌తిలో పాల్గొన్న కేంద్ర విద్యాశాఖ మంత్రి

ఇండోర్ ఐఐటి క్యాంప‌స్ లో నిర్మించిన ప‌లు భ‌వ‌నాల‌ను ప్రారంభించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి

వైజ్ఞానిక భార‌త‌దేశ మిష‌న్ బ్రాండ్ అంబాసిడ‌ర్లుగా వ్య‌వ‌హ‌రించే విద్యార్థులు త‌మ విజ్ఞానాన్ని అంద‌రికీ పంచాలి: శ్రీ ర‌మేష్ పోఖ్రియాల్ నిషాంక్

Posted On: 19 OCT 2020 7:31PM by PIB Hyderabad

ఇండోర్ ఐఐటి నిర్వ‌హించిన 8వ స్నాత‌కోత్స‌వ కార్య‌క్ర‌మంలో  కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ ర‌మేష్ పోఖ్రియాల్ విర్చువ‌ల్ ప‌ద్ధ‌తిద్వారా పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఇండోర్ ఐఐటి క్యాంప‌స్ లో నిర్మించిన ప‌లు భ‌వ‌నాల‌ను ప్రారంభించారు. 
ప‌ట్టాలు పొందిన విద్యార్థుల‌కు కేంద్ర మంత్రి అభినంద‌న‌లు తెలిపారు. విజ్ఞాన ఆర్జ‌న చేసిన విద్యార్థులు త‌మ తెలివితేట‌ల్ని స‌మాజ అభివృద్ధికి ఉప‌యోగించాల‌ని ఈ సంద‌ర్భంగా మంత్రి కోరారు. విద్యార్థులు తాము నేర్చుకున్న సిద్ధాంతాల‌ను నిత్య జీవితంలో ఉప‌యోగించడం మొద‌లైనప్పుడే వారి నిజ‌మైన చ‌దువులు ప్రారంభ‌మైన‌ట్టు అని ఆయ‌న అన్నారు. 
ఈ రోజున ప‌ట్టాలు పొందిన విద్యార్థులు వైజ్ఞానిక భార‌త‌దేశ మిష‌న్ బ్రాండ్ అంబాసిడ‌ర్లుగా వ్య‌వ‌హ‌రించి త‌మ విజ్ఞానాన్ని అంద‌రికీ పంచాలని కేంద్ర మంత్రి అభిల‌షించారు.
ఇండోర్ ఐఐటి సాధించిన సాధిస్తున్న విజ‌యాల‌ను కేంద్ర మంత్రి శ్రీ ర‌మేష్ ప్ర‌శంసించారు. విద్యాసంస్థ‌ల‌కు, ప‌రిశ్ర‌మ‌ల‌కు మ‌ధ్య‌న అంత‌రాన్ని తొల‌గించ‌డానికి ఇండోర్ ఐఐటి కృషి చేస్తోంద‌ని ఇది స్వ‌యం స‌మృద్ధ భార‌త‌దేశ సాధ‌న‌కు ఉప‌క‌రిస్తుంద‌ని ఆయ‌న అన్నారు. 
ఇండోర్ ఐఐటి త‌న క్యాంప‌స్ లో ప‌లు భ‌వ‌నాల‌ను నిర్మించుకున్నందుకుగాను కేంద్ర‌మంత్రి అభినంద‌న‌లు తెలిపారు. ఇండోర్ ఐఐటికి అవ‌స‌ర‌మ‌య్యే స‌హాయ స‌హ‌కారాల‌ను కేంద్ర విద్యాశాఖ ఇస్తుంద‌ని ఈ సంద‌ర్భంగా మంత్రి భ‌రోసా నిచ్చారు. 
ఇండోర్ ఐఐటి గ‌వ‌ర్న‌ర్స్ బోర్డ్ ఛైర్మ‌న్ ప్రొఫెస‌ర్ దీప‌క్ బి. పాఠ‌క్ మాట్లాడుతూ ప‌ట్టాలు పొందిన విద్యార్థులంద‌రికీ అభినంద‌న‌లు తెలిపారు. విద్యార్థులంద‌రూ కోవిడ్ 19 మ‌హ‌మ్మారిపై సంయమ‌నంతో పోరాటం చేయాల‌ని ఆయ‌న కోరారు. నిత్యం విజ్ఞాన ఆర్జ‌న చేస్తూ వుండాల‌ని అన్నారు. మీ స‌బ్జెక్టుల్లోనే కాదు...ఇత‌ర స‌బ్జెక్టుల్లో కూడా విజ్ఞాన ఆర్జ‌న చేయాల‌ని అన్నారు. అంద‌రూ మాన‌వ సేవ‌లో వుండాల‌ని, ఇండోర్ ఐఐటితో సంబంధాల‌ను కొన‌సాగిస్తూ సంస్థ ప్ర‌గ‌తికి స‌హ‌క‌రించాల‌ని కోరారు. 
మొత్తం 412 మంది విద్యార్థుల‌కు ప‌ట్టాల‌ను ప్ర‌ధానం చేశారు. వివిధ విభాగాల్లో ప్ర‌తిభ చూపిన వారికి మెడ‌ల్స్ ప్ర‌క‌టించారు. విద్యార్థులంద‌రూ ఆన్ లైన్ మోడ్ లో హాజ‌ర‌య్యారు. వీరు త‌మ డిగ్రీల‌ను, ప‌ట్టాల‌ను స్వ‌యంగా కాలేజికి వెళ్లి తీసుకోవాల్సి వుంటుంది.
కేంద్ర‌మంత్రి ప్రారంభించిన నూత‌న భ‌వ‌నాల వివ‌రాలు ఇలా వున్నాయి. 1. కేంద్రీ విద్యాల‌యం 2. కంప్యూట‌ర్ మ‌రియు స‌మాచార సాంకేతిక కేంద్రం 3. సెంట్ర‌ల్ వ‌ర్క్ షాప్ భ‌వ‌నం 4. అభినంద‌న్ భ‌వ‌నం 5. త‌క్ష‌శిల ఉప‌న్యాస వేదిక మందిరం.

 

***


(Release ID: 1666072) Visitor Counter : 176