ప్రధాన మంత్రి కార్యాలయం

"గ్రాండ్ ఛాలెంజెస్ వార్షిక సమావేశం-2020" లో కీలకోపన్యాసం చేసిన - ప్రధానమంత్రి మోదీ

విజ్ఞానశాస్త్రం మరియు ఆవిష్కరణల్లో పెట్టుబడులు పెట్టే సమాజాలచే భవిష్యత్తు రూపుదిద్దుకుంటుంది: ప్రధానమంత్రి

మన పౌరులకు రోగనిరోధక శక్తినిచ్చేలా భారతదేశం ఇప్పటికే బాగా స్థిరపడిన వ్యాక్సిన్ డెలివరీ వ్యవస్థను అమలు చేయడానికి కృషి చేస్తోంది : ప్రధానమంత్రి

Posted On: 19 OCT 2020 10:36PM by PIB Hyderabad

"గ్రాండ్ ఛాలెంజెస్" వార్షిక సమావేశం-2020 లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ కీలకోపన్యాసం ఉపన్యాసం చేశారు. 

ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, విజ్ఞానశాస్త్రం మరియు ఆవిష్కరణల్లో పెట్టుబడులు పెట్టే సమాజాలే భవిష్యత్తును రూపొందిస్తాయని, పేర్కొన్నారు.  స్వల్ప కాలిక దృష్టి కలిగిన విధానాలకు బదులు, ముందుగానే బాగా పెట్టుబడులు పెట్టడం ద్వారా,  విజ్ఞానశాస్త్రం మరియు ఆవిష్కరణల ప్రయోజనాలను సరైన సమయంలో పొందవచ్చునని, ఆయన సూచించారు.  ఈ ఆవిష్కరణల మార్గాన్ని, సహకారం మరియు ప్రజల భాగస్వామ్యం ద్వారా రూపొందించుకోవాలని ఆయన చెప్పారు. విజ్ఞానశాస్త్రం ఎప్పుడూకేవలం సిలోస్ వల్ల వృద్ధి చెందదనీ, గ్రాండ్ ఛాలెంజెస్ కార్యక్రమం ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకుందనీ, ప్రధానమంత్రి పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు నిమగ్నమై,  సూక్ష్మజీవులను నశింపజేసే నిరోధక శక్తి, మాతా, శిశు ఆరోగ్యం, వ్యవసాయం, పౌష్టికాహారం, డబ్ల్యూ.ఏ.ఎస్.హెచ్-వాష్ (నీరు, పారిశుధ్యం మరియు పరిశుభ్రత) వంటి మరెన్నో విభిన్న సమస్యలను పరిష్కరిస్తున్న, ఈ కార్యక్రమం యొక్క స్థాయిని ఆయన ప్రశంసించారు. 

ప్రపంచ వ్యాప్తంగా వ్యాప్తి చెందిన ఈ మహమ్మారి, సమిష్టి కృషి యొక్క ప్రాముఖ్యతను గుర్తించేలా చేసిందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.   ఈ వ్యాధులకు భౌగోళిక సరిహద్దులు లేవనీ, విశ్వాసం, జాతి, లింగం లేదా రంగు ఆధారంగా వివక్ష చూపదనీ, ఆయన పేర్కొన్నారు.  ప్రజలను ప్రభావితం చేసే అనేక సంక్రమణ మరియు సంక్రమించని వ్యాధులు కూడా, ఈ వ్యాధుల్లో, ఉన్నాయి.  ముఖ్యంగా గత కొన్ని నెలలుగా, కోవిడ్-19 తో పోరాడుతున్న సమయంలో, భారతదేశంలో బలమైన, శక్తివంతమైన శాస్త్రీయ సమాజం మరియు మంచి శాస్త్రీయ సంస్థలు భారతదేశపు గొప్ప ఆస్తులని, ఆయన పేర్కొన్నారు.  ఇవి, నియంత్రణ నుండి సామర్థ్యం పెంపు వరకు అద్భుతాలు సాధించాయని కూడా ఆయన తెలిపారు. 

జనాభా అధికంగా ఉన్నప్పటికీ, ప్రజల నడవడిక కారణంగా, భారతదేశంలో కోవిడ్-19 మరణాల రేటు చాలా తక్కువగా ఉందని, ప్రధానమంత్రి చెప్పారు.  ఆయన మాట్లాడుతూ, రోజువారీ కేసుల సంఖ్య ఈరోజు తగ్గిందనీ, కేసుల వృద్ధి రేటు క్షీణించిందనీ, అదేవిధంగా,  ఈ రోజు రికవరీ రేటు అత్యధికంగా 88 శాతం గా నమోదయ్యిందనీ తెలియజేశారు. అనువైన లాక్ డౌన్ ను ముందుగా అమలు చేసిన దేశాల్లో భారతదేశం ఒకటనీ, మాస్కుల వాడకాన్ని ముందుగా ప్రోత్సహించిన దేశాలలో భారతదేశం ఒకటనీ,  మన దేశం సమర్థవంతమైన గుర్తింపు ప్రక్రియను ముందుగా ప్రారంభించడంతో పాటు,  ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలను మన దేశం ముందుగా చేపట్టడంతో ఇది సాధ్యమయ్యిందని, ఆయన వివరించారు. 

కోవిడ్ కోసం టీకా అభివృద్ధిలో భారతదేశం ఇప్పుడు ముందంజలో ఉందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.  మన దేశంలో 30 కి పైగా దేశీయ వ్యాక్సిన్లను అభివృద్ధి చేస్తున్నామనీ, వాటిలో మూడు అధునాతన దశలో ఉన్నాయనీ, ఆయన ప్రకటించారు.  భారతదేశం ఇప్పటికే బాగా స్థిరపడిన వ్యాక్సిన్ డెలివరీ వ్యవస్థను అమలు చేయడానికి కృషి చేస్తోందనీ, డిజిటల్ ఆరోగ్య గుర్తింపుతో పాటు మన పౌరులకు రోగనిరోధకత కల్పించడానికి, ఈ డిజిటల్ నెట్‌వర్క్, ఉపయోగపడుతుందని ఆయన అన్నారు.  తక్కువ ఖర్చుతో నాణ్యమైన మందులు, వ్యాక్సిన్‌లను ఉత్పత్తి చేయగల సామర్థ్యం భారతదేశానికి ఉన్నదన్న విషయం ఎప్పుడో  నిరూపితమైందని, ఆయన పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా రోగ నిరోధకత కోసం తయారౌతున్న టీకాలలో 60 శాతం కంటే ఎక్కువ భారతదేశంలోనే తయారౌతున్నాయని చెప్పారు.  భారతదేశం యొక్క అనుభవం మరియు పరిశోధన ప్రతిభతో, భారతదేశం ప్రపంచ ఆరోగ్య సంరక్షణ ప్రయత్నాలు మరియు ఈ రంగాలలో వారి సామర్థ్యాలను పెంచడానికి ఇతర దేశాలకు సహాయం చేయాలనే కోరికలకు కేంద్రంగా ఉంటుందని ఆయన అన్నారు.

మెరుగైన ఆరోగ్య వ్యవస్థ, మెరుగైన పరిశుభ్రత, ఎక్కువ సంఖ్యలో మరుగుదొడ్ల నిర్మాణం వంటి గత 6 సంవత్సరాలలో చేసిన అనేక చర్యలను ప్రధానమంత్రి ఈ సందర్భంగా వివరించారు. ఇది మెరుగైన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు దోహదపడిందని తెలిపారు.  ఇది మహిళలకు, పేదలకు, ప్రత్యేక సౌకర్యాలు లేని ప్రజలకు సహాయపడిందనీ, అదేవిధంగా వ్యాధుల తగ్గింపుకు దారితీసిందనీ, ఆయన చెప్పారు. వ్యాధుల తగ్గింపు మరియు గ్రామాలకు మెరుగైన ఆరోగ్య సంరక్షణను అందించడం కోసం ప్రభుత్వం చేస్తున్న - ప్రతి ఇంటికి పైపులతో తాగునీరు అందించడం, గ్రామీణ ప్రాంతాల్లో వైద్య కళాశాలలు ఏర్పాటు చేయడంతో పాటు ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య బీమా పథకాన్ని అమలు చేయడం వంటి  ప్రయత్నాలను కూడా ఆయన వివరించారు. 

వ్యక్తిగత సాధికారత మరియు సామూహిక శ్రేయస్సు కోసం సహకార స్ఫూర్తిని ఉపయోగించడం కొనసాగించాలని ప్రధానమంత్రి కోరారు.  ఫలవంతమైన మరియు ఉత్పాదక చర్చలు జరగాలని ఆకాంక్షిస్తున్నట్లు, ఈ గ్రాండ్ ఛాలెంజెస్ వేదిక ద్వారా చాలా ఉత్తేజకరమైన మరియు ప్రోత్సాహకరమైన కొత్త పరిష్కారాలను ఆశిస్తున్నట్లు, ప్రధానమంత్రి పేర్కొన్నారు. 

 

*****



(Release ID: 1665979) Visitor Counter : 244